పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము
శల్యుఁడు పాండవులం జూడ నుపప్లావ్యంబునకు వచ్చుట (సం. 5-8-15)
వ. అంత శల్యుండు నుపప్లావ్యంబునకుం జని, స్కంధావారంబు దఱియం జొచ్చి, ధర్మనందనుని నివాసంబున కరిగిన, నతండు దమ్ములుం, దానును, ద్రౌపదీ సుభద్రలు, నభిమన్యు ప్రభృతి పుత్త్ర వర్గంబును నెదురువచ్చి, కృతప్రణాముండై, తోడ్కొనిపోయి, కాంచనాసనంబున నునిచి, యర్ఘ్యపాద్యంబు లిచ్చి, కుశలం బడిగిన, ‘సర్వంబును గుశల సంపన్నంబ’ యని వారల నందఱ నభినందించి, యుధిష్ఠిరుం బునరాలింగనంబు సేసి యిట్లనియె. 104
క. ‘జనరహితంబగు వనమున | ననుజన్ములు, ద్రుపదభూవరాత్మజయును, నీ
వును నింతకాల మలయక | యునికి కడున్‌ దుష్కరము, మహోదాత్తమతీ!
105
ఆ. దానికంటె నరిది దలపోయ నజ్ఞాత | వాస ముజ్జ్వలాంగభాసమాను
లైన, మీకు; మీ దయాసూనృతాదుల | పెంపు మిమ్ముఁ గడవఁ బెట్టకున్నె?
106
క. ఇమ్మహి యెల్లను నీ మది | యుమ్మలికకుఁ జాల నొచ్చె, నుర్వీవర! నీ
విమ్మెయి నిప్పు డఖిల దురి | తమ్ములుఁ గడచుటకు సమ్మదమ్మునఁ బొదలెన్‌.’
107
వ. అని యుచితసంభాషణంబులు సేసి, దుర్యోధనుండు తన్నుం గాంచిన విధంబును, నతండు ప్రార్థించిన తెఱంగును, దానికిఁ దా నియ్యకొనుటయుం జెప్పిన, ధర్మనందనుం డతని కిట్లనియె. 108
తే. ‘మేలు సేసితి; రొక్కరి మెచ్చి వారి | కోర్కి దీర్చుట పెద్దల గుణమ కాదె?
యది మదీయ చిత్తమునకు హర్షకరమ; | తివిరి యొక్కటి వేఁడెద నవధరింపు.
109
వ. పార్థునకుఁ గృష్ణుండు సారథ్యంబు సేయువాఁడై యున్నవాఁడు; కర్ణుండు పార్థుతో నెప్పుడు మచ్చరించుచునుండు; వీరిరువురకు సంగ్రామం బైనయప్పుడు కృష్ణునకుఁ బ్రతిసారథ్యం బొనరింప మీరకాని యక్కడం దక్కొరుండు లేఁడు; గావున, నవశ్యంబును మీకుం గర్ణసారథ్యంబు గర్తవ్యంబు గాఁగలయది; సమర సమయంబున నిరాకరించి పలికి కర్ణు చిత్తంబునకుం గలంకవుట్టించి పార్థు రక్షింపవలయు; నకృత్యంబని యనుమానింపక మత్ప్రార్థనంబున నెల్లభంగుల నివ్విధం బనుష్ఠించువా’రని యభ్యర్థించిన, సమ్మతించి శల్యుం డిట్లనియె. 110
క. ‘అగు నిది వోలును; నాకుం | దగ వట్టిద; ‘కర్ణునకు రథంబు గడప నీ
వగు’ దని కోరిన కౌరవ | జగతీశ్వరు ప్రార్థనంబు సలుపఁగవలయున్‌.
111
క. కర్ణుని సారథినైనను | నిర్ణయమున కేను బార్థునిం గాచెద; నా
దుర్ణయవిచారు నెమ్మెయిఁ | గర్ణకఠోరంబు లాడి కలఁతుం బోరన్‌.
112
తే. దర్పమును దేజమును మాయఁ దలరఁ బలికి | చిక్కువఱిచిన, నేయంగఁ జేతులాడ
కునికి, రాధాతనూజు నర్జునుఁడు తీవ్ర | బహుళ బాణపరంపర పాలుపఱుచు.
113
చ. ఇది యొకఁ డేల? నీవు మది నెయ్యదిగోరినఁ జేయువాఁ డ; నాఁ
డదయత సూతసూతి సభ నాడినమాటకుఁ జాల నొచ్చి మా
హృదయము లెల్ల నీవలన నెంతయుఁ బక్షముసేయు; నక్కటా!
యదియునుగాక మీ పడిన యాపద లెవ్వరి నొవ్వఁజేయవే?
114
ఆ. ఇట్లు వడితి ననుచు నెద నీవు వగవకు; | గారవమున నీ మనోరథమ్ము
ఫలము నొందు నెల్లభంగుల; దేవత | లయినఁ బడుదు రొక్క యవసరమున.
115
క. వాసవుఁడు దొల్లి నిజకాం | తా సహితము గాఁగ నధికదైన్యము నొందెన్‌;
మీ సంపద పెద్దయె? విధి | సేసిన గతిఁ బడకయుండ శివునకు వశమే?’
116
వ. అనిన విని ధర్మనందనుం ‘డింద్రుండు శచీసమేతంబుగా నట్టి దురవస్థ యేమికారణంబున నెత్తెఱంగున ననుభవించె?’నని యడిగిన, మద్రపతి ‘దొల్లింటి యితిహాసంబు సెప్పెద విను’మని యిట్లనియె; ‘దేవతలయందు మాన్యుండై త్వష్ట యనుపేరం బరఁగువాఁడు వాసవునకుఁ గీడు దలంచి మూఁడుదలలవాని నొక్కని సృజియించి, విశ్వరూప నామధేయుం జేసిన, నతం డింద్రపదవిం గోరి ఘోరతపంబు సేయుచున్న, దానికి భయంబంది నిలింపపతి యప్సరః స్త్రీలఁ ‘దత్తపోభంగంబు సేయుం’ డని నియమించి పంచిన. 117
క. వారి విలాసంబులను, వి | హారముల, విలోకనముల, నాలాపములన్‌
మారవికారం బాతనిఁ | జేరద; యన్నాకపతియు సి గ్గెదఁ గదురన్‌.
118
తే. తలరి యమ్మునిఁ దెగఁజూచి ధర్మరహితుఁ | డగుట, యెవ్వరు నెఱుఁగనియట్లు గాఁగ
నేఁడు గాలంబు గడపిన, నెఱిఁగి భూత | గణము లాక్రోశ మొనరింపఁగా నతండు.
119
వ. తన దుష్కర్మంబు ప్రకటంబగుటకు రోసి, యొక్కవిషమవ్రతం బాచరించి, సముద్ర తరు ధరణీ స్త్రీజనంబులయందు బ్రహ్మహత్య విభాగించి పెట్టి, నిజకల్మషంబుఁ బాపికొని, మునిగణ సేవితుండయి సముల్లాసంబునం బొంది యునికికిఁ ద్వష్ట కోపించి. 120
తే. ‘అనపరాధుఁ, దపోనిధి, నధికశాంతి | యుక్తుఁ జంపిన పాపాత్ము నుఱక పట్టి
మ్రింగఁ జాలెడు వాని, నుత్తుంగదేహు | నేను సృజియింతుఁ జూడుఁడీ యీ క్షణంబ.’
121
చ. అనుచుఁ గడంగి నిష్ఠమెయి నగ్నిముఖం బొనరించి, వేలిమిం
దనయు సృజించి, లోకవిదితంబుగ వృత్ర సమాఖ్య యిచ్చి ‘మ
ద్వినుత తపోబలంబునఁ బ్రదీపిత తేజుఁడవై జయింపు నీ’
వని నియమించి పంచె నమరాధిపుతో సమరంబు సేయఁగన్‌.
122
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )