పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము
భీష్ముఁడు కర్ణుని దుర్ణయంబు ధృతరాష్ట్రునితోఁ జెప్పుట (సం. 5-48-33)
తే. ‘ఒకట నైనను వారియం దొకరిలోని | చిదుర పాలును బోలండు; సిగ్గులేక
‘పాండవుల గెల్తు నే’ నని పలుకుచుండు; | వీని రజ్జులు దులువలు విండ్రు తగిలి!
160
క. మగఁటిమి వారికి వీఁ డెదు | రుగ నమ్మి, సుయోధనుఁడు విరోధము గొని, స
ర్వ గుణాఢ్యులు బలవంతులు | నగు పాండునృపాలసుతుల నవమానించెన్‌.
161
ఉ. ఒక్కఁ డొకం డనేక విధ యుద్ధ జయంబులు గొన్నవారు వా;
రెక్కడ నేమి సేసె నితఁ? డీతని తమ్మునిఁ గూలనేసి యు
క్కెక్కిన పార్థుపైఁ గవిసెనే? పసు లాతఁడు గ్రమ్మఱింపఁగా
నక్కడ లేఁడె వీఁడు? భవదాత్మజుఁ గోల్పడె ఘోషయాత్రలోన్‌.
162
వ. ఈ దురాత్ముండు కర్జం బెఱుంగక నీతిబాహ్యుండై వలసినట్లు ప్రేలరిమాట లాడుచుండు; నీవునుం గైకొని వినుచుండుదువు; మేల కాక!’ యనిన భీష్ము పలుకులు విని ద్రోణుం డమ్మహారాజుతో నిట్లనియె; 163
ఉ. ‘శాంతనవుండు సర్వకురుసంతతికిం గలవాఁడు గాఁడె? య
త్యంత హితంబు లీ పలుకు; లాహవ మొప్పదు; ధర్మసూతితోఁ
బొంతము మేలు; దేవపతిపుత్త్రుఁడు సంజయుతోడ నాడిన
ట్లంతకు నోపు; మీకుఁ దెలియం దగు ఖాండవదాహ మాదిగాన్‌.
164
ఆ. శర శరాసనములు ధరియింప రెట్టు లె | వ్వరును? మగతనంబు వలనుఁ గలిగి
కయ్యమున జయంబు గైకొనరే యొరు? | లర్జునుండ విజయుఁ డనఁగ నెగడె!
165
క. మన వీటనకా, దయ్య | ర్జునునకు సరివింటివానిఁ జూడఁగ లోకం
బున నెందు లేమి దెల్లం | బనుమానములేదు; తొడరనగునే వానిన్‌?’
166
వ. అని చెప్పి, యప్పాటం బరమహితోపదేశంబు సేసిన భీష్మ ద్రోణుల పలుకు లాదరింపక, వారికి సదుత్తరంబు లీక, వారలతోడం దదనురూపంబుగా సంభాషింపక, ధృతరాష్ట్రుండు వెండియుఁ బాండవులవలని వార్త లడుగుటకు సంజయుదిక్కు మొగంబైనం జూచి, కురుపక్షవీరు లందఱుఁ బ్రాణంబుల దెస నిరాశులై యుండి; రమ్మహీపతి సంజయునితో నిట్లనియె; 167
తే. ‘ధర్మ పుత్త్రున కిక్కడి తలఁపు భంగి | యెట్టు లుండు? నీ సైన్యంబులెల్లఁ గూడి
యునికి వినియెనే? యెవ్వరిఁ గొని యతండు | కౌరవులమీఁది కెత్తి రాఁగలుగువాఁడు?’
168
వ. అనిన విని సంజయుండు వెచ్చనూర్చి, ఱిచ్చవడి, మూర్ఛవోయిన చందంబున డెందంబు మొగుడం జేష్టలు దక్కియుండి, కొండొక సేపునకుఁ జిత్తం బొక్కింత సేసికొని, ‘యక్కటా! యీ భూపాలుం డింత బేల యగునే? యుధిష్ఠిరుం డెవ్వరిఁ గొని యెత్తి వచ్చు వాఁడని యడుగుచున్నవాఁ! డింత యెఱుంగని వాఁ డెంతసెప్పినను తెలియనేర్చునే? యితని భంగి యిట్టిదనినఁ, గొడుకుల తెఱంగు వేఱ యెన్న నేల? యే నింక నేమనువాఁడ? నైనను నన్నడిగిన మాటకుం దగిన మాఱుమాట పలుకవలయునకాదె’ యని తలంచి ధృతరాష్ట్రున కిట్లనియె;’ 169
చ. ‘వినుము నరేంద్ర! పాండుపృథివీవతి యగ్రసుతుండు సంధిసే
యన మదిఁ గోరు; మీరు దమ యయ్యసగంబును భూమియీక త
క్కిన మఱికాని ముంద రొకకీడుఁ దలంపఁడు; మీ బలంబు నె
ల్లను మదిఁ జీరికిం గొనఁడు లావున నేలఁ గొనం దలంచినన్‌.’
170
వ. అతం డెవ్వరిం గొని యెత్తివచ్చువాఁ డని యడిగితివి; నీ యెఱుంగని వార లం దెవ్వరు గల? రవధరింపుము. 171
మ. బకవిధ్వంసి జటాసురాంతకు హిడింబప్రాణపారీణుఁ గీ
చక నిర్మూలన కేళి లోలు సమరోత్సాహైక శీల ప్రవ
ర్తకు నాగాయుత సామ్యకీర్తిత బలోదగ్రుం బ్రతివ్యూహ దా
హకు భీముం గొని వచ్చు ధర్మజుఁడు బాహాటోపముం జూపఁగన్‌.
172
వ. మఱియును. 173
మ. అట మిన్నందిన యట్టివాని పొడ వెం తన్నట్లు ఫాలాక్షు నె
క్కటి కయ్యంబునఁ గన్న ఫల్గును భుజాగర్వంబు లెక్కించు; టం
తటి వానింగొని ధర్మసూతి సమరోత్సాహంబుమై నెత్తి వ
చ్చుటకుం గొంకునె? వీఁపు సక్కనయి నిల్చుంగాక మీ సైన్యముల్‌.
174
తే. నకులు సహదేవుఁ గొని ధర్మనందనుండు | మొనసి కౌరవ బలముల ముట్టికొనఁగఁ
దలఁచి తఱి వేచి వచ్చుట ధరణినాథ! | సింగములఁ బట్టి వేఁటాడు భంగి గాదె?
175
తే. ద్రౌపదేయులు, నా సుభద్రా సుతుండు | నుక్కు తునియలు గారె? మి మ్మక్కుమార
వరులఁగొని యోర్చువాఁడయి వచ్చు ధర్మ | పుత్త్రుఁ; డిది నీకుఁ జూడంగఁ బోల దెట్లు?’
176
వ. అని చెప్పి వెండియు నిట్లనియె : 177
క. ‘వృష్ణి కుమారోత్తముఁ డా | కృష్ణుని తమ్ముండు సాత్యకియు, దవదహనా
త్యుష్ణ ప్రతాపదీప్తులు | కృష్ణా సోదరులుఁ దలఁపఁ గేవలులె నృపా!
178
సీ. శౌర్యోజ్జ్వలుండు పాంచాల భూనాథుండు, | మహితవిక్రముఁ డగు మత్స్యవిభుఁడు
నధిక ధైర్యాన్వితు లతని తమ్ము, లుదగ్ర | తేజస్కులైన తదీయసుతులు,
నన్నదమ్ములు ప్రతాపోన్నతు లేవురు | కేకయపతులు, నక్షీణ బాహు
శక్తియుక్తులు జరాసంధ సూనుఁడు సహ | దేవుండు, నా జయత్సేన విభుఁడు
 
తే. వినుము శిశుపాల తనయులు వీరధనులు | ధృష్టకేతుండు వృషభుండుఁ, దీవ్రరణ వి
నోది యదుభర్త చేకితానుండు, దర్ప | ఘనుఁడు శైబ్య నృపాలుండుఁ గలరుగాదె!
179
క. వీరెల్లఁ బాండురాజ కు | మారుల పాటునకుఁ గుందు మనములతోడన్‌
వారి పగ దీర్పఁ గడఁగెడు | వారల కా, కందు లాఁతివారుం గలరే?
180
వ. భీమసేనసూనుండు ఘటోత్కచుండు తండ్రికంటెను లావును బీరంబునుం గలవాఁడు, మాయాబలంబున మనబలంబు నెల్లం గలంచు; మఱియును దూర్పున నుత్తరంబునం గలుగు నరనాయకులు నానా సేనా సమన్వితులయి వచ్చి చిచ్చయిననుం బిడికిలింత మనుచున్నవా; రదియునుంగాక. 181
క. సకల భువనములు నఱ చే | తికిఁ దేరంజాలు నట్టి ధీమంతుఁడు దే
వకి కొడుకు గలఁడు ధర్మజు | నికి; నాతం డెత్తి రాక నిలుచునె యధిపా?’
182
వ. అని చెప్పిన సూతపుత్త్రునకు నంబికాపుత్త్రుం డిట్లనియె: 183
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )