పురాణేతిహాసములు శ్రీమహాభారతము స్త్రీపర్వము - ప్రథమాశ్వాసము
ధర్మజుని శపింపఁ బూనిన గాంధారిని వ్యాసుఁడూరార్చుట (సం. 11-13-6)
సీ. ‘పాండవేయాగ్రజుపై నల్కమానుము | రాజసంబేల? యీ రాజు ధర్మ
పరుఁడు నీ వించుక పాటించి వినవమ్మ | చెప్పెదఁ గౌరవశ్రేష్ఠుఁ డనికిఁ
జనుచుండి ‘తల్లి! దీవన యిమ్ము జయముగా | నా’కని పలికిన నా కుమారు
తోడ నీ పేర్మికి నీడుగాఁ గొడుక! యె | క్కడనుండు ధర్మ మక్కడకు జయము
 
తే. సేరు ననవె? భూరి ఘోర యుద్ధంబున | గెలుపుగొనిరి గాన తలఁప ధర్మ
పరుల కాఁగవలయుఁ బాండుతనూజు ల | సూయ లేని బుద్ధిఁ జూడు మెట్లు.
151
మేదినీవృత్తము విను మిటులేటికిం జనిన వృత్త మూఁ ది యల్గన్‌ | జనము నుతించు నీదు గురుసారధీరబుద్ధిన్‌
నిను నతిశాంతచిత్తయని నిక్క మేనుఁ గందున్‌ | మనమున నట్టి నీ కగునె? మత్సరంబు వత్సా!
152
వ. ధర్మంబు పరిగ్రహించి నీ కొడుకులగు పాండవులదెస రోషంబు నిగ్రహింపు’ మనిన గంధవతీనందనునకు గాంధారరాజనందన యిట్లనియె. 153
సీ. ‘ఏ నసూయాగ్రస్తఁ గాను వీరలఁ జెడఁ | దలఁతునె? యెట్టు లుమ్మలికఁ జేసి
కలఁగితిఁ గాక యిక్కౌంతేయ వర్గంబు | గొంతికెట్లట్ల నాకును భరింప
వలదె? దుర్యోధను తులువతనంబున | శకునియుఁ గర్ణదుశ్శాసనులును
దుష్టాత్ము లగుటను ద్రుంగెఁ గౌరవకుల | మడరి పాండవులుఁ గయ్యంబుపాడిఁ
 
ఆ. జంపి రందఱ నది మది నొంపఁజాల | దచ్యుతుఁడు సూడఁ గురుపతి ననిలసుతుఁడు
దగునె గదపోర నాభికి దిగువ నొంచి | చంప? నత్తెఱఁ గుల్లంబు నొంపకున్నె?
154
క. విడుతురె శూరులు రణమునఁ | బడునట్టి యవస్థ తమకుఁ బాటిల్లిననుం
బుడమి సమస్తజనంబులు | నడపెడు తెఱఁ గలుక తప్పునకు రాకున్నే?’
155
వ. అనిన భీముండు భీతికంపితుండగుచు గాంధారికి వినతుండై వినయంబున నిట్లనియె. 156
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )