| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము |
| క. |
అని పలికి హరి కిరీటిం | గనుఁగొని ‘కొండుకవు నీవు గావున, నీకున్ మును గోరఁ బాడి’ యనవుడు | విని కృష్ణునిఁ గోరికొనియె విజయుం డెలమిన్. |
76 |
| ఆ. |
దాని కాత్మఁ బొంగి ధార్తరాష్ట్రుఁడు వారి | నపహరించికొనినయట్ల కాఁగఁ దలఁచి, చెన్నుమీఱి, బలములఁ గైకొని | చనియెఁ బ్రీతి రాము సదనమునకు. |
77 |
| వ. | చని యతనిం గని సమ్మానంబు వడసి తనవచ్చిన కార్యం బెఱింగించిన దుర్యోధనునకు బలదేవుం డిట్లనియె. | 78 |
| క. |
‘అభిమన్యు వివాహమునకుఁ | బ్రభువర్గం బెల్లఁ గూడఁబడియుండఁగ, నా సభ నీకై యేఁ బలికితి; | నిభపురమున మాట వుట్ట దె ట్లీవు వినన్? |
79 |
| వ. | దానికిఁ గొంద ఱసహ్యపడి పాండవ పక్షపాతంబునం బ్రతికూలవచనంబులు వలికిన, నవి కృష్ణునకుఁ బ్రియంబులై యుండె నట్లగుటం జేసి. | 80 |
| తే. |
అతనిఁ బాసి యొక్కింత ప్రొద్దైన నిలువఁ | జాలమియు మూలముగ, విరసంపు మాట లాడ నొల్లమి, నేమియు ననక యంత | నుండి యొక నిశ్చయమ్ముమై నున్నవాఁడ.’ |
81 |
| వ. | అది యెయ్యది యంటేని. | 82 |
| క. |
మీరును వారును జలమునఁ | బోరెడునెడ, నెద్ది యెట్లు వోయిన నెఱి నే నూరకయుండుదుఁ; దో డె | వ్వారికిఁ బో; నింత నిక్కువం బెబ్భంగిన్.’ |
83 |
| వ. | అనిన విని, దుర్యోధనుండు దాని కియ్యకొని, సవినయంబుగా బలదేవుని వీడ్కొని, వాసుదేవు నామంత్రణంబుసేసి, కృతవర్మ పాలికిం జని, యాతం డొక్క యక్షౌహిణితోడఁ దన్నుంగలయవచ్చువాఁడయి యూఱడం బలికినఁ బ్రియంబంది, నిజపురంబున కరిగెఁ; దదనంతరంబ కృష్ణుం డర్జునున కిట్లనియె. | 84 |
| క. |
‘నారాయణ గోపాలుర | భూరిపరాక్రములఁ గురువిభుఁడు గొన, సంగ్రా మారంభరహితు నన్నుం | గోరికొనుట నీకు మేలగునె తలపోయన్?’ |
85 |
| క. |
అనుటయు, నాతఁడు హరి కి | ట్లను: ‘నేను రణంబునకు సహాయం బొల్లన్; విను, సుప్రసిద్ధుఁడవు నీ | వని సేసినఁ, బేరు నీక యగు నెప్పాటన్. |
86 |
| వ. | నీ కెదురై జయంబు గొనరా; దట్లగుటం జేసి, విజయమూలం బగు నీతోడును వలయు; నీవు సమరంబు సేయకునికియుం బ్రియంబు కావున నిన్నుం గోరికొంటి’ నని చెప్పి మఱియు నిట్లనియె. | 87 |
| క. |
‘సారథ్యం బొనరింపు మ | పారకృపాలీల నెల్లభంగుల నా; కీ గౌరవమును జిరకాలము | గోరినయది; దీని నిమ్ము గుణరత్ననిధీ!’ |
88 |
| క. |
అనినఁ గిరీటికి హరి యి | ట్లను ‘నీదగు కోర్కి దీర్చు టది నాకు వ్రతం బనఘా! తగ సారథ్యం | బొనరించెద నీకు నసమయుద్ధక్రీడన్’. |
89 |
| క. |
అని యూఱడించి, నరుఁ దో | డ్కొని, ధర్మతనూజునొద్దకుం బ్రియ మెసఁగం జనుదెంచెం గార్యాలో | చనమును దగఁజేయు బుద్ధి శౌరి గడంకన్. |
90 |
| వ. | అంత నట శల్యుపాలికిం బోయినదూత లతనిం గని సముచితాలాపంబుల సమరసహాయత్వంబునకుఁ గోరి పిలిచినం బ్రీతుండై యతండును బుత్త్రమిత్త్రసమేతంబుగా నానాసేనాతిసంకులంబుగాఁ గదలి పాండవు లున్నయెడకు నిత్యప్రయాణంబుల నడచు సమయంబున. | 91 |