పురాణేతిహాసములు శ్రీమహాభారతము స్వర్గారోహణపర్వము - ఏకాశ్వాసము
ఫలశ్రుతి
క. ‘అలఘుమతులార! పర్వం | బుల నీ యితిహాస రత్నమును వినిన నఘం
బులు వాయు; నాకలోకము | గలుగును; సిద్ధించు ముక్తి కాంక్షిత యైనన్‌.
085
క. ఆద్యంతంబును నీ యన | వద్యకథ వినంగఁ గనినవారికిఁ బాయున్‌
సద్యంబ బ్రహ్మహత్యా | వద్యము మొదలైన పాపవర్గం బెల్లన్‌.
086
క. సురపితృకార్యంబుల భూ | సురులకు దీని వినిపించు సుకృతాత్ముఁడు ద
త్కరణ ఫలంబుల నధిక | స్ఫురితంబుగఁ బడయు మహితబోధనులారా!
087
క. మానసముల నింద్రియముల | నేనియుఁ జేయంగఁబడిన యేనః పుంజం
బీ నిర్మలేతిహాసము | వీనుల నొక్కింత సిలుక విరియు సకలమున్‌.
088
ఉ. భ్రాజిత వృత్తిమైఁ బరఁగు భారత సంహిత సంయమీంద్రులా
రా! జయనామకంబునను రాజితభంగి జగత్త్రయంబునం
బూజిత కీర్తియై నెగడు భూరిజయోన్నతిఁ గండ్రు దీనిచే
రాజు; లిలాసురుల్‌ మఱి యరాతుల గెల్తురు విన్న యంతటన్‌.
089
ఉ. భారతమర్థితో వినిన భక్తిఁ బఠించిన శ్రీయు నాయువున్‌
భూరియశంబునుం బ్రమదమున్‌ దృఢ విద్యయుఁ గల్గు; వారి కే
కోరికలైన వేగ మొనఁగూడు; సుపుత్త్రునిఁ గాంచు సద్వరున్‌
గారవ మొప్పఁగాఁ బడయు గర్భిణియున్‌ వరుసన్‌ గుమారియున్‌.
090
ఉ. శిక్షిత చిత్తులార! శుభసిద్ధులు వొందు ననేక జన్మ పా
పక్షపణంబునన్‌ వెలుఁగు భారత సంహిత కెల్లఁ బుండరీ
కాక్షుని వాసుదేవుఁ బ్రకటార్థముగాఁ గని విన్న మానవుం
డక్షయ పుణ్యలోకములయందు రమించు నిరామయస్థితిన్‌.
091
ఉ. వ్యాసమునీంద్ర సారకరుణాతిశయంబున భారతార్థ ము
ద్భాసితమైనయట్టి నుతభాగ్యునకున్‌ సకలాగమార్థ సం
వాసన మావహిల్లు జనపంక్తులు గీర్తనసేయ శశ్వదు
ల్లాస సుఖానుభూతి నచలస్థితి నొప్పు నతం డుదాత్తుఁడై.
092
వ. అని యిట్లు సమస్త పురాణ పారీణుండైన సూతుండు. 093
చ. పరమపదాప్తి హేతు వగు భారత సంహిత శౌనకాది భూ
సురవరు లింపునం గరఁగు చొప్పునఁ జెప్పిన వారు మోదసం
భరితతఁ బొంది యక్కథకు బ్రాఁతిగ నర్చితుఁ జేసి రర్మిలిన్‌;
హరిహరనాథ! సర్వభువనార్చిత! నన్‌ దయఁ జూడు మెప్పుడున్‌.
094
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )