పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము
శ్రీకృష్ణుఁడు భీమసేనునిఁ గౌరవులతోడి యుద్ధమునకుఁ బురికొల్పుట (సం. 5-73-1)
తే. అని సహోదరు లాజి నాయాసపడుట | కోర్వమియుఁ గౌరవులఁ జంప నొల్లమియును,
గలుగు నెయ్యంబు పెంపునఁ గరుణ నార్ద్రుఁ | డైన పవనజుఁ బురికొల్ప నాత్మఁ దలఁచి.
53
వ. మురమర్దనుం డతనితో నిట్లనియె : 54
ఉ. ‘యుద్ధము మీఁది వేడ్కయు మహోగ్ర విరోధుల నల్కఁజేయు ద
ర్పోద్ధతియున్‌ సుయోధనుని యున్నతి సైఁపని యేపు రాజ్యసం
సిద్ధి నిజాగ్రజన్మునకుఁ జేయు తలంపును గల్గు నీ వసం
బద్ధములైన వాక్యములు వల్కుట యొప్పునె కీచకాంతకా!’
55
వ. అని యంత నిలువక. 56
క. ‘వెఱ పెట్టిదియో యెన్నఁడు | నెఱుఁగని నీ యట్టివాని కెవ్వరొకో యీ
పిఱికితన మింత యలవడ | గఱపినవా’ రనుచు శౌరి గలకల నవ్వెన్‌.
57
వ. దానికి దరహసితవదనుం డగుచు భీమసేనుండు వసుదేవసూనున కిట్లనియె: 58
ఉ. ‘బంటుతనంబు మాటలకుఁ బాఱకు; పాండునృపాలుపాలు గై
కొంటయ చాలునన్న నృపకుంజరు పల్కుల కడ్డమాడ రా
కుంట యెఱుంగవే; మును సుయోధను చందముఁ జూపి యప్పు డే
మంటి యుపేంద్ర! న న్నని రణాగ్రమునన్‌ నిను మూదలించెదన్‌.
59
క. నా కొలఁది విచారింపక | నీ కిట్లనఁ దగునె? మిన్ను నేలయు నిమ్మైఁ
గాక తిరుగంగఁ బడినం | బో కే ముంజేతు లొడ్డి పోవఁగఁ ద్రోతున్‌.
60
ఉ. నావుడు ‘నవ్వుటాల కనినం బవనాత్మజ! యింత యేటికిం?
గేవల యోధవే? పరుల కిల్బిషముల్‌ దలపోయ కిమ్మెయిన్‌
జావడమైనఁ జూచి యిది చందము గాదని యంటిఁగాక, నీ
చేవయు లావు నీవు మును చేసిన భంగులు నే నెఱుంగనే?
61
వ. అని చెప్పి మాధవుండు మఱియును. 62
ఉ. ‘పార్థుఁడు పోరఁ దేరు గడపం దనకున్‌ ననుఁ గోరి యెంతయుం
బ్రార్థన సేసె; దాని కనురాగము నొందితి నేను గాన యు
ద్ధార్థులమైన మాకు నిను నాసపడం దగదే? యశంబు నా
నార్థములున్‌ విరోధి విజయంబునఁ దక్కఁగ నొంటఁ గల్గునే?’
63
వ. అనవుడు. 64
శా. ‘ఏమీ! పార్థుఁడు నీవు దండిమగలై యీవచ్చు కౌరవ్య సం
గ్రామక్షోభము బాహుదర్పమునఁ దీర్పం బెద్ద మిఱ్ఱెక్కి మి
మ్మే మెల్లన్‌ వెఱఁగంది చూచెదముగా; కీసారెకుం బోయి రా
భీముం డిత్తఱి రిత్తమాటలకుఁ గోపింపండుసూ పెంపఱన్‌.’
65
వ. అని పలికి యివ్విధంబున గోపాలదేవు మేలంపు మెయివడి కార్యవచనంబులకుం దగం దానును దోడ్తో సరసం బాడుటయకా మఱుమాటలాడి యంతటఁ దనివోవక బకమర్దనుం డతనితో నిట్లనియె: 66
ఉ. ‘కయ్యము గల్గినట్లయిన గంధ గజ ప్రకరంబు కుంభముల్‌
వ్రయ్యఁ దురంగ పంక్తులు ధరం బడఁ దేరిగముల్‌ బడల్పడన్‌
డయ్యమి కీవు వెక్కసపడన్‌ గదపండువు సేయఁగోరు నా
దయ్యము నెత్తికోలు దుది దాఁకుటగాదె భుజంగభంజనా!
67
చ. అన విని దేవకీతనయుఁ డాతని కిట్లనుఁ ‘జెప్పినంత కం
టెను మిగులంగఁ జేయుదు గడింది మగండవు నిన్నుఁ దెప్పగాఁ
గొని పలుమాఱు నాపదలకున్‌ భయమొందక దుఃఖవార్థు లీఁ
దిన మము నెల్ల నిక్కొఱఁత దీర్చి సుఖాత్ములఁ జేయు పావనీ!
68
క. ఇదె పోయెదఁ గౌరవ్యులఁ | బదనికి రాఁ బలికి సంధి వాటించెద; నా
కది యొప్పదె! కాని తుదిం | గుదురింతకు నీవ కావె గుణరత్ననిధీ!’
69
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )