పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము
ఇంద్రుఁడు వృత్రాసురునితో యుద్ధంబు సేయుట (సం. 5-9-45)
చ. పనిచిన నాతఁడుం జనియె బాహుబలంబున నేచి; వాసవుం
డని కెదురేఁగుదెంచె; నిటు లద్భుతసంగరమైనచోట న
య్యనిమిషనాథుఁ బట్టుకొని యంగద వృత్రుఁడు మ్రింగె, దేవత
ల్మనమున బెగ్గలింపఁగఁ జలంబు బలంబును జూపి యుగ్రుఁడై.
123
వ. ఇట్లు మ్రింగినం ద్రిదశగణంబులు దత్‌క్షణంబ యాదైత్యునకు నావులించునట్టి యాలస్యం బావహించిన. 124
తే. అసురనాథుండు నలసత యడర నీల్గి | యావులించిన, నత్తఱి నమరవిభుఁడు
దన శరీరంబు సంకుచితంబు సేసి, | కడుజవంబునఁ గుప్పించి వెడల నుఱికె.
125
క. వెలలి బలరిపుఁడు చలమునఁ | గలహమునకుం జొచ్చె; వృత్రు ఘనబాహుబలం
బలవికి మీఱెను దండ్రి వి | మల తపమునఁ జేసి సురల మనములు దలఁకన్‌.
126
వ. ఇట్లధికబలుండైన వృత్రు నాటోపంబు సహింపంజాలక సురపతి దెరలి మరలి పఱచి మందరగిరి శిఖరంబున కరిగినం, గనుకనిం జని యనిమిషు లతనిం గూడుకొని, వృత్రవధోపాయంబు విచారించునెడ, నవ్వాసవుండును దన మనంబున నిశ్చయించి. 127
క. ‘హరిఁ గాంచి యతని చెప్పిన | పరమోపాయంబు సేసి బ్రతుకుద’ మనినన్‌.
సుర లదియ కర్జమని య | మ్మురమర్దను కడకుఁ జనిరి మునులుం దారున్‌.
128
వ. ఇట్లు దివిజానీకంబును పాకశాసనుం బురస్కరించుకొని 129
మ. చని యా దైత్యుతెఱంగు సెప్పి, ‘యతులోత్సాహంబుమై నెప్పుడున్‌
దనుజవ్రాతము త్రు ళ్ళడంచి, దివిజేంద్రశ్రీవిలాసంబు పెం
పునఁ బొందించుట నీకు నైజము గదా, భూతేశ! ఘోరారిమ
ర్దన సంక్రీడ యొనర్పు లోకముల కత్యంతప్రమోదంబుగాన్‌.’
130
క. అనిన విని, ‘యొకటి సెప్పెద | వినుఁ డాతనితోడ సమరవిభునకుఁ దగఁ బొం
దొనరింపుఁ; డొక్క సమయం | బున నడఁకువఁ గులిశధారఁ బొందెద నేనున్‌.
131
వ. మదీయ తేజో విశేషంబున నప్పురుహూతున కుత్సాహంబు సంభవింపంగలయది. అప్పు డనాయాసంబునఁ బగతు వధియింప నగు’నని గదాధరుం డూఱడిలం బలికిన, బలసూదన ప్రముఖ నిఖిల సురలోకంబును సంతసిల్లి మగిడి వచ్చి వృత్రుకడకు మునిజనంబులం బుచ్చిన, వారునుం జని యతని కిట్లనిరి. 132
క. ‘భుజ బల దుర్జయుఁ డింద్రుం; | డజయ్యుఁడవు నీవు; నీకు నతనికి మీలో
విజయము దక్కదు; మీరే | చి జగంబులు నొవ్వ రణము సేయఁగనేలా?
133
క. మైత్రీ సౌఖ్యముఁబోలునె | శాత్రవ మెమ్మెయిఁ దలంప? శక్రశ్రీకిం
బాత్రమవై యింపుగఁ ద | న్మిత్రుఁడవగు; మిదియ మేలు మీ యిద్దఱకున్‌.’
134
వ. అనవుడు వృత్రాసురుండు ‘తేజంబువాసికి నాసపడియెడు మా యిరువురకు సఖ్యంబు సమకూర నేర్చునే?’ యనుటయు నమ్మునులు’ సత్పురుష సాంగత్యంబు సంభవించినఁ జేయమి నీతి గాదు. మహేంద్రుండు సకల లోక సమ్మత సద్భావుండుగావున నతనితోడి చుట్టఱికంబు మే’లనిన నొడంబడి యతండు వారల కిట్లనియె. 135
క. ‘ఏ నొక్క తెఱఁగు సెప్పెద; | దానిం గాదనక చేసి తగ మీరలు సం
ధానము దృఢముగఁ జేయుం | డా నాకేశునకు నాకు నధికప్రీతిన్‌.’
136
వ. ‘అది యెయ్యది?’ యనిన ‘ఆర్ద్రం బగుదానను, శుష్కంబైన సాధనంబునను, దారువునం, బాషాణంబున, శస్త్రాస్త్రంబులం, దివంబున, రాత్రి యందును నేను వధ్యుండఁ గాకుండవలయు’ ననిన, వారును దానికి నొడంబడి, యవ్వరంబు లొసంగి వృత్రవజ్రధరులకు మిత్రభావం బొనరించి, మగుడం జని, యత్తెఱంగు వాసవున కెఱింగించి నిజనివాసంబుల కరిగిరి, సురనాథుండు సుఖంబుండి, పెద్దకాలంబునకుం దన మనంబునఁ బాయని వైరంబు సైరింపంజాలక, దామోదరుని పూనికయు, మునిజనంబు సేసిన సంధి విధంబును నిరూపించి, రిపుం బరిభవింప రంధ్రాన్వేషణంబు సేయుచుండి యొక్కనాఁడు. 137
చ. జలనిధి తీరభూమిఁ దన శత్రుఁ గనుంగొని, ‘వీని నిప్డు దో
ర్బల మెసఁగంగ నాదు భిదురంబునఁ ద్రుంచెద; రాత్రిగాదు, తాఁ
దలఁప దివంబుగా; దిది యుదగ్రపరాక్రమ యోగ్య సంధ్య; నా
యలవుఁ జలంబుఁ జూప నెపమై తగు సాధన మెద్ది గల్గునో?’
138
క. అని తలఁచుచు నచ్చట నొక | వననిధి ఫేనంబుఁ జూచి వాసవుఁ ‘డార్ద్రం
బును శుష్కంబును గాదిది’ | యనుచుం గులిశమునఁ గూర్చి యధికరయమునన్‌.
139
తే. దాన వృత్రుని వ్రేయ నత్తఱి మురారి | యందుఁ దగ సంక్రమించి, యయ్యసురఁ జంపె;
జిష్ణుఁ డతిభక్తి విష్ణుఁ బూజించె నాత్మ | నఖిలలోకంబులకు మోద మావహిల్లె.
140
వ. ఇవ్విధంబునం బగతుం బరిమార్చి పేర్చి యింద్రుండు నిజపురంబునకుం జనియె; మఱియును భూతసంఘం ‘బిట్లు బ్రహ్మహత్య సేయందగునే?’ యని యతని నిందించినం బ్రభుత్వ సంపద సెడుటయు. 141
ఆ. నీచదశకు వచ్చి నిషధాచలంబున | కరిగి, సురవరేణ్యుఁ డడఁగియుండె;
నమరు లెల్లఁ గలఁగి, యన్యోన్యపీడన | భయముఁ బొంది కూడఁబాఱి, తమకు.
142
క. కావలియై సురరాజ్య | శ్రీ వాలింపంగఁదగు విశేషంబున సం
భావితుఁడు నహుషుఁ డని చని, | యా విభుఁ గని తారు మునులు నతనికి నెమ్మిన్‌.
143
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )