పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము
దుర్యోధనుండును నర్జునుండును శ్రీకృష్ణుని దర్శింపఁబోవుట (సం. 5-7-2)
వ. అంత నక్కడ దుర్యోధనుండు, సకల రాజన్య సామాన్యంబుగా గోపాలదేవు పాలికి దూతం బుచ్చుట దగ వగునే?యని విచారించి. 62
క. వెరవుమెయిఁ దాన కతిపయ | పరిజన సహితముగ నరిగెఁ బటు తురగ గతి
స్ఫురణానుమోదలీలా | భరితుఁ డగుచు వేగిరంపుఁ బయనములఁ దగన్‌.
63
వ. చని తదీయ పురప్రవేశంబు సేసె; నా దివసంబున ధనంజయుండును గోవిందుం గానవచ్చె నట్టియెడ. 64
తే. అతఁడు పవడింప మును కౌరవాధినాథుఁ | డరిగి తలయంపి దెస నున్నతాసనమున
నుండెఁ, బదపడి కాల్కడ యొద్ద కల్లఁ | జని వినమ్రుఁడై నిలుచుండె సవ్యసాచి.
65
వ. అంత. 66
క. మేలుకని కృష్ణుఁ డర్జును | నాలోకించి మఱి కౌరవాధిపుఁ గని త
త్కాలోచిత బహుమతిమైఁ | జాలఁ బ్రియం బిరువురకుఁ బ్రసన్నతఁ జేసెన్‌.
67
వ. తదనంతరంబ. 68
ఉ. వారలఁ జూచి కేశవుఁడు ‘వచ్చిన కార్యము సెప్పుఁ’డన్న న
క్కౌరవనాథుఁ డిట్లనియెఁ; ‘గయ్యము సేయువగన్‌ సహాయముం
గోరి భవత్సకాశమునకుం జనుదెంచితి; మేము వీరు నీ
కారయ నొక్కరూప హృదయంబునఁ బేర్చిన బాంధవంబునన్‌.
69
క. ము న్నేను గానవచ్చితి | నిన్ను; సుజనులైనవారు నెమ్మిని మునుమున్‌
గన్నం దగఁ గైకొండ్రు; స | మున్నత సౌజన్య సారయుతుఁడవు నీవున్‌.
70
వ. కావున లోకంబుపాడి విచారించి నాకుం దోడు గావలయు’ ననిన వాసుదేవుం డిట్లనియె. 71
ఉ. ‘నీ విట మున్న వచ్చి;తిది నిక్కము; పార్థునిఁ దొల్తఁ గాంచితిం;
గావున మీకు నిద్దఱకు గౌరవ మొప్పఁగఁదోడుపాటు స
ద్భావము; దీనికిం దెఱఁగు దప్పకయుండఁగ నేర్పరించెదన్‌;
మీ వల పెట్టు లట్ల తగ నీవును నీతఁడు గోరికొం డొగిన్‌.
72
క. నా పాటియ పదివేవురు | గోపాలురు గలరు సమరకోవిద బాహా
టోపాభిరామమూర్తులు, | చాపాద్యాయుధ కళా విశారదచిత్తుల్‌.
73
క. నారాయణాభిధానులు | వారలు గయ్యంబు సేయువా; రొక్కెడ నే
నూరక నిరాయుధ వ్యా | పారతమై నుండువాఁడఁ బరమాప్తుఁడనై.
74
క. వా రొకతల, యే నొక తల; | యీ రెండు దెఱంగులందు నెయ్యది ప్రియ మె
వ్వారికిఁ జెప్పుఁడు; దొలితొలి | గోరికొనన్‌ బాలునికిఁ దగుం బాడిమెయిన్‌.’
75
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )