| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
ధర్మసుతుఁ డొడ్డి శకుని క | ధర్మ స్థితి నోటు వడియె; దైవము చెయిదిన్ నిర్మితమయిన శుభాశుభ | కర్మ ఫలం బెట్లు దేహి గడవఁగ నేర్చున్. |
279 |
| వ. | అంత ననుద్యూతపరాజితులయిన పాండవులు దమరాజ్యోపభోగంబులు విడిచి విప్రసుహృద్బాంధవ జనానుగమ్యమానులయి వనంబునకుం బోవ సమకట్టి భీష్మ ధృతరాష్ట్ర విదురకృప ద్రోణాచార్యుల నా మంత్రించిన విదురుం డి ట్లనియె. | 280 |
| క. |
వనవాసపరిక్లేశం | బున కోపదు కుంతిదేవి భోజాత్మజ గా వున నా గృహమున నుండెడు | ననవరతము భక్తితో మదభ్యర్చితయై. |
281 |
| సీ. |
ధర్మజ్ఞుఁడవు నీవు పేర్మిఁ, బరాక్రమ | ధనుఁడు భీముం, డింద్రతనయుఁ డఖిల యుద్ధ విశారదుం డిద్ధయశోనిధి, | నకులుఁ డర్థాఢ్యుండు, ప్రకట బుద్ధి నెంతయు సంయమవంతుఁడు సహదేవుఁ, | డధ్యాత్మవిద్య నారాధ్యుఁ డెందు ననఘుండు ధౌమ్యుండు, వినుతార్థ ధర్మంబు | లందు విచక్షణ సుందరాంగి |
|
| ఆ. |
ద్రుపదతనయ; యిట్లు విపులగుణాళి న | న్యోన్య హితుల రగుట నన్యు లుర్వి నాదరింపఁగాక భేదింపనోపెడు | వారు గలరె మిమ్ము ధీరమతుల. |
282 |
| వ. | మఱియుఁ గృష్ణద్వైపాయనుచేత శిక్షితులరు, నారదుచేత రక్షితులరు, మీకుం బురోహితుండు ధౌమ్యుండు, దైవమానుషసంపన్నులరు, బలపరాక్రమంబులంజేసి రాజులను, ధర్మచరితంబునం జేసి ఋషులను, మహత్త్వంబునంజేసి కుబేరవాసవాదులను జయించిన వారలరు, మిమ్ము భూమియు గాడ్పును జంద్రాదిత్యులు నెల్లకాలము రక్షించుచు నుండెడు; మెల్ల కార్యంబులయందును నప్రమత్తుల రయి వర్తిల్లునది; భవత్పునర్దర్శన మయ్యెడు మరుగుం’డని కఱపిన గురువృద్ధానుమతంబునం దమ తల్లి చరణంబులకు మ్రొక్కినం గొడుకుల. | 283 |
| సీ. |
అధికలజ్జావనతాస్యుల, నపగతా | భరణాంబరుల, ధర్మపరుల, నజిన వల్కలధారుల, వరమునివేషులఁ | బాండుకుమారుల భానునిభులఁ జూచి దుఃఖిత యయి సుతులార! యిట్టి దు | ర్వ్యసనోపహతులైనవారి మిమ్ముఁ జూడక ముందఱ సురలోకమున కేఁగి | పాండుభూపతి పుణ్యభాగి యయ్యె; |
|
| తే. |
భక్తిఁ బతితోన పోవఁ దపంబు సేసె | మాద్రి; యే నేల పోవక మందభాగ్య నయితి నని విలాపించుచు నపుడు గుంతి | యేడ్చె దుఃఖితు లగుచుండ నెల్లవారు. |
284 |
| వ. | మఱియును | 285 |
| మత్తకోకిల |
వీర లిట్టు లనాథులై మునివృత్తి నుండెడు వారె హా ద్వారకాపురనాథ! కేశవ! దైత్యభేది! భవత్పదాం భోరుహాశ్రితులైన వీరలఁ బూని కావక యుండఁగా ధారుణీధర! నీకు ధర్మువె ధర్మనిర్మలమానసా! |
286 |
| తరలము |
అమితసత్త్వులు ధర్మమూర్తు లహర్పతిప్రతిముల్ రిపు ద్రుమహుతాశను లాపగేయుఁడు ద్రోణుఁడున్ విదురుండు గౌ తముఁడు నుండఁగ ధర్మమార్గము దప్పఁ బాడియె? పాండవో త్తములు రాష్ట్రనిరాసయోగ్యులె ధార్తరాష్ట్రుల వంచనన్? |
287 |
| క. |
అన్న! సహదేవ! నీవును | నన్నలతో నరిగె దయ్య యట నడవుల కీ వున్నను సుతు లందఱు నిం | దున్నట్టుల నాకుఁ జిత్త మూఱడి యుండున్. |
288 |
| వ. | అనుచు శోకాక్రాంత యయి కుంతీదేవి దనకు వినయవినమితోత్తమాంగ యయిన పాంచాలిం జూచి బాష్పజలంబు లురుల ని ట్లనియె. | 289 |
| క. |
ధవళాక్షి! నీ కతంబునఁ | బవిత్రమై ద్రుపదకులముఁ బాండుకులంబున్ భువనముల వెలిఁగె నీ వు | ద్భవ మౌటను జొచ్చుటను శుభస్థితితోడన్. |
290 |
| ఆ. |
‘పురుషవృషభు లయిన పురుషులతోడన | యరిగి పరమభక్తిఁ బరిచరింపఁ బోవఁ గనుట నీవు పుణ్యంబు సేసితి’ | వంచుఁ బ్రీతిఁ గౌఁగిలించుకొనియె. |
291 |
| వ. | అని యిట్లు కోడలిం గొడుకులను దీవించి కుంతీదేవి విదురుగృహంబున నుండె; నంత. | 292 |
| ఆ. |
పతులపిఱుఁద మందగతి ముక్తకేశియై | పోవుదాని ద్రుపదపుత్త్రిఁ జూచి వంతఁ గౌరవేంద్రు నంతిపురంబున | వారలెల్లఁ దలలు వాంచి రడలి. |
293 |
| ఆ. |
ధర్మతనయుపిఱుఁదఁ దమ్ములు నలువురు | నరుగుచుండి తత్సభాంతరమున జనులు వినుచునుండ సంభృతక్రోధులై | పలికి రధికపరుషభాషణముల. |
294 |
| క. |
సాహసమున మద్బాహు గ | దాహతి దుర్యోధనాదులగు రిపుల జగ ద్ద్రోహులఁ జంపుదు నత్యు | గ్రాహవమున హరిహరాదు లడ్డం బైనన్. |
295 |
| ఆ. |
దుష్టచిత్తుఁ డయిన కష్టు దుర్యోధను | శిరము దన్నువాఁడ ధరణిఁ గూల్చి; హీనుఁడైన దుస్ససేనుని వధియించి | వేఁడిరక్త మానువాఁడఁ గడఁగి. |
296 |
| మ. |
కనకోర్వీధర సానుసార రుచిమద్గాండీవ నిర్ముక్త ప త్త్రినిపీతారుణ వారిశేషముఁ బతత్రివ్రాతముల్ ద్రావున య్యని నాతోడఁ జతుర్దశాబ్దమున మాఱైపోరు కర్ణాది దు ర్జన సంఘంబుల మార్తురం దునుముదున్ సంగ్రామరంగంబునన్. |
297 |
| క. |
మాయాద్యూతంబున ని | ర్జేయులఁ గా మమ్ము నిట్లు సేసిన ఖలు న న్యాయపరు శకుని నస్మ | త్సాయకజితహస్తుఁ జేసి చంపుదు మాజిన్. |
298 |
| వ. | అని భీమార్జున నకుల సహదేవులును విజృంభించి కృతప్రతిజ్ఞులై; రట్లు పాండవులు పరిత్యక్తవిభవు లయి నిజాయుధంబులు ధరించి గజపురంబు వెలువడి; రంత. | 299 |
| సీ. |
ధృతరాష్ట్రవిభుని మందిరమున నఱచుచుఁ | బఱచె గోమాయువుల్ పట్టపగల; యప్రదక్షిణముగా నయ్యె నుల్కాపాత; | మపమేఘమై యున్న యంబరమున విద్యుత్సహస్రముల్ విలసిల్లె; మఱి రాహు | పర్వంబు గాకయ భానుఁ బట్టె; భూకంప మయ్యె నప్పుడు; సభాంతరమున | నరులెల్ల వినుచుండ నారదుండు |
|
| ఆ. |
పలికె నద్భుతముగఁ ‘బదునాలుగవ యేఁడు | భారతాజి యగు; నపారవీరు లయిన పాండవులు జయం బందుదురు భీమ | మఘవసుతుల విక్రమమున’ ననుచు. |
300 |
| వ. | ధృతరాష్ట్రుండును దాని నంతయు విని ‘కొడుకుల దుర్ణయంబుల నింక నెట్టి యరిష్టంబులు పుట్టెడునో’ యని వగచుచు విదురుం బిలిచి, ‘ధౌమ్య ద్రౌపదీ సహితు లయిన పాండవు లెట్లు వోయి’ రని యడిగిన నతనికి విదురుం డి ట్లనియె. | 301 |