పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము
సాత్యక్యాదులు సేనాసమేతంబుగఁ బాండవులం జేరవచ్చుట (సం. 5-19-1)
మ. సకలారాతి భయంకరుం డగుచు నుత్సాహంబు వాటించి, నే
లకు వ్రేఁ గయ్యెడుభంగి వచ్చె రణలీలాకౌతుకం బొప్పఁ దా
నొక యక్షౌహిణి తోడఁ, బాండవబలం బుల్లాసముం బొంద సా
త్యకి బాహాబలగర్వ నిర్వహణ విద్యాప్రౌఢి సంరూఢుఁడై.
218
వ. అంతం జేదిపతి యగు ధృష్టకేతుండును, జరాసంధనందనుండగు సహదేవుండును జెఱొక్క యక్షౌహిణి తోడం జనుదెంచిరి. సహోదరు లేవు రగు కేకయపతులు నేకాక్షౌహిణీ సమేతులై యేఁగుదెంచిరి; తదనంతరంబ. 219
క. కొడుకులుఁ దానును గుఱ్ఱపు | దడములఁ, గరిఘటల; భట రథవ్రాతములం
బుడమి చలింపఁగ ద్రుపదుఁడు | గడు వేడుకఁ దోడు సూపెఁ గౌంతేయులకున్‌.
220
వ. అదియును నొక యక్షౌహిణికిం గలిగి యొప్పె; నయ్యవసరంబున ననుజ తనుజ సమేతుండును, బార్వతీయ మహీపాల సహితుండును నై యొక్క యక్షౌహిణి యొడ్డనంబు దీర్చి. 221
క. చిందముల మ్రోఁతఁ బగతుర | డెందంబులతోడ దిక్తటీసంధులు నం
దంద పగులంగఁ, గుంతీ | నందనులకుఁ దోడు మత్స్యనాథుఁడు సూపెన్‌.
222
వ. పాండ్యవిభుండు లోనుగాఁ బలుదెసలనుండి వచ్చిన బలం బొక్క యక్షౌహిణికిం గలిగి యొప్పె. 223
క. ఏ డక్షౌహిణు లిమ్మెయిఁ | గూడెం బాండునృపసుతులఁ గ్రూరాహవసం
క్రీడా వినోదమునకుం | దోడుపడం బూని యతి కుతూహల వృత్తిన్‌.
224
వ. ఇవ్విధంబునం గూడి పెరిఁగి యుధిష్ఠిరు సైన్యంబు గయ్యంబునకుం గాలు ద్రవ్వుచునుండె; నంత నక్కడం గిరాతకాంచన సైన్యనిచయంబులం గూర్చికొని, సమరంబునకు నమరి యొక్క యక్షౌహిణి గల భగదత్తుండు సుయోధనుం గలిసె; భూరిపరాక్రముండయిన భూరిశ్రవుండును, మహాబలుండయిన శల్యుండును నేకాక్షౌహిణీ సమేతంబుగా నేతెంచిరి; వారలయట్ల సన్నద్ధుఁడై కాంభోజనాథుండైన సుదక్షిణుండును యవనేశ్వరుండును వచ్చె; నత్తెఱంగున సమకట్టి జయద్రథ ప్రముఖులైన సింధు సౌవీర నరపతు లరుగుదెంచిరి; మాహిష్మతీ పతి యగు నీలుండు, యాదవవీరుం డగు కృతవర్మయు, నవంతీశ్వరులు సోదరులు నగు విందానువిందు లిరువురునుంగా నిన్నలువురు నొక్కొక్క యక్షౌహిణితోడఁ జనుదెంచిరి; మఱియునుం బలుదెసల నుండి వచ్చి కూడిన వాహినులు మూఁ డక్షౌహిణులకుం గలిగె; ధార్తరాష్ట్రులకుఁ దోడు పడం బూనినయవి పదునొకం డక్షౌహిణు లయ్యె; నట్టియెడ. 225
క. సవరణల నొప్పి, యనిఁ బాం | డవ బలముల మార్కొనం గడంగుచు, నత్యు
త్సవమునఁ బేర్చిన సేనల | కవకాశము లేదు విడియ హస్తిపురమునన్‌.
226
క. నానాముఖముల విడియం | గా నియమించెను బలంబుఁ గౌరవపతి యా
సేనల దొరలకు నిలువఁగ | నైనను నెడ లేమి, నధిక హర్షం బెసఁగన్‌.
227
వ. ఇత్తెఱంగునం గురుజాంగలంబున, రౌహితకారణ్యంబున, మరుదేశంబున, నహిచ్ఛత్రంబునఁ, గాలకూటంబున, గంగాకూలంబున, వారణావతంబున, వటస్థానంబున విచ్చలవిడి విడిసి, ధనధాన్యాది సమస్త వస్తువుల కలిమింజేసి యెలమి మిగిలి యున్నంత. 228
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )