| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము |
| తే. |
‘నీకు నా లావు తోడ్పాటు లేకయుండ | వలయు; నీ తెగునంతకుఁ గలన నిలువ; నాయుధంబులు విడిచితి; నంత మీఁద | మెఱసి బలవిక్రమంబులు నెఱపువాఁడ.’ |
289 |
| వ. | అని శస్త్రసన్న్యాసంబుసేసి కొలువున నిలువనొల్లక దిగ్గన లేచిపోయె; నట్టియెడ శాంతనవుండు నవ్వుచు దుర్యోధనునితో నిట్లనియె: | 290 |
| క. |
‘అంతకుఁ జాలఁడె కర్ణుం? | డింతకు మును బాస యిచ్చి యెన్నఁడు బొంకం! డింతటి మానిసి యలిగినఁ | గౌంతేయుల కెట్లు బ్రదుకఁగా వచ్చు ననిన్?’ |
291 |
| క. |
అని వెండియు నిట్లను: ‘నా | తని మాటల కెట్లుఁ గడఁగి ధర్మతనయుతో నని సేయక తక్కవు నీ | వనుమానము వాయఁ జూడు మతనిని, నన్నున్. |
292 |
| వ. | ఏను బాహ్లిక ద్రోణ ప్రముఖులు గనుంగొనుచుండఁ బ్రతివీరుల ననేక సహస్రంబుల సమయించెదఁ; బిదప రాధేయు రణంబునుం జూచెదవుగాక!’ యనిన విని దుర్యోధనుండు కర్ణ పక్షపాతియు, నవినీతుండు నగుటం జేసి సహింపక పితామహుతో నిట్లనియె: | 293 |
| చ. |
‘ఎఱిఁగి యెఱింగి యొండె, మది నేది యెఱుంగక యొండె నెప్డు నం దఱు వినఁ ‘బాండునందనులు దర్పితులై యని గెల్తు’ రండ్రు; ముం దఱ నిను బాహ్లికున్ గురునిఁ దక్కటివారిని నమ్మి యేను నే డ్తెఱ నని సేయఁబూనితిఁ; గడింది మగంటిమి తోడు సాలదే? |
294 |
| ఉ. |
కర్ణుఁడు దుస్ససేనుఁడును గల్గఁగ నా కొరులేల? సద్భటా కీర్ణ విరోధి సైన్యముల గెల్వఁగఁ జాలుదు మేమ; మాకు నీ యర్ణవ వేష్టిత క్షితి యనర్గళ విక్రమ మొప్పదక్కు; మా నిర్ణయ మెల్ల నిట్టి; దవినీతియొ నీతియొ చూడుమీ తుదిన్.’ |
295 |
| క. |
అను పలుకులకు విషాదము | దనుకఁగ ధృతరాష్ట్రవిభుఁడు దననందను నే మనియుం బలుకఁగఁజాలక | వెనుఁబాటున నిట్టులనియె విదురునితోడన్. |
296 |
| తే. |
‘మృత్యుపాశోపహతుఁడయ్యె మీఁదు లేక | సూతనందనుతోఁగూడి నా తనూజుఁ డకట! నాశంబుఁ బొందువాఁడయ్యె; మనకు | నింకఁ జేయంగ నగుపని యెద్ది చెపుమ?’ |
297 |
| వ. | అనిన విని విదురుం డతని కిట్లను: ‘మనవారలు మున్న దుర్బలులు. తమలోనం బెనంకువలయి విరస వచనంబు లాడుచు నింతలు పుట్టించుట యది యర్జునునకుఁ గార్యసాధనం బింతియకాక యే మనువారము? వారలు బంధుమిత్త్ర సహాయులుం దారును నొక్క తలంపువారలయి యున్నవారు. వలవని యీ వెంగలి మాటలు విడిచి పాండవులం బిలువం బనిచి తగవు నడపుటదక్క మనకుఁ జేయందగుపని వేఱొండు గలుగునే?’ యని చెప్పిన, ధృతరాష్ట్రుండు సంజయు చెప్పిన కార్యవచనంబులు కొఱంత వినంగలవాఁడై యతని దిక్కు మొగంబు సేసి. | 298 |
| క. |
‘మును వరుసతోడఁ దన తలఁ | చిన యన్నియు నీవు వినఁగఁ జెప్పి తగవుమై నిను వీడుకొల్పునెడ, న | ర్జునుఁ డేమని నిశ్చయించెఁ జూతము చెపుమా!’ |
299 |
| క. |
అని యడిగిన సంజయుఁ డి | ట్లనుఁ: ‘దుదిఁ బార్థుండు నిశ్చయము సేసి సుయో ధనుతో నిందలి పెద్దలు | వినఁగా ననుమన్నపలుకు వినుము నరేంద్రా!’ |
300 |
| మ. |
‘కురువంశోత్తముఁడైన ధర్మజుఁడు ‘నాకుం దండ్రిపా లీఁదగున్ ధరలో సా’ మని తాన పల్క, వినియున్ దర్పంబుమై నీక త క్కిరయేనిం, జటు లాస్మదీయ విశిఖాగ్నిజ్వాలలం దాహుతుల్ వరుసం బెట్టుదు ధార్తరాష్ట్రతతి నైశ్వర్యం బవార్యంబుగన్.’ |
301 |
| వ. | అని పలికి, కౌఁగిలించుకొని భూషణాంబరాది కమనీయ వస్తువు లొసంగిన, నేనునుం బాండవులను వాసుదేవుని సవినయంబున వీడ్కొని యింతవట్టును దేవరకు నెఱింగింప వేగంబ వచ్చితి’ ననిన నమ్మాటలు దుర్యోధనుం డాదరింపక పెడచెవులంబెట్టె; ధృతరాష్ట్రుండును ఱిచ్చవడి యూరకుండె; నప్పు డయ్యిరువురపాలను సంజయుం డొక్కరుండుదక్క నయ్యాస్థానంబున నున్న సమస్త జనంబులును దిగ్గన లేచి తమతమ నివాసంబులకుం బోయిరి; తదనంతరంబ. | 302 |
| క. |
తనుజవశవర్తి యగు న | మ్మనుజేంద్రుఁడు దన సుతుండు మర్దింపఁగ నో పునొ యనిఁ బాండుతనూజుల? | నను మతి సంజయునితోడ నాడె దురాశన్. |
303 |
| సీ. |
‘ఈ రెండు వీళుల తారతమ్యంబులు | నెఱుఁగుదు; పోరైన నెవ్వ రోర్తు రిది నిశ్చయింతమే? యెందు నుపాయంబుఁ | బౌరుషంబును గలవారు గలరు? సూతము చెపు’ మన్న సూతనందనుఁడు ‘న | న్నడిగెద వే నొంటి యడుగవలదు; మీ యయ్య సాత్యవతేయుఁ డీయెడకు వేం | చేయునట్లుగ భక్తిఁ జేసి తలఁపు; |
|
| తే. |
పిలువఁబంపు గాంధారి; వారలు వినీతి | రతులు, నిశ్చయవిదులు, ధర్మజ్ఞ చిత్తు; లుల్లమున నీ కసూయాదు లొదవెనేని | పూని మాన్పంగ నేర్తురు మానవేంద్ర!’ |
304 |