| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము |
| ఆ. |
‘ఇట్టు లాడఁదగునె? యిది నీక పోలు ని | న్నేమనంగ నేర్తు? నిత్తెఱంగు పాడి గాఁగఁ బూని పలుకంగఁ జెవి యొడ్డి | యాదరించువారి నందుఁగాక! |
23 |
| క. |
వేడుక పుట్టిన జూదం | బాడెనె ధర్మజుఁడు? వార లందఱుఁ దమలోఁ గూడుకొని పిలిచి బలిమిన | యాడి కపట జయము గొనుట యది దగవగునే? |
24 |
| క. |
ధర్మతనూభవు దెస దు | ష్కర్మము రూపించిన సభ నొకండును మైమైఁ బేర్మి సెడక పోనేర్చునె? | ధార్మికు లిం కెట్టివారు తథ్యం బరయన్? |
25 |
| చ. |
పలికినచందముల్ నెఱపి పైతృకమై చను రాజ్యభాగ మి మ్ములఁ బడయం దలంచి బలముం జలమున్ నెఱపం గడంగు వీ రలు నొరు వేఁడఁబోదురె? యరాతులు సాధుల మెత్తురే? రణం బుల జయలక్ష్మిఁ జేకొనుటఁ బోలునె యొండొకరాజధర్మముల్? |
26 |
| తే. |
సముచితములగు మాటలఁ జక్కఁబడక | తక్కెనే, నుక్కివుం డగు ధార్తరాష్ట్రుఁ గ్రూరశరముల నే నియ్యకొలుపువాఁడ | నవని కౌంతేయులకు నిచ్చునట్లుగాఁగ. |
27 |
| క. |
భీమార్జునులకు రణమున | నే మగలును బ్రతియె? వీరు నేనును సైన్యో ద్దాములమై నడచిన, నే | భూమీశులు నెదిరి బ్రదికిపోవం గలరే? |
28 |
| ఆ. |
కవలవారుఁ, గొడుకుగమియుఁ, బాంచాలవ | ర్గంబు, వృష్ణివరులుఁ గడఁగిరేని, నొక్క మాత్రలోన నువ్వెత్తుగొనరె? దు | ర్యోధనాది శతము నుద్దవిడిన. |
29 |
| క. |
ఈ మత్స్యపతి సహాయము | గా మాకుం దీర్పరాని కార్యము గలదే? సామాద్యుపాయపరుఁ, డు | ద్దామ భుజాబలయుతుం డితఁడు కేవలుఁడే? |
30 |
| క. |
నా మతమునఁ గార్యము సం | గ్రామము సేయుటయ; యిట్లుగా కీలోనన్ సామవచనంబు లక్కురు | భూమీశ్వరుతోడ నాడఁ బుచ్చెదరేనిన్. |
31 |
| ఉ. |
దైన్యము దక్కి దూత యుచితంబుగఁ బాండునృపాలుపాలు రా జన్యవరుండు ధర్మజుఁడు సమ్మతి వేఁడెడు నన్న, లోక సా మాన్య విధిం దగంగ గరిమంబున నిచ్చినఁ బుచ్చికొంద; మ న్యోన్య విరుద్ధభాషణము లాడినఁ, దత్ఫల మాతఁ డందెడున్. |
32 |
| వ. | అనిన ద్రుపదుం ‘డిది వోలు; బలదేవు మాట మాట గాదు. బలపరాక్రమవంతుండును, సహాయ సంపన్నుండును, దుష్టాత్ముండునునైన దుర్యోధనుండు ప్రియవచనంబుల రాజ్యంబు పాలిచ్చుట కియ్యకొనమి సిద్ధంబు; యుద్ధంబునంగాని చక్కంబడఁ’ డని పలికి మఱియు నిట్లనియె. | 33 |
| క. |
‘మృదుభాషణముల దుర్జన | హృదయములు ప్రసన్నతామహిమఁ బొందునె? యె ల్లిదముగఁ గొని, యంతంతకు | మద మెక్కుంగాక దురభిమానముపేర్మిన్. |
34 |
| వ. | అదియునుంగాక. | 35 |
| తే. |
కూటికై ద్రోణభీష్ములు గుమతి యనక | యనుసరింతురు; ధృతరాష్ట్రుఁడును దనూజు తృష్ణ నూనినవాఁడు; రాధేయు బోఁటి | తులువ లెల్లను నతని సద్బుద్ధి యండ్రు. |
36 |
| వ. | కావున నతండు దుర్వినీతుండైయుండు; నెల్లభంగుల సంగరంబు గాఁగలయది; యీ సమయంబున బలంబులంగూర్చికొని పిలువందగు రాజులం బిలిచి పుచ్చవలయు; సుయోధనుండును దోడాసపడి పుచ్చు; నుచితపరులగు నరపతులు దొలుతఁ జెప్పినవారిక సహాయత్వంబుఁ జేయంజూతురు; మనము వెసగల కాలరుల వేగంబ పుచ్చి, శల్య కేకయ ధృష్టకేతు జరాసంధతనయ ప్రభృతు లయిన భూపతులకును, వారి వారి బంధు మిత్ర జనంబులకునునెఱింగించి పుచ్చుట కార్యం; బిది నాకుం బోలిన తెఱం’ గని పలికి తన కెలన సముచితాసనంబున నున్న విప్రవరుం జూపి. | 37 |
| క. |
ఇతఁడు మదీయాగ్ర పురో | హితుఁ; డితనికి నెల్లపనులు నెఱిఁగించి తగన్ ధృతరాష్ట్రు కడకుఁ బనుపుఁడు | చతుర వచన రచనఁ గఱపి సంప్రీతిమెయిన్. |
38 |
| ఉ. |
ఆతని సమ్ముఖంబునఁ దదగ్రతనూజుకడన్ మరున్నదీ జాతుని సన్నిధిం గలశసంభవునొద్దఁ గ్రమోచితంబుగా నీతెఱఁ గిట్టులాడుమని యేర్పడ నంతయుఁ జెప్పిపుచ్చఁగా నీతిమెయిం దగం బలుక నెయ్యము లాభముఁ, బెంపుఁజొప్పడున్. |
39 |
| వ. | అనిన వాసుదేవుండు ‘పాంచాలపతి వచనంబు లుచితంబులయి యున్నయవి; యిబ్భంగిన చేయవలయు’ నని పలికి’ మఱియు నిట్లనియె. | 40 |
| క. |
‘కౌరవులకుఁ బాండవులకు | నారయ నే నొక్కరూప; యట్లగుటఁ దగన్ వారును వీరును దమతమ | నేరిమిమెయి ధరణి యేలి నెగడఁగఁ జూతున్. |
41 |
| తే. |
పెండ్లికని పిల్వఁ బంచినఁ బ్రియముతోడ | నేఁగుదెంచితి; మిన్నాళ్ళు నెల్ల యొప్పి దములఁ జూచితి; మియ్యెడఁ దడవుగాఁగ | నిలువఁ దీఱదు పోయిరావలయు మాకు. |
42 |
| వ. | అని పలికి ద్రుపదు నాలోకించి ‘మీరు మాకెల్లవారికి గురుస్థానంబు; మీ మాట యనిన ధృతరాష్ట్రుండు బహుమానంబు సేయు, మిమ్ము శాంతనవుండునుం గొనియాడు; మీయందు ద్రోణకృపాచార్యులు సఖ్యంబు వాటింతు; రట్లగుటం జేసి. | 43 |
| తే. |
పాండవార్థమై యొక్కరుఁ బనుప మీక | భరము; మీ పలు కందఱపలుకు; మీరు తెఱఁగు పఱుపంగ మిగిలి యుద్రేకులైన | వార చెడువారు; విమలవిచారవిభవ! |
44 |
| క. |
పొందైన లెస్స; విరసపుఁ | గ్రం దయ్యెడు చందమైన, రాజుల నెల్లన్ ముందఱ రావించి క్రమం | బొందఁగ, మముఁ బిలువఁ బంపుఁ డొయ్యన పిదపన్. |
45 |
| క. |
మీ పనుపున రాజ్యము పా | లీపాండు తనూభవులకు నీకున్న, భుజా టోపభయంకరుఁ డర్జును | కోపానల మడరి ముట్టికొనదే వారిన్?’ |
46 |
| చ. |
అని, గమనోన్ముఖుండయి మురాంతకుఁ డా ద్రుపదుండు ధర్మనం దనుఁడు వృకోదరాదులగు తమ్ములు మత్స్యమహీవిభుండుఁ ద న్ననుప, హలాయుధ ప్రభృతి యాదవలోకము తోడరా ముదం బున నిజపట్టణంబునకుఁ బోయె సముజ్జ్వల వైభవంబునన్. |
47 |
| వ. | వివాహ మహోత్సవంబునకు వచ్చిన తక్కటి రాజులును సంగ్రామ సన్నాహంబునకై తమ తమ పురంబులకుం జనిరి; తదనంతరంబ. | 48 |
| క. |
సమరమునకుఁ దగు నుద్యో | గమునఁ బ్రవర్తిల్లి రెలమిఁ గౌంతేయులు; మ త్స్య మహీనాథుఁడు సన్నా | హము సేసెన్; ద్రుపదవిభుఁడు నాయిత మయ్యెన్. |
49 |
| వ. | ఇట్లు సన్నద్ధులై వెలివీడు విడిసి తమకు ననురక్తులైన రాజుల పాలికిం దగుదూతలం బుచ్చి; రట దుర్యోధనుండు వీరల చందంబు విని, తానును దన బంధుమిత్రగణంబైన రాజలోకంబు నెల్ల రావించిన. | 50 |
| క. |
ఇభ తురగ స్యందన గతి | రభసంబునఁ బృథివి యద్రువ రాఁ దొడఁగిరి భూ విభులు నలుదిక్కులను లో | క భయంకరలీల నుభయకటకంబులకున్. |
51 |