| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
వదనసరోజంబు వస్త్రాంతమునఁ గప్పి | కొని యేఁగె ధర్మనందనుఁడు; మఱియు భీమబాహులు రెండుఁ బెద్దలుగాఁ జాచి | ఘనసత్త్వుఁ డమ్మరుత్తనయుఁ డరిగె; నిసుము చల్లుచు నమరేంద్రపుత్త్రుఁడు వోయె; | భూరేణులిప్తశరీరుఁ డగుచు నకులుండు సనియె; మానక లజ్జఁ జేసి య | ధోవక్త్రుఁ డై సహదేవుఁ డరిగె; |
|
| ఆ. |
వివృతకేశభరము వ్రేలంగ ద్రౌపది | సనియె; రౌద్రయామ్య సామగాన ముఖరితాస్యుఁ డగుచు మ్రోల ధౌమ్యుం డేఁగె | సకలజనులు శోకజలధిఁ దేల. |
302 |
| వ. | అనిన ‘నట్లేల వార లరిగి?’ రని యడిగిన విదురుం డి ట్లనియె. | 303 |
| క. |
నీకొడుకునికృతిఁ జేసి య | పాకృత రాజ్యుఁ డయి ధర్మపతి నిజరూక్షా లోకనజనదాహభయ | వ్యాకులుఁ డై చనియె దృష్టి వారించి వడిన్. |
304 |
| క. |
సమరమున బాహుబల ద | ర్పము మెఱయం గంటి ననుచు బాహు లతివిశా లములుగఁ జేయుచు నరిగెను | సమీరజుఁ డరాతిభీతిసంజననుం డై. |
305 |
| క. |
వెఱచఱవ నింతకంటెం | దఱుచుగ బాణంబు లేసి తడయక పగఱం జెఱుతు నని యిసుము చల్లుచు | నుఱక ధనంజయుఁడు రణజయోన్నతుఁ డరిగెన్. |
306 |
| వ. | మఱి దుఃఖాను భావంబున కనుచితంబైన తన సుందర రూపంబు సూచి జనులు దుఃఖింప కుండ వలయు నని ధూళి ధూసరిత శరీరుండై నకులుం డరిగె; దీనంబైన తన యాననంబు సూచినవారికి నెల్ల నెగ్గగు నని యవనతవదనుం డయి సహదేవుం డరిగె. | 307 |
| చ. |
తడిసిన యేకవస్త్రపరిధానముతోడ విముక్తకేశియై తొడరుచు దుఃఖభావమున ద్రోవది వోయె మహాహవంబునం బడిన నిజేశ మిత్ర సుత బంధు జనంబులు శోకవేదనం గడుకొని యట్ల యేఁగుదురు కౌరవభామిను లన్విధంబునన్. |
308 |
| క. |
భారతరణహతు లగు కురు | శూరుల పరలోకవిధులు సూచించి క్రియా పారగుఁడు ధౌమ్యుఁ డరిగె వి | చారజ్ఞుఁడు రౌద్రయామ్యసామోద్గీతిన్. |
309 |
| వ. | అనిన విని ధృతరాష్ట్రుండు దుఃఖితుం డయి. | 310 |
| తరలము |
సమరశూరులు పాండవుల్ జితశత్రు లున్నతచిత్తు లు త్తములు వారలతోడి వైరము ధర్మయుక్తిఁ గరం బయు క్తము ప్రజాక్షయకారణం బని తద్దయున్ భయమందుచున్ విమనుఁడై పడియుండె హా యని వెచ్చనూర్చుచు విన్న నై. |
311 |
| వ. | అట్లు వగుచుచున్న ధృతరాష్ట్రునకు సంజయుం డి ట్లనియె. | 312 |
| సీ. |
పాండుకుమారులఁ బరమధార్మికు లని | వగవక రాష్ట్రంబువలనఁ బాపి వసుపూర్ణమైన యివ్వసుమతి సేకొంటి | వసుధేశ! నీ కింక వగవ నేల? కలశజ విదుర గంగాసుత ప్రభృతులు | వారింప వారింప వశము గాక కర్ణ గాంధారుల కఱపులు విని, వారి | కపకారి యయ్యె నీ యాత్మజుండు; |
|
| ఆ. |
వగవ కధికు లయిన వారితో వైరంబు | సేసికొంటి కరము చెట్ట యనక; నీవు నీ సుతుండు నేర్తురు గా, కొరు | లేమి సేయనేర్తు రిందుకులుఁడ! |
313 |
| వ. | అని సంజయుండు పలికిన విని విదురుండు ధృతరాష్ట్రున కి ట్లనియె. | 314 |
| తరలము |
వగవ నేటికి నింకనైనను వారలం బిలిపించి యీ జగతి నెప్పటియట్ల యేలుచు సంతసంబున నుండఁగా జగదధీశ్వర! పంపు; వంచన చన్నె? యన్యుల సంపదల్ మిగిలి చేకొన నిట్లు సేసిన మెత్తురే మది నుత్తముల్? |
315 |
| ఆ. |
అనిన విదురుపలుకు లా ధృతరాష్ట్రుండు | వినియు విననియట్లు విపినవాస గతులఁ బాండుసుతులఁ గ్రమ్మఱింపక యుపే | క్షించెఁ బూర్వవిహిత కిల్బిషమున. |
316 |
| వ. | మఱియు ద్రోణుండు పాండవులకు నెయ్యుం డయ్యును దొల్లి యాజోపయాజుల వరంబున నగ్ని కుండంబున నుద్భవిల్లిన ద్రుపదాత్మజుండు ధృష్టద్యుమ్నుండు పాండవసంబంధి యయి ప్రతివీరుం డగుట నాతనితోఁ దనకు సమరం బగు నని యెఱింగి పాండవానుగమనంబు సేయ నొల్లక గజపురంబున ధృతరాష్ట్రు నొద్దన యుండె; ని ట్లింద్రప్రస్థపురంబున నిరువది మూఁడేఁడులు రాజ్యంబు సేసి పాండవులు పాపద్యూత పరాజితు లయి. | 317 |
| క. |
వీరులగు పాండు సుతులు మ | హారణ్యనివాస నిరతులయి ధరణీబృం దారక సహస్రములతో | సారమతుల్ సనిరి నిత్యసత్యవ్రతులై. |
318 |
| క. |
అని యిట్లు సభాపర్వం | బున కథ జనమేజయునకు మొగి వైశంపా యను చెప్పిన విధమంతయు | మనునిభ! శుభచరిత! నిత్యమహిమాతిశయా! |
319 |