| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | అనిన వాసుదేవున కర్జునుం డిట్లనియె : | 70 |
| తే. |
‘చెప్పఁ గల యంతవట్టును జెప్పె నీ క | జాత శత్రుండు; వింటి వీ వా తెఱంగు; మాకు నెల్లను బలుకంగ మాట లొండు | గలవె? యైనను జెప్పెదఁ గన్నయంత. |
71 |
| మ. |
ధృతరాష్ట్రుం డతిలోభదూషితుఁడు ధాత్రీభాగ మీ నేర్చునే సుతుఁడుం గష్టుఁడు సంధి యేల యగునంచున్ మున్న కైపెక్కిన ట్టితలం పచ్యుత! నీకుఁ గల్గినది; గాండీవంబు దివ్యాస్త్ర సం తతియుం బెట్టినయట్లయుండ మముఁ జింతం బాపరాదో కదే! |
72 |
| ఉ. |
నీ వొనరింపఁ బూనిన పనిం గమలోదర! కీడు వుట్టునే? కా వనినట్ల యుండి యవుఁ గార్యము; లట్లగుటం బ్రయత్న సం భావనసేఁత పౌరుషము పద్ధతి తత్ఫలసిద్ధి వొందుచో దైవము దోడ్పడన్ వలయుఁ; దథ్యము రెండును నీ వినోదముల్. |
73 |
| ఉ. |
వేరిమి ధర్మజుం బరిభవించిన ద్రోహులు వధ్యులన్న నె వ్వారికిఁ బోలదే సుజనవత్సల! నీ విటులంట వారు మ మ్మీరసమెత్తి కీడ్పఱిచి యింతలుసేసినదాన నీ మదిం గూరిన నొవ్వుసొంపునను గోపము పెంపునఁ గాదె యారయన్. |
74 |
| ఉ. |
ఐనను జిత్తగింపు; ద్రుపదాత్మజ నాసభ నట్లు సేసినన్ దానికి సైఁప లెస్సయని దైన్యముఁ బొందుట కోర్చి యమ్మెయిం గాననభూమికిం జనుట కారుణికోత్తమ! నీ వెఱుంగవే? కాన సహించి పాండవులఁ గౌరవులం దగఁ గూర్పు నేర్పునన్. |
75 |
| తే. |
అలవి యెఱుఁగక ధార్తరాష్ట్రులు గడంగి | మమ్ముఁ బఱచిన పాటులు మానసమునఁ జవుటఁబెట్టిన విత్తుల చందమొంది | యంకురింపక చెడిపోయె నంబుజాక్ష! |
76 |
| వ. | అమ్మొఱకుల నెమ్మెయి నయినను. | 77 |
| క. |
ఒడఁబఱిచి మాకు వారికిఁ | బుడమి సగము గాఁగఁ జేసి పొంది పొసఁగియుం డెడు నట్టి తెఱఁగు సేయుట | కడు మే; లది గౌరవము సుఖంబును జేయున్. |
78 |
| క. |
నీ కిట్టిది చిత్తమునకు | రాకున్నది యేని వలదు రం డిమ్మెయి మీ రీకార్యము సేయుం డని | మా కానతి యిమ్ము కంసమర్దన! తెలియన్. |
79 |
| మ. |
హిత మిబ్భంగిది మాకు ధర్మము తెఱం గిట్లుండునం చేను నీ మతి బోధింప వలంతినే? హితము ధర్మంబున్ విచారించి చూ చి తగున్‌బొమ్మని యేది పంచి తది నిశ్చింతంబునంజేసి యు న్నతిఁ బొందంగలవారమై యునికి కృష్ణా! నేఁడుగా వచ్చెనే! |
80 |
| వ. | అనిన విని కృష్ణుండు విజయున కిట్లనియె : | 81 |
| చ. |
వెరవున లావునం గృషికి వేయు విధంబుల మేలొనర్చినం దొరకొనునే ఫలంబు? తఱితోఁ దగు వర్షము లేకయున్న; నె ప్పరుసున లెస్స సేసినను బౌరుషముల్ ఫలియించు టెల్ల నా దరణమునం బ్రసన్నమగు దైవముచేఁతన చూవె ఫల్గునా! |
82 |
| ఉ. |
కావున సంధికిం బురుషకార మొనర్చెద నోపినంతయున్ దైవముచేఁత యెట్లగునొ దాని నెఱుంగ సుయోధనుండు సం భావనసేసి పా లొసఁగు పాడియ కల్గిన బాల్యమాదిగా నేవిధి నైననుం జెఱుప నింతలు పాపము లాచరించునే? |
83 |
| వ. | అది యెల్ల నట్లుండె; నిచ్చట విరాటు పసులన్ బెట్టింప నీవు వోయిన యప్పుడు భీష్ముండు దుర్యోధనుతోఁ జెప్పిన తెఱంగు. | 84 |
| ఉ. |
వచ్చినవాఁడు ఫల్గునుఁ డవశ్యము గెల్తు మనంగరాదు రా లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే? హెచ్చగుఁ గుందగుం దొడరు టెల్ల విధంబుల కోర్చు టట్లుగా కిచ్చఁ దలంచి యొక్క మెయి నిత్తఱిఁ బొందగుచేఁతయుం దగున్. |
85 |
| వ. | అనియె దానికతం డుత్తరం బిచ్చిన తెఱంగు. | 86 |
| ఆ. |
మనకుఁ బాండురాజతనయవర్గమునకు | నెట్లు వొందు గలుగు? నేను రాజ్య భాగ మీను; సమరభంగిక విక్రమ | నిరతిఁ బూను టిదియ నిశ్చయంబు. |
87 |
| వ. | అని పలికె; నది యంతయుఁ బదంపడి మనమెల్ల వింటిమ కాదె! యా మాటల ఫలం బప్పుడ కనియు నా కష్టాత్ముండు వెండియుఁ దెలియండు. | 88 |
| తే. |
అతని గుణదోషముల చంద మట్లయుండె; | నాకు ధర్మజు బుద్ధిన నడపవలయు నిత్తెఱం గాచరింపంగ నేఁగి యచట | నెల్ల తెఱఁగును నేర్పడ నెఱిఁగివత్తు.’ |
89 |
| చ. |
అనిన ముకుందుతో నకులుఁ డల్లన యిట్లను ‘నీకు ధర్మజుం డును బవనాత్మజుండు నరుఁడుం దగఁ జెప్పుట రిత్తగాదు; మా మనము లరణ్యవాసమున మత్స్యమహీపతిపాల నున్నయ ద్దినముల భంగి గావు; కృపఁ దీవ్రతఁ గుందిన చంద మయ్యెడున్. |
90 |
| క. |
కడవఁగ నొకళ్ళు పసరము | నడిచిన నొక్కళులుఁ బెయ్య నడువ వలయునే? చెడుతెరు వా కౌరవ్యుల | కడ నిలుచుంగాక మనకుఁ గ్రౌర్యం బేలా? |
91 |
| సీ. |
గోగ్రహణంబునఁ గోలె నెంతయు మెత్తఁ | బడకుండుదురె వారు పద్మనాభ! నీ యనుగ్రహమున నెమ్మిమైఁ గూడిన | బలము లేడక్షౌహిణులును, దొరలుఁ, బాంచాల యాదవ పాండ్య కేకయ మాత్స్యు | లొకతెంపు నెఱుఁగకయున్నవారె భీమార్జునుల లావు పెంపును నీ సహా | యంబును గలుగుట కలుక రెట్లు? |
|
| ఆ. |
గురుఁడుఁ గృపుఁడు బాహ్లికుఁడు భీష్ముఁడును బుద్ధి | సెప్పి వారిఁ జక్కఁ జేయరెట్లు? కార్య మీవు చెప్పఁగా విదురుండు వి | నంగ నెట్లు గాదనంగ వచ్చు? |
92 |
| వ. | అట్లుంగాక నీవు దమపాలికిం బోవుట ధార్తరాష్ట్రు లాదరింపకుండ వెఱవరే? నీ పోయినప్పుడ యీ కార్యంబు చక్కనగు’ ననిన విని సహదేవుండు వాసుదేవున కిట్లనియె: | 93 |
| ఉ. |
‘రక్కెస మాట లాడెదరు రాజును దమ్ములు; వానిలోన నీ వొక్కటియైనఁ గాదనక యూఁ కొనుచుండుట యంతకంటె మే; లక్కట! యిట్లు వేఁడికొననైనను బోయెదువో; సుయోధనుం డెక్కడ? భూమిలోన సగమిచ్చుట యెక్కడ? దానవాంతకా! |
94 |
| మ. |
తలఁపం గూడునె యింత లేసి దొర లీ దైన్యంబు? చుట్టంబులుం జెలులుం దిట్టరె? లాఁతిరాజులకు మెచ్చే యి వ్విధం’ బిట్టిదిం గలదే? వేఁడఁగ ధర్మజుం డడుగఁ బోఁగాఁ గృష్ణుఁ డా ధార్తరా ష్ట్రులు పాలీక చలంబునం బెనఁగ నిట్లుం గూడు దీపయ్యెనే? |
95 |
| ఉ. |
వీరలు ధర్మమార్గము సవిస్తరతం దగనాడి రేనియు న్వారలు దాని కియ్యకొనినన్ విను మచ్యుత! యట్టిసంధి పెం పారఁగ నేర్చునే? యుచితమైనది కయ్యమ; వంకమాట లే నేరఁ గురుప్రవీరుసభ నిశ్చయ మిట్టిద కాఁగఁ జెప్పుమీ! |
96 |
| మ. |
తుది రాజ్యమ్ము సగమ్ము గొ; మ్మడవియందుం, బేరు వంచించియుం, బదుమూఁడేఁడులు నీవునుం దిరిగిరాఁ బాలీకపోవచ్చునే? యది గాదేఁ దెగి బంటవై యఱుము మాయల్‌వన్ను నేర్పింకఁ జె ల్లదుసూ నీ కని యా సుయోధనుని యుల్లం బుచ్చిపోనాడుమీ!’ |
97 |
| మ. |
అనినన్ సాత్యకి ప్రీతుఁడై ‘యితఁడు లెస్సై యుండఁబల్కెం; బ్రయో జనముం గల్గదు గౌరవంబుఁ జెడు దుశ్చారిత్రకుం డా సుయో ధను బోధింపఁగఁ బోయినన్; సరభసోత్సాహంబుమై నున్న వీ రనికాయంబున కెల్లనుం బ్రియము సంగ్రామంబు మే లెమ్మెయిన్.’ |
98 |
| వ. | అనిన విని రథికవరు లందఱు ‘సహదేవుం డింత యొప్పనాడునే? సాత్యకి పలుకు లిట్లుండునే? తక్కటివి యెక్కడి మాటలు? పగవారి నడిగికొనంబోవుట యుచితంబఁట! కయ్యంబు కర్జంబుగాదఁట! భంగంబు నీఁగికొనం దగదఁట! యనునిది మొదలుగా ననేకు లనేక ప్రకారంబుల వీరాలాపంబులం గొలువెల్ల నొక్క మ్రోఁతగాఁ జెలంగిన యెలుంగులు నింగి ముట్టెఁ దదనంతరంబ. | 99 |