పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము
ద్రుపద పురోహితుని రాయబారము (సం. 5-29-1)
క. పాంచాల మహీవల్లభు | పంచిన భూదేవుఁ డుచితభంగి నగరి కే
తెంచి, ధృతరాష్ట్రుఁ బ్రీతిం | గాంచి, కృపద్రోణ విదుర గంగాసుతులన్‌.
229
వ. వారి వారి మందిరంబులకుం జని కని, సముచితాలాపంబులం బ్రసన్న చిత్తులం జేసి, దుర్యోధను సందర్శనం బును నిర్వర్తించి, నిత్య నిపుణారాధనంబున ధృతరాష్ట్రునభిముఖుం గావించి, యొక్క నాఁ డక్కౌరవేశ్వరు పేరోలగంబున సమస్త సేనాపతులం గలయం గనుంగొని యిట్లనియె. 230
సీ. ‘ధృతరాష్ట్ర పాండుభూపతులు సహోదరు | లగుటయు, వారల యాత్మజులకుఁ
దమ తమ తండ్రుల ధనములు గైకొనఁ | దగుటయు, మీకు నందఱకుఁ జూడ
నుచితంబ కాదె? యట్లుండెఁ, దొల్లింటి చం | దంబును మనకుఁ దెల్లంబ కాదె?
ప్రాణగొడ్డము లగు పనుల వారలఁ దీర్పఁ | దలఁచినఁ, బున్నెంబు కలిమిఁ జేసి
 
తే. బాహుబల మొప్ప నిజరాజ్యపదవిఁ బొంది | యున్న, వంచనమెయి మహిఁ గొన్న తెఱఁగు
నెఱుఁగుదుర కాదె? దీనికి నెల్ల నియ్య | కొనియె నీ పెద్దరాజు నేమనఁగ నేర్తు?
231
శా. నారీరత్నము నట్లు దెచ్చి సభలోన న్వారలుం జూడఁగాఁ
జీరల్‌ ప్రోవులు గాఁగ నొల్చుటయు, లచ్చిం బుచ్చికోలున్‌, మహో
గ్రారణ్యస్థలి నిల్వఁబంచుటయు, దైన్యవ్యక్తిమై పల్కులున్‌
సైరింపం జను పాండవేయులకు నీ సంధిక్రమం బొప్పదే?
232
క. వీరల వృత్తముఁ, బాండుకు | మారుల వర్తనముతెఱఁగు మాత్సర్యములే
కారసి, ధృతరాష్ట్రునకున్‌ | గారవమున బుద్ధిసెప్పఁగాఁ దగు మీకున్‌.
233
తే. పాండవులు కౌరవులతోడి పగకు నొల్ల | రఖిల భూప్రజ నాశన మగుటఁజేసి
వార లస దని తలఁపంగ వలవ; దధిక | ధర్మపరులైన కతమునఁ దగవు నడచె.
234
వ. అందుఁ గూడినవి యే డక్షౌహిణు, లిందుఁ గూడినవి పదు నొకం డక్షౌహిణులని తలంతురేని వినుండు. 235
క. బాహుబల ఘనుఁడు భీముఁడు, | సాహస రసికాత్ముఁ డయిన సాత్యకియు మహో
గ్రాహవభూమి సహస్రా | క్షౌహిణు; లట్లగుట మీరు గానరె యెందున్‌?
236
క. గాండీవధన్వు నాహవ | పాండిత్యముఁ దలఁప నతని భండనమున మా
ర్కొండు నని యొకఁడు గడఁగుట | కొండం గని తగరు దాఁకఁ గోరుట గాదే?
237
క. ఆ బీభత్సుని భూరి భు | జా బలమును, దుర్నివార శౌర్యము, శర వి
ద్యా బహుళతయును బందికి | నై బవరముఁ జేసినట్టి హరుఁడ యెఱుంగున్‌.
238
వ. అదియునుం గాక. 239
మ. వివిధోపాయ పరాయణుండు, రిపుదోర్వీర్యాపహారక్రియా
ప్రవణోద్యోగుఁడు, మంత్ర రక్షణ కళా ప్రావీణ్యగణ్యుండు, ధై
ర్య వివేకాది గుణోత్తరుం, డఖిల విద్యాజాల సంవేది మా
ధవుఁ డా దిక్కటె! పాండవేయుల కసాధ్యం బెద్దియుం గల్గునే?
240
ఆ. అదను దప్పకుండ నమ్మహాత్ముల నెమ్మిఁ | బిలువఁ బంచి, హితముఁ బ్రియము రెండు
పక్షములకు నగుట పాటించి తగవుమైఁ | గొంతభూమి యిచ్చి కూడి మనుఁడు.’
241
చ. అనవుడు భీష్ముఁ డిట్లనియె ‘నక్కట! భాగ్యముగాదె పాండునం
దను లొకయాపదం బడక ధర్మగతిం దగ నందఱున్‌ సుహృ
జ్జనులను గృష్ణునిం గలిసి సమ్మద మొందుటయుం బ్రశాంతిమై
మనముల నీసు దక్కి మృదుమార్గము వట్టుటయుం దలంపఁగన్‌.
242
క. నీ వాక్యము విప్ర స్వా | భావికమై యిట్లు శ్రుతికిఁ బరుషం బైనన్‌,
భావింపఁ గార్యమునయం | దే విధమున సభకు నింత యిష్టం బగునే ?
243
చ. సమయమ యూఁది, పాండవు లశక్తుల చాడ్పున నిందు నాఁడు బ
న్నము వడి చన్న దైన్యము, వనంబునఁ బడ్డ విషాదవేదనా
శ్రమము, విరాటు వీట లఘు సంచరణంబున దాఁగియున్న దుః
ఖమును జగం బెఱుంగదె? యకల్మషులం బఱుపంగఁ బాడియే?
244
క. పితృధన మగు పా లుచిత | స్థితి వారల కిచ్చి, నిర్విశేషుండై యీ
పతి లోకము మెచ్చఁగ నిజ | సుత నివహమునట్ల వారిఁ జూడఁగవలయున్‌.
245
వ. అట్లుం గాక. 246
చ. కడవఁగ జూదమాడి, యవుఁ గాడన నేరక, సత్యభాషణం
బెడలిన వచ్చు ధర్మగతిహీనత కోర్వక, రాజ్యహీనతం
బడుటకు నోర్చి, ధర్మజుఁడు పంచిన సైరణ సేసెఁ గాక క
వ్వడి నెఱ గిన్క కెట్టి మగవారును నోర్తురె యిజ్జగంబులన్‌?’
247
వ. అనిన విని కర్ణుండు కనలి యిట్లనియె. 248
క. ‘జనులెల్ల నెఱింగిన యీ | పని యేటికి నుగ్గడింపఁ బలుమఱు ? దుర్యో
ధనునకయి శకుని జూదం | బున మేదిని గెలిచె; ధర్మపుత్త్రుం డోడెన్‌.
249
ఆ. దీన నేమి తప్పు? కానకు నేఁగిన | యతఁడు సమయవృత్తి నాక్రమించి,
తండ్రిపాలు మాకుఁ దగునంచు, నడియరి | తనము సేసి రాక తప్పు గాక,
250
క. విరటుఁడు ద్రుపదుఁడుఁ దోడుగ | బరవసమున నెత్తి విడిసి బలిమి నడిగినం
గురుపతియు వెఱచి యిచ్చునె | ధరలోఁ జక్క సగ? మిట్టి తగవులు గలవే?’
251
వ. అనిన గాంగేయుండు గటకటంబడి కర్ణున కిట్లనియె. 252
ఉ. చిక్కని పోటుమానిసి విసీ ! వినువారలు నవ్వ నేమిగా
నెక్కుడు మాట లాడెద? వహీన పరాక్రమశాలి యర్జునుం
డొక్కఁడ యార్వురన్‌ మనల నుగ్రరణంబున గెల్చె నిన్న; నేఁ
డిక్కడఁ బల్కులన్‌ గెలిచె దీ వతనిన్‌ మనరాజు కొల్వునన్‌.
253
క. నరుఁ డాల వెనుక వచ్చినఁ, | గురురా జడుగంగ, నీవు, గురుఁడును, గృపుఁడున్‌
గురుసుతుఁడు వినఁగ, వారల | చిరసమయము దెగుట యేను జెప్పనె తెలియన్‌?
254
తే. అనిన, ధృతరాష్ట్రుఁ డాపగాతనయు భక్తి | ననునయించి, రాధేయునిఁ గినిసి, ప్రియము
దోఁపఁ దా నిట్టు లనియె నా ద్రుపద మనుజ | పతి పురోహితుతోడ సంభ్రమము లేక.
255
ఉ. ‘మంచిగ నేను బంధులును మంత్రిజనంబులుఁ బెద్దలున్‌ విచా
రించి, సమస్త భూ ప్రజకుఁ బ్రీతిగ, బిడ్డల పాలి కిప్డు పు
త్తెంచెద సౌమ్యు నొక్కరు’ మదీయ మనోగతి వారిఁ గూడి వ
ర్తించు తెఱంగు గైకొనుట దెల్లము కౌరవజాతి కెంతయున్‌.
256
తే. నీవు మున్నేఁగు’ మని యతనికి విభూష | ణాంబరమ్ములతోఁ దమ్ములంబుఁ బెట్టి
వీడుకోలిచ్చి పుచ్చిన, విప్రవరుఁడు | పాండు జనపాల తనయుల పాలి కరిగె.
257
వ. ఇట్లు సని వారలఁ గని యతండు సముచిత సంభాషణంబులఁ దనపోయి వచ్చిన తెఱం గెఱింగించె; నిట ధృతరాష్ట్రుండును బుత్త్ర మిత్త్ర వృద్ధామాత్య సహితంబుగా నాస్థానాసీనుం డయి యుండి సంజయు రావించి యతని కిట్లనియె. 258
తే. ‘పాండు నరపాల సుతు లుపప్లావ్యమునకు | వచ్చియున్నారు; నీ వేఁగి వాసుదేవ
సహితముగ వారిఁ గని, తద్విషాద మేమి | భంగి మాను నమ్మెయిఁ దగఁ బలుకవలయు.’
259
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )