| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము |
| తే. |
ఎలమి నభిమన్యు పెండిలి యివ్విధమునఁ | జేసి, యుల్లాసలక్ష్మిఁ గైసేసి మత్స్య మనుజపతి యన్వయంబు పావనము సేసి, | దినచతుష్టయానంతరమునఁ బ్రియమున. |
3 |
| వ. | ధర్మతనయుండు దమ్ములుం గొడుకులుం బరివేష్టించియుండ, విశాలరమణీయంబగు విరాటు కొలువు కూటంబున కరిగి యందు. | 4 |
| క. |
విరటుఁడుఁ, బాంచాలుండును, | హరియును, రాముండు, వారి యనుజ తనూజుల్, పరిణయ సమాగతాఖిల | ధరణీశులు బలసియుండఁ, దద్దయు నెమ్మిన్. |
5 |
| వ. | ఉన్నసమయంబున సభాసదులైన మానవేంద్రులు నానావిధంబులఁ గృష్ణ యుధిష్ఠిరులతో సంభాషణంబులు సేయుచుండఁ, బాండవకార్యార్థియై కృష్ణుండు తదీయ వచనంబులు వారించి, వారలఁ గలయం గనుంగొని యిట్లనియె. | 6 |
| మ. |
‘కపటద్యూతమునందు సౌబలునిచేఁ గౌంతేయు లాత్మీయరా జ్య పదభ్రంశముఁ బొంది, సత్యనిరతిన్ శక్తాత్ములై యుండియుం గుపితస్వాంతులు గాక, తత్సమయ సంక్షోభంబు గాకుండఁగా, విపినావాసము, గూఢచర్యయును గావింపం దలం పొప్పదే? |
7 |
| ఆ. |
తలఁచినట్ల వ్రతము సలిపి యమ్మాడ్కిఁ బం | డ్రెండు వత్సరములు పాండవేయు లకట! క్రూరసత్త్వ యాతుధానావలి | తోడఁ గాననమునఁ గూడి మనరె? |
8 |
| క. |
పదపడి, దుస్తరమగు నీ | పదుమూఁడగునేఁడు గడవఁబడుట యరిది; త మ్మెదు రెఱుఁగమికై యాపద | లొదవిన సైరించి; రిట్టి యునికియుఁ గలదే? |
9 |
| క. |
మీరలు ధర్మజు వర్తన | గౌరవ మెఱుఁగుదుర కాదె? కావున నా గాం ధారీ తనూభవులకును, | వీరలకును హితమగా వివేకప్రౌఢిన్. |
10 |
| తే. |
ధర్మమార్గంబు దప్పక తలఁపుఁ డొక్క | తెఱఁగు; ధర్మువు దప్పి యుధిష్ఠిరుండు పడయ నొడఁబడఁ డయ్యింద్రపదవియైన; | నుచితగతి నెంత వడసిన నుల్లసిల్లు. |
11 |
| వ. | కావునఁ బాండవులకుఁ బితృధనంబగు రాజ్యంబుఁ గపటద్యూతంబున దుర్యోధనుఁ డపహరించుటయు, నది వీరలు దిగ్విజయంబుఁ జేసి యలవరించుకొన్న పదం బగుటయు; ధర్మసూను మహానుభావంబు విచారింపక ధార్తరాష్ట్రులు పరిభవించినం దెగి యితండు వారలకుం గీడు రోయమియు, నీరెండు దెఱంగుల వారికిం బంచి కుడువందగుటయుం దలపోసి, తగిన కార్యంబు సెప్పనర్హుల; రేనును నాకన్నంత సెప్పెద వినుండు. | 12 |
| క. |
కుంతీతనయులు సమయము | శాంతతమై నడపి, తమ భుజాబలమును, దు ర్దాంతోద్యమ శౌర్యము నెఱిఁ | గింతు మనుచు నున్నవారు గిను కెదఁ గదురన్. |
13 |
| క. |
వీరి తలం పెఱిఁగిన గాం | ధారీ తనయుఁడు సుహృద్వితానముఁ గూర్చుం, ‘బోరఁ బరిమార్తుఁ గొంచెపు | వారై యున్నెడన’ యని యవశ్యముఁ గడఁకన్. |
14 |
| క. |
అలఘు బల విక్రమోదా | త్తుల కైనను బలము లేక దోర్గర్వముమై గెలువఁగ వశమె, సహాయము | కలిమి ననంతంబు లగు పగఱసైన్యములన్? |
15 |
| క. |
కావునఁ బాండవ పక్షము | భూవల్లభకోటి యిచటఁ బ్రోవగు; నిమ్మై నీ వీరులు, నా వీరులు | దేవాసురులట్ల యనికిఁ దెగుదురు గడిమిన్. |
16 |
| వ. | ఇది యిక్కడి తెఱంగునకుఁ దోఁచిన తలం; పక్కడివారి చిత్తవృత్తి యెట్టిదగుట యెఱుంగ; మెదిరిమతంబెఱుంగక యెట్టికార్యంబు నిశ్చయింప వెరవగునే? కావున ని య్యవసరంబునం దగిన మానిసి నందులకుం బుచ్చవలయు; దుర్యోధనుండు వీరికి రాజ్యంబు పా లిచ్చిన మేలగుఁగాక, తక్కిన నప్పటికిఁ బోలినపని సూచుకొంద’మని పలికిన విని బలదేవుం డియ్యకొని రాజలోకంబు నాలోకించి యిట్లనియె. | 17 |
| క. |
‘హరి వాక్యము వింటిరె? యిది | యిరు దెఱఁగుల జనములకును హితమును ధర్మో త్తరమును నైయున్నది యీ | వెరవున శక్యంబు మనకు వీరలఁ దీర్పన్. |
18 |
| చ. |
తమ సగపాలు గోలుపడి దానిన యిప్పుడు గోరు వీరికిన్ సముచితవృత్తి నిచ్చి తమ సామున సంతసమంది యున్కి యు క్తము ధృతరాష్ట్రసూనునకు; దాన నపాయము లేకయుండుఁ; గో పముడిగి వీరు సేయుదురు బాంధవ; మిజ్జగముం బ్రియంపడున్. |
19 |
| వ. | కావున నిక్కార్యం బెడసేయక యొక్కరుం బనుపవలయు; వాఁడునుం జని యభిమతంబు సాధించునప్పుడు. | 20 |
| ఆ. |
మాట పొందెఱింగి, యోటమై నల్లన | చేరి, కౌరవేంద్రు చిత్తవృత్తి కనుగుణంబుగాఁగ నానతుం డగుచుఁ బ్రా | ర్థించి యడుగకున్నఁ దెఱఁగుపడదు. |
21 |
| వ. | అది యెట్లనిన, ధర్మనందనుం డతని యుద్ధతికిం బుయిలోడి, మెయివడిగల నడవడిం బ్రవర్తిల్లుచుండియు, జూదంబు వెంట మోసపోయి, తొడరి చిక్కునం బడియె; అదియును నతం డక్షవిద్యాపాటవంబు దనకు మిగుల లేమింజేసియు, బంధుజనంబులు దన్ను వారించుటయుఁ, దా నాడుట మాని గాంధారరాజును నియమించినం, దత్కళా కౌశలంబునం బరిణతుండు గావున నా శకుని యాడి, యుధిష్ఠిరుం డొడ్డిన యొడ్డిమియు గెలుచుచు వచ్చె నట్లగుట, నాతని యందును గొఱంత లే; దిత్తెఱంగున వార లధర్మపరులని నిందింపరాకునికి కారణంబుగా వీరలు వుచ్చినమానిసి వినయంబుతోన యిక్కార్యంబు దీర్చికొని రావలయు’ ననిన, సాత్యకి కోపించి యిట్లనియె. | 22 |