| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | స్త్రీపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
అచ్యుత! వీఁడె మహాభీలభుజుఁడగు | భీమగదాహతి భూమిఁ గూలి యాతని చేత సర్వాంగంబులందును | గలుగు క్రొన్నెత్తురు కాంక్షఁ ద్రావఁ బడి మఱి తెగటారి పడియున్నవాఁడు దు | శ్శాసనుఁ డీతండు సభకు ద్రుపద పుత్రి నీడిచి తెచ్చి పొలువతనమ్మునఁ | బతుల సన్నిధిఁ గురుక్షితివిభునకుఁ |
|
| తే. |
గర్ణునకుఁ జిత్తసంప్రీతి గాఁగ దూల | పుచ్చెఁ బెక్కువిధంబుల నొచ్చి యా మృ గాక్షి యప్పుడు మారుతి యంతరంగ | మేర్పఁ దలఁపించుదానన యింతపుట్టె. |
56 |
| క. |
ఆ సభ నమ్మెయి నీ దు | శ్శాసనుఁ డప్పాండుపుత్రసతిఁ గ్రూరాత్ముం డై సంకలేక పెద్దయుఁ | గాసిం బెట్టంగ నెఱిఁగి కలఁగినమదితోన్. |
57 |
| వ. | ఏను దుర్యోధనునితో నిట్లంటి. | 58 |
| తరువోజ |
హరిచేత రక్షితయైన పాంచాలి కగునయ్య యిమ్మెయి నత్యంత నీచ పరిభవదుఃఖంబుపాల్ సేఁత? మీఁదు పరికింపకున్నఁ గీడ్పాటిల్లకున్నె? యరికంజకుంజరుఁ డగు భీముఁ బల్కులను బరిగోలల నలఁచుమేలె? వెరవిడి వేవేగ విడువుము గారవింపు మీ వంశపవిత్ర నో పుత్ర! |
59 |
| క. |
క్రూరాత్ముఁడు నీచుఁడు గాం | ధార విభునిఁ దొఱఁగు పాండు తనయులఁ బుణ్య ప్రారంభులఁగూడి మనుము | కౌరవకుల మెల్ల బ్రదుకఁగాఁ బొగడొందన్.’ |
60 |
| క. |
అని యెన్ని భంగులను జె | ప్పినఁ దా నప్పలుకు లెల్లఁ బెడచెవులం బె ట్టె నుదగ్రుఁడు దగుకార్యము | గనునె? వశంబగునె దైవగతి తప్పింపన్? |
61 |
| తే. |
నాఁటిమాట లుల్లంబున నాటియుండ | నొవ్వుతోఁ దఱివేచి నేఁ డివ్విధమునఁ బఱిచె భీముండు నొప్పింపఁబడిన త్రాఁచు | పాము పగసాటి తెగ తార్చుభంగిఁ గృష్ణ! |
62 |
| క. |
తగుఁ బగ దీర్చుట యిమ్మైఁ | దగ వగునే నెత్తురెత్తి త్రావుట? భీముం డు గడున్ ఘోరము సేసెను | మగల కతి క్షుద్రవృత్తమా పొగ డొసఁగున్? |
63 |
| తరలము |
కరములుం జరణంబులున్ విరి గల్గి సాఁగి వికీర్ణమై యురము నిర్భరవైకృతంబుగ నుర్విఁ ద్రెళ్ళి సుతుండు గే సరి నఖంబుల వ్రవ్వఁబడ్డ గజంబు చాడ్పున నుండఁగాఁ గరుణ మాత్మకు నింత మిక్కిలి గాక యున్నె? జనార్దనా! |
64 |
| సీ. |
వీఁడె వికర్ణుండు వాఁడి మెఱుంగు మే | ఘంబుల గముల మధ్యంబునందుఁ దేజరిల్లెడుమాడ్కి రాజిల్లుచున్నవాఁ | డతిసాంద్రహస్తికాయములలోనఁ గార్ముకజ్యాకిణకఠినమైనయున్న యి | బ్బాలుని ముంజేయి బాల గృధ్ర మోపదు కబళించియును జంచుపుటమునఁ | జీరంగఁ జూచితే శౌరి? యితని |
|
| తే. |
రమణి పొరిఁబొరి గన్నీరు గ్రమ్మఁ జుట్టు | మెలఁగి కాకుల గ్రద్దలఁ దొలఁగ నడుచు చున్నయది పాసి యవి వోవకున్న నిట్లు | సూతురే తల్లులెందును సుతుల నకట! |
65 |
| క. |
మారుతనందను నుగ్రపు | నారాచము లొడల నాటినం జచ్చియు న వ్వీర కుమారుం డుజ్జ్వల | చారుత్వముఁ బాయకున్న చందముఁ గంటే? |
66 |
| క. |
అని మొన నెవ్వరికిని మా | ర్కొన రాని ఘనుండు దుర్ముఖుఁడు భీమునిచే వినిపాతితుఁడై భూరజ | మున బ్రుంగుడు వడ్డవాఁడు మురహర! కంటే? |
67 |
| తే. |
నక్క తోఁడెలు వీని యాననము సగము | దిన్నయవి యట్టులయ్యును నున్నయొప్పు దొరసి సప్తమినాఁటిచందురునిఁ బోలె | చూడు భావించి దీపితశూరవంశ! |
68 |
| మత్తకోకిల |
శూరసేనుఁడు భీమసేననిషూదితుండయి చుట్టు నం భోరుహానన లార్తి మూర్తతఁ బొందిన ట్లతిరూక్ష హా హారవంబులతోడఁ గ్రుమ్మర నల్లవాఁడె వికారితా కారుఁడై పడియున్నవాఁడు వృకంబుఁ బక్షులు జించినన్. |
69 |
| సీ. |
అంగంబు కోమల మంతరంగంబు చా | తుర్య నిరూఢంబు శౌర్యఘనుఁడు వీఁడె గోవింద! వివింశతి యీతండు | సొబగుండు మెలఁతలు సుట్టు నెపుడు నప్సరోగణ మమరాధిపుఁ గొలిచెడు | చాడ్పునఁ బాయక సమ్మదంబు చిగురొత్త నుండుదు రగరుకస్తూరికా | చందనాద్యనులేపశాలి యిపుడు |
|
| తే. |
గ్రద్దలును గాకులును జుట్టుఁ గదిసియుండఁ | దఱచునెత్తుటఁ దోఁగిన తనువుఁ దాను నున్నవాఁడు గానాకర్ణనోత్సుకుండు | నక్క లఱచెడు చేరువ నక్కటకట! |
70 |
| తే. |
కనకపుంఖశరావృత గాత్రుఁడైన | దుష్ప్రహుండు చచ్చి యుండియుఁ దోయజాక్ష! వికచ నవకర్ణికార సంవేష్టనంబు | గలుగు శైలంబు తెఱఁగునఁ బొలిచెఁ జూడు. |
71 |