| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | ఇవ్విధంబునం బాండునందను లందఱును గోవిందునకు వలయు మాటలు సెప్పి ‘యతనిఁ గౌఁగిలించికొని యథోచిత ప్రకారంబుల వీడుకొని వలగొని మగిడిరి; తక్కినవారలు నర్హంబులగు తెఱంగుల నామంత్రితులై మరలిరి; మాధవుండును బ్రయాణ సర్వ సంభార నిర్వాహకులం గలయం గనుంగొని తగిన సల్లాపంబులు సేసి, కరినగరంబు పెం దెరువుఁ గైకొని దారుకుని చతురత్వంబునఁ దురంగంబుల పటుత్వంబున నత్యంత సమీచీనంబైన యానంబున మనం బలరం జనిచని, యొక్కయెడ నారద జమదగ్ని కణ్వాదులగు మహామునులం గొందఱం గని రథంబు డిగ్గి నమస్కరించి సభక్తి తాత్పర్యంబునఁ గుశలం బడిగి, మీ రిక్కడకు, విజయంచేయుటకుఁ గతం బేమి? సేయంగల పని యెయ్యది? నా కానతిం’ డనిన నారాయణునకు నారదుం డిట్లనియె. | 145 |
| సీ. |
‘అనఘ! పుణ్యాత్ముఁడ వగు నిన్నుఁ గనుఁగొనఁ, | గౌరవసభ నీవు గారవమునఁ బలికెడి పలుకుల భంగు లాకర్ణింప, | విదుర భీష్మాదులు విను తెఱంగు నుత్తరం బిచ్చు కార్యోక్తులు నెఱుఁగంగ | వేడుక వచ్చిరి వీరలెల్ల’ నని చెప్ప విని ‘లెస్స, యట్ల చేయుదురుగా’ | కని హరి వల్కిన నమ్మునీంద్రు |
|
| తే. |
లతని దీవించి ‘నీవు పొ; మ్మచటి కేము | నరుగుదెంచెద’మని ప్రీతి ననుప నరిగి యొక్క పుణ్యాశ్రమంబున యొద్ది యేట | విడిసి దివస ప్రవర్తన విధులు నడిపి. |
146 |
| వ. | కమలనాభుండు గదలిపోయి సూర్యాస్తమయ సమయంబునఁ గుశస్థలంబు సేరం జనునప్పు డందలి విప్రు లెదురు వచ్చి కాంచి నిజనివాసంబులకుం బిలిచినం బ్రసన్నవదనుండగుచు సమ్మర్దంబు వలవదని పలికి విశాల రమణీయంబైన బహిరంగణంబునం బటకుటీర ప్రకరం బెత్తించి విడిసి, తగువారును దానును వారల గృహంబుల కరిగి యభ్యాగత పూజలు గైకొని వారిని సంభావించి విడిదలకుం జని సమయ సముచిత వృత్తిం బ్రవర్తిల్లుచుండె; నంత నక్కడ; | 147 |
| తే. |
వార్త విని యాక్షణమ కౌరవక్షితీశ్వ | రుండు గాంగేయ గురు విదురులను బుత్త్రు సంజయునిఁ గర్ణు సైంధవు శకునిఁ బిలువఁ | బనిచి తా నిట్టు లనియె నందనునితోడ. |
148 |
| వ. | ‘కృష్ణుఁడు పాండవ కార్యార్థంబుగా మనయొద్దకు వచ్చుచున్నవాఁడు; నేఁడు కుశస్థలంబున విడిసె రేపిందులకు వచ్చునని వింటి; మిట్టి యాశ్చర్యంబునుం గలదే! సర్వలోకాభిగమ్యుండగు నమ్మహానుభావునకు మన మభిగమ్యుల మైతిమి; మన కింతకంటెను బెంపెయ్యది? యతం డెవ్వరివలన సంతుష్టుండయ్యె వారికి శుభంబును, నెవ్వరిదెస ననాదరంబు సేసె వారికి నశుభంబు నగుటదప్ప; దతనికి వలయు పూజ లాచరించుటకు సంవిధానంబు సేయుము; గృహాలంకరణాది మంగళప్రకారంబు లనుష్ఠింప నియమింపు; మతని చిత్తంబునకు నీ విభవంబును దనమీఁది ప్రియంబునుం దోఁచునట్టి తెఱంగున సమస్తంబును సమకట్టుము. | 149 |
| క. |
అనిన ధృతరాష్ట్రు పలుకులు | గొనియాడిరి సంతసిల్లి గురుఁడును భీష్ముం డును నౌఁగాకని దుర్యో | ధనుడుం బరిచారక ప్రతతిఁ బిలిపించెన్. |
150 |
| వ. | ఇట్లుచిత పరివారంబు రావించి యతండు. | 151 |
| క. |
‘అలుకుఁడు మృగమదమున, మ్రు | గ్గులు వెట్టుఁడు గప్పురమునఁ, గుంకుమమున గో డలు పూయుఁడు’ మణిదామక | ములు గట్టుఁడు పెద్ద కూటమున సొంపారన్. |
152 |
| వ. | మఱియు నగరెల్లను శోభిల్ల నలంకారంబు సేయుండు. | 153 |
| క. |
పెనుపుం జతురత మెఱయఁగ | మన యింటను దుస్ససేను మందిరమున శో భనశిల్పము లొనరింపుఁడు | చనుఁడు వృకస్థలమునందుఁ జప్పరము లిడన్. |
154 |
| వ. | అది విడి పట్టు గాఁదగియెడు ప’ ట్టని పలికి ‘వాసుదేవుండు రేపకడయ వచ్చునంతకుమున్న యింతయుం గావింపవలయు’ నని పనిచి పురంబున నుత్సవంబు సాటుండని నియోగించి వివిధ గంధ మహిత మాల్యంబులు సంపాదింపను మణిభూషణ చిత్రాంబరంబులు సమకట్టను సరసాన్నస్వాదు పాన ద్రవ్యంబు లొడఁగూర్పను నేర్పరులగు తద్‌జ్ఞుల నియమించె; నట్టి యెడ నాంబికేయుండు విదురున కిట్లనియె: | 155 |