పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము
కృష్ణద్వైపాయనుఁడు ధృతరాష్ట్రుని యొద్దకు వచ్చుట (సం. 5-65-8)
వ. అనిన విని యంబికానందనుం ‘డట్లకాక’యని యొక కంచుకిం బిలిచి వానిం బుచ్చి గాంధారి రావించి, సద్భక్తి తాత్పర్యంబునఁ గృష్ణద్వైపాయన మహామునిం దలంచిన, దివ్యబోధ మహనీయుండైన యమ్మహాత్ముండు విజయం చేయుటకు, నందఱు దండ ప్రణామంబులు సేసి సమున్నతాసనంబున నునిచి, యర్ఘ్యపాద్యాది విధులం బూజించియున్న సమయంబున ధృతరాష్ట్రుండు విన్నపంబు సేయక మున్న యమ్మహాపురుషుండు ధృతరాష్ట్ర సంజయుల చిత్తవృత్తులు దాన యెఱింగినవాఁడగుటం జేసి, సంజయువలనఁ బ్రసన్న దృష్టి నవలోకించి యతని కిట్లనియె: 305
క. ‘నీవు సమస్తము నెఱుఁగుదు | గావున నీ కూరకుండఁగాఁ దగదు; ధరి
త్రీ వల్లభుఁ డడిగిన పని | యీ విధమని తెలియఁబలుకు మేను వినంగన్‌.’
306
వ. అనినఁ బ్రసాదం బని సంజయుండు ధృతరాష్ట్రున కిట్లనియె: 307
క. ‘ఆ సేనకు నీ సేనకు | వాసి యడిగె దీవు నన్ను, వసుదేవసుతుం
డా సేనఁ గలఁడు; తత్సము | నీ సేనం జూపుమా నరేశ్వర! నాకున్‌.
308
వ. వాసుదేవుం డెట్టివాఁ డని యడిగెదేనిం జెప్పెద. 309
చ. జగముల నన్నిటిం దనవశంబుగఁ జేసినవీరు, భంగమున్‌,
బగయు లలాట లోచనుఁడు వాపఁగఁ బేర్చినయట్టి బాణు, నొ
క్క గడియలోన గర్వ మడఁగం బరిమార్చె; సురేంద్ర కల్పకం
బు గరములీలఁ దెచ్చె; హరి భూరి పరాక్రమ మప్రసిద్ధమే!
310
ఆ. అధిక దుష్కరంబులైన కార్యంబులు | క్రీడవోలెఁజేయుఁ గేశవుండు;
విను మతండు పార్థు నెనసి యేకార్థుఁడై | యుండుఁ బూర్వ భవ సఖుండు గాన.
311
వ. అట్టి వాసుదేవుని చక్రంబు నిజమాయాబలంబునఁ బాండవుల సర్వ సమర సాధనంబుల యందును సూక్ష్మరూపవ్యాపియై నిలిచి వారికి విజయం బొసంగుచుండు’ నని చెప్పి, మఱియు నిట్లనియె: 312
క. ‘పలుమఱుఁ బాండు తనూజుల | కొలఁది వితర్కించెదవు; నిగూఢం బదియుం
దెలియం బలికెద; వారికి | బలమును సత్త్వంబు హరియ పార్థివముఖ్యా!
313
వ. హరి మహత్త్వంబు విన్నవించెద నవధరింపుము. 314
క. ఒక తల సమస్త జగములు, | నొకఁడ జనార్దనుఁడు నిలిచి యొక తలయైనన్‌,
సకలము నసార; మాతం | డొకరుని సారంబ చాల నుత్కృష్టమగున్‌.
315
క. తలఁపునన వాసుదేవుఁడు | గలిగింపను, నిలుప, నడఁపఁగా నోపు జగం
బుల; మఱియును గ్రీడార్థము | పలువోకలఁ బుచ్చుచుండుఁ బౌరవనాథా!
316
క. ఎక్కడ నడచును సత్యం, | బెక్కడ ధర్మంబు వరఁగు, నెక్కడఁ గలుగుం
జక్కటి నిలుచుం గృష్ణుం | డక్కడ; నతఁ డున్నకడన యగు జయ మధిపా!
317
సీ. పురుషోత్తముం డెల్ల భువనంబులును దాన | యఖిల భూతాత్మకుండై విహార
లీల విచేష్టించు; నీ లోకముల మాయ | దొట్టి యొక్కొకమరి పుట్టి, పెరిఁగి
కర్మానుచరణముల్‌ గైకొని వర్తించు; | శిష్టరక్షణమును, దుష్ట నిగ్ర
హంబును దన పను లగుటఁ; బాండవుల నె | పం బిడుకొని ధర్మబాహ్యు లైన
 
తే. నీ తనూజుల నిక్కమ నిగ్రహింపఁ | దలఁచినాఁ డమ్మహాత్ముండు; తథ్య మతని
నిట్టి చందంబువాఁ డని యెఱిఁగి యెవ్వ | రాశ్రయింతురు, బ్రదుకుదు రట్టివారు.’
318
క. అనవుడు ధృతరాష్ట్రుఁడు ‘వి | ష్ణుని నే నెఱుఁగని విధంబునుం, దెలియఁగ నీ
కని యున్న తెఱఁగుఁ జెప్పుమ’ | యనుటయు సూతసుతుఁ డిట్టులను నాతనితోన్‌.
319
వ. ‘విద్యయు నవిద్యయు ననఁగా రెండు గల; వవిద్యాదూషితుండై తమోగ్రస్తుండైనవాఁడు విష్ణు నెఱుంగఁడు. విద్యాసంపన్నుం డెఱుంగు’ ననిన, ‘విద్య యనునది యెట్టి? దెద్దాన నీవా సర్వేశ్వరు నెఱింగితి? దాని, నవిద్య యెట్టిది? దానిని జెప్పు’ మనుటయు, నాంబికేయునకు సంజయుం డిట్లనియె: ‘సాత్త్విక రాజస తామస వికారంబుల త్రిప్పులంబడక ధర్మం బాచరించుచు భావశుద్ధి గలిగి యుండుదు; దీన నే నచ్యుతు నెఱుంగుదు; విద్య యిట్టిది. నీకునుం, దక్కెవరికైనను నతని నెఱుంగుటకు నిదియ తెరు; విట్టిదిగాని విధం బవిద్య’ యని చెప్పిన, నతండు నిజనందనున కిట్లనియె: 320
క. ‘మన కాప్తుఁడు సంజయుఁ; డీ | తని యుపదేశంబు వట్టి ధర్మమున ముకుం
దుని నాశ్రయింపవయ్య! య | తనిఁ జొచ్చిన బ్రదుకుదీవుఁ దమ్ములు సుతులున్‌.’
321
చ. అనిన సుయోధనుండు దమ యయ్యకు నిట్లను: ‘నిజ్జగంబు ల
న్నిని నొకపెట్ట మ్రింగినను, నెట్టన సర్వము గాచెనేనియు
న్వినుము - ముకుందుఁ డర్జునుని నెచ్చెలి నాఁ జెవులార వించు, నిం
క నతని నొక్క బామునకుఁగా ధృతిపెంపఱ నాశ్రయింతునే?’
322
తే. అనిన గాంధారి కిట్లను జనవిభుండు: | ‘నీ తనూజుండు దుర్మాని నీతిబాహ్యుఁ
డుద్ధతుం డీసుమాని నా బుద్ధి వినఁడు; | వీఁడు సెడుఁగాని బ్రదుకంగ లేఁడు సుమ్ము!’
323
ఉ. నావుడుఁ దల్లి యిట్టులను నందనుతో: ‘నిది యేల యాయువున్‌
శ్రీ విభవంబులన్‌ మము నశేషసుహృజ్జనులం దొఱంగఁగా
నీవు గడంగె? దిట్టి యవినీతులునుం గలరే? వృకోదరుం
డై విధి సంపఁగా నొరుల కాఁగఁగ వచ్చునె యింకఁ బుత్త్రకా?’
324
వ. అనియె; నట్టి యెడం గృష్ణద్వైపాయనుండు ధృతరాష్ట్రునకిట్లను ‘కృష్ణుండు నీకుం గూర్చు; నీవుం బరమాప్తుండైన సంజయు నతనిపాలికిం బుచ్చి; తది లెస్స కార్యం బయ్యె, వీఁడును నమ్మహానుభావు మహనీయ ప్రభావం బున్నరూ పెఱుంగు. వీని బుద్ధి విని యద్దేవు నాశ్రయింపు; మతం డేకాగ్రచిత్తులై యారాధించినవారికిఁ జేరువ యగుఁ; గామక్రోధోపహతులై తమ తమ ధనంబులం దృప్తులు గాక యన్యాయంబున వర్తించువారలకు దూరంబై యుండు; నెల్లభంగుల నాతనిం జొచ్చి బ్రదుకు;’ మనినం, ‘బ్రసాదం బట్ల చేయుదు’ నని, విచిత్రవీర్యనందనుండు సూతనందనునితో ‘నవ్వాసుదేవ నామ నిర్వచనంబు నాకుఁ దేటపడం దెలిపి యతనిం బొందు నుపాయం బుపదేశింపవే’ యని యడిగిన. 325
తే. ‘ఎల్లయందును దా వసియించు, టెల్ల | యదియుఁ దనయందు వసియించు టండ్రు వాసు
దేవుఁ డనుపేరి కర్థంబు; దెల్ల మింత | యెఱుఁగు జనులందుఁ దగ వసియించు శుభము.
326
తే. అతనిఁ బొందు నుపాయంబు నంతరంగ | నిగ్రహమ కాఁగ నార్యు లనుగ్రహింతు;
రోపి చిత్తవికారంబు లుడిపి, యేక | బుద్ధిఁ గొలువఁ బ్రసన్నతఁ బొందు నతఁడు.
327
వ. నీవును బలుబుద్ధులుడిగి గోవిందు నాశ్రయింపు’ మనినం బ్రజ్ఞాచక్షుం డిట్లనియె: 328
క. ‘నాకు నయనేంద్రియము గతి | లేకుండుట కంత వగపులే; దఖిల మనో
జ్ఞాకారుఁడైన హరి నా | లోకింపం గానమికిఁ గలుగు వగ పెపుడున్‌.
329
ఉ. ఆతనిఁ గన్నులారఁగ నహర్నిశముం గనుఁగొంచు నుండువా
రే తప మాచరించిరొ? యుపేంద్రుని, నాశ్రితవత్సలున్‌, విని
ర్ధూతకలంకు, ధర్మనిరతుం, గరుణాకరు, సర్వలోక వి
ఖ్యాతుఁ, బవిత్రమూర్తి, శరణాగతరక్షకు నాశ్రయించెదన్‌’.
330
వ. అని పలికి పరమశాంతుండై పారాశర్యు నుద్దేశించి ‘దేవా! యేను వాసుదేవుని శరణు సొచ్చి బ్రదుకువాఁడ’ ననుచుఁ గృతాంజలి యగుటయు వ్యాసమహామునియు నాశీర్వాదంబు సేసి యంతర్హితుం డయ్యెఁ; గౌరవేశ్వరుండును దుర్యోధన సంజయుల నిజ నివాసంబులకుం బోవం బనిచి, తానును గాంధారియు నభ్యంతర మందిరంబున కరిగి, యుచిత వ్యాపారంబులం బ్రవర్తిల్లుచునుండె’ నని చెప్పిన విని ‘పదంపడి పుట్టిన విశేషంబు లెట్టి’ వని యడిగిన. 331
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )