పురాణేతిహాసములు శ్రీమహాభారతము స్త్రీపర్వము - ప్రథమాశ్వాసము
ధర్మరాజు దమ్ములతోడ ధృతరాష్ట్రు నొద్దకుఁ బోవుట (సం. 11-11-1)
తే. తనయులందఱుఁ బొలియుట వినిన యడలు | మానసంబు దహింప నమ్మనుజవిభుఁడు
వొగులుచును వచ్చెనను తలపోఁతఁ జేసి | యుల్ల మక్కటికమునఁ జొత్తిల్లుచుండ.
117
క. వదనమున విన్నఁదనముం | గదురఁగ హరిఁ జూచి రాజుఁ గానవలయు నా
కదియెట్లు నుడుగవచ్చునె? | కదలుండని పలికి చనియెఁ గలనివలనికిన్‌.
118
ద్రుతవిలంబిత వృత్తము చనఁగ నాతఁడు సాత్యకి వాయునం | దనుఁడు గాండివి దమ్ములు సూరెలం
జనిరి ద్రౌపది సంభృతశోక యై | చనియెఁ జుట్టపుఁ జానలు సుట్టిరాన్‌.
119
వ. ఇట్లు మాత్స్యపాంచాల భామలు నరిగిరి. తొలునాఁడు దుర్యోధనుండు మన్నించు మానవతులం గరి నగరంబునకుం గొని చని యారాత్రి యందు నిలిచి ధృతరాష్ట్రుం బొడగానక రేపకడ మగిడి వచ్చి యున్న యుయుత్సుండును నమ్మానవపతితోన చనియె. నట్లు ధర్మసూనుండు సని సమరతలంబు దఱియునంతకు నయ్యెడకు నాంబికేయుండు సనుదెంచె. నతని ముందటి వలని వనితాజనంబు లక్కౌంతేయాగ్రజుం గనుంగొని కరంబులెత్తి యేడ్చుచు నెదుర్కొని. 120
సీ. ధర్మ వేదిత్వ మీ ధరణీశ్వరునకు నెక్కడి | యది కృప యెందుఁగలదు? తలఁపఁ
దండ్రుల మామలఁ దాతలఁ గొడుకులఁ | దోడఁబుట్టువులను ద్రుంచివైచెఁ
గ్రూరత మెఱయంగ గురుజనంబులఁ గూల్చె | సఖుల సంబంధులఁ జంపె నదయుఁ
డని పల్కుదురు కొంద ఱప్పార్థుఁ జేరి గాం | గేయుని ద్రోణునిఁ గెడయఁ బొదువఁ
 
ఆ. బనుపనెట్లు నేర్చి తని పల్కుదురు గొంద | ఱకట! సింధురాజు ననుజమగనిఁ
దునిమి తేటి రాజ్య? మని పల్కుదురు గొంద | ఱతఁడు మోము వాంచి యరుగుచుండ.
121
వ. మఱియుం గొందఱు. 122
క. ఇందఱఁ జంపితినని యు | బ్బం దీఱద ద్రుపదతనయపట్టుల నభిమ
న్యుం దెగటార్చితి మఱఁదుల | నందఱ మ్రింగితి విభూతి యన నీ కెద్దీ?
123
వ. అని పలుకుదు రిట్లు బహుప్రకారంబులం బలుకుచుండం బలుకు వెలువరింపక పుత్రశోకార్తుఁడగు నప్పాండురాజపుత్రుండు పుత్ర శోకార్తి మిగులం బొగులు విచిత్ర వీర్యపుత్రుకడకుంజని తత్పార్శ్వవర్తులచేత నావేదితుండగుచు నా భూవల్లభు పాదంబులకుం బ్రణతుండగుటయు. 124
శుద్ధ విరాటి వృత్తము ఉల్లం బప్రియ మొందఁ గ్రొత్త సం | ధిల్లన్‌ నెవ్వగ దీనవక్త్రుఁడై
యొల్లంబోవుచు నుచ్చె నవ్విభుం | డల్లం గౌఁగిట నా నృపాలకున్‌.
125
వ. ఇవ్విధంబున నాలింగనంబు సేసి సాంత్వన వచనంబుల నుపచరించెఁ దదనంతరంబ భీమార్జున నకుల సహదేవులు సేరిన నతనియొద్దివారు వారిం బేరు వేర నెఱిఁగించిన. 126
తే. భీముఁ డనుమాట విని యతి భీమమైన | యలుక యను వహ్ని యవ్వీరుఁడను వనంబు
దరికొనంగ నుంకింప నధర్మవిధికి | నాయితంబగు నయ్యాంబికేయుఁ జూచి.
127
క. మనసెఱిఁగి హృషీకేశుఁడు | దనమనమున నిద్దురాత్ము తలఁపొప్ప దిసీ
యనుచుం బవనజు నద్దెస | జనకుండఁగ బట్టి వీతసంభ్రమలీలన్‌.
128
వ. ధృతరాష్ట్రుం డిట్టివాఁడు గాఁగలవాఁడని తొల్లి యెఱింగి త్రికాలవేదియైన కృష్ణుం డయోమయంబుగా భీమ ప్రతిరూపంబు సేయించి సంగ్రహించి నిగూఢ ప్రకారంబునం దత్ప్రదేశంబునకుఁ దెప్పించినవాఁడు గావున గ్రక్కున నయ్యినుపరూ పజ్జగతీశ్వరుం జేర నిలిపె; నిలిపిన నది భీమసేనుండ కాఁ దలంచి. 129
క. కోపం బుత్కటమై యా | రూపము నిరుగేలఁ బట్టి క్రూరత ఘోరా
టోపం బెసకమెసఁగ నా | భూపతి వెసఁ గౌఁగిలించి పొలుపఱ విఱిచెన్‌.
130
లయవిభాతి పెరుఁగఁగ నిజాంగములు సరభసపరిస్ఫురణ | మరుదుగ జనావలులు నిరుపమవిధం బి
న్నరపతి బలంబనఁగఁ గరయుగముతోలవియ | నురము సదియం బెలుచఁ దొరఁగఁగఁ బొరిన్‌ నె
త్తురులు ముఖ రంధ్రములఁ బరవశత మానసము | బొరయుటకుఁ జొచ్చియును సరిగొనఁగఁ గంటిన్‌
వరసుతున కిప్పుడను పరమపదవిన్‌ మగుడఁ | గురునృపతి యా ప్రతిమఁ బొరి నిటులు పుచ్చెన్‌.
131
వ. ఇత్తెఱంగున దశసహస్రసామజ సమానబలుండగు నయ్యంధనృపతి గంధవహనందన ప్రతిరూపంబు భగ్నంబు సేసి పెంపున నెడఁద నిర్భర హర్షంబు నొందియు మెఱమెచ్చునకై భీమునిం బేర్కొని హాహాకారంబు లెసంగ రోదనంబు సేసినఁ జిఱునవ్వునం దన వదనకమలం బొప్పం గమలనాభుం డతని కిట్లనియె. 132
తే. ‘అడల నేటికి? నీచేతఁ బడఁడు భీముఁ | డిపుడు భంజింపఁ బడినది యినుపరూపు
వినుము నీ కోప మెఱిఁగియ వెనుక కతనిఁ | దిగిచి యేను నీ ముందట దీని నిడివి.
133
క. బలమున నీతో దొరయఁగ | నిల నెవ్వఁడు గలఁడు? నీ మహిత భుజ శాఖల్‌
తలఁపఁగఁ బ్రళయాంతకు దం | ష్ట్రలు వీనిం దగిలి వశమె? చాకుండంగన్‌.
134
వ. కావున 135
ఉపేంద్రవజ్రావృత్తము మరుత్తనూజుం బరిమార్పఁ జూచుం | బరిస్ఫురత్కోప నిబద్ధుఁడై యి
ద్ధరావిభుండం చిది తల్గనే సం | స్మరించి యీ కోపు నమర్చికొంటిన్‌.
136
తే. తనయ శోకాతురుండవై ధర్మ మెడలి | యనిలసుతుఁ దెగటార్చెదనని తలంచి
తట్టి పనియేల నీ చేతనగు? విధాతృ | లీలఁ బరికింప నేరక బేలవైతి.
137
వ. అదియునుం గాక. 138
క. వినుమొకని నేల భవదను | జుని పుత్రుల నెల్లఁ జంపఁ జొప్పడినను నీ
తనయులు మగుడఁగ వత్తురె? | యనయము పాపంబు సేసి తాఱడిఁ బోవన్‌.
139
స్రగ్విణీ వృత్తము ఏము నీ పుత్రుచే నెన్నియేన్‌ భంగులన్‌ | వేమఱుం బాటు నీ వెంట భావించుచున్‌
సామసంపాదివై సైఁపు మాతప్పులన్‌ | ధీమహత్త్వంబు సంధిల్లు నీ కిమ్మెయిన్‌.’
140
వ. అని చెప్పె నప్పుడు ధృతరాష్ట్రు పరిచారకు లతని యవయంబుల రుధిరంబు ప్రక్షాళనంబున నపనయింపం దలంచి జలంబులు దెచ్చి యెఱింగించిన నజ్జనపతి యప్పని యాచరించె. నప్పుండరీకాక్షుండు వెండియు నవ్విభున కిట్లనియె. 141
సీ. ‘జగతీశ! వేదముల్‌ సదివితి శాస్త్రముల్‌ | వింటి వర్తిల్లితి వృద్ధగోష్ఠి
నఖిలపురాణ పర్యాలోచనము సేసి | తెల్ల ధర్మంబులు నెఱుఁగు దిట్లు
నీ తప్పు దలఁపక నెవ్వగఁ బొందెదు | కనలెద వేను శంతనసుతుండు
గురుఁడును విదురుండుఁ గూర్కొని కూర్కొని | చెవులఁ బోయమె సవిశేషకార్య
 
తే. వచనములు? సంజయుఁడు పెక్కువరుస లుభయ | బలవిధంబులు దెలియఁగఁ బలుకఁ డెట్లు?
నీకు నా బుద్ధులన్నియు నెమ్మనమునఁ | జేర్పఁబోలవ యింకేమి సేయవచ్చు?
142
క. భీమార్జునుల రణసము | ద్దామత్వం బెఱిఁగి యెఱిఁగి తగునే తొడరం
గా మనుజుల కవ్వీరుల? | నేమనఁగల దింక నేల యీ చందంబుల్‌?
143
క. తన మేలుఁ గీడుఁ దా మదిఁ | గనుచు హితులు సెప్పు బుద్ధిఁ గైకొని శుభముం
గొనకొని నడపు పతికి వ | చ్చునె పశ్చాత్తాప మెట్టి చోట? నరేంద్రా!
144
ప్రణవ వృత్తము నీ యుల్లం బొక నియతిం గార్యం | బాయత్తంబుగ ననుసంధింపం
జేయం జాలవు చెడు తెర్వుం బోఁ | బాయం ద్రోవవు బలిమిం బుత్రున్‌.
145
తే. ద్యూతమునగెల్పు నెపమున నుఱికి పుణ్య | కాంతఁ దల పట్టికొని సభాభ్యంతరమున
కీడ్చి వలువ లొలుచుటయు నెఱిఁగి సుతులఁ | జంపెనని భీముఁ జంపఁ దలంపనగునె.
146
వ. నీ యవినీతియుం గొడుకుల దుశ్చరిత్రంబునుం దలంచి శోక రోషంబులు విడిచి శాంతుండవై యుండుమనిన నుపేంద్రునకు నన్నరేంద్రుం డిట్లనియె. 147
జలదవృత్తము ‘నీ పలుకెల్ల నిక్కమ యనింద్యగుణా! | యీ పురుషార్థహాని సుతు లీల్గుటకుం
దాపముఁ బొంది తాల్మి దిగఁ ద్రావి మహా | కోపుఁడ నైనఁ బాటిలెఁ దగుం గినియన్‌.
148
క. తెలిసితి నీ మాటలఁ బు | త్రుల దెస నెవ్వగనెల్లఁ దొఱఁగి యనుజ పు
త్రుల నాకుఁ బ్రియ మొనర్పం | గలవారుగ నడచువాఁడఁ గంసారాతీ!’
149
వ. అనుటయు నమ్మహాత్ముండు భీమార్జున నకుల సహదేవులం గానిపించినఁగ్రమంబున నమ్మానవపతి వారలం గౌఁగిలించుకొని దీవించె నప్పు డాశ్రితవత్సలుండగు శ్రీవత్సలాంఛనుండు యుయుత్సునకుఁ దదీయ సందర్శనంబు సముచిత ప్రకారంబున నడిపె నట్లు గాంచిన వణిక్కన్యాజాతునెడం బొడమిన వాత్సల్యంబున వైచిత్రవీర్యుం డతనిఁ దిగిచికొని యక్కునం జేర్చికొనియెఁ దదనంతరంబ యద్ధరణీవిభుండు ధర్మపుత్ర ప్రభృతులగు నయ్యేవుర నుద్దేశించి ‘మీరు గాంధారిం గనుం’ డని పంచిన నప్పాండవేయులు పద్మనాభ పురస్సరంబుగాఁ జని వినయంబున వినతులైన నద్దేవి దీవింప నొల్లక యుల్లంబు నిజతనూజుల మరణంబునకుం దాపంబునొంద శాపంబిచ్చునదియై యజాతశత్రు నుద్దేశించిన నత్తెఱఁగు సకలప్రాణి చిత్త వృత్తంబులు దన దివ్యబోధనంబునం దేటపడం గనియెడువాఁడును మనోజవుండును సర్వలోక సంపూజ్యుండును నగు సత్యవతీ సూనుండెఱింగి తత్‌క్షణంబ సన్నిహితుండై యఖిలజనంబు లభివందనంబు సేయం గైకొనుచు నక్కోడలిం జేరి యోహో! శపింపకు శమింపుమని పలికి మఱియు నిట్లనియె. 150
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )