పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము
ధృతరాష్ట్రునకు విదురుఁడు హిత ముపదేశించుట (సం. 5-33-16)
క. ‘జనులకు నొడఁ బా టగువిధ | మున నడచుచు, లోకనింద్యముల నుడుగుచు, మీఁ
దని యొకని కలిమి కులుకక | మనుజులతోఁ బొంది పొసఁగి మను టొప్పు నృపా!
31
క. కోపము, నుబ్బును, గర్వము | నాపోవక యునికియును, దురభిమానము, ని
ర్వ్యాపారత్వము నను నివి | కాపురుషగుణంబు లండ్రు కౌరవనాథా!
32
క. ఏలిన వానిని, దైవము, | నాలిని, బంధులను సముచితారాధన సం
శీలతఁ బ్రీతులఁ జేయని | పాలసుఁడా ఫలము లాసపడు, మనుజేంద్రా!
33
క. నెమ్మి గలవారి నొల్లరు | త మ్మొల్లనివారి వెనుకఁ దగులుదు; రధిక
త్వ మ్మెఱిఁగి యెఱిఁగి తొడరుదు | రి మ్మెఱుఁగని యట్టివార లిభపురనాథా!
34
క. ధనమును, విద్యయు, వంశం | బును దుర్మతులకు మదంబుఁ బొనరించును; స
జ్ఞను లైనవారి కడఁకువ | యును, వినయము నివియతెచ్చు నుర్వీనాథా!
35
క. అరిది విలుకాని యుజ్జ్వల | శర మొక్కని నొంచుఁ; దప్పి చనినం జను; నే
ర్పరి యైనవాని నీతి | స్ఫురణము పగరాజు, నతని భూమిం జెఱుచున్‌.
36
తే. ఒకటిఁ గొని, రెంటి నిశ్చలయుక్తిఁ జేర్చి, | మూఁటి నాల్గింటఁ గడు వశ్యములుగఁ జేసి,
యేనిటిని గెల్చి, యాఱింటి నెఱిఁగి, యేడు | విడిచి వర్తించువాఁడు వివేకధనుఁడు.
37
క. విను, మధురాహారంబులు | గొనుటయుఁ, బెక్కండ్రు నిద్ర గూరినయెడ మే
ల్కని యునికియుఁ, గార్యాలో | చనముఁ, దెరువు నడచుటయును జన దొక్కనికిన్‌.
38
క. నడవడి యను మున్నీటిం | గడవం బెట్టంగ నోడకరణిం దగి తా
నొడఁగూడు ననిన, సత్యము | గడచినగుణ మింక నొండు గలదే యరయన్‌?
39
క. క్షమియించు వారిఁ గని చా | లమి వెట్టుదు; రైననుం దలంప, ననూన
క్షమయ కడు మెఱయు తొడ; వు | త్తమ రూపము గోరువారు దాల్తురు దానిన్‌.
40
క. పురుషుండు రెండు దెఱఁగుల | ధర నుత్తముఁ డనఁగఁ బరఁగుఁ; దా నెయ్యెడలం
బరుసములు వలుక కునికిన్‌; | దురితంబులు వొరయు పనులు దొఱఁగుట కతనన్‌.
41
తే. చెల్లియుండియు సైరణ సేయునతఁడుఁ, | బేదవడియును నర్థికిఁ బ్రియముతోడఁ
దనకుఁ గల భంగి నిచ్చు నతండుఁ, బుణ్య | పురుషు లని చెప్పి రార్యులు కురువరేణ్య!
42
ఆ. పాడి దప్పకుండఁ బడయు సొమ్ములకు న | పాత్రములకు నీగి, పాత్రములకుఁ
బెట్ట కునికి యనఁగ నెట్టన రెండు వి | ధములఁ గీడు దొడరు ధరణినాథ!
43
తే. వెలఁది, జూదంబు, పానంబు, వేఁట, పలుకు | ప్రల్లదంబును, దండంబుఁ బరుసఁదనము
సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ము సేఁత | యనెడు సప్తవ్యసనములఁ జనదు తగుల.
44
తే. తగిన వేషంబు, దనుఁ దాన పొగడుకొనమి | నొచ్చియును గీడు వలుకమి, యిచ్చి వగవ
కునికి, దన కెంత నడవకయున్నఁ బథము | దప్పకుండుట నడవడి కొప్పు సేయు.
45
క. చెలిమియు, సంభాషణమును | బలిమి, వివాదంబుఁ, ద్రోపుఁ బాడియుఁ దమయం
తలవారితోన తగు; నథి | కుల, హీనుల తోడనైనఁ గొఱ గా దధిపా!
46
తే. కొంచె మైనను దగఁ బంచి కుడువ మేలు; | పనులయెడ దుఃఖ మోర్చి యల్పంబు సుఖము
ననుభవించుట హితము; శత్రునకు నైన | నిచ్చుటయ లెస్స యడిగినయెడ నృపాల!
47
క. తను లోకము గొనియాడఁగ | విని యుబ్బఁడు సజ్జనుండు; వెండియుఁ గడు మే
లొనరించుఁ; గీ డొకించుక | యును దసదెసఁ దోఁపనీక యుడుపుచు వచ్చున్‌.
48
వ. ఇట్టి చందంబులు ధర్మనందనునకుం గల’ వని పలికి, విదురుం డది ప్రసంగంబుగాఁ బాండవులఁ బ్రశంసించి, ‘నీవు వారలం బెనిచి మానుసులం జేసి రక్షించి, యిప్పు డుపేక్షించి, వారలు వెలినుండ నూరకుండం దగునే? తగుపాలిచ్చి, వారి రావించి, నీ కొడుకుల తోడివారింగా నడపుట యుచితంబు, మీరును వారును నొక్కటియై యున్న మీదిక్కు దేవతలకుం దేఱి చూడరా’ దనిన, నమ్మాటలు వెడవెడ యూఁకొని ధృతరాష్ట్రుండు విదురున కిట్లనియె. 49
తే. ‘హితముఁ గర్తవ్యమును నాకు నెఱుఁగు దీవ; | ధర్మసుతు చందమును విదితంబు నీకు;
నట్లు గావున నెఱిఁగింపు మఖిలకార్య | జాతమును జిత్తతాపోపశమము గాఁగ.’
50
క. అనుడు విదురుఁ డాతని కి | ట్లను; ‘నిమ్మెయి నన్ను నొత్తి యడిగినఁ జెప్పం
జను నున్న రూపు; సెప్పెద | విను మవధానంబు తోడ విమలవిచారా!
51
ఉ. డక్కెను రాజ్యమంచు నకటా! యిటు దమ్ముని భాగ మీక నీ
వెక్కటి మ్రింగఁ జూచె; దది యె ట్లఱుగున్‌? విను, మీను లోలతన్‌
గ్రక్కున నామిషంబు చవి గాలము మ్రింగిన చాడ్పు సూవె యి;
ట్లుక్కివుఁడైన నీ కొడుకు నుల్లము నున్నటు లాడఁగూడునే?’
52
క. అన విని నిరుత్తరుం డయి | మనుజేంద్రుఁడు గొంతసేపు మ్రాన్పడి తలఁపుల్‌
పెనఁగొన, నిద్రాహానిం | దను వలయఁగ విదురుతోడఁ దా నిట్లనియెన్‌:
53
క. ‘ఇందాఁక నీదు పలుకుల | డెందము తాపంబు గొంత డిందుపడియె; నా
కుం దగ నయానయంబుల | చందంబులు సెప్పుచుండు సౌజన్యనిధీ!’
54
వ. అనిన విని విదురుం డిట్లనియె: 55
ఆ. ‘తనియఁ బండకుండ మును గోసికొనఁ జవి | చేటె కాదు; విత్తు చేటుఁ గలుగుఁ;
బక్వమైనఁ గొనిన ఫల మించుఁ, జెడదు బీ | జంబుఁ; గార్యసిద్ధిచంద మిట్లు.
56
తే. మాలకరి పుష్పములు గోయుమాడ్కిఁ, దేఁటి | పువ్వుఁ దేనియ గొనియెడు పోల్కి నెదురు
గందకుండఁగఁ గొనునది కార్యఫలము; | బొగ్గులకుఁ బోలె మొదలంటఁ బొడువఁ జనదు.
57
క. పరుల ధనమునకు, విద్యా | పరిణతికిం, దేజమునకు, బలమునకు మనం
బెరియఁగ నసహ్యపడు న | న్నరుఁడు దెవులు లేని వేదనం బడు నధిపా!
58
క. ఎదిరికి హితమును, బ్రియమును, | మది కింపును గాఁగఁ బలుకు మాటలు పెక్కై
యొదవినను లెస్స; యటు గా | కిది యది యన కూరకునికి యెంతయు నొప్పున్‌.
59
క. చెలిమియుఁ బగయును, దెలివియుఁ, | గలఁకయు, ధర్మంబుఁ, బాపగతియును, బెంపుం,
దులువతనంబును వచ్చును | బలుకుబడిన; కానఁ బొసఁగఁ బలుకఁగ వలయున్‌.
60
క. బెడిదముగఁ గత్తి గొడ్డటఁ | బొడువఁ దెగినమ్రానఁ జిగురు వొడముఁ; బలుకులం
జెడఁ దునిసిన కార్యంబు ని | గుడనేరదు పిదపనెట్టుఁ గురువంశనిధీ!
61
క. తనువున విఱిగిన యలుఁగుల | ననువునఁ బుచ్చంగవచ్చు; నతి నిష్ఠురతన్‌
మనమున నాటిన మాటలు | విను మెన్ని యుపాయములను వెడలునె యధిపా!
62
ఉ. అక్కట! ధర్మనందనుని యాస్యమునం దొకనాఁడుఁ గీడుప
ల్కొక్కఁడు లేదు; నీ కొడుకు లొండొరు మీఱి నికృష్టవాక్యముల్‌
పెక్కులు పెక్కుభంగులను బ్రేలుచు నుండఁగ నీవు దానికిన్‌
స్రుక్కక వించు నుండె; దనురూపమె నీ కిది కౌరవేశ్వరా?
63
ఆ. చేటుకాలమైనఁ జెట్టమాటలు నెఱి | గాని తెరువు వట్టు కర్జములును
దగవు లట్లు తోఁచుఁ; దగియెడునవి యవి | నీతు లని మనంబు నిశ్చయించు.
64
వ. నీ బుద్ధి పాండవులతోడి విరోధంబునెడ మరలంబడమి పాపం బింతియకాక యేమి సేయుదము? మన కులంబునం దేజో ధైర్య ధార్మికత్వాది గుణంబుల గరిష్ఠుండయిన యుధిష్ఠిరుండు నీ సిరికి వెలియై యట్లుండుట దగ వగునే? నీ పెద్దతనంబు సూచి సైరణ వాటించి యున్నవాఁ’డనిన, విదురు దిక్కు మొగంబై ధృతరాష్ట్రుండు ‘నీ చెప్పిన నీతివాక్యంబుల నా మనంబు దనివోవ దింకను జెప్పు’ మనవుడు నతండు వెండియు నిట్లనియె. 65
ఆ. ‘సకల పుణ్యకర్మ చయమును నొకదెస, | వినుము పాడి దప్పకునికి యొక్క
దిక్కు; దీని శ్రుతులు తెలిపెడునెడఁ, బాడి | కలిమి యెందుఁ బెద్దగా నుతించె.
66
తే. పాడి గలిగిన నిహలోకఫలములెల్లఁ | జేరుటయ కాదు, కీర్తియుఁ జెందుఁ బురుషు;
ధరణిఁ బొగడిత యెందాఁకఁ బరఁగు, నంత | కాలమును బుణ్యలోకంబు గల్గు నండ్రు.
67
వ. తొల్లి ప్రహ్లాదుండు దైత్యజాతి సంభవుం డయ్యును, దనకొడుకు విరోచనుండును, నంగిరసుండను విప్రు కొడుకు సుధన్వుండును దమతమ ప్రాణంబు లొడ్డుగా నొడ్డి యొక్క ధర్మ సందేహంబునకుఁ బన్నిదంబు సఱచి వచ్చి త న్నడిగిన, నితండు గొడు, కితండు లాఁతి యని తలంపక మధ్యస్థుండై సుధన్వు గెలిపించి, యతని చేత నిజతనయుని జీవితంబు దానంబుగాఁ గొని వాని బ్రదికించెం గావున, నీవును ధర్మంబు విడువక, యధర్మోపేతులైన నీకొడుకులవలని పక్షపాతంబు విడిచి తెఱంగు సేయుము; వారును వీరును నాపదలేక బ్రదుకుదురు; నీవును శోకంబులేక తక్కుదు’వని చెప్పి మఱియును- 68
క. ‘పాపంబులు గర్జము లని | యేపునఁ జేయంగ నవియు నింపగు; ధర్మ
వ్యాపారంబు లకార్యము | లై పరిణతిఁ బొందెనేని నట్టుల చెల్లున్‌.
69
చ. అది సభయే ప్రియం బెసఁగ నార్యులు నిల్వరయేని? నార్యులే
మదిఁ దలఁపంగ వారలు సమంచిత ధర్మము వల్కరేని? న
ట్టిదియును ధర్మువే తగ ఘటించిన నిక్కము లేద యేనిఁ? దాఁ
బదిలపునిక్కమే యొక నెపంబిడు చొప్పగునేని భూవరా!
70
ఉ. నీతి పథంబునన్‌ బ్రదుక నేర్చుట యుత్తమ భంగి; శౌర్య సం
జాతములై కరం బలరు సంపద లొందుట మధ్యవృత్తి; య
స్ఫీతములైన భారవహజీవనముల్‌ దలఁపం గనిష్ఠముల్‌;
నీతికి బాహ్యులైన, ధరణీవర! మెత్తురె వారి నుత్తముల్‌?
71
ఆ. కయ్యమునక యెపుడుఁ గాలు ద్రవ్వుదురు నీ | పుత్త్రు లెల్ల; సూతపుత్త్రుఁ డాది
యగు తదీయ మంత్రు లంతకు ముందర | బిరుదు; లీవు నీతి తెరువు సొరవు.
72
క. పాండవులు శౌర్య మొల్ల; ర | ఖండిత నీతి ప్రకార కార్యము మెచ్చై
యుండుదు; రెదు రేచినఁ దుది | మండుదు; రార్పంగ రాదు మఱి యెవ్వరికిన్‌.
73
క. తమ తండ్రి భంగి నీకును | సముచిత మగు భక్తి సేసి సజ్జననుత మా
ర్గమున నడచువారల నీ | వమలమతిం గన్నకొడుకు ల ట్లరయఁదగున్‌.’
74
వ. అని పలికి మఱియు నిట్లనియె: 75
క. ‘కారణము లేకయును నుప | కార పరత్వమున నొరుల కార్యంబులకున్‌
వారని యలజడిఁ బడియెడు | వారల చూ యేడుగడయు వారికి నధిపా!
76
చ. ఒకరుని చేతిప్రోపును దదున్నతి ప్రాపును గాంచి, యెల్లవెం
టకును గొఱంతలేక పొగడందగు సంపద నొంది, యట్టి దా
తకుఁ దుదిఁ గీడు సేసిన కృతఘ్నుని పీనుఁగునైన రోఁత వు
ట్టక కబళింపఁ గుక్కలు నొడంబడునే కురువంశవర్ధనా!
77
వ. కావునఁ గృతము దలంపమి గీడు; పాండురాజు నీకుం బరమ భక్తుండు; పాండవులునుం దేజో లాభంబులు గావించినవారలు; వారల నాదరింపు’ మని చెప్పి వెండియు నిట్లనియె: 78
ఆ. ‘బ్రదుకు, చేటు, పొగడువడుట, దూ ఱొందుట, | యీఁగి, వేఁడుకొనుట, యిట్లు మఱియుఁ
గలుగు సౌఖ్య దుఃఖములు వచ్చు నడవడి; | వాని కింత యేల వగవ నధిప!
79
క. వగ బలము దఱుఁగు, రూపఱు; | వగచిన మతి దప్పుఁ, దెవులు వచ్చును; దూరన్‌
వగచి నలంగినఁ బ్రియ మగుఁ | బగతురకును; వగచు టుడుగు; పార్థివముఖ్యా!’
80
వ. అనిన విని ధృతరాష్ట్రుండిట్లనియె : 81
క. ‘రిత్త యుపచారముల నే | నుత్తముఁ డగు ధర్మతనయు నుడికించితి; దు
ర్వృత్తులగు మత్సుతులకును | మిత్తి యగుం బోర; వగలు మిగులక యున్నే?
82
వ. నెవ్వగలు నివ్వటిల్లనీక నిలుపునట్టిది యెయ్యది? దాని నెఱింగింపు’ మనిన విదురుం డిట్లనియె. 83
తే. ‘నియత తపమును, నింద్రియ నిగ్రహంబు, | భూరి విద్యయు శాంతికిఁ గారణములు;
వాని యన్నిటికంటె మేలైన శాంతి | కారణము లోభ ముడుగుట కౌరవేంద్ర!’
84
వ. అని వెండియు. 85
క. ‘జ్ఞాతుల పోరితమును; గో | వ్రాతము నాక్రమము, విప్ర వర్గము చనవున్‌,
నాతులఁ గారించుటయును | బ్రీతిం జన నిచ్చునతని పెం పొప్పు నృపా!
86
క. అలమికొని యొండొరుల ప్రో | పులఁ బ్రాపుల నెలమికలిమిఁ బొంది బహు జ్ఞా
తులు నెమ్మిఁ గూడి తామర | కొలని క్రియన్‌ సిరికిఁ బట్టగుదు రుజ్జ్వలులై.
87
చ. కరి తురగాది ఘట్టనయు గాలియు నొంపదె యొంటి నున్న య
త్తరువు? ననేక భూరుహవితానము గుంపయిపేర్చి బాధలం
బొరయునె? యన్నదమ్ములును బొందిన నేరి కసాధ్యు; లట్లు గా
కెరవయి నిల్చినం గెలని కెల్లిదమై పఱివోదు రెంతయున్‌.
88
వ. కావునఁ గౌరవులుం బాండవులు నొండొరులకుఁ బ్రాపై పొదలిన నెదిరికి నజయ్యు లగుదురు; పరుల యొత్తులేని రాజ్యంబు పూజ్యమహిమం బరఁగు. వనవాసంబునం గుందిన కౌంతేయులం దడయక తెచ్చి యుచితపదం బిచ్చి నిలుపుట నీ కొడుకులకు నిలుపు గావించుట యగు’నని చెప్పి మఱియు నిట్లనుఁ ‘బ్రియవాదు లెందును గల రప్రియం బగుంగాకేమియని పథ్యంబు(తథ్యంబు) వలుకువారు లేరు. జూదంబునప్పు డే నడ్డపడి, యప్రియం బగుటకు శంకింపక తథ్యంబు వలికితి; నది నీకు రుచియింపక, రోగికిఁ బథ్యాహారంబు దలకంటగించునట్లయ్యె; నైన నిప్పుడుం జెప్పెద వినుము: కాకంబులం గైకొని మయూరంబులం బరిహరించు విధంబున, మార్జాలంబులం బాటించి సింహంబులయెడ ననాదరంబు సేయు చందంబున సుయోధనాదులం బట్టి యుధిష్ఠిర ప్రముఖుల విడిచితి; నేఁడు కార్యంబు ముట్టవచ్చినం దోఁపక మిడుంగుఱు సోఁకినట్లు దల్లడించెదవు. కులంబునకై యొకనిఁ దొఱంగుటయ నీతి యని పెద్దలు సెప్పుదురు; దుర్ణయపరుండై సద్బుద్ధి సెప్ప వినం డేని, మనము దుర్యోధనుం దొఱంగిన నేమి యగు? నది యట్లుండె, సంపద సహాయంబు నపేక్షించియుండు; సహాయంబు సంపద నుద్దేశించి వర్తిల్లు; నిట్లవి యొకటొకటి పొందునంగాని సిద్ధింపవు కావున నీ సంపద పాండవులకును, వారి సహాయత్వంబు నీకునుం బ్రియం బొనరింప, నొండొరుల కలయుట మేలుగాక, మనలావువెలిసేయుట లెస్స యగునే? కురువంశనిస్తారకులగు భీష్మ యుధిష్ఠిరులును, నవక్ర విక్రములగు కర్ణార్జునులును, బ్రతాపధాములగు భీమ దుర్యోధనులును, శస్త్రాస్త్రపారగులగు నభిమన్యు లక్ష్మణ ప్రభృతి కుమారులును, శాపాను గ్రహసమర్థులగు ద్రోణ ద్రుపదాది పరమాప్తులును, వారి వారి బంధు మిత్రజనంబులును, నొక్క మొగంబై నీ పనుపు సేయుచు, నయ విక్రమంబు లప్రతిహతంబులై నడవం, బృథివి శాసింప భవదీయ విభవం బుజ్జ్వలంబై యొరులకెడలేక చెల్లుచున్న నెంత యొప్పగునో యటు విచారింపుము. పాండవులు ధీరమతులై వైర మెత్తక యూరక తొలంగియుండిరేనియుఁ, గతిపయ దినంబులలోఁ జీకాకుపడి చెడుంగాక, గాంధారీనందనుచేత వసుంధరా పరిపాలన భారంబు నిర్వహింపబడునే?’ యనిన విని ధృతరాష్ట్రుండు విదురున కి ట్లనియె: 89
తే. ‘నీవు సెప్పిన మాటలు నిర్మలములు, | నిపుణ సమ్మతములు, రాజనీతి మార్గ
బోధకంబులు; నైనను బుత్త్రువిడువ | నోప, ‘ధర్మో జయతి’యని యుండువాఁడ.’
90
వ. అనిన విని విదురుం డతని కిట్లనియె: ‘దేవా! జ్ఞాతులు గుణహీనులైనను విడువందగ దనిన, సకల గుణసంపన్నులై భవత్ప్రసాదంబు గోరుచున్న కౌంతేయులన్‌ దిగవిడువం దగునే? యేను నీకు హితంబు గోరెడువాఁడనని నిశ్చయించి నా బుద్ధి వినుము; వారల జీవనంబునకుఁ గొన్ని యలంతిపల్లియలైనను దుర్యోధను నొడంబఱచి యేర్పఱచి, తెఱంగు పఱచిన లెస్స యని చూచెద; నతని విడువ వలయునని చెప్పితినేనిఁ బెనఁకువం బశ్చాత్తాపంబువుట్టు; దాని కప్పుడు ప్రతీకారంబు లేదు. కావున నెల్లభంగుల నియ్యకొని పాండవులతోడ సంధి సేయవలయు; నట్లుం గాక. 91
క. తమలోని పాళ్ళకుం గా | సమరము సేసినను గాని చాఁ జనదె? శరీ
రము లాధివ్యాధి జరా | సమన్వితము లగుటఁ జేటు సహజం బరయన్‌.
92
చ. గజ తురగాది సంపదలుఁ, గాంతలతోడి విహారలీలలుం,
బ్రజ కనురాగ మొందఁ బరిపాలన సేయుక్రమంబుఁ, బోరులన్‌
విజయము లొంది పేర్చుటయు, విస్ఫురితాభరణానులేపవ
స్త్ర జనిత వైభవంబుఁ గల రాజులుఁ బోయిర కాక నిల్చిరే?
93
క. కావునఁ జెవికిం జేఁ దగు | నీ వాక్యము వినఁగఁ జాలితేని, నిహపర
శ్రీ విభవములకుఁ గీర్తికిఁ | దావలమై వెలయు టింత తథ్యము సుమ్మీ!
94
క. తగ నీలో నూహింపుము; | దిగ విడువకు ధర్మతనయు; దృఢమతివై పొం
దగు చందము గొడుకులకుం | బ్రెగడలకుం జెప్పి తీర్పు పెం పేర్పడఁగన్‌.
95
ఆ. అనిన నాంబికేయుఁ డను: ‘నీదు పలుకులఁ | గలఁక దేఱి బుద్ధి దెలివి నొందె;
నిట్ల చేయువాఁడ; నిదియ కర్జము, ధర్మ | మును, యశంబు, లాభమును దలంప.’
96
చ. అనుడు ముదంబు నమ్మమియు నాత్మఁ బెనంగొన నన్నతోడ ని
ట్లను విదురుండు: ‘పెద్దవడి కక్కట! నీ మది కార్యవృత్తి నూ
ల్కొనియె; సుయోధనుం గని యకుంఠిత నిశ్చయమై యతండు వ్రా
లినదెస వ్రాలకుండిన బలే, మముబోఁటులకుం బ్రియం బగున్‌.
97
వ. అని పలికి నిట్టూర్పు నిగిడించి. 98
క. ‘దైవంబు నేర్చుఁగా; కిటు | వోవఁగ నే నేర్తు, నేరఁ బొమ్మని పలుకం
గా వశమె నరున? కెక్కుడు | దైవము పౌరుషముకంటె ధరణీనాథా!’
99
వ. అనిన, విదురునకు వైచిత్రవీర్యుం డిట్లనియె: 100
తే. ‘ధర్మ పథమును, నీతి తత్త్వంబు తెరువు | నిర్మలము లగు పలుకుల నీవు నాకుఁ
దెలియఁ జెప్పితి; పరమార్థ దృష్టి యెట్టి | వాక్యములఁ గల్గుఁ? జెప్పుము వాని ననఘ!
101
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )