పురాణేతిహాసములు శ్రీమహాభారతము స్త్రీపర్వము - ప్రథమాశ్వాసము
భీముఁడు గాంధారికిఁ గోపోపశమనంబుగా నుత్తరంబు లిచ్చుట (సం. 11-14-1)
సీ. ‘తలపోసి చూడంగ ధర్మమయ్యె నధర్మ | మయ్యెనేఁ బ్రాణభయంబు కతన
నట్లు సేసితిఁ గృపయార సైరింపుము | నీదు పుత్రుఁడు లావు నేర్పుఁ గలఁడు
గావున నమ్మెయిఁగాని యోర్వంగ రా | దదియట్టులుండె ధర్మాత్మజునకుఁ
బాడితో వచ్చెనే పరిభవం బతనిచే? | ద్రౌపది యేకవస్త్రయు రజ స్వ
 
ఆ. లయును గాదె? యపుడు దయమాలి కొలువున | కీడ్చి తేరఁబంచి యేమి యనియె
నతఁడు వినవె! యూరు లప్పుణ్యకాంతకుఁ | జూపు టెఱుఁగవే విశుద్ధచరిత!
157
వ. తత్కాలోద్దీపితంబైన కోపంబున నెసంగు మనస్సంతాపంబు దాల్మి దహించిన దదూరుభంగంబు గదా దండంబునఁ జేయంగలవాఁడనని యప్పేరోలగంబునఁ బ్రతిన వట్టితి నుత్తమ క్షత్ర ధర్మజ్ఞులు ప్రతిజ్ఞాహాని నిందింతురు గాన పూనిక నెఱపితి విను మా సభలో నప్పుడ తొడలు పొడిసేసి యతనిం దెగఁ జూడఁ దగియుండ నజాతశత్రునాజ్ఞ మిగులరామించేసి యమ్మహాత్ము చేసిన సమయంబు దప్పింపక యవ్విధంబున విపినంబున కరిగి యనేకదుఃఖంబులంబడి మగిడి యజ్జనపతి సంధిగోరి శౌరిం గౌరవసభకుం బుత్తెంచుటకుం దగుమాటలాడు నవసరంబున నేనును. 158
తే. ‘అన్నదమ్ములమై యుండియకట! మనల | నొరులు దల లెత్తి చూడ నొండొరుల తోడఁ
బెనఁగ నేటికి? నీ నేల పెద్దవారి | బుద్ధి విని పంచికుడుచుట పోలదొక్కొ?’
159
వ. అని నీ కొడుకునకుం జెప్పించితి దానను శాంతిం బొందక యద్దురాచారుండు చలంబున వైరంబుఁ బెనిచె నట్లగుట నవశ్యంబును ధర్మరాజునకు రాజ్యంబు సేకొనుటయు నాకుఁబ్రతిజ్ఞ దీర్చుటయుం గర్తవ్యంబులయ్యెం కావున నేమిభంగినైనం బగదీర్పవలసె నీవును సువిచార వింతయు విచారింపు’ మనవుడు నద్దేవి యతని కిట్లనియె. 160
క. ‘ఆ చావు సావఁ దగు న | న్నీచునకున్‌ వానివలన నిక్కం బరయన్‌
నీ చెప్పినయన్నియుఁగల | వా చెయ్దియుఁ దగవ నీకు? నదియట్లుండెన్‌.
161
తే. వైరి ననిఁ జంపుదురుగాక వ్రచ్చి నెత్తు | రెత్తికొని క్రోలు క్రూరాత్ము లెచట నైన
నెన్నఁడేనియుఁ గలిగిరే యీవు దక్క? | నది వృకోదర! వృకవిధ మసురభంగి.’
162
వ. అనవుడు ననిలపుత్రుండు సుబలరాజపుత్రి కిట్లనియె. 163
జలధరవృత్తము ఆ సభలోని కట్లు ద్రుపదాత్మజఁ దా | గాసిగ నీడ్చి వల్వొలువఁగాఁ గినుకం
జేసిన బాసకై పెదవిఁ జేర్చితి దు | శ్శాసను శోణితం బిది నిజం బరయన్‌.
164
వ. అదియునుంగాక వినుమతని నేఁ బొదివినప్పుడు. 165
క్రౌంచపదవృత్తము కౌరవసేనావీరులు లావుం గడిమియుఁ జలమును గడఁక యెలర్పన్‌
ధీరతసొంపుం గ్రూరతపెంపుం దెగువయు నెఱపఁగఁ దెరలక వీఁకన్‌
బోరనఁ ద్రోవంగా రభసం బేపును గలితనమును బొలుపు వహింపన్‌
వారు భయంబుం గూరుటకుం గావలసెను రుధిరము వదనము సేర్పన్‌.
166
వ. ఆ రెండు పనులకై యట్లు ద్రావుటగా నటించితిం గాని. 167
తే. అన్యజనముల శోణితమైనఁ ద్రావు | టధిక పాతకమని విందు ననుజ రక్త
మాన నేనంత వెఱ్ఱినె? యంతపాప | కర్ముఁడనె? తల్లి! యంత నిష్కరుణమతినె?
168
వ. అనుటయు. 169
తే. ‘అంధులకు నూఁతకోలగా నకట! యొకని | నైన నిలుపక నూర్వుర నదయవృత్తి
మ్రింగి తందెవ్వఁ డేనియు మీకు నెగ్గు | లాచరింపని వాఁడు లేఁడయ్యెనయ్య?
170
క. ఒక్కరుని నీవు సంపక | తక్కిన నంతటనె ప్రతిన దప్పునె? విభవం
బెక్కఁగ మీయన్న నతం | డెక్కటి రాజ్యంబు సేయ నీఁడె కుమారా!’
171
వ. అని పలికి ధర్మనందను దెస మనసు నిగుడం బుత్రపౌత్రవధసంపీడితస్వాంతయగు నగ్గాంధారి క్రోధ పరుషాక్షరంబుల ‘నమ్మహారాజెచట నున్నవాఁ?’ డనిన నా భూపతి భయకంపిత గాత్రుండగుచుం జేతులు మొగిచి సవినయంబుగా మెత్తని మాటల నిదె వచ్చితి దేవీ! యేను బాండవాగ్రజుండ ననుచుం జేరం బోయి. 172
క. ‘నీ పుత్రులఁ జంపించిన | పాపాత్మునిఁ గ్రూరచిత్తుఁ బరివాదార్హున్‌
శాపంబునఁ బొలియింపుము | భూపాలకవల్లభాభిపూజిత చరణా!
173
క. ధరణింగల రాజులకుం | బరివారమ్మునకుఁ జావు పాటిల్లుటకై
పరుషత గైకొన్న యుధి | ష్ఠిరు దారుణ దండ కలితుఁ జేయందగదే!
174
మత్తకోకిల జీవమేటికి? రాజ్యమేటికిఁ జెల్లుఁ? జుట్టల బిడ్డలం
జావఁ జూచిన యట్టి ద్రోహికి సర్వభోగము లేటికిన్‌?’
నావుడున్‌ మఱుమాటలాడఁగ నాలుకాడక యుండి య
ద్దేవి యూర్పు నిగిడ్చె నుష్ణము దీర్ఘముం బరుషంబుగన్‌.
175
వ. ఇ ట్లా ధృతరాష్ట్ర మహిషి యతని యుచితవచనంబులు విని యూరక యుండె నతం డంజలిపుటంబు ఫాలంబున మోపి యానతుండయ్యెఁ బట్టావృతనయన యగు నప్పతివ్రత దృష్టి పట్టంబునంచు సందునం జని యజ్జనపతి పదనఖంబులం జెందిన నవి గందినం జూచి సవ్యసాచి జనార్దను వెనుకకుం జనియెం సమీర సుతుండును మాద్రీసుతులునుం దిరుగుడువడి రప్పుడు గాంధార రాజనందన క్రోధంబు దక్కి ధర్మపుత్రాదుల దెస మాతృభావం బలవడ సాంత్వనస్వరంబునం గుంతీసందర్శనంబు సేయరన్నా! యని పలికిన నప్పురుష సత్తములు చిత్తంబుల కలంక డిందువడ నందఱు నొక్కటఁ గుంతియున్న దెసకుఁ జన నక్కుంతిభోజనందన వారిం గలయం గనుంగొని. 176
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )