| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | శాంతి ప్రకారంబునం గార్యంబు నడపి యొక్కటియై మనుట యొడఁగూర్చి రమ్ము; రథం బెక్కి పొ’ మ్మని తగినతెఱంగున వీడ్కొలిపిన, సంజయుండునుం జని, యుపప్లావ్యంబు సొచ్చి, మాధవు మందిరంబున కరిగి, యభ్యంతర వినోదంబుల నరసహితుండై యున్న యన్నారాయణునకుం దనరాక యెఱింగించి పుచ్చి, తగఁ బ్రవేశించి, భయభక్తివినయ సంభ్రమంబులు మెఱయ వారలం గాంచి, యమ్మహాత్ము లిరువుర సంభావనంబులును, సంభాషణంబులునుం బడసి సంప్రీతచేతస్కుండై, మఱునాఁడు ధర్మతనయు నొడ్డోల గంబున్న సమయంబు వేచి, సముచితంబుగా నతనిం గని సాష్టాంగంబుగాఁ బ్రణమిల్లిన, నతండుం బ్రియపూర్వకంబుగా నాదరించి తన సమీపంబున నునిచికొనినం గొలిచియుండి యతని కిట్లనియె. | 272 |
| తే. |
‘భాగ్యమున నిన్నుఁ గనుఁగొనఁ బడసి నాదు | చూడ్కి చరితార్థ మయ్యె; నస్తోక పుణ్య ధనుఁడు మీ తండ్రి ధృతరాష్ట్ర ధరణినాథుఁ | డిందు మీ యున్కి విని, ప్రియ మెసకమెసఁగ. |
273 |
| క. |
అనుజులు నీవును ద్రోవది | యును బుత్త్రచయంబు నున్న యోగక్షేమం బున తెఱఁ గారయఁ బుత్తెం | చె నితాంత స్నేహపూర్ణ చేతోవృత్తిన్.’ |
274 |
| వ. | అనిన సూతనందనునకు ధర్మనందనుం డిట్లనియె. | 275 |
| క. |
‘ఆ రాజు మా దెసం గల | కారుణ్యము కతమునను సుఖంబున ని ట్లు న్నారము; నినుఁ బుత్తెంచిన | గారవమున నాదుమది వికాసముఁ బొందెన్. |
276 |
| క. |
అమ్మనుజేశ్వరునకు సే | మమ్మే? పుత్త్రకులు సుఖులె? మనుమలు సమ్మో దమ్మునఁ బెరిఁగెదరే? నగ | రమ్ముల భూములను శుభపరంపర గలదే ? |
277 |
| సీ. |
ద్రోణుండుఁ, గృపుఁడును, ద్రోణసుతుండును | సుఖమున్నవారె? సుశ్లోకుఁడైన భీష్ముడు కుశలియే? పెద్దతనం బిచ్చి | యాతనిఁ గౌరవు లనుసరించి మెలఁగుదురే? బ్రాహ్మణులకు మన్నన గల్గి | యుండునే? యే మర్థి నొసఁగి నట్టి వృత్తులు సెల్లునే? యొత్తొరు వొండుల | వలనఁ బుట్టదుగదా? కలఁకు లందుఁ |
|
| తే. |
బుట్టినప్పుడు గాండీవి భుజబలంబుఁ | దలఁతురే? భీమసేను గదా విహార ముగ్గడింతురె? కవలు మహోగ్రరిపుల | భూము లంతంత కొత్తుట పొగడఁబడునె? |
278 |
| మ. |
ఒకనాఁడా తమ ముందటం బలుమఱున్ హోరాటమై నేల యొ త్తి కొనంగా బవరంబులన్ గెలువఁగాఁ దెల్లఁబుగాఁ జూచి పాం డు కుమారాళి నుతింపకుండుదురె? యాటోపంబునన్ ఘోషయా త్రకు గంధర్వులు వచ్చినప్పటి చరిత్రం బాత్మలం బాయునే? |
279 |
| క. |
వినుము మనము మధ్యస్థుల; | మని నర్జును నెదిరి, సంజయా! యిటము న్నె వ్వనికిని మానముఁ బ్రాణం | బును దగఁ దక్కించుకొనఁగఁ బోలెనె చెపుమా! |
280 |
| క. |
దుర్యోధను నింటం దగు | కార్యమునకు ఖడ్గమునకుఁ గలవాఁడై చా తుర్యంబు మెఱయు కర్ణుని | యార్యత్వము సెల్లుచున్న యదియే నెమ్మిన్?’ |
281 |
| వ. | అనిన విని సంజయుండు సవినయంబుగా నిట్లనుఁ ‘గురురాజునొద్ద నవినీతులు, నీతిమంతులు, సత్త్వసంపన్నులు, దురహంకారులు, మఱియు వివిధ ప్రకారులు నయి బెరసి యుండుదురు; వా రొకళ్ళొకళ్ళ మాటలం బోయెడువారు గారు; కావున వారి నంత యనం బనిలేదు; నా విన్నపంబు చిత్తగింపుము. | 282 |
| క. |
పొందొందఁగఁ దలఁచితి నీ | విందు శిశిరమైన విమల హృదయంబున; వా రందఱకును సేమం; బిట | ముందఱ లేకున్న, నేఁడు మొదలుగఁ గలుగున్. |
283 |
| క. |
ధృతరాష్ట్ర భూపతికి వృ | ద్ధత కతమునఁ జిత్త మొక విధము గామి సుతో ద్ధతి మాన్పఁడ నాఁడు; మనః | క్షతి పిదపం బుట్టి యిపుడు శాంతుం డయ్యెన్. |
284 |
| తే. |
ఇట్టి చందంబు లెల్లను నీవు పుణ్య | చిత్తవృత్తిమై సైఁచినఁ జెల్లివచ్చు; నీ యజాతశత్రుత్వంబు నిఖిల లోక | విశ్రుతము గాదె, ధర్మప్రవీణహృదయ! |
285 |
| చ. |
జగముల నెల్లెడన్ దురిత సంతమసంబు జయింపఁ గోరి పా ల్పుగఁ బరమేష్ఠి నిల్పిన వెలుంగు మహీసురు; లట్టి వారికిం దగవు ఘటింప సత్పురుష దత్తములై చను జీవనంబు లెం త గుమతులైన మార్తురె? పదంపడి యాయువు శ్రీయు నొల్లరే? |
286 |
| ఉ. |
ఒక్కొకచోఁ గడంగి ప్రతియోధులు మార్కొనునప్పు డాత్మలన్ నెక్కొని మోములం బొడము నెవ్వగతోడ జనంబు లిట్టి యం దక్కట! భీముఁ డైన, మన యర్జునుఁ డైనను, మాద్రి పుత్త్రులం దొక్కరుఁడైన నీ పగఱ నుక్కడఁగింపరె యొక్క వ్రేల్మిడిన్? |
287 |
| క. |
వారొక యాగ్రహవృత్తిం | గూరి యధర్మంబు సేఁతకుం జాలరు; దు ర్వారబలు లయ్యుఁ బాండుకు | మారులు శాంతాత్ము’ లండ్రు మనుజాధీశా ! |
288 |
| క. |
నలువురు తమ్ములు, భవదా | ప్తులుఁ గృష్ణుఁడు వినుచునుండ భూవర! నీ కేఁ గొలువునను విన్నవింపం | బలుకులు గల వవధరింపు పరిపాటి మెయిన్’. |
289 |
| చ. |
అనవుడు ‘వీరె తమ్ములును, నాప్తులుఁ, గృష్ణుఁడు; వీరె తక్కుకొ ల్వునఁ గలయట్టి సర్వజనులున్ వినుచుండెద; రయ్య నిన్ను నే మను మని పంచెఁ జెప్పు మది యంతయు నేర్పడ’ నన్న, ధర్మనం దను గరువంపుఁ బల్కుల విధంబునకున్ మదిలోన నుల్కుచున్. |
290 |
| ఆ. |
సంజయుండు కృష్ణు సద్భక్తి నీక్షించి, | పవనపుత్త్రుఁ బార్థుఁ గవల ద్రుపద తనయు సవినయమునఁ గనుఁగొని, ప్రీతిఁ బాం | చాలు మత్స్యధరణిపాలుఁ జూచి. |
291 |
| వ. | ‘సావధానులరై వినుం’ డని పలికి, యుధిష్ఠిరుదెసకు మోడ్పుఁగేలు నిగిడించి యిట్లనియె. | 292 |
| ఉ. |
‘శాంతతఁ బొంది కార్యముదెసన్ ధృతరాష్ట్ర మహీశుఁ డాత్మ న త్యంతముఁ దేఱి, న న్నిటఁ బ్రియంబునఁ బంచెడునప్డు నాకుఁ దే రెంతయు వేడ్కఁ దాన వెర వేర్పడఁ జెప్పుచుఁ బన్నఁ బంచె ని ట్లింత ఘటించెఁ బొందు; మన మీ పదనం దెలివొందఁగాఁ దగున్. |
293 |
| క. |
చులుకని కార్యము సేయం | దలఁచుట మీ యట్టి సర్వధర్మజ్ఞులు శాం తులు ననఁ బ్రసిద్ధులగు పె | ద్దలకుం దగ వగునె యెవ్విధంబునఁ జూడన్ ? |
294 |
| ఆ. |
మడుఁగుఁ జీరయందు మసి దాఁకినట్లు మీ | సత్కులమునఁ గల్మషంబు కౌర వేంద్రు కతనఁ బొందె; నింతయుఁ బాపంగ | నీవ నేర్తు, కార్యనిపుణహృదయ! |
295 |
| చ. |
అఖిల జనక్షయంబయి, జయాపజయంబులు రెండునుం దుదిన్ సుఖములు గాని యీ పనికిఁ జొత్తురె యుత్తము? లట్లుఁగాక యా నిఖిలసుఖంబు లేమిటికి నీవని వృద్ధజనంబు బాలురన్ సఖులను బంధులన్ గురులఁ జంపితయేని దయాపయోనిధీ! |
296 |
| ఉ. |
పెట్టనికోట నీకు హరి; భీముఁడు నర్జునుఁడున్ రణంబునం దొట్టిన మంట; లా కొలఁది యోధుల సాత్యకియున్, విరాటుఁడున్; జుట్టపు మేరు, వుగ్రరణ శోభితుఁ డీ ద్రుపదుండు; నిన్ను ని ట్టట్టనవచ్చునే సురలకైనను? నొల్లవు గాక చివ్వకున్. |
297 |
| వ. | మఱియు నక్కడ. | 298 |
| ఉ. |
ద్రోణుఁడు, భీష్ముఁడుం, గృపుఁడు, ద్రోణసుతుండును గర్ణశల్యులుం బ్రాణము లా సుయోధనుని పాలివ యండ్రు; నిజానుజన్ము ల క్షీణపరాక్రముల్, సుతు లజేయులు; బాహ్లిక సోమదత్తు లా స్థాణునకైన నోడరు; వశంబె జయింపఁగ వారి నేరికిన్? |
299 |
| ఆ. |
అధిప! యిట్టి మీకు నన్యోన్య కలహంబు | నాకుఁ జూడ మే లనంగ రాదు; రెండు పక్షములకుఁ బ్రియము హితంబును | నాత్మఁ గోరువారి నడిగి చూడు.’ |
300 |
| వ. | అని పలికి సూతనందనుండు గొలువు గలయం గనుంగొని. | 301 |
| ఉ. |
‘మ్రొక్కెద వాసుదేవునకు, మోడ్చెదఁ జేతులు సవ్యసాచికిం, దక్కటి మిత్త్ర బాంధవ హిత ప్రియమంత్రి వయస్య కోటికిన్ స్రుక్కుచు విన్నవించెద నసూయలు దక్కి యనుజ్ఞ సేయుఁడీ యిక్కరుణాకరున్ శరణ మే నిదె వేఁడెదఁ గ్రోధశాంతికిన్. |
302 |
| వ. | అనుచుం బ్రణామపూర్వకంబుగాఁ బాండవాగ్రజు వదనంబునం జూడ్కినిలిపి, ‘దేవా! యుపశమించుట లెస్స, యిమ్మెయికిం గురు పితామహుండును సంతసిల్లు; నాతనికనుమతంబయిన తెఱంగు సర్వలోకసమ్మతం బగు’ నన విని ధర్మనందనుం డిట్లనియె. | 303 |
| ఉ. |
‘నెయ్యము దప్ప నొండొకటి నీ చెవి సోఁకెనె నాదు పల్కులం దియ్యెడ? సంజయా! యనికి నెమ్మెయి నల్కెదు నీవు; మాకుఁ దాఁ గయ్యము దక్కి మన్కి తగు కార్యము గా దాకొ? పోరితంబు లే కయ్యెడు నర్థసిద్ధి వెడఁగైనను నొల్లక యొండు సేయునే? |
304 |
| క. |
జనులకు నెల్లను బథ్యము | లనఁగా, ధర్మానుగతములగు ననఁ బొగడం జను పనులు సేయు భీమా | ర్జునులే దుష్కర్మములకు రోయని వారల్? |
305 |
| క. |
మది సుఖము గోరి, దుఃఖం | బొదవం గల కార్యములకు నుత్సాహము సే యుదు రొప్పని తృష్ణం బడి | చదు రేమియు లేని యట్టి జను లాతురులై. |
306 |
| ఆ. |
యోగ్యతృష్ణ దారు, లుచితంపుఁ గొలఁదిమై | నడచినట్టివారు బెడిదములకు నంత సొత్తు రెట్లు? సంతాపకారుల | కాక పెనఁకువలు సుఖంబు లగునె? |
307 |
| వ. | భోగంబులు వలదా యని తలంతు మేని. | 308 |
| తే. |
వస్త్ర మాల్యానులేపనావసరములును, | జతుర తూర్య త్రయంబుల సమయములును, నేమ వెలిగాఁగ మా తండ్రి కించు నెట్లు; | పుత్త్రులన పట్టి మమ్మేల పోవఁ ద్రోచు? |
309 |
| వ. | అయినను నొకమాట సెప్పెద సమచిత్తుఁడవై విను’ మని యిట్లనియె. | 310 |
| క. |
తానైన నపుడు వక్రుం | డై నీతిపథంబు విడిచె నక్కట! పతి; మ మ్మైనను జక్కని తెరువునఁ | బూని నడవుఁ డనుచు నిపుడు బుద్ధులు సెప్పెన్. |
311 |
| క. |
ఎదిరిం దమయట్టుల కా | మదిఁ దలఁచినఁ బొసఁగుఁ గాక, మాకుం గుడు మిం డిదె మీరు వ్రక్కఁ గొనుఁడని | చదు రడిచిన మనసు పొందు చక్కం బడునే?’ |
312 |
| వ. | అని చూపి చెప్పి, వెండియు. | 313 |
| ఉ. |
‘సంపద దక్కి యుండఁగ నశక్తు లనం జను మమ్ముఁ బిల్చి పూ జింపఁగ నంత బేలె పతి? సెప్పెడు వారల బుద్ధి నాఁడ మ న్నింపఁడ; యింక నేల యగు? నీ వడియాసల వచ్చి రిత్త గా రింపక మాను; మాతని చరిత్రము నీకును మాకు వింతయే? |
314 |
| క. |
తగు మాట లాంబికేయుం | డగు నని కైకొనునె యెన్నఁడైనను? గొడుకున్ మగఁటిమి గలఁ డనియెడు న | మ్మిగఁ జూచుచు నుండు విషము మ్రింగిన యేనిన్. |
315 |
| క. |
జూదపుసిరి యాసపడం | గా దని విదురుండు సెప్పఁగా నప్పుడు క ర్ణాదుల పలుకులు విని పతి | యాదరణము సేయకున్న, నంతన తీరున్. |
316 |
| క. |
ధృతరాష్ట్రుం డిట మీఁదను | సుతులును, శకునియును, సూతసుతుఁడును దను నే గతి నడపించిరి వారల | మతమ యనుష్ఠించుఁగాక మరలం బడునే? |
317 |
| క. |
కార్యము తెఱఁ గిట్టిది; నీ | వార్య చరితమునకుఁ జొచ్చి యాడెదు; నీ కా దుర్యోధను నవినయ మని | వార్యం బని యెఱుఁగరామి; వలనో, వెడఁగో? |
318 |
| క. |
చక్రధరు లెక్క గొనఁడు; ప | రాక్రమనిధి యర్జునునకు రాధేయ భుజా విక్రమ మెదురుగఁ గొని, ని | ర్వక్రముఁ జేసికొనువాఁడు రాజ్యం బెల్లన్.’ |
319 |
| వ. | అని పలికి వెడవెడ యలుక వొడమిన, మఱియు నిట్లనియె. | 320 |
| శా. |
‘చాపాచార్యుఁడు, భీష్ముఁడుం, గృపుఁడు, నశ్వత్థామయుం, గర్ణుఁడున్, భూపశ్రేష్ఠుఁడుఁ దారు మున్నెఱుఁగరే పో? రెట్లుఁ గయ్యంబు లా శాపాశంబులు చుట్ట; లా వెఱిఁగియుం జావేఁడి మార్కొందు; రిం తేపో! తమ్ముఁ గపిధ్వజప్రభల యంధీభూతులం జేయవే? |
321 |
| క. |
మును మమ్ముఁ బొగడి, పదపడి | యని వారల గెలువ నరిది యని పొత్తుగఁ జె ప్పిన మాటకు నే నొడఁబడ; | విను సంజయ! పక్షపాత వృత్తి విడువుమీ! |
322 |
| స్రగ్ధర |
గాండీవ జ్యారవం బుత్కట మయి పెలుచం గ్రమ్మినన్, భీము బాహా దండం బేపారి శుంభద్గద జడియుచు రౌద్రంబుగాఁ దోఁచినన్, వే దండ ద్వంద్వంబు మాడ్కిం దఱిమి కవలు మాద్యద్గతిం దాఁకినం, జా కుండం బోకుండఁ గౌరవ్యులకు వశమె బిట్టుల్కి మూర్ఛిల్లకుండన్? |
323 |
| వ. | కావున. | 324 |
| చ. |
రణమున వారలన్ గెలువరా దను పల్కు లటుండనిమ్ము; స ద్గుణుఁడవు నీవు వచ్చితి; ప్రకోపశమంబుగఁ బల్కి; తింకసై రణ దగఁ జేయువారము; పరాభవ మొందియు మున్ను వారి దు ర్గుణములు సైఁచు టీవు నొకకొంత యెఱుంగుదు వింతయేటికిన్? |
325 |
| ఉ. |
ఇంకను నట్ల కాఁ దలఁపు; మే మొక కీడునకుం దొడంగ; మా శంకలు దక్కు; మయ్యకు విచారము గల్గెనయేని, బాంధవం బంకుర మొత్త, మా వలన నక్కటికం బొలయంగ, మమ్ము నే వంకకుఁ బోవనీక, గరువంబు జగంబు ప్రశంస సేయఁగన్. |
326 |
| క. |
రండని పిలువఁ బనిచి, పా | లిండని కొడుకులకుఁ జెప్పి, యింద్ర ప్రస్థం బొండెను, వేఱొక పట్టణ | మొండెను మా కిచ్చి యనుచు టుచితమ కాదే?’ |
327 |
| ఉ. |
నా విని సంజయుండు నరనాథున కిట్లను ‘నెట్టి తప్పులుం బోవఁగఁ ద్రోచి తాలిమియ పూనుదు గావున నిన్నిమాట లి ట్లీవు వినంగ నాడియును, నేఁ దనివోవక విన్నవించెదన్ నీ విభవం బహింసయు ననింద్యచరిత్రమ కాక యన్యమే? |
328 |
| క. |
పా లీక కౌరవులు దు | శ్శీలతఁ జెడఁ దలఁచిరేనిఁ, జెప్పెద, రుధిరా భీలాన్నంబునకంటెను | మేలగు భిక్షాన్నమైన మీ నడవడికిన్. |
329 |
| వ. | అది యెట్లంటేని. | 330 |
| సీ. |
రాజసూయ మహాధ్వరం బట్లు నడపి స | ద్ద్విజులకు సురలకుఁ దృప్తిఁ జేసి, శాంతియు దాంతియు సకలలోకంబులఁ | బొగడొంద బ్రదికిన పుణ్యమూర్తి విట్టి నీ చరితంబు హింసాకళంకిత | మగు టెంత యొప్పదు? నదియుఁగాక దుర్ణయవృత్తి దుర్ద్యూతంబు పుట్టించి | యంతలు సేసిన యట్టివారి |
|
| తే. |
నేల గర్వంబు సెల్లంగ నిచ్చి, జగము | చేతఁ దిట్టులు వడునట్లు సేసి పోయి తేల? యడవుల నిమ్మెయి నిడుమ గుడిచి | తేల? తాల్మియ ధనముగా నింత వడితి. |
331 |
| క. |
తుదిఁ బోయి క్రూర కర్మా | స్పదమగు తెఱఁగునకుఁ జొచ్చి, బంధుల గురులన్ వెదకి వధియించు సౌఖ్యం | బది యేటికి, నార్యనింద్య మస్థిర మరయన్. |
332 |
| తే. |
అల్పులకు మ్రింగఁ జేఁదైన హాలహలము | భంగిఁ బొంగెడు కోపంబు మ్రింగికొనఁగ నీలగళు నెన్ని నిన్నెన్నఁబోలు; నట్టి | నీవు సాలినఁ గా కేల నెగడుఁ బేరు?’ |
333 |
| చ. |
అనవుడుఁ బాండురాజతనయాగ్రణి సంజయుమోముఁ జూచి యి ట్లను; ‘నది యెల్ల నీ పలికినట్టిద; ధర్మువులట్ల యుండి బో ధను లరయంగ వచ్చిన నధర్మములై చెడుఁ గొన్ని; ధర్మ వ ర్తనములు గాక తోఁచి తుది ధర్మములై చనుఁ గొన్ని కర్మముల్. |
334 |
| వ. | కావున నన్ను దూఱఁదలంచితేని నా చేయునది ధర్మం బధర్మంబని నిరూపించి మఱి దూఱుము; కోపంబు నివారింపం దగు; నహింసయ యుత్తమధర్మం బగు; నట్లయినను వంశదూషకులును, లోకకంటకులును నగు పాపాత్ముల నిర్మూలంబుగాఁ జెఱుచుట ధర్మంబని పెద్దలచేత విందు; మది యట్లుండె; సంగ్రామంబు రాజులకు ధర్మం బవుంగాదని నీవచెప్పు; మట్లుంగాక యిది కర్తవ్యం బిది యకర్తవ్యం బని మనల శాసింప వాసుదేవుండు గలండు; మన కీ వితర్కం బేటికి? నితండు ధర్మాధర్మవిదులకు గురుండు, కార్యాకార్య నిరూపకులకు శిక్షకుం, డుచితానుచితజ్ఞులకుఁ బ్రదర్శకుం; డితని పంపునంగాదె యదు భోజాంధక వృష్ణి సృంజయ కేకయ ప్రభృతి భూపతి ప్రకరంబు ప్రశస్త పథంబునం బ్రవర్తిల్లుచున్నయది; విశేషించి మాకు నితని బుద్ధియ సమస్త పురుషార్థమ్ములకు మూలం బగుట నితని వచనం బవశ్యంబు నలంఘనీయం’ బనిన విని జనార్దనుండు సంజయున కిట్లనియె. | 335 |
| ఉ. |
‘పాండుతనూజకోటికి శుభం బెడఁ గోరుదు నెప్డు; నాంబికే యుండును బుత్త్ర పౌత్త్ర మహిమోజ్జ్వలుఁ; డక్కట చేటు మేలె యం చుండుదు; నట్లుగాక తెలివొంది యతం డిట వీరిఁ దేర్పఁగా నిండుమనంబుతోఁ బనిచె ని న్నని దీనికిఁ బ్రీతిఁ బొందితిన్. |
336 |
| ఆ. |
నీవు నుచితవృత్తి నెయ్యంబు, ధర్మంబు | వినయ మొప్పఁ దెలిపి, వీరు శాంతిఁ బొందునట్టి భంగి పొసఁగఁ బల్కుటయును | నాకు సమ్మదం బొనర్చె నిపుడు. |
337 |
| ఆ. |
అనఘ! యిట్టు లంతయును దలఁపం గడు | నెనసినట్టు లుండెనేని వింటె? పాండవాగ్రజన్ము పలుకుల చందంబు | సూడ సంధి లేని చొప్పు దోఁచె. |
338 |
| క. |
అది యట్టిద; సంధానము | దుది నెమ్మెయిఁ గల్గు? నెట్లు దుర్యోధనుఁ డు న్మదుఁడు; ధృతరాష్ట్రభూవిభు | హృదయంబు తెఱంగు గొంత యెఱుఁగుదుము కదా! |
339 |
| క. |
ఆ రాజు సేయు నెయ్యము | గారామును జెప్పె దీవు గడుఁ దీపులుగా వీరు దమ పాలు వడయక | నేరిమి మాటలన తీర నేర్తురె చెపుమా! |
340 |
| ఉ. |
వీరలు పెద్ద ద్రవ్వ, కొకవెంట నొడంబడి, తేఱి శాంతులై కౌరవకోటిఁ గూడి మనఁగా మదిఁ గోరుట పెంపుఁ దాల్మియుం, గారుణికత్వముం దగవుఁ గాదె? జగంబున పాడిఁ దండ్రిపా లీరని తెంపు సేసి పయినెత్తిన నెత్తిరిగాక ద్రోహమే? |
341 |
| క. |
విను మవమానము పడి యి | ట్లునికిఁ బడయు పొగడు కంటె, నుజ్జ్వలులై మా ర్కొనిన నది లెస్స; యెట్లయి | నను వీరికిఁ బోటు మేలు నాకుం జూడన్. |
342 |
| వ. | ‘సంగ్రామంబు రాజులకు ధర్మం బవుంగాదని నీవ చెప్పు’మని యుధిష్ఠిరుండు నిన్నడిగెఁగదా! ద్విజాతులకు యజన యాజనాది కర్మ కరణ విభాగంబు ధర్మశాస్త్రాచార్యులు విధించునప్పుడు రాజు లిచ్చువారు గాని, వేఁడుకొనువారు గారని చెప్పుట సకలలోక ప్రసిద్ధంబు; సర్వ వర్ణాశ్రమ ధర్మ పరిపాలనంబు సేయునట్టి రాజులు దార నిజధర్మంబు వదలుదురా? యదియునుంగాక; పాడితోడి యార్జనంబునం దమకుఁ గల కలిమి యనుభవించుచు సత్పథంబున నడచుచుండఁ, ద మ్మొరు లన్యాయంబు సేసినయప్పటికిం గదా యీ శస్త్రాస్త్రధర్మంబు లింద్రాదులగు పెద్దలు గావించిరి; నీ చెప్పెడి ధర్మంబులు కౌరవులకుం జెప్పవలవదా? వారలు గదా మీఁ దెఱుంగక కొఱఁతనుఱుకులై చెడు తెరువునం బోయెడువా’ రని పలికి మఱియు నిట్లనియె. | 343 |
| క. |
‘నెట్టన సభలో వేవుర | కట్టెదుర నరాతితనము గా కెంతయు వా రెట్టితులువలో! ద్రౌపది | నట్టులు పఱిచెడిదె! జూదమాడరె యెందున్?’ |
344 |
| వ. | అనవుడు సంజయుండు ‘దేవా! నీ చిత్తంబున నిడి దీని నింత కొనయాడినఁ గర్జం బొడఁగూడునే?’ యనిన వాసుదేవుం డిట్లనియె. | 345 |
| ఉ. |
‘అత్తఱి భీష్మముఖ్యులగు నచ్చటి వృద్ధజనంబు లెల్ల నో రెత్తక యూరకుండిరి మహీశ్వరుచిత్త మెఱుంగకున్కిఁ; దా నొత్తి కుమారులం గినియనోపఁడ; యక్కట! మాన్పఁ గన్న; నా చిత్తమ కాదు; లోకముల చిత్తము లెల్లను సంతసింపవే? |
346 |
| ఉ. |
తిట్టులఁబోయి యక్కొలువు తేఁకువ వారలలోని కింతిఁ దా నట్టులు దుస్ససేనుఁ డదయాకృతి ముందల వట్టి యీడ్వఁగా నెట్టు సహించె మామ? సతి యేడ్పు టెలుంగున కెట్టు లోర్చె? నీ పట్టున సేమ మారయఁగఁ బంచుట కెట్టులు నేర్చెఁ గ్రమ్మఱన్? |
347 |
| చ. |
ఇది తగదంచు నడ్డపడునింతకు నేరక సభ్యులందఱున్ మది మఱగొన్న యట్టి యెడ మానినికిం దనుఁ దాన కాచికో లొదవిన దానఁ జేసి సభ నొచ్చెము దక్కినఁ బాండునందనుల్ బ్రదికిరి గాక; యయ్యెడరు రాచకొమారుల కోర్చునట్టిదే? |
348 |
| వ. | సంజయా! వినవే యప్పుడు సభాసధులకుఁ గర్ణశూలంబు లగునట్లుగాఁ గర్ణుండు. | 349 |
| క. |
‘లే రిచట మగలు నీకును; | వీరలు జూదమున నోడి విడిచిరి నిన్నున్; వారిజలోచన! నీపైఁ | గూరిమి గల మగని వెదకికొను మొరు’ ననఁడే? |
350 |
| క. |
నరునకు నదివాఙ్మయ మగు | శరమై హృదయంబు నాటి చలియింపక దు ర్భర వేదనఁ జేయంగాఁ | జిరకాలము, దచ్చికిత్స చేసెనె చెపుమా? |
351 |
| వ. | మఱియు దుశ్శాసనుండు ‘వీర లందఱును గొడ్డువోయిన వారలు; పౌరుషంబు గల మానిసి యిం దెవ్వం?’ డనియె; నతని చెప్పినట్ల పెద్దగాలంబేని వీరల గొడ్డువోయిరి గాక, వీరిదెస వారికి నేమిఫలించె? వెండియుఁ దత్సమయంబునఁ బుట్టిన మాట లుగ్గడించునట్టివిగా; వీ సంధికార్యం బత్యంత దుర్ఘటంబని తలంచెద; నయినను. | 352 |
| సీ. |
పాండవేయులఁ దగం బ్రార్థించి, యందుల | కక్కట! యేనైన నరుగుదెంచి, కౌరవులకు బుద్ధిగాఁ జెప్పి రాజ్యంబు | పాలుసేసిన, మృత్యుపాశములకుఁ దప్పరే వారలు? దగవును నేర్పును | నా మీఁద నిలుచుట నాకుఁ గీడె? నన్ను మన్నింతు; రన్యాయంబు సొరని నా | మాటకుఁ దా రొడఁబాటు లేక |
|
| తే. |
యుండుదురె? కేరడము లాడుచుండిరేనిఁ | గవియు పాండవ బాణాగ్ని గాదు సువ్వె, తమ్ముఁ దమ లోభ మను చిచ్చు దరికొనంగఁ | దెగినవారయి పోదు; రింతియ తలంప. |
353 |
| వ. | అని పలికి వెండియు నిట్లనియె. | 354 |
| ఆ. |
‘రోషమయ మహాతరువు సుయోధనుఁ డురు | స్కంధ మందులోనఁ గర్ణుఁ, డలరుఁ గొమ్మ సౌబలుండు, గుసుమ ఫలములు దు | శ్శాసనుండు, మూలశక్తి తండ్రి. |
355 |
| ఆ. |
ధర్మజుండు ధర్మతరు, వర్జునుఁడు ఘన | స్కంధ, మనిలసుతుఁడు శాఖ, కవలు పుష్పఫలము; లేను, భూసురులును, వేద | ములుఁ దదీయమైన మూల చయము. |
356 |
| క. |
ఈ రెంటియందు నరసి య | సారం బిది, గాఢసార సహితం బిది నా నేరవలయు; నదియును గా | కేరూపం బయ్యెనేని నీ సేమిటికిన్? |
357 |
| మ. |
ధృతరాష్ట్రుండును బుత్త్రులున్ వనము; కుంతీనందనుల్ సింహముల్; మతి నూహింప నసింహమైన వనమున్ మర్దింతు; రెందున్ వనా వృత వృత్తంబులు గాని సింహములకున్ వేగంబ చేటొందుఁ; గా న తగం బొందుట కార్య మీ యుభయమున్ సంతుష్టిమై నున్కికిన్. |
358 |
| క. |
పరిచారకులై యుండుదు, | రరివర్గ వ్యతికరమున కగుదురు; వీరిన్ సరిఁ దన కొడుకుల మెలపిన | తెరువున మెలఁగింపవలదె ధృతరాష్ట్రునకున్. |
359 |
| క. |
ఏ నీ పనికై వచ్చెదఁ; | దా నొప్పఁ దలంచె నొండెఁ దప్పం దలఁచెన్; దానన నెగడెద మే; మ | మ్మానవ నాథునకుఁ జెప్పు మా మతమెల్లన్. |
360 |
| వ. | అనిన విని సంజయుండు ధర్మతనయుం గనుంగొని ‘యట్లయినను గడు లెస్సగదా! దేవా! నా వచ్చిన కార్యంబు సఫలం బయ్యెఁ; బనివినియెద’ నని, వాసుదేవునకు నట్ల విన్నవించి, భీమార్జున నకుల సహదేవ సాత్యకి ద్రుపద విరాటుల నీక్షించి, ‘మీ యందఱచేత ననుజ్ఞాతుండన కదా? పోయి వచ్చెద. నా యాడిన మాటలయం దేమియుఁ దగని యట్టివి లేవు గదా?’ యనుటయుఁ బాండవాగ్రజుం డతని కిట్లనియె. | 361 |
| ఆ. |
‘పోయి వత్తుగాక, యీ యున్న యందఱు | వినఁగ నాడి తీవు విశదభంగి; నొక్కమాట యైన నుచితంబు గానిది | గలదె? యి ట్లనంగ వలయు నెట్లు? |
362 |
| క. |
ఎదురున్న రూపు వలుకఁగఁ | దుదిఁ కటకటఁ బడవు నీవు; దుర్ణయమును బె ట్టిదమును బెండును నగు పలు | కొదవదు నీనాలుకకు నయోన్నత! యెపుడున్. |
363 |
| క. |
నీ వొండె, విదురుఁ డొండెను | గా వలయుంగాక యిట్టి కార్యంబులకున్ రా వేఱ కలరె తగువా | రీ వినయము నేర్పు గలదె యితరుల కెందున్? |
364 |
| చ. |
అరిగినయప్డు పెద్ద లగు నందలి విప్రుల నెల్లఁ గాంచి, యా దరమున వారి సేమ ముచితంబుగ నారసి, వెండి కాన్పుమీ గురునిఁ బితామహుం గృపునిఁ; గూర్తురు వారలు నాకు; నా నమ స్కరణము గాఁగ వారి కధికప్రియభక్తి నమస్కరింపుమీ! |
365 |
| సీ. |
మా తండ్రిఁ గని యేను బ్రీతి మ్రొక్కుట గాఁగ | దండప్రణామంబు దగ నొనర్పు; దుర్వృత్తిఁ బొరయు నా దుర్యోధనుని సేమ | మడిగితి నని చెప్పు; మతని తమ్ముఁ డగుటకుఁ దగియెడు నా దుస్ససేనుని | కుశల మారయుము; దక్కును గుమార వర్గంబు నెల్లను, వనితాజనంబుల | నుచితంపుమై సుఖ మున్కి యడుగు; |
|
| ఆ. |
విదురు, శల్యుఁ గాంచి వినయంబు దోఁపంగ | నాడు; ద్రోణతనయు నక్కు సేర్చి కొంటి ననుము; బాహ్లికుని సోమదత్తు, భూ | రిశ్రవసునిఁ దలఁచి ప్రియము నెఱపు. |
366 |
| వ. | మఱియు వంశవంతులు, వయోవృద్ధులు నగు భూపతులను, గృతవర్మను, గర్ణ శకుని సైంధవ ప్రభృతులను; దక్కటిరాజలోకంబును; గయ్యంబునకుఁ దోడు వచ్చిన సకల దేశాధీశులనుం గని, యెవ్వరితోడ నెవ్విధంబునం బలుకందగు ప్రణామ వినయ బాంధవ మైత్రీ వాత్సల్యంబులకు నయ్యై ప్రకారంబుల మద్వచనంబులుగాఁ బలికి; యుచితంబుమెయి నుపచరింపుము. | 367 |
| క. |
దాసీ దాస జనముల కు | దాసీనము గాక యుండఁ, దడయక యే మి త్త్రాసంగ మొంది, శత్రు ని | రాసం బొనరించి; తమ్ము నరసెద ననుమీ. |
368 |
| క. |
పోయిన మొగమున నచ్చటఁ | జేయు తెఱంగెల్ల నీకుఁ చెప్పితిఁ; బిదపన్ మా యయ్య పెద్ద కొలువున | వా యోడక యిట్టనంగ వలయుం జుమ్మీ! |
369 |
| చ. |
అనఘ! భవద్బలంబునన యాపద యించుక లేక పాండునం దనులు నిజాప్తబంధుసహితంబు సుఖస్థితి నున్నవారు; త జ్జనకుని రాజ్యపీఠమున సమ్మద మొందఁగ నిల్పి శైశవం బునన ప్రభుత్వ మిచ్చి తగఁ బ్రోచితి వారల విశ్రుతంబుగన్. |
370 |
| ఉ. |
ఇప్పు డుపేక్ష సేసి, కృప యేమియు లేక, విహీనవృత్తి వా రొప్పమిఁ బొందఁ జూచు టిది యొప్పునె? యింతట సంతసింప రా దిప్పుడు; నంతకంత నట యెక్కుడు గోరినఁ జాలకుండదే? యొప్పదె కూడి మన్కి మన కొప్పనివారల యుక్కు దక్కఁగన్?’ |
371 |
| వ. | అని తదవసరంబునం బితామహుతో నిట్లనుము. | 372 |
| చ. |
‘అడఁగఁగనీక శంతనుని యన్వయముం గలిగించి; తీవ యి ప్పుడుఁ దగ నీ మతంబునన పొందొడఁగూడఁగఁ జేర్చి పౌత్త్రులన్ సడికి నధర్మవృత్తికిని జావునకుం దొలఁగించి మన్చినం బుడమిజనంబు రాజులును భూసురులున్ నినుఁ బ్రస్తుతింపరే?’ |
373 |
| వ. | అని పలికి వెండియు. | 374 |
| క. |
ఇంతలు వుట్టిన చోటను | శంతనునందన! యహీన శాంతిపరుండై కౌంతేయాగ్రజుఁ డాలము | పొంతం బో నొల్లఁ’ డనుము బుధు లియ్యకొనన్. |
375 |
| సీ. |
ఆ సమయంబున నచ్చటి వారెల్ల | వినునట్లుగా సుయోధనుని తోడ ‘బాహుబలాఢ్యుల బలవిహీనుల క్రియ | వెడలంగ నడిచిన వెఱ్ఱితనము, నత్యంత చిరకాల మడవులఁ గొండల | బాధలఁ బెట్టిన పరుసఁదనము, సభలోన నట్లు పాంచాల రాజాత్మజఁ | దలవట్టి యీడ్చిన తులువతనము |
|
| తే. |
ధర్మపుత్త్రుండు సైరించెఁ దథ్య; మీవు | కురుకుమారుల నని మ్రింగికొనకు; మొరుల సొమ్మునకు నాసపడఁ దగ; దిమ్ము వారి | పాలు; వారలతోఁ గూడి బ్రదుకు’ మనుము. |
376 |
| వ. | ఏము కలహం బొల్లక పొందుగోరుట తనకు మేలు; తన మనంబున దరికొను తృష్ణానలం బార్ప నొరు లడ్డంబు సొరమింజేసి, యేన బుద్ధి సెప్పవలసెఁ; దనయొద్దం గల యోధవీరులె య్యెడల లేమి దెల్లంబయినను, మాకుఁ జేదోడు ధర్మంబు గల; దదియునుంగాక యఖిలలోక సేవితుండైన కృష్ణుండు పెనుఁబ్రాపు గావునఁ దమకు మమ్ము గెలువం గొలఁదిగా; దదియట్లుండె; నేను భీమసేనాదులకుం దమకుం బెద్దవాఁడ నగుట వీరును వారును మదీయ ప్రార్థనా భంగంబు సేయక, నాదగు శాంతియు దాంతియుఁ జెల్లించి; న న్నలజడిఁ బెట్టక, పోరితం బుడిగి తమతమ ధనంబులు గుడిచి సుఖంబుండుట మన పెద్దలకుం దక్కటి బుద్ధిమంతులకును సంతోషంబగుఁ; బెద్దయీ నోపఁడయ్యెనేనిఁ గుశస్థలంబును; వృకస్థలంబును; వాసంతియు; వారణావతంబును జాలుఁ; గాదేని మఱియు నెందేనియు నొక్కటి యగునట్లుగాఁ దన తోడఁబుట్టువు లేవురకు నిలువఠావు లయి దిచ్చిన సర్వశాంతి యగు; నట్లయిన నిందలి యందలి బంధు మిత్త్ర సహాయజనంబులు గలసి నవ్వుచుం దెగడుచు నునికి మన మనంబులకుఁ బ్రియంబుసేయుఁ; గురు పాంచాల యాదవ మాత్స్యులు పరస్పర ప్రీతి సంపాదకత్వ సంపన్నులై బ్రదుకుట నాకుం గోర్కి; యింతయు నమ్మహాపురుషునకుం దెలియం జెప్పు’ మనిన విని ‘దేవా! నీ యానతిచ్చిన మార్గంబంతయు నడపెద; మీ తండ్రి నీకును దమ్ములకును వాసుదేవునకు నెట్లు ప్రియం బట్లు సేయువాఁడ కాక’ యనుచుం బ్రణామంబు సేసిన, సంజయునకు ధనంజయుం డిట్లనియె. | 377 |
| క. |
‘బాల సఖుండవు; నాకును | నీ లెస్సఁదనంబు; నేము నీతి విడిచి దు శ్శీలుర మగుటయు; శైశవ | లీల మొదలు గాఁగ మును దెలియదే నీకున్? |
378 |
| మ. |
బలమత్తాకృతి యైన భీముఁ డను శుంభత్కుంభి సంరంభమున్ నిలిపెన్ నాఁడును నంకుశంబయి; తుదిన్ నేఁడుం దదుద్రేకమున్ మలుఁగం జేయ నజాతశత్రుని కృపామౌగ్ధ్యంబ చాలంగ; వా రల కేలా నయవిక్రమోచిత విచారక్లేశముల్ సంజయా!’ |
379 |
| వ. | అని పలికి ధర్మతనయానుమతంబున సంజయునకు సపరివారంబుగా సముచిత ప్రకారంబున మజ్జన భోజనంబు లొనరించి, మాల్యానులేపనాద్యుపచారంబులు సేయించి, మణిభూషణ చిత్రాంబరంబు లొసంగి వీడుకొల్పిన, నతండును బాండవులను వాసుదేవుని వీడ్కొని చనియె’ నని చెప్పిన. | 380 |
| క. |
విని, యత్యంత కుతూహల | మునఁ బొదలుచు, ‘సంజయుండు మున్నెచ్చటికిం జనియెను? నెవ్వరితో నే | మనియెను వినవలయు; మునిజనాధిప! చెపుమా.’ |
381 |
| వ. | అని యడిగిన. | 382 |