| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము |
| సీ. |
‘ప్రారంభములకెల్లఁ బౌరుషమ్మును దైవ | మును సాధనమ్ములు వినుము వాని లోన నొక్కటి చేతఁ గానేర వనఘ! త | త్ఫల సిద్ధు; లెట్లన్నఁ. దఱచు వాన కారు పొలంబునఁ గల్గె నేనియుఁ గొల్చు | గావింప నేర్చునే? కల విధమున వల నేర్పడఁగ దున్నఁ బొలములో నైన వ | ర్షంబు లేకున్న ధాన్యంబు లగునె? |
|
| ఆ. |
కాఁపు లావు వెరవు గల్గి కర్శనము సే | యంగ, వృష్టి దగినయట్లు గలుగ ఫలము గల్గు; నట్లు పౌరుషంబునకు దై | వంబు తోడుపాటు వలయు నెందు. |
31 |
| వ. | ‘అదియునుం గాక.’ | 32 |
| క. |
‘తగుపని కుద్యోగించుచుఁ, | దగ వెఱిఁగెడు హితుల కనుమతంబుగఁ జేయన్ జగతీ సురవర! కార్యము | లగు; వారికిఁ గలుగు విధి సహాయత్వంబున్.’ |
33 |
| క. |
‘ధర్మము దప్పక నయగతిఁ | గర్మాచరణంబు నడపఁగా ఫలసిద్ధిన్ నిర్మలయశ మగుఁ; దప్పినఁ, | బేర్మి సెడదె నింద రా నభేద్యోత్సాహా!’ |
34 |
| ఉ. |
‘నీతి దొఱంగి కార్యముల నెట్టన యాగ్రహవృత్తిఁ జేసినం బ్రీతిగ సిద్ధిఁ బొందినను భీతియుఁ గుత్సయుఁ బుట్టు; భూజను ల్వేతురు; చేటు చేఁతలు ఫలింపక తక్కిన, మున్న వచ్చు న త్యాతురతాస్పదంబు లగు నాపద; లిద్ధ వివేకవైభవా!’ |
35 |
| ఉ. |
‘క్రోధము, లోభమున్, భయముఁ గూరిన చిత్తముతోడ దుష్క్రియా సాధనవృత్తి దుర్జనుఁడు సజ్జను లాఁగఁగఁ జేయు కార్యముల్ బాధలఁ బెట్టకున్నె? సిరి పాయఁగఁ జేయకయున్నె వానిఁ? దీ వ్రాధి నితాంత దుఃఖ హృదయత్వము దేరకయున్నె వానికిన్?’ |
36 |
| చ. |
వినుము కురుక్షితీశుఁడు వివేక విదూరుఁడు క్రోధలోభముల్ మనమునఁ బేర్చినన్ దురభిమానమునన్ హితులెంత చెప్పిన న్వినక బహుప్రకారముల నిందకు నోర్చి పరాభవించె స జ్జనులగు పాండుపుత్రుల; నసత్పథవృత్తికిఁ జేటు దప్పునే?’ |
37 |
| వ. | అని పలికి తమ్మునతండు ‘మీ మది గలఁగకయున్నదేనిఁ గర్తవ్యంబుఁ జెప్పవలయు’ నని యడిగినమాట లుగ్గడించి | 38 |
| క. |
‘జగ మెఱుఁగఁగ దుశ్శీలుం | డగు భూనాథుండు వోయినట్టులె పోఁగాఁ డెగడుం జేటుఁ గలిగి వగ | మిగులను మది గలఁగదే యమిత్రధ్వంసీ!’ |
39 |
| వ. | ‘అది యట్లుండె మన కిప్పు డిది కర్తవ్యం బని నిశ్చయింప మన మేమి నేర్తుము? తగవు తెఱంగెఱింగించెద నాకర్ణింపుము.’ | 40 |
| క. |
‘మన మందఱమును ధృతరా | ష్ట్రుని కడకుం బోయి కార్యసూత్ర మతనిచే వినవలయు; నాతఁ డెయ్యది | గని పలికిన నదియ మనకుఁ గర్తవ్య మగున్.’ |
41 |
| వ. | అమ్మహీకాంతుండు. | 42 |
| క. |
తానును గాంధారియు నె | ద్దానిం గార్యంబు గాఁగఁ దలఁచి పనిచినన్ దానికిఁ గా దన వలవదు; | పూని యనుష్ఠింత; మదియ పొగ డొందించున్. |
43 |
| వ. | వారలకడ విదురుండు నుండు నమ్మువ్వురు విచారించి చెప్పిన కార్యంబునకు నిందగలుగ; దట్లుంగాకయెట్లు పొరలినను దైవోపహతంబు లగు కార్యంబులు సిద్ధిఁ బొందునె? యడిచిపడవలవదు. విచారించి కొంద’ మనవుడు శోక దందహ్యమానమానసుం డగుచు నగ్గురపుత్రుండు కృతవర్మను నతని నాలోకించి. | 44 |