| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | అనుచు నెలుంగు రాలుపడ నేడ్చిన యాజ్ఞసేనిం గృపాయత్తచిత్తుండయి నారాయణుం డూరార్చి కూర్చుండ నియమించి కన్నీరు దుడువను బెన్నెఱివేణి ముడువనుం దగువారి నియోగించి య మ్మానినితో నిట్లనియె: | 119 |
| ఉ. |
‘మ్రుచ్చిర నేల యేఁ గలుగ? ముద్దియ! నాకు వృకోదరుండు వి వ్వచ్చుఁడుఁ దోడుగాఁగ జనవంద్యుఁడు ధర్మసుతుండు పంప నీ మెచ్చుగ శత్రు సంక్షయము మేకొని చేసెదఁగాక! వేఱొకం డచ్చుపడంగ నేర్చునె? దురాత్ములు కౌరవు లుర్వి యిత్తురే? |
120 |
| క. |
లలనా! యుడుగుము నీ యే | డ్పుల కొలఁదియె కురునృపాల పుత్త్ర కళత్రం బుల యేడ్పు; లింక వానిం | గలకల నవ్వుచు వినంగఁ గాలం బయ్యెన్. |
121 |
| క. |
యమ మహిష ఘంటికా నా | దము వినఁ గౌతూహలంబు దళుకొత్తెడు చి త్తములు గల కౌరవుల కి | ష్టము లగునే సంధికార్య శాంతవచనముల్? |
122 |
| క. |
మొదల విధినియతియును న | ట్టిద యందురు పెద్ద; లది ఘటింపకపో దే మదిఁ జూచి చెప్పినను ద | ప్పదు మేరువు దిరిగెనేనిఁ బాంచాలసుతా! |
123 |
| తే. |
పూని పలికెద వినుము రిపు క్షయంబుఁ | జేసి యుజ్జ్వల పుణ్యలక్ష్మీ సమేతు లైన పాండు కుమారుల యధిక విభవ | మీవు సూచెదు; తడవులే; దిది నిజంబు! |
124 |
| క. |
అని యూఱడిలఁగఁ బలికిన | విని యంకిలి దేఱు చిత్తవృత్తిగలుగు నం గన యే డ్పుడిగెం; దగ ఫ | ల్గునుఁ డిట్లని పలికె నపుడు గోవిందునితోన్. |
125 |
| తే. |
‘పాండవులు ధార్తరాష్ట్రులుఁ బుండరీక | నేత్ర ! చుట్టరికంబున నీకు నొక్క రూప; కావునఁ గోరి యేరూపునందు | నుభయపక్షంబులకుఁ జేయు ముచితహితము. |
126 |
| క. |
ధర్మార్థ సంగతంబుగ | ధర్మతనయు చెప్పినట్ల తగఁ బల్కఁగ నా దుర్మతులు కౌరవులు స | త్కర్మమునకుఁ జొరకయున్న దైవమ యెఱుఁగున్. |
127 |
| క. |
అన విని ‘కౌరవులకు మీ | కును హితముఁ బ్రియంబుఁ జేయఁ గోరియ కుంతీ తనయాగ్రజుపని ధృతరా | ష్ట్రుని కడకుం బోయెదను గడుం బ్రీతిమెయిన్. |
128 |
| క. |
అని పలికిన హరి ధర్మ వ | చనముల తెఱఁగున కజాతశత్రుఁడు చిత్తం బునఁ బొంగి ‘యట్ల చేయుము | మన నిశ్చయ మిదియ దీని మఱవకు మనఘా!’ |
129 |
| వ. | అని కార్యంబు నిశ్చయించి దినశుద్ధి నిరూపించి నారాయణుం జూచి ‘నీ నక్షత్రంబు రోహిణిగదా యెల్లి రేవతి నీకుఁ జంద్ర తారాబలంబులు గలవు; గమనంబునకు రేపకడయ మేలు; పయనం బగుట లెస్స’యని చెప్పిన నప్పలుకుల కతండు సగౌరవంబుగా నియ్యకొనినం బాండవాగ్రజుండు కొలువుం గలయం గనుంగొని యెల్లవారును విన నది యట్లకాక యని పలికి తదనంతరంబ తానునుం దమ్ములుఁ బాంచాలియుఁ బరివారంబును నుచిత ప్రకారంబున నిజనివాసంబులకుం జనిరి; మఱునాఁ డరుణోదయంబునఁ గృష్ణుండు గాలోచిత కృత్యంబులు నిర్వర్తించి సూర్యోపాస్తి సేసి యగ్ని సమారాధనం బాచరించి ధరణిసురులం బ్రణామపూర్వకంబుగాఁ బ్రయాణ దాన ప్రముఖ పూజావిశేషంబులం బ్రీతులం గావించి వారల యిచ్చు నాశీర్వాదంబులును సమంత్రాక్షత దూర్వాంకురాదులునుం గైకొని యుచిత ప్రదేశంబున నుండి సాత్యకి రావించి. | 130 |
| క. |
‘మన ప్రజలోఁ గరిపురికిం | జనుదేరఁగ వలయువారి సవరణతో రం డని యేర్పడ నియమింపు ప | యనమై యేతెమ్ము నీవు’ నని తగ మఱియున్. |
131 |
| వ. | ‘దుర్యోధనుండు దుష్టాత్మకుం; డతని మన్నించు మానుసులునుం గుటిలబుద్ధులు గావునఁ జక్రగదా ద్యాయుధంబులు రథంబునం బెట్టింపవలయు’ నని చెప్పి పనిచి సమయజ్ఞతం బొడసూపి నిలుచున్న దారుకుం జూచి తేరు పూన్ప నియోగించిన, నతండును మణిగణ ప్రభాపటల జటిలంబగు నరదంబు వన్ని శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకంబు లనంబరఁగు తురంగంబులం బూన్చి గరుడధ్వజం బెత్తి తెచ్చినం దానునుం బయనంపుఁ జందంబునఁ గట్టాయితంబై జనంబుల చూడ్కులకుం బండు వగుచుఁ బుండరీకాక్షుండు మంగళ తూర్యంబులు సెలంగఁ జామరంబు లుల్లసిల్ల రథం బెక్కిన యవసరంబున యాదవ పరివారంబుతో నరుగుదెంచిన సాత్యకిం దన రథం బెక్కించుకొని యాంగికంబులైన శుభ సూచకంబులు గైకొనుచుఁ బూర్ణ కలశ వృషభాది భద్రపదార్థంబుల నవలోకించుచుఁ బుణ్యాంగనలు సేసలొలుకఁ జిత్తంబు ప్రసన్నతం బొంద వెడలునప్పుడు. | 132 |
| సీ. |
పాండవ యాదవ పాంచాల కేకయ | పాండ్య మాత్స్యాదులు భద్రదంతి హయరథంబులతోడ నతికుతూహలమున | వచ్చినఁ గనుఁగొని వారినెల్ల సంభావనంబుల సంభాషణంబుల | నాదరించుచుఁ దగ నల్ల నల్ల విభవంబు మెఱయంగ విడిదల పఱపెల్లఁ | గడచిన యత్తఱిఁ గరము శుభము |
|
| ఆ. |
లైన శకునములకు నందఱుఁ బ్రియమంద | నరుగుచున్నయట్టి యవసరమున రథము రథముఁ గదియ రా నిచ్చి ధర్మనం | దనుఁడు నెమ్మి నిట్టు లనియె హరికి. |
133 |
| ఉ. |
‘వచ్చె జనార్దనుం డనిన వార్తకుఁ బ్రాణము మేనికంతకున్ వచ్చిన సేదఁ దేఱుఁ గురువంశ పవిత్రచరిత్ర గొంతి నీ వచ్చటి కేఁగి పాండవుల యందఱ మాఱనిచెప్పి మ్రొక్కుచున్ గ్రుచ్చియ కౌఁగిలించుకొని కుందిన చిత్తము నొప్పి దీర్పుమీ! |
134 |
| చ. |
అడవికి నేఁగునాఁడు మము నంపఁగ నెంతయు దవ్వు వచ్చిన ప్పుడు దనమోము దైన్యమునఁ బొందెడు నశ్రులుఁ జూచి చూచి య ట్లొడఁబడి డించిపోవలసె నుమ్మలికమ్మున గొంతి యింతకుం బడుగయి పాలలోఁ బడిన బల్లి విధంబున నుండకుండునే? |
135 |
| క. |
లక్కయిలు కాలినది మొద | లక్కట! మా తల్లి మాకునై నెవ్వగతోఁ బెక్కిడుమలఁ బడుచున్నది | దిక్కెవ్వరు లేనియట్లు దీనత్వమునన్. |
136 |
| క. |
ఏ ననుట గాఁగ దుఃఖము | లైనవి దెగు సమయ మయ్యె నని చెప్పుము; మీ మేనత్త నూఱడింపుము; | దా నెప్పుడు నీవు గలవు తన కనుచుండున్.’ |
137 |
| వ. | అని చెప్పి వెండియు. | 138 |
| ఆ. |
‘గురుఁడు బాహ్లికాది కురువృద్ధులును సుహృ | ద్బాంధవులు నశేష ధరణిపతులుఁ బ్రీతిఁ బొంద నెవ్వరికి నేది దగుఁ బ్రణా | మాది విధుల నడపు నాదుపలుకు. |
139 |
| క. |
పరమ ప్రియమున నాకై | పరిరంభణ సేసి గాఢ బాంధవ సాంద్రా దరమున సంభాషింపు వి | దురుతో; మధ్యస్థుఁడగు హితుం డతఁ డనఘా!’ |
140 |
| వ. | అనియెఁ దదనంతరంబ యర్జునుండు. | 141 |
| చ. |
‘జనులు వినంగ రాజ్యమున సాము గొనంగలవారమన్న యీ జనపతి కార్యనిశ్చయము సమ్మతి గైకొని చేసినన్ సుయో ధనుఁడును దమ్ములున్ సఖులు దానికి నేమును నియ్యకొందు మొం డనిన సపుత్త్రమిత్త్రముగ నద్దెస నందఱ గ్రొచ్చి పాఁతుదున్.’ |
142 |
| మ. |
అనినన్ మెచ్చి వృకోదరుం డితఁడు కార్యం బింత దెల్లంబుగాఁ బొనరం బల్కునె?’ యంచుఁ బేరెలుఁగు సొంపుం బొంద వక్త్రంబు పొ ల్పున దర్పం బొలయంగ నంగములునుం బొంగార నుద్‌బృంహిత ధ్వనియై పొల్చు మహోగ్ర సింధురము చందం బొంది యొప్పెం గడున్. |
143 |
| క. |
నకుల సహదేవులును దా | నికి సంతసమంది ‘యిట్లు నెయ్యము కయ్యం బొక తెఱఁగు సేసికొని తడ | యక ర మ్మని పలికి రప్పు డచ్యుతుతోడన్. |
144 |