| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | సాత్యకియును సముచిత ప్రకారంబునం బూజితుండయ్యెఁ; దదనంతరంబు నిజాసనాసీనులయి తన మొగంబునం జూడ్కి నిలిపియున్న దుర్యోధనాదులతో మాధవుండు మధురసంభాషణంబులు సేయుచుండె; నట్టియెడ. | 211 |
| తే. |
సముచితంబుగఁ గూరలచంద ముగ్గ | డించి కుడుపు తెఱంగు పుట్టించి పలుకు నా సుయోధనుతోఁ గృష్ణుఁ డచటఁ దాను | గుడువ నొల్లక యునికి యేర్పడఁగఁ జెప్పె. |
212 |
| వ. | చెప్పిన విని దుర్యోధనుండు సూర్యసూను వదనం బవలోకించి యల్లన యిట్లనియె: | 213 |
| క. |
‘హరి వలికిన విధ మెంతయు | నెరవై యున్నయది వింటె యిమ్మాట తెఱం గరయుదము తొలుత; నీ పెను | పరిచందం బెల్ల నెఱుకపడియెడుఁ బిదపన్.’ |
214 |
| వ. | అని పలికి యచ్యుతున కిట్లనియె: | 215 |
| తే. |
‘వలయు నన్నపానంబులు పలు దెఱఁగుల | నేర్చు విధముల నే మొడఁ గూర్చి వేడ్క నున్న నీ వుపయోగింప నొల్లకునికి | బాంధవమునకు నీతికి బాహిరంబు. |
216 |
| క. |
కౌరవులకుఁ బాండవులకు | నారయ నీ వొక్క రూప; యసదృశ ధర్మా చారుండవు రాజునకుం | గూరుతు? కతమేమి యిట్లగుటకుం జెపుమా’. |
217 |
| క. |
అనుడు నుపేంద్రుఁడు మనుజేం | ద్రుని కిట్లను ‘దూత లెందుఁ దొలిదొలి గుడువం గొనఁ గట్టఁ దొడఁగుదురె? వ | చ్చిన కార్యము దీర్చి పిదపఁ జేయుదు రెల్లన్.’ |
218 |
| వ. | అనిన గాంధారీనందనుండు దేవకీనందనున కిట్లనియె: | 219 |
| ఆ. |
‘వేగపడుట మేలె? వినుము; కార్యము దీఱుఁ | దీఱకుండు దాని తెఱఁగు దగిన యప్పు డాడరాదె? యిప్పుడు ముకుఁ ద్రాటఁ | గాలు గ్రువ్వనేల కమలనాభ! |
220 |
| వ. | నీవు వచ్చినవాఁడవు మా యింటఁ గుడిచి కూర్చుండి యెల్లపనులుం జెప్పుట యొప్పుఁగాక; కుడువనొల్ల ననం దగునె? దీనికిం గారణంబు నా యెఱింగిన యది లేదు; విచారింపక పలికి’ తనిన మందరధరుండు మందస్మితంబుతో నందఱం గలయం గనుంగొని ధార్తరాష్ట్రుకరంబు గజంబు పల్లవం బల్లన తెమల్చు లీలం గేల నమర్చి ‘యిట్టి మాటలు తేటపఱుపవలయునేని విను’మని యతని కిట్లనియె: | 221 |
| చ. |
ప్రియమెసఁగం దగం బిలిచి పెట్టెడు కూ డది లెస్సకూడు; ద క్కయనయహీనతం దమకు నాపద యైనెడ నిట్టునట్టు నే మియు ననలేని కూ డదియు మేవడియై చను; నీవు మా దెసం బ్రియుఁడవు గావు; మాకు ధృతి పెంపఱ నాపదలే దొకింతయున్. |
222 |
| వ. | అట్లుంగాక. | 223 |
| క. |
పగవారి యింటఁ గుడిచిన | నగుఁ దమ కనుమాన; మమృత మైనను దారుం బగతురకుఁ గుడువఁ బెట్టఁగఁ | దగ; దొడళుల కెప్పు డెవ్విధము వాటిలునో? |
224 |
| వ. | నేను పగతుండనె యంటేని. | 225 |
| క. |
అలుగుదు పాండవులకు వా | రలు నాకుం బ్రాణములు ధరావల్లభ! యి ట్టలముగఁ దమ ప్రాణములకు | నలుగు జనులు పగతు రగుట యనుమానంబే? |
226 |
| ఆ. |
కారణంబు లేక కౌంతేయులకు బాల్య | మాదిగాఁగఁ గీడె యాచరింతు; పుణ్యపరులు తోడఁబుట్టువు లార్యులు | వైర మెత్తఁదగునె వారితోడ? |
227 |
| వ. | ఇట్లున్న మీ యందఱ యన్నంబులు దుష్టాన్నంబులు; విదురుం డొక్కని యన్నంబు భోక్తవ్యంబని నిశ్చయించితిఁ గావున నందుఁ బోయెద’నని చెప్పి యజ్జనపతి యనుమతి సేయఁ జనునప్పుడు తోడన బాహ్లిక భీష్మాది కౌరవులును గుంభసంభవ ప్రముఖులైన మాన్యులును జని మాధవుతోడ ‘మా యిండ్ల నెల్లను గానిక లాయి తంబులు చేసికొని నీవు విజయం చేయుటకు నెదురు చూచుచున్న వార’మని పల్కి ప్రార్థించిన ‘నే నన్ని చోట్లకు వచ్చిన వాఁడన; యందఱ యర్చనలుం గైకొంటిన; మీరు నిలువుం’డని వారల నిలిపి విదురు గృహంబునకుం బోయిన. | 228 |
| సీ. |
సంభ్రమ స్నేహ నిశ్చల భక్తియుక్తిఁ బ | విత్ర మజ్జనము గావించి విదురుఁ డెల్లవంటకమును నేర్పడ బోనాలు | వేర్పింప, నెంతయుఁ బ్రీతి ముంద రోజమై బ్రాహ్మణభోజనం బొనరించి | సపరివారముగ విశాల రమ్య పూత స్థలంబునఁ బుండరీకాక్షుండు | దమ్ముండు దాను నుత్సవ మెలర్ప |
|
| తే. |
సరస రంజక మహనీయ సంప్రయోగ | మగు చతుర్విధ హృద్యాన్న మారగించె లలిత సంభావనా మంజులంబు లైన | పలుకు లెడనెడ విదురున కెలమి యొసఁగ. |
229 |
| వ. | ఆతండును. | 230 |
| క. |
‘గోవింద! సంభ్రమము సం | భావింపుము మాకు నిదియ పరమధనం; బొం డే విధమున నీ కర్చన | గావింపం జాలువాఁడు కలఁడే యెందున్?’ |
231 |
| వ. | అని మఱియు నత్యంత వినయ వాక్యమ్ముల నారాధించుచుండె; నిట్లు కృతాహారుండైన హరికి చందన చర్చా ద్యుపచారంబు లాచరించి యవ్విదురుండు కృతార్థుండై యుండఁ; గవి గాయక ప్రముఖ నిఖిల విద్వజ్జనంబులు పాఠక వాంశిక వైణికాది వినోద పాత్రంబులు నప్పరమేశ్వరుం గానవచ్చి ప్రొద్దువుచ్చి యభిమతార్థంబులు వడసి చనిరి; రాత్రియగుటయుం దగిన యభ్యంతర మందిరంబున హంసతూలికా తల్పంబున భుజంగ తల్పు నునిచి యతనికడ నుచితాసనంబున నుండి. | 232 |
| ఆ. |
‘విదురుఁ డిట్టు లనియె నిది యొక కార్యంబు | గాఁగఁ బూని యిందు రాఁగఁ దగునె? దుష్టబుద్ధి నీచు దుర్యోధనుండు నీ | మాట వినునె? దురభిమాన ఘనుఁడు. |
233 |
| క. |
వచ్చిన సైన్యంబులఁ గని | పెచ్చు పెరిఁగినాఁడు; ద్రోణ భీష్ముల లావుల్ నచ్చియుఁ గర్ణుం డొక్కఁడ | యిచ్చుఁ దనకు విజయ మనియు నెంతయుఁ బొంగున్. |
234 |
| వ. | నీ విట వచ్చుట వినిన యప్పుడు ధార్త రాష్ట్రులందఱుం గూడంబాఱి తమలో నిశ్చయించిన తెఱంగు నీ శాసనం బుల్లంఘింపం గలవారు ‘పాండునందనులకు నేమియు నీకుండువారు’ తార యీ ధాత్రియంతయు బీఱువోవ కుండ నేలువారు; వారింగూడిన రాజులెల్లను దిగ్విజయంబునాఁడు పాండవులచేత భంగపడినవారు గావునఁ గర్ణుతో నేకార్థులమై చత్తుము గెలుతు; మింతియ కాని యొండు లేదని నిశ్చయించికొని యున్నవా; ర ట్లగుటంజేసి దుర్యోధనుండు గండు మిగిలి యున్నవాఁడు; సంధి గానేరదు; వారల కందఱకు నిది ప్రాప్తకాలంబై యున్నయది; యెట్లును నుడుగ నేర్చినవారు గా;రిట్లు తమ్మెఱుంగని దుష్టాత్ముల నడుమం గూర్చుండుటయు నవ్వెంగలివిత్తు లఱచు వీఱిఁడి యఱపులకు వంకలొత్తి మాఱుసెప్పుటయు నొప్పకయుండు వెడంగు లగుటం గార్యవచనంబు లెఱుంగరు; మొఱకులగుటం బ్రతాపభాషణంబులకు వెఱవరు; వారల తలంపులు కీడు; నీ మహనీయ ప్రభావబుద్ధి పౌరుషంబు లే నెఱుంగుదు; నయినను బాండవేయులపై స్నేహంబునను నీమీఁది భక్తినిం జెప్పెద; నందుఁ బో వలవ’ దనిన వాసుదేవుం డతని కిట్లనియె: | 235 |
| తే. |
‘నీ వివేకంబు నాప్తియు నెఱపితీవు | తల్లిదండ్రుల మాడ్కి హితంబు సెప్పి తేను నా రాక తెఱఁగెల్ల నేర్పరించి | చెప్ప విని యేమి సెప్పినఁ జేయువాఁడ. |
236 |