పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము
సనత్సుజాతుఁడు ధృతరాష్ట్రునకు నధ్యాత్మతత్త్వంబుఁ జెప్పుట - (సం. 5-41-2)
వ. అని యడిగిన, విదురుం డతని కిట్లనియె; ‘నాకుఁ దోఁచిన యన్నియు నా నేర్చినట్లు నీ కెఱింగించితి; నత్యంత గుహ్యంబులగు నర్థంబులు పురాణుం డయ్యునుం గుమారుం డగు సనత్సుజాతుండు దెలుపనోపుంగాని యిట మీఁద నాకుం దెలియ’ దనిన ధృతరాష్ట్రుం ‘డమ్మునీంద్రుండు నా కెంతదవ్వు! నీవ యవియునుం జెప్పు’ మనిన, ‘నేను శూద్రయోని జాతుండ, వేదాంత వేద్యంబు లగు నర్థంబులు నా కగోచరంబు; లమ్మహాత్ము బుద్ధి నే నెఱుంగుదు. దేవతలకుం దెలియనట్టివి యాతనికిం దెలియు; నతండు దెలుపంజాలు’ ననిన, ధృతరాష్ట్రుం డతి కుతూహలుండై. 102
ఆ. ‘మనకు నిప్పు డతనిఁ గను తెఱంగెయ్యది | యగుటయును నెఱుంగ’ ననిన, విదురుఁ
డధిక భక్తిఁ దలఁచె నాత్మలో నాశ్రిత | వత్సలత్వ నిధి సనత్సుజాతు.
103
వ. ఇట్లు దలంచుటయును, దివ్యజ్ఞాన మాననీయుండగు నమ్మునివరేణ్యుం డాక్షణంబ పొడసూపిన, విదురుం డతని వచ్చుట యుగ్గడించుచు, వినయంబున నతని నెదుర్కొని, దండ నమస్కారంబు లాచరించి, యున్నతాసనంబిడి, యర్ఘ్యపాద్యంబు లిచ్చి, ససంభ్రమంబుగాఁ బ్రత్యుత్థానంబును బ్రణామంబునుం జేసియున్న ధృతరాష్ట్రు నతనికిం జూపి విదురుం డి ట్లనియె: 104
క. ‘దేవా! దేవర కృప నీ | భూవల్లభుఁ డమల తత్త్వ బోధకమై సౌ
ఖ్యావహ మగు వాక్య చయముఁ | దా వినఁ గోరుటయు, మిమ్ముఁ దలఁచితి భక్తిన్‌.
105
వ. మీరును గారుణ్యాతిశయంబున విజయం చేసితిరి. గురు సమాశ్రితులగు వార లెద్దాని వలన సుఖదుఃఖంబులు, లాభాలాభంబులుఁ, బ్రియద్వేషంబులు నాదిగాఁ గల ద్వంద్వంబులం బడక బ్రదుకుదు? రట్టి పరమార్థోపదేశంబున నితనిం గృతార్థునిం గావించి రక్షింపవలయు’నని ప్రార్థించినం, బార్థివుండునుం దదనురూపంబు లగు నాలాపంబుల నారాధించినం బ్రసన్నుండై, సనత్సుజాతుం డధ్యాత్మ విషయంబులగు వివిధ వాక్యంబుల సోపాన ప్రకారంబున నంతకంతకు సూక్ష్మంబులగు నర్థంబులు సమర్థించుచు, నందుఁ బ్రజ్ఞాచక్షుండెయ్యది యేర్పడ నడిగె నది యెల్ల వివరించుచు, హృదయ పుష్కర కలితంబగు పరతత్త్వంబు ప్రసాదించునట్టి గూఢోక్తు లనుగ్రహించుచుండ, నెట్టకేలకుఁ బ్రభాతం బగుటయు, ధృతరాష్ట్ర విదురుల నామంత్రణంబు సేసి యద్దేవముని యంతర్ధానంబు నొందె; నట్టి సమయంబున. 106
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )