పురాణేతిహాసములు శ్రీమహాభారతము స్త్రీపర్వము - ప్రథమాశ్వాసము
పాండవులు కుంతీదేవి కడకు గాంధారి పంపునం బోవుట (సం. 11-15-9)
అంబురుహ వృత్తము పెద్దయుఁగాలము వారలఁ జూడఁగఁ బ్రేముడించుచు దుర్భరా
పద్దశ నొందుట నమ్మహితాత్ముల పట్టులందఱుఁ ద్రుంగుటం
దద్దయు శోకమునం బొరి నశ్రులధార లొల్క వగర్పుతో
నద్దురవస్థ తెఱంగు గనుంగొని యంతకంటెను నార్తు లై.
177
వ. చరణంబులు దొట్రిల్లం జని తచ్చరణంబుల మీఁద వ్రాలి. 178
తే. ఏడ్వ నందఱపైఁ జేతు లిడుచుఁ బెలుచ | నేడ్చి యద్దేవి వారల నెత్తి వేఱు
వేఱ మేనులు నివురుచు వివిధ దారు | ణాస్త్ర శస్త్రవ్రణ ప్రచయములు గాంచి.
179
క. ‘అచ్చోటు లంటి చూచుచు | వెచ్చని యూర్పులు నిగుడ్చు వేఁగుచుఁ బొగులుం
గ్రుచ్చి కవుంగిటఁ జేర్చును | ‘వచ్చితిరే! నృపకుమారవరులార!’ యనున్‌.
180
సీ. ఆ సమయంబున నప్పాండుభూపాల | పత్నికి శోకాగ్ని ప్రజ్వరిల్లఁ
దత్సమీపమునకు ద్రౌపది విన్నని | మోముపైఁ గన్నీరు ముసుఁగువడఁగఁ
బదముల నట దొట్రుపాటు వాటిల్లంగ | దైన్య మాకారంబు దాల్చినట్టి
తెఱఁగునఁ జనుదెంచి ‘దేవి! సౌభద్రాదు |లైన నీ మనుమ లెం దరిగి? రెంత
 
తే. యేనిఁ గాలంబు నినుఁ జూడ రిప్పు డిచటి | కేలరా?’ రంచు నడుగుల మ్రోల నేల
వ్రాలె వికలాంగియై తెంచివైవ నెండ | దాఁకి వందిత తీఁగ చందంబు దోఁప.
181
వ. ఇట్లు మేదినింబడి రోదనంబు సేయు నయ్యుగ్మలి మీఁద నొఱగి తానునుం బెద్ద యెలుంగున నేడ్చి గ్రుచ్చి యెత్తి యక్కునం జేర్చి యూరార్చి యత్తన్వియుం దనయులుం దోడన చనుదేరఁ గుంతి గాంధారి కడకుం జనియె నప్పుడు ద్రౌపది యా ధృతరాష్ట్రు పత్ని పాదంబులకు మ్రొక్కి యడలున వెక్కుచున్న నద్దేవి యమ్ముద్దియ నుద్దేశించి. 182
మత్తకోకిల ‘పుత్రి! యిట్లగు నమ్మ? శోకముఁ బొంది కుందుచు నున్న నీ
గాత్ర మొండొక కీడు పాటిలి కందుఁ బాండుతనూభవుల్‌
పుత్రవర్గము గన్నచో నెద భూరితాపముఁ బొందుడుం
బౌత్ర హీనతఁ బడ్డ గొంతికిఁ బాయనేర్చునె నెవ్వగల్‌?
183
క. నిను నే నిట్టూరార్చెద | నను నీ వూరార్ప వలదె? నా నీ తెఱఁగుల్‌
విను మొక్కరూప మన కే | మనఁగలదు విధాత క్రూరుఁడై పఱుపంగన్‌?
184
ప్రహరణకలిత వృత్తము ఇది యిటులగు ట ట్లెఱిఁగి పలికె నా | విదురుండు సభఁ గోవిదులు వొగడఁగా
నది వినియును నే నడఁపన దురితం | బొదవెఁ గలఁక సే టొలయ కుడుగునే?
185
వ. ఇ ట్లనియెదం గాక నా చేతఁబోవునే యెవ్వరు నేమి సేయుదురు కాలవశంబున నవశ్యభావియైనది యయ్యె నుపశమింపు ‘మని పలికెనని యిట్లు పాండవులు ధృతరాష్ట్రుని గాంధారిని ననునయించిన తెఱంగెఱింగించిన నా భంగి నుపశమితక్రోధయైన గాంధారరాజనందన పదంపడి యెవ్విధంబున వర్తించె? ధర్మతనయు ననంతర వర్తనం బెప్పాటఁ జెల్లె?నని యడుగుటయును. 186
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )