| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
‘నరుఁ డలుక వొడమియును సు | స్థిరుఁడై, తన యెఱ్ఱ సెరల చెలువునఁ గెందా మరలం దెగడెడు కన్నుల | నరుణచ్ఛవి నెఱయ నిట్టు లనియె నరేంద్రా! |
132 |
| ఆ. |
‘ఆ సుయోధనుండు, నతనికిఁ దోడ్పడ | నరుగుదెంచినట్టి ధరణినాథ చయము వినుచునుండ సంజయ ! నా వచ | నములు గాఁగ ని ట్లనంగవలయు. |
133 |
| ఉ. |
పాండుని యగ్రనందనుఁడు పా లడుగం దగ నీఁడయేని, మా కొం డన నేల? మే లది; సుయోధనుఁ డింతకుమున్ను పెక్కు లు ద్దండతఁ దాను జేసిన విధంబుల కెల్ల మెఱుంగు వెట్టిన ట్లుండెడుఁ గాక, యేనును వృకోదరుఁడుం బ్రియమందునట్లుగన్. |
134 |
| క. |
మా యిరువురతోఁ గయ్యము | సేయ నతం డియ్యకొనిన, సిద్ధించెన కా దే యుచితచరితుఁ డగు కౌం | తేయాగ్రజు కార్య; మట్టి తెఱఁగొప్పుఁ గదా! |
135 |
| క. |
వనవాసంబున భూశ | య్యను ధర్మజుఁ డున్నయట్టి యాయాసము వో వునె, యంపశయ్య దుర్యో | ధనుఁడు రణక్షోణిఁ బడక తక్కిన యేనిన్? |
136 |
| ఉ. |
సూనృత మూఁది బన్నములు సూడక లోన నడంచినట్టి కో పానల మెండియున్న నిబిడాటవిపైఁ బచరించు తీవ్ర దా వానలుఁ బోలి శాత్రవచయంబుపయిం గవియించి నిల్చినం గాని యుధిష్ఠిరున్ సరకుగాఁ గొన రా ధృతరాష్ట్రనందనుల్. |
137 |
| మ. |
గద సారించుచు నంత్యకాల విచలత్కాలాకృతిన్ భీముఁ డు న్మద మాతంగచయంబు నుగ్గుగ, లసన్నానా రథవ్రాతముల్ చదియన్, భూరి హయవ్రజంబు పొడిగా సంరంభతుంగాంగుఁడై కదియం జూచి బలే! సుయోధనుఁడు భాగం బిచ్చు రాజ్యంబునన్. |
138 |
| సీ. |
కోల్పులి వీఁకమై గొదగొని లేళ్లకు | నుఱుకు తెఱంగునఁ దఱియఁ జొచ్చి, పెనుగాలి జీమూత బృందంబుపైఁ బెట్టి | దంబుగ వీఁచుచందమున నడరి, కసి మసంగిన మారి గడఁగి జీవులమీఁద | నుగ్రతఁ గవియున ట్లురవడించి, యాఁకొన్న లయరుద్రుఁ డాగ్రహంబున జగ | త్ప్రచయంబు ముట్టెడు భంగిఁ బొదివి. |
|
| తే. |
నకులుఁడును, దదనుజుఁడు, సాత్యకియు, నా సు | భద్ర కొడుకును నెదిరిన బలము నెల్ల బెదరఁ, జెదర, బడల్పడఁ, బెల్లు సావఁ | జేయఁగని కౌరవులు సంధి సేయువారు. |
139 |
| ఉ. |
చిత్తము లుల్లసిల్ల, నల సింహకిశోరము లొక్కమై మదో న్మత్త గజావళిం బొదువుమాడ్కి నరాతి బలంబు ముట్టి, యు ద్వృత్తిఁ గడంగి యప్రతిమవీరులు ద్రౌపదిపుత్త్రులేవురున్ నెత్తురు నీరఁ దేల్చిన ననిం గని మీ నృపుఁ డల్క దీఱెడిన్. |
140 |
| మ. |
చెలులుం జుట్టలు నిష్టభృత్యులు మహాజిం బ్రాణముల్ డాఁప కు జ్జ్వలులై తో నడవన్, విరాటుఁడును బాంచాలుండు నేపారి సే నల యుద్రేకము రౌద్రముం బెనుప, నానా హేతి ఘోరంబుగాఁ దలపడ్డం గని గాక; స్రుక్కుదురె గాంధారీసుతుల్ మాటలన్? |
141 |
| చ. |
తఱిమి శిఖండి తన్నొరులు దాఁకఁగ నెవ్వరి దిక్కుఁజూడ కే డ్తెఱఁ దనపూన్కిపై మనము ధీరత నిల్పి, రథంబు బల్విడిం బఱపి, కురుక్షితీశుఁడను బ్రహ్మకు వేయును నిండ భీష్ముపై కుఱికినఁ గాక, మాకు సగ మూరక యిత్తురె మీరు మేదినిన్? |
142 |
| శా. |
విద్యుద్దండము నిల్చిపొల్చినగతిన్ విల్లందమైయుండ న స్మ ద్యోధావలి మానసంబున రణోత్సాహంబు రెట్టింప ధృ ష్టద్యుమ్నుండు గడంగి ద్రోణుఁ గడిమిన్ డాయంగ, వీక్షించి కా కుద్యోగించుట కేల తక్కుదురు మీ రుగ్రాహవక్రీడకున్? |
143 |
| సీ. |
గాండీవ గుణ రవం బొండొండ చెలఁగంగ, | శరపరంపర లాకసంబు గప్పఁ, బ్రతి విశిఖములు ఖండితములై రాలంగ, | నెదిరి సైన్యంబుల మదగజాది చతురంగములును జర్జరితంబులై యవ | యవ భేద మెఱుఁగని యట్లు గాఁగఁ దునిసిన, నెత్తురు నెనడును నెమ్ములు | నెఱచియుఁ గండలు నెనసి సమర |
|
| తే. |
తలము ఘోరంబుగాఁ, గపిధ్వజము, ధవళ | హరులు శోభిల్ల, నొగలపై హరి యెలర్ప, దేవదత్తంబు మ్రోయఁ దోఁతెంచునట్టి | రథముఁ గని కాని కానఁడు రాజరాజు. |
144 |
| శా. |
బాలక్రీడ మహాసురప్రకరమున్ భంజింపఁడే? యెప్పుడుం ద్రైలోక్యంబును భక్తియుక్తిఁ దగ నారాధింపదే? యట్టి శౌ ర్యాలంకారు మహాత్ముఁ దా సరకుసేయం డచ్యుతున్! మ మ్మతం డేలా కైకొను? నా సుయోధనునియం దెగ్గేది యూహింపఁగన్? |
145 |
| వ. | ఏము పితామహ గురు కృపాచార్యులకు నమస్కరించి, యస్మదీయ రాజ్యభాగంబునకై తొడరి కయ్యంబు సేయువారము; కౌరవులకుంబూని యెవ్వరేమాతోఁబెనంగినను వారి శస్త్రాస్త్రంబులు ధర్మప్రతిహతంబులగునని తలంచెదము; పండ్రెండు వత్సరంబులు వనంబున నమ్మెయి నిడుమలం బడి, జనపదంబునం బదుమూఁడగునేఁ డజ్ఞాతవాసాయాసం బట్లనుభవించి వచ్చి, మా తండ్రి పాలికినై పెనం గు మమ్ము నింద్రాది సుర సహాయులయ్యును ధార్తరాష్ట్రులు గెల్చువారైరేని ధర్మంబుకంటె నధర్మము బలవంతం బైనయదియగు; నింతియకాని మా చేయునట్టిది గీ డైనదిగా; దేము వాసుదేవుని మున్నిడుకొని నడతుము గావున, నీ యుద్ధంబునం జయంబు మాకు సిద్ధంబ; యెల్ల భంగులం గర్ణ సహితంబుగా గాంధారీనందనులం దునిమి యేము భూమి గొనుట దప్పదు; ‘గాండీవంబు దివియకయును గుడుసువడియెడు; బాణంబులు దమయంతన తూణీరంబుల వెడలెడుఁ; దోలూడ్చు మహానాగంబునుంబోలెఁ గరవాలంబు దాన యొఱవెలికి నిగుడుచున్నయది గావున, మా కవశ్యంబును సంగరంబు సంభవించుఁ; బాశుపతాది దివ్యశరంబులం గురుపక్ష ప్రజాక్షయంబు సేసి శాంతిం బొందెదము; సూతనందనా! నీవు సుస్థిరుండవై యింతయుం దెలియం బలుకవలయు; నిమ్మాటలు విని కురువృద్ధుండగు బాహ్లికుండును, బితామహుండగు భీష్ముండును, గురుం డగు కుంభసంభవుండును, శిక్షకుండగు కృపాచార్యుండును, గురుపుత్రుండగు నశ్వత్థామయు, సద్బుద్ధి యగు విదురుండును, ధర్మాచరణకల్యుండగు శల్యుండును నెయ్యది నిశ్చయించి పలికి రది యయ్యెడు; సుయోధనాదు లాయుష్మంతు లగువారకాక! యని పలికె.’ నని చెప్పిన విని మందాకినీనందనుం డందఱు విన దుర్యోధనున కి ట్లనియె: | 146 |
| సీ. |
నలినగర్భుఁడు పెద్ద కొలువున నున్నెడ | సురపతి ప్రముఖుల చూడ్కులెల్ల మెఱయు తేజంబున మిఱుమిట్లు గొన నిద్ద | ఱచ్చట నొరసికొంచరుగఁ జూచి, ‘వీ రెవ్వ, రిమ్మెయి మీ రుండ సరుకుసే | యని యట్లు వోయెడు నట్టివార?’ లని బృహస్పతి బ్రహ్మ నడిగిన నతని కి | ట్లనియె నా చతురాస్యుఁ డాదరమునఁ |
|
| తే. |
దపము పెంపును బలశౌర్యదర్పములును | గలిగి లోకహితార్థంబుగాఁ జరింతు రే యుగంబున నరుఁడు నారాయణుండు | ననఁ బ్రసిద్ధికి నెక్కిన మునులు సుమ్ము!’ |
147 |
| వ. | అని పలికి వెండియు | 148 |
| క. |
‘అనిమిషహితము దనుజ నా | శనమును జేయుదు; రధర్మ సంగ్రామము గ ల్గిన చోట ధర్మపరు లగు | జనముల గెలిపింతు రధిక సంరంభమునన్. |
149 |
| వ. | దేవాసుర యుద్ధంబు నప్పు డింద్రుండు వోయి వీరి నారాధించి తో డడిగినం, జనుదెంచి పౌలోమ కాలకేయాదులగు ననేక దైత్య దానవులం జంపి యింద్రునకు విజయంబు గావించి; రది మొదలుగా వీరల నెల్లవారలు నెఱింగియుండుదు; రిది యొక్క తేజంబ రెండు దెఱంగులై వెలుంగుచుండు’ నని చెప్పి, వినోదార్థంబు జన్మాంతరంబు నొందిన యమ్మహాత్ములు గదా యీ యర్జునుండును వాసుదేవుండును! నర్జునుండు సముద్రతీరంబున హిరణ్యపురంబు వొడిచి నివాతకవచుల నఱువది వేవుర నిర్జించి పర్జన్యునకుఁ బ్రియంబుసేసె; వాసుదేవు పరాక్రమంబు గంస నరకాసుర ప్రముఖ నిఖిల దుష్ట నిగ్రహంబునం బ్రసిద్ధంబు గాదె? తెలియ విను మున్నరూపు సెప్పెద. | 150 |
| క. |
ఆ యిరువురు నొకతలయై | యాయోధనమునకు నడచునట్టిద యేనిన్ వే యేల మనక కా దెదు | రై యేడ్తెఱఁ దాఁక హరునకైనను వశమే? |
151 |
| క. |
సారథియు రథియు నై యొక | తేరం గృష్ణు లతిఘోరతేజస్సార స్ఫారతఁ దోఁచిన నైనను | ధీరత వాటించి చూచి తెలిసెదవు బలే!’ |
152 |
| వ. | అనుచు నా సుయోధను నుపలక్షించి శాంతనవుండు మఱియు నిట్లనియె: | 153 |
| క. |
‘మది నా మాట కొకింతయు | బెదర వకార్యంబునందుఁ బ్రియము గలిగి యుం డుదు; కౌరవులకుఁ గాలము | తుదియో కా కిట్టి గర్వితుని నే మందున్? |
154 |
| తే. |
హితములగు నాదు వచనంబు లిపుడు వినని | వాఁడవైతేని నప్పుడు ‘వారు వడిరి, వీరు వడి’ రను పలుకులు విందుగాక | శకుని కర్ణ దుశ్శాసనుల్ సమ్మతింప. |
155 |
| వ. | దుష్ట కష్ట నికృష్టాత్ము లగు నిమ్మువ్వురుఁ జెప్పెడు బుద్ధులుగాని యొండు విననొల్ల; వేమి సేయవచ్చు?’ నని పలికినం గానీనుండు గనలి గాంగేయున కిట్లనియె; | 156 |
| ఆ. |
‘ఇట్టు లాడఁ దగునె? యే నేమి సేసెతిఁ? | గొలిచి కుడుచు పాడి నలవుఁ జలముఁ బలుకు టెందు నెగ్గె? పతికిఁ బుత్త్రులకును | మనుమలకు హితంబ యొనర నడతు. |
157 |
| క. |
కాని తెఱఁగైన నింతటి | మానిసిఁ గా నేల చేయు మనుజేంద్రుఁడు న న్నీ నెఱి దప్పిన మాటలు | నీ నోరన్ వెడలఁ దగునె నిండిన సభలోన్?’ |
158 |
| వ. | అనిన విని భీష్ముఁడు ధృతరాష్ట్రున కిట్లనియె: | 159 |