| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | స్వర్గారోహణపర్వము - ఏకాశ్వాసము |
| సీ. |
అనవుడు నతనితో నాతఁ ‘డీ భామ మ | హాలక్ష్మి ద్రౌపది’ యనఁగ ద్రుపదు నికిఁ గూఁతురై యయోనిప్రభవం బగు | మానుషరూపంబు మహితలీల ముగఁ దాల్చి భవదనుభూతి సెల్లించె గౌ | రీశ్వరు నాజ్ఞ వహించి వచ్చె’ నని చెప్పి, యల్ల రమ్యాకృతు లేవురు | గంధర్వవరులు నిక్కమలనయన |
|
| తే. |
యందు మీకు జన్మించిన యక్కుమారు; | లల్లవాఁడె మీ తండ్రికి నగ్రజుండు ప్రకట గంధర్వపతి ధృతరాష్ట్రనాముఁ | డిందు నతఁ’ డంచుఁ జూపె నరేంద్రముఖ్య! |
058 |
| వ. | ఇట్లు ద్రౌపదీ ద్రౌపదేయాంబికేయుల తెఱం గెఱింగించి, వెండియు నాఖండలుండు పాండవాగ్రజునకుఁ గర్ణుం జూపి ‘భవదగ్రజుండు సూర్యునపరశరీరంబు కౌంతేయుండయి రాధేయుం డనం బరఁగినవాఁడు సుమ్ము! చూడు’ మని పలికి, సిద్ధ సాధ్య విశ్వదేవగణంబులతో నున్నవారు తత్తదంశ ప్రభూతు లయి వాసుదేవానుచరణ పరాయణులగుచు వర్తించిన సాత్యకి కృతవర్మాది యాదవుల నాలోకింపుము.’ | 059 |
| క. |
అని చెప్పి చూపి ‘యభిమ | న్యునిఁ జూచితె చంద్రు భంగి నుజ్జ్వల కాంతిం దనరెడుఁ దదంశజాతుం | డనూన ధృతిశాలి వీఁడె’ యంచుం జూపెన్. |
060 |
| వ. | చూపి తదనంతరం బమ్మహాత్మునితోడ. | 061 |
| ఆ. |
‘పాండురాజు వీఁడె బహురత్న ఖచిత వి | మాన మెక్కి గొంతి మాద్రి తన యు పాంత భాగమున సుఖాసీనలుగ నాదు | వలను వచ్చుచున్నవాఁడు గంటె. |
062 |
| క. |
అదె భీష్ముఁడు వసువుల కడఁ | గదిసి యెలమి నున్నవాఁడు కంటేన్! ద్రోణుం డిదె దివిజగురుని పాలఁ బ్ర | మద మెసఁగ వసించినాఁడు మాన్యచరిత్రా!’ |
063 |
| వ. | అని పలుకుచుఁ జూపి, గంధర్వ యక్ష గుహ్యక గణంబులలో ద్రుపద విరాటులను, దదీయానుజ తనుజ వర్గంబులనుం, దక్కునుం గలుగు కేకయ పాండ్యప్రభృతి నానా దేశాధీశులను వేఱువేఱం జెప్పుచుఁ జూపుచు ‘భవదీయం బగు సమరంబునం బరిత్యక్త శరీరు లయి యుత్తమలోకంబులు వడసి యున్నవారల నవలో కింపు’ మని చెప్పె ననిన విని జనమేజయుండు వైశంపాయనుతో ‘మునీంద్రా! యిప్పుడు నీ చెప్పిన సుయోధన శకుని సైంధవులును గర్ణుండును గర్ణకుమారులును వెండియుంగల తత్పక్ష భూపతులును ఘటోత్కచాదు లయిన పాండవులవారును నీ చెప్పిన సకల జనంబులు నాకలోకంబున నెప్పుడు నుండుదురో? యట్లుంగాక కొంతకాలంబు నిలిచి క్రమ్మఱ మనుష్యాది జన్మంబుల నొందుటకై యరుగుదెంతురో? యిత్తెఱంగు వినవలతుం జెప్పవే’ యని యడిగిన నమ్మునిపతి యమ్మనుజపతితో నిట్లనియె. | 064 |
| సీ. |
‘కురువర! యిది దేవగుహ్యంబు మునివరుఁ | డైన వేదవ్యాసుఁ డతుల కరుణఁ జెప్పినయది నీకుఁ జెప్పెద సమవధా | నంబుతో వినుము ‘సనత్కుమారుఁ గలసెఁ బ్రద్యుమ్నుఁ డన్యులకు దురాసదం | బయిన కుబేర లోకానుభవము ధృతరాష్ట్రుఁ డొందెను సతియుఁ దానును నింద్రు | భవనంబునన నిల్చెఁ, బాండునృపతి |
|
| తే. |
యాండ్రు రిరువురుఁ దో నిల్వ నమృతకరునిఁ | గూడె నభిమన్యుఁ, డనిమిషగురుని నొందెఁ దత్ప్రతీకాశుఁ డయిన కోదండగురుఁడు, | ద్వాపరాత్మకుం డయ్యె గాంధారవిభుఁడు. |
065 |
| క. |
రారాజు నాక నరకో ’ దార సుఖాత్యంత దుఃఖ ధామంబులఁ బెం పారియు హీనత నొందియుఁ | గౌరవ కులనాథ! పిదపఁ గలియం దొం(దు)దెన్. |
066 |
| వ. | అట్లపోలె నాక నరకంబు లనుభవించి. | 067 |
| ఆ. |
అతని తమ్ములెల్ల యాతుధానావలిఁ | గలిసి; రాత్మజనకుఁ గలసె సూర్యుఁ గర్ణుఁ; డధిప! వసువు గావున వినుము గం | గాత్మజుండు వసువు లందు నిలిచె. |
068 |
| వ. | ద్రుపదుండు, విరాటుండు, ధృష్టకేతుండును, భూరిశ్రవుండును, శల్యుండును, శంఖుండును, నుత్తరుండును, విశ్వనామదేవతలఁ గలసిరి. ధృష్టద్యుమ్నుండు హుతవహునిఁ గూడికొనియె’ నని చెప్పి యప్పరమ సంయమి యప్పుడమిఱేనితో వెండియు నిట్లనియె. | 069 |
| తే. |
వినుము ధర్మనందను పుణ్యతనువునందుఁ | దగఁ బ్రవేశించి యున్న విద్యామయాత్ముఁ డైన విదురుండు నమ్మహితాత్మ బోధ | శాలియును ధర్ముఁ గూడిరి సచ్చరిత్ర! |
070 |
| సీ. |
కమలగర్భుని నియోగంబున నిజయోగ | బలము గైకొని బలభద్రదేవుఁ డంబుధి కరిగి యనంతుఁ బరమమూర్తిఁ | గలసె; నత్తెఱఁగు ము న్నలఘుకీర్తి ధన! నీకుఁ జెప్పితిఁ దక్కటి వృష్ణిభో | జాంధకు లెల్ల గుహ్యక గణంబుఁ గూడిరి; కృష్ణు సంక్రీడకుఁ బాత్రంబు | లైన షోడశ సహస్రాంగనలును |
|
| తే. |
విధినియుక్త కాలంబున విను సరస్వ | తీ జలంబుల మునిఁగి యుత్కృష్ట మగు ని జాప్సరోభావ మొంది నారాయణుని యు | పాంతచారిణు లైరి ప్రహర్ష మెసఁగ. |
071 |
| చ. |
అనుమరణంబునం దగ మురాంతకు రుక్మిణి సెందె; లక్ష్మి య వ్వనరుహనేత్ర; తక్కుఁగల వామవిలోచన లేడ్వురుం దదీ యనుత తను ప్రవేశన సమాచరణం బొనరించి రవ్వరాం గనలును లక్ష్మి యంశముల కావునఁ; గౌరవ వంశవర్ధనా! |
072 |
| వ. | అని చెప్పి యమ్మహాయుద్ధంబున మృతులైన యట్టివారును, నేను మున్ను ప్రసంగించిన యట్టివారును, బ్రసంగింపనివారును నిట్టిట్టి గతిం బ్రాపించి రని నాచేతం జెప్పంబడిన వారెల్లను నిజార్హప్రకారంబుల సురాసుర యక్షగుహ్యక గంధర్వబృందంబులం జెందిరి; కురునందనా! నీ యడిగిన తెఱం గెఱింగించితి నని వెండియు. | 073 |
| తే. |
‘వినుము పాండవ కౌరవ విషయ మైన | యట్టి యితిహాస మే నుపాఖ్యానజాత సహిత మగునట్లుగా సమస్తంబు మహిత | విస్తరంబుగఁ జెప్పితి విశదభంగి. |
074 |
| వ. | కృష్ణద్వైపాయన మునీంద్రుండు సత్ప్రసాద భరితుండై యాజ్ఞాపింప నట్లు తదీయానుజ్ఞ వడసి తద్దయా లబ్ధ ప్రజ్ఞావిశేషుండనై యశేషంబును వివరింప నమ్మహాత్ముని కారుణ్యంబున నిమ్మహనీయేతిహాసంబు సమాధాన మానసుండ వై యాకర్ణించి నీవును బహుళ పుణ్యాత్ముండవుఁ గృతార్థుండవుఁ బరమార్థవిదుండవు నైతి’ వని యిట్లు సాంద్రానంద సంపాదనశీలుం డై. | 075 |
| క. |
శ్రీనిత్యత్వ ప్రమదా | దాన కుతూహల నిరూఢతాస్త వ్యాపాం గా! నిర్భర వేదవ్యా | సానేక వచోనుషంగ! హరిహరనాథా! |
076 |
| వ. | దేవా! వైశంపాయనుండు జనమేజయునకుఁ జెప్పినట్లు సర్పయాగ సమయ ప్రవృత్తం బైన మహాభారతం బంతయు దత్సభాగతుండైన రోమహర్షణ నామధేయుండును సాత్యవతేయ శిష్యుండును, బండిత ప్రవరుండును నగు సూతుని పుత్రుండైన యుగ్రశ్రవుండనియెడు కథకుండు సమ్యగవధానంబున నాకర్ణించిన వాఁడగుటను సమాశ్రితవత్సలుం డైన యా కృష్ణద్వైపాయను ననుగ్రహంబునఁ దత్కథా సాకల్య వివరణ విశార దుం డై యుండు; నతండు నైమిశారణ్య పుణ్యక్షేత్రంబునందు శౌనకుండను కులపతి మొదలుగాఁ గల కొందఱు మహామునులు సత్రయాగం బాచరించుచుండ నయ్యెడకుం జని వారలం గాంచినఁ బుణ్యకథాశ్రవణ కౌతు కాధీన మానసులైన యమ్మాననీయులు పుణ్యాత్మకుం డైన యక్కథకునకు సముచితార్చనంబులఁ బ్రియంబొనర్చి కథాకథనంబుఁ బ్రసంగించినం బ్రీతుండై యాతం ‘డేమి తెఱంగు కథ వినంగోరెద?’ రనుటయు నప్పరమార్థ పరాయణు లతనితోడ ‘నెయ్యది హృద్యంబును నపూర్వంబును సమగ్ర జ్ఞాన ప్రదంబును నఘ నిబర్హణంబును నైనయది యక్కథ మాకు విన నిష్టం’ బని పలుకుటయు. | 077 |
| క. |
అతఁ డింతటిది మహా భా | రతంబ యను నిశ్చయము తిరంబుగ మతిసం గత మగుడు నమ్మహాత్ముల | కతివిశదము గాఁగ నిమ్మహాకథ చెప్పెన్. |
078 |
| వ. | చెప్పి యిట్లనియె; ‘నట్లు జనమేజయుండు సర్పయాగ కర్మానుష్ఠానముల యెడ వైశంపాయనువలన నివ్వినుతేతిహాసంబు విని విస్మితుండును బ్రమోద భరితుండును నయ్యె; నక్కొలఁదిఁ దదీయ యాజకులు యజన సమాపన విధి యనుష్ఠించి; రయ్యుధిష్ఠిరానుజ పుత్త్ర పౌత్త్రుఁ డత్తెఱంగున భుజంగంబుల యాపదఁ దీర్చిన యస్తీకు నభ్యర్చనంబున నత్యంత సంతుష్టునిం జేసి, యతని నివాసంబునకు ననిచి పుచ్చి, ఋత్విజులాదిగా నఖిల బ్రాహ్మణులకు బహు ధనంబు లొసంగి వినయం బెసంగ నామంత్రితులం జేసిన వారలు నిజ నివాసంబులకుం జనిరి; వైశంపాయనుఁ బెంపారు సవిశేష పూజనంబులఁ బరితోషితుం గావించి దేవోప చారంబులఁ గృష్ణద్వైపాయన మునీంద్రులంబూజించి, యజ్జనపతి సకల జనంబులు ప్రస్తుతింప విభవంబు శోభిల్లం బురంబుఁ బ్రవేశించె.’ | 079 |
| సీ. |
అని చెప్పి యా శౌనకాది మునీశ్వర | గణముతో మఱియు నక్కథకుఁ డింపు మిగులంగ నిట్లను ‘మేటి మునీశ్వర | సంఘంబులో నెల్ల సత్యదర్శి సర్వవిధిజ్ఞాత సర్వవిజ్ఞాన భ | వ్యాత్ముండు సర్వేంద్రియ ప్రబోధ శాలి సర్వజ్ఞుండు శౌచశాంతి క్షమా | దాంతి తపోనిత్యతావిభాసి |
|
| తే. |
యాప్తసర్వవిధైశ్వర్యుఁ డఖిల సాంఖ్య | యోగ భేద విదుండు ధర్మోపదేశ చతుర వాగ్విలాసుండు నిస్తత్త్వ వస్తు | వేది సాత్యవతేయుండు వేదమయుఁడు. |
080 |
| వ. | పాండవుల కీర్తిం బ్రకటించుటకును, మఱియుం గొందఱు జనపతుల చరిత్రంబుల జనుల కెఱింగించుటకును, దేవదేవుం డగు వాసుదేవుని సంక్రీడా విశేషంబులు వివరించుటకును, సర్వదేవజాతుల జన్మంబులును దదీయ సాయుజ్యంబులును దేటపఱుచుటకును, సకల ధర్మంబులునుం దెలుపుటకునుగాఁ బంచమవేదం బయి పరఁగు నిమ్మహాభారత సంహిత యొనర్చె; నిమ్మహేతిహాసంబు సంవత్సర త్రయకృతంబు; దీని విశేషంబు వినుండు. | 081 |
| తే. |
అమల ధర్మార్థ కామ మోక్షముల గుఱిచి | యొలయు తెరు వెద్దియును నిందుఁ గలుగునదియ యొం డెడలఁ గల్గు దీన లేకుండు చొప్పు | దక్కొకంటను లేదు వేదజ్ఞులార!’ |
082 |
| సీ. |
‘పుణ్యాత్ములార! యీ పుణ్యేతిహాసంబు | జనమేజయుఁడు సేయు సర్పమఖము కాలంబునం దట్లు కారుణికోత్తముఁ | డైన వేదవ్యాసుఁ డాదరమున నాజ్ఞాపనము సేయ నతని శిష్యుఁడు లోక | నుతుఁడు వైశంపాయనుండు సెప్పు నన్నరేంద్రుఁడు విన నా సభ నిలిచి స | వినయభక్తికముగ వినినవాఁడఁ |
|
| తే. |
గథనశక్తియు నమ్ముని కరుణవలనఁ | గలిగె నా కిత్తెఱంగున గారవించి మీరు వినుచుండఁ జెప్పెడి మేటి పదము | గంటి; మంటి మీ దయ పెంపుకతనఁ జేసి.’ |
083 |
| వ. | అని పలికి వెండియు. | 084 |