| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
సుందరి! నా కోడండ్రుర | యం దభ్యర్హితవు నీవ; యతిముదమున నీ కుం దగఁ బ్రియంబు సేసెద | నిందుముఖీ! వేఁడు మెద్ది యిష్టము నీకున్. |
257 |
| వ. | అనినం బాంచాలి యి ట్లనియె. | 258 |
| ఆ. |
కరుణతోడ నాకు వరము ప్రసాదింప | బుద్ధియేని లోకపూజితుండు మనునిభుండు ధర్మతనయుండు దాస్యంబు | వలనఁ బాయవలయు వసుమతీశ! |
259 |
| వ. | ‘అ ట్లయినం గురుకుమారులు గురువృద్ధజనలాలితుండై పెరిఁగిన ప్రతివింధ్యు దాసపుత్త్రుం డనకుండుదు; రిదియ నా యిష్టం’ బనిన ‘నిచ్చితి; నింక రెండవవరంబు వేఁడు’ మనిన ద్రౌపది యి ట్లనియె. | 260 |
| క. |
నెమ్మిని ధర్మజు నలువురు | దమ్ములుఁ దమ యాయుధములఁ దమవర్మవరూ థమ్ములయుఁ దోడ సకల హి | తమ్ముగఁ బాయంగవలయు దాస్యము వలనన్. |
261 |
| వ. | అనిన ధృతరాష్ట్రుండు ‘నీకోరిన వరం బిచ్చితి; నింక మూఁడవవరంబు వేఁడు’ మనిన ద్రౌపది యి ట్లనియె. | 262 |
| ఆ. |
‘వైశ్యసతికి నొక్క వరము, సత్‌క్షత్త్రియ | సతికి రెండు, శూద్రసతికి మూఁడు, విప్రసతికి నూఱు వేఁడఁజ న్వరములు | గాన యింక వేఁడఁగాదు నాకు.’ |
263 |
| వ. | అనిన ధృతరాష్ట్రుండు కోడలి గుణంబులకు ధర్మం బెఱుంగుటకు సంతసిల్లి, యనుజ సహితుం డయిన యుధిష్ఠిరు రావించి ‘నీవు సర్వసంపదలు స్వరాజ్యంబు నొప్పుగొని యెప్పటియట్ల యింద్రప్రస్థపురంబున కరిగి సుఖం బుండుము; నీకు లగ్గయ్యెడు’ మని వెండియు. | 264 |
| తే. |
నీవు నిత్యంబు వృద్ధోపసేవఁ జేసి | యెఱుఁగు దెల్ల ధర్మంబులు; నెఱుక లేక కడఁగి నీ కెగ్గు సేసె నా కొడుకు; దీని | మఱచునది; నీకు నే నొండ్లు గఱపనేల? |
265 |
| క. |
మనమున వేరమిఁ దలఁపమి | యును, సక్షమచిత్తుఁ డగుటయును, గుణములు కై కొని దోషమ్ములు విడుచుట | యును నుత్తముఁ డయిన పురుషు నుత్తమగుణముల్. |
266 |
| వ. | ఏను బుద్ధిలేక జూదం బుపేక్షించితి; నల్పబుద్ధిసత్త్వుండయిన వృద్ధు నన్నును, మీతల్లి యయిన గాంధారినిం దలంచి, దుర్యోధనాదులు సేసిన దుర్నయంబులు సేకొన కుండునది; సర్వశాస్త్రవిదుం డయిన విదురుండు మంత్రిగా సర్వధర్మవిదుండవైన నీవు రక్షకుండవుగా నిక్కురుకులంబునకు లగ్గగు’నని ధర్మరాజుఁ బాండురాజు రాజ్యంబునందు సమర్పించిన. | 267 |
| తరలము |
తరుణి ద్రౌపది యిట్లు పాండవధార్తరాష్ట్రులదైన భీ కర పరస్పర కోపవేగము గ్రన్నఁ బాచి విపత్తి సా గర నిమగ్నుల నుద్ధరించెఁ బ్రకాశకీర్తుల ధీరులం బురుషసింహములన్ నిజేశులఁ బూని తద్దయుఁ బ్రీతితోన్. |
268 |
| సీ. |
దాని నంతయు భీమసేనుండు విని ‘రాజ్య | సంప్రాప్తి పాండవసత్తములకు సతికారణంబున ధృతమయ్యె నను నింత | కంటెను గష్టంబు గలదె యొండు; పేర్మి నపత్యంబుఁ గర్మంబు విద్యయు | నను నివి తేజంబు లట్టె తగిన పురుషున కెందును; నిరతంబు మిక్కిలి | తేజంబు కర్మంబు; దీని విడిచి |
|
| ఆ. |
యలుక గాఁడె పురుషుఁ’ డని కోపఘూర్ణిత | రక్తనేత్రుఁడై ‘పరాక్రమమున శత్రువరుల నుగ్రసంగరంబునఁ జంపి | కుతలరాజ్యమెల్లఁ గొందు’ ననుచు. |
269 |
| వ. | మృగమధ్యంబున నున్న సింహంబునుంబోలె ననుజమధ్యంబున నున్న యాతనిం గరంబున వారించి, ధర్మరాజు ధృతరాష్ట్రు శాసనంబునం దమ్ములుం దానును ద్రౌపదీ సహితంబుగాఁ గాంచనరథారూఢుఁ డై యింద్రప్రస్థపురంబున కరిగిన; నిట దుశ్శాసనుచేత నంత వృత్తాంతంబును విని దుర్యోధనుండు కర్ణశకుని సైంధవులతో విచారించి ధృతరాష్ట్రుపాలికిం జని యి ట్లనియె. | 270 |
| క. |
అహితుల నెల్ల విధంబుల | విహతులఁగాఁ జేయునది వివేక మని మరు న్మహితుండు చెప్పె నిది మును | బృహస్పతి సురేశ్వరునకుఁ బ్రియహితబుద్ధిన్. |
271 |
| వ. | అప్పాండవుల కెంత లగ్గు సేసియు నింక హితుల మయ్యెదమె? యాశీవిషంబుల నలిగించి కంఠ సమీపంబున విడుచునట్లు వారల విడిచిపుచ్చి కర్జంబు దప్పితిమి. | 272 |
| ఉ. |
భూ విదిత ప్రతాప పరిభూత విపక్షుఁడు సవ్యసాచి గాం డీవము గొన్న భీముఁడు వడిన్ గదగొన్నఁ, గవల్ కృపాణచ ర్మావరణాది భాసిత మహాభుజ విక్రములైన, వారలన్ లావె రణంబులో మన కలంఘ్యబలాఢ్యుల నింక నోర్వఁగన్. |
273 |
| వ. | ‘కావున వారల ననుద్యూతంబునఁ బరాజితులం గావించి విరళ దేశ నిర్వాసితులం జేయుట కార్యం’ బనిన విని ధృతరాష్ట్రుం డొడంబడి, యప్పుడ యనుద్యూతార్థంబు ధర్మనందనుం దోడితేరం బ్రాతికామిం బంచినం ‘బితృనియోగంబును విధినియోగంబు నతిక్రమింప నగునే’ యని. | 274 |
| క. |
నృపవరుఁ డనుజులుఁ దానును | ద్రుపదతనూజయుఁ బ్రియంబుతో నరిగెను హ స్తిపురంబునకు నశేష | స్వపక్షజన హృదయములకు సంతాపముగన్. |
275 |
| వ. | అం దెప్పటియట్ల ధృతరాష్ట్ర నిర్మిత సభాసీనులై యున్నంత నభిమతాక్షుండైన శకుని కితవుండు ధర్మరాజున కి ట్లనియె. | 276 |
| క. |
ధనసంపద రాజ్యంబున | దినకరతేజుండు మిమ్ము ధృతరాష్ట్రుఁడు పెం పునఁ బూజించెం గావునఁ | జన దింకను వాని నొడ్డి సరి క్రీడింపన్. |
277 |
| వ. | ‘ఇది యపూర్వంబైన పణంబు; దీని నొడ్డి యోటువడిన వార లజినవల్కలంబులు గట్టి వన్యమూలఫలాశనులై బ్రహ్మచర్యంబునం బండ్రెండేండ్లు వనవాసంబు సేసి, పదుమూఁడగు నేఁడు జనపదంబున నజ్ఞాతవాసంబు సేసి, యం దెఱుంగఁ బడిరేని వెండియుఁ బండ్రెండేండ్లు వనవాసంబు నొక్కయేఁ డజ్ఞాతవాసంబుఁ జేయుచుండు వా; రిట్లోపుదేని జూదం బాడుద’ మనిన ‘ననుద్యూతార్థం బాహూతుండనై మగుడ నగునే’ యని. | 278 |