పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము
శ్రీకృష్ణుఁడు కుంతీదేవి నూఱడించుట (సం. 5-88-89)
చ. ‘సుగుణవు, పుట్టినింటికిని జొచ్చినయింటికిఁ దేజ మెక్కఁగాఁ
దగుచరితంబునన్‌ నడచు ధన్యవు, ధీరవు, దేవి! నీ వెడ
న్వగ లడఁగింపకున్న భువనంబుల నింకిట నెవ్వ రోర్చువా
రు గలఁక దక్కుమీ హృదయ రోగము లన్నియుఁ బుచ్చివైచెదన్‌.
203
క. తనయులుఁ గోడలు సేమం | బున నున్నా; రధిక భక్తిపూర్వముగా దం
డనమస్కారంబులు నీ | కొనరించిరి, కౌఁగిలించి రుల్లములఁ దగన్‌.
204
క. నీ కొడుకు లొండు సుఖములు | చేకొన; రవ్వీరసుఖమ చిత్తములఁ గరం
బాకాంక్షింతు; రలంతులఁ | బోక గలుగు నెట్టు? లల్పబుద్ధులె వారల్‌?
205
క. ఉత్సాహంబున శత్రు కు | లోత్సాదన విధి యొనర్చి యున్నత సామ్రా
జ్యోత్సవము నొందు పుత్త్రుల | నుత్సుకతం జూతుగాక; యూఱడు మింకన్‌.’
206
చ. అన విని మోము విచ్చుచు మురారికి నిట్లనుఁ గుంతి ‘పాండు నం
దనులకుఁ దండ్రియున్‌ గురువు దైవము నారయ నీవ కావె! నీ
మనమున ధర్మమున్‌ హితము మంచిగఁ జూచి విధించినట్ల చే
సి నెగడువారు గాక నినుఁ జేరిన నాపద లొంద నేర్చునే?
207
క. వారలక యేల మాధవ! | కౌరవులకు మఱియు నీజగంబులకెల్లం
జేరుగడ నీవ; నీ పలు | కారయ వేదంబ కాదె యఖిలంబునకున్‌.’
208
వ. అనినం బ్రసన్నవదనుం డగుచు నద్దేవి గారవించి యామంత్రణంబు సేసి తదావాసంబు వెలువడి తనరాకకు నలంకృతంబైన దుర్యోధను మందిరంబునకుఁ గృతవర్మ సాత్యకి సమేతుండయి పోవు గోవిందునిం గని తదీయ ద్వారపాలకులు సంభ్రమంబునం బఱచి యతని కెఱిఁగించి తదనుమతంబునం బఱతెంచి యెదుర్కొని కక్ష్యాంతరంబుల సందడి నెడగలుగ జడియుచు వినయంబునం దోడ్కొనిచన నమ్మనుజవిభుండు కైలాసశిఖరాకారంబగు సౌధంబున బాహ్లిక భీష్మ ద్రోణ ప్రభృతులును, గర్ణశకుని సైంధవాదులును, దుశ్శాసన వికర్ణ దుర్ముఖ ప్రముఖులును మఱియు ననేక దేశాధీశులునుం బరివేష్టింపఁ బేరోలగంబున సింహాసనాసీనుండై యున్న యెడకుం జను నప్పు డాసుయోధనుండు సపరివారంబుగాఁ బ్రత్యుత్థానంబు సేయం జేర నరిగి యతనికిం దగువారలకు నాలింగనాద్యుపచారంబులు తానుం దమ్ముండును నాచరించి. 209
క. అతఁ డునుపఁగఁ గనక మయో | న్నత పర్యంకంబునందు నారాయణుఁ డూ
ర్జిత మహిమ నుండి యభ్య | ర్చితుఁ డయ్యెఁ దగంగ నతనిచే సత్కృతులన్‌.
210
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )