| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
ఎఱుఁగుదు నేను సుయోధను | కొఱగామియు నతనితోడఁ గూడిన నృపు లం దఱుఁ బగ మనమున నిడికొని | యఱుముటయును సంధి పొసఁగదనియు మహాత్మా! |
237 |
| ఆ. |
పుడమియెల్ల నొడ్డగెడవయి గజవాజి | యుతముగాఁ గడంగి యుగ్ర మృత్యు ముఖము సొరఁగఁ దివురు మూర్ఖత మాన్చుట | యధికమైన పుణ్య మనఘచరిత! |
238 |
| వ. | మానుప వచ్చునే యంటేని. | 239 |
| క. |
దొరకొని పుణ్యముఁ బాపము | నరుఁ డర్థిం జేయుచుండ నడుమ నొకట న వ్వెర వెడలి తప్పినను ద | త్పరిణతి ఫలమొందునండ్రు ధర్మవిధిజ్ఞుల్. |
240 |
| వ. | అట్లుంగాక. | 241 |
| తే. |
చుట్టములలోన నొప్పమి పుట్టినప్పు | డడ్డపడి వారితోడఁ గొట్లాడియైన దాని నుడుపంగఁ జొరకున్నవానిఁ గ్రూర | కర్ముఁడని చెప్పుదురు కర్మకాండవిదులు. |
242 |
| వ. | కావున నీ రెండు దెఱంగులవారికి శాంతిగావింపం బ్రయత్నంబు సేసెద; ధర్మార్థ సహితంబైన తెఱంగు మాటలు మంత్రి జన సహితుండైన సుయోధనునకుం జెప్పెదఁ దనకుం బాండునందనులకు లోకంబులకు హితంబయిన విధంబు వంచన లేక చెప్పెడు నన్ను పాండవులవాఁడని శంకించి యతండు నామాట వినండయ్యె నేనియు మేలకాక యిట్లు సొచ్చి చెప్పకున్న నన్నదమ్ములు దమలోనం బోరఁ గృష్ణుండు వారింపక యుపేక్షించెఁ దనచేతఁ జక్కంబడదా? యని యజ్ఞులైన జను లాడుదు; రెల్లభంగులం గార్యం బార్యు లియ్యకొనం జెప్పుదు; ధార్త రాష్ట్రులుం దమకు బ్రదుకు తెరువైన నా పలుకులు వట్టుదురు; పట్టక నీ తలంచిన చందమునం దులువలై కలఁగం బాఱినవారు నా ముందర నిలువం జాలుదురే’ యని పలికిన విదురుం డట్లకాక యని సమ్మతించి యామంత్రణంబు సేసి నిజ శయన స్థానంబునకుం జనియె; ననంతరంబ. | 243 |
| ఆ. |
ఆతని వచన రచన యాత్మలోఁదలపోసి | యిట్టివాఁడు గలఁడె యెందు?’ ననుచుఁ బాలకడలి కడల పాటియై యొప్పు న | ప్పాన్పునందు శౌరి పవ్వడించె. |
244 |
| వ. | ఇట్లు సుఖనిద్రసేసి వేగుంబోకట మాగధమంగళగానంబుల మేలుకాంచి సమయ కర్తవ్యంబులు సలిపె; నట్టియెడఁ గృతవర్మయు సాత్యకియు వచ్చి పొడసూపినం బురుషోత్తముండ వారలు మొదలుగాఁగల యిష్ట జనంబులు పరివేష్టింప నుచిత ప్రదేశంబున నున్నంత. | 245 |
| క. |
ఇనతనయ శకుని దుశ్శాసన సహితము | గాఁగ నెలమిఁ జనుదెంచి సుయో ధనుఁడు ప్రియోక్తులఁ దగు వా | రును దానును వారిజోదరుం గొనియాడెన్. |
246 |
| వ. | అతండును మధుర సంభాషణంబులు చేయ వార లతనికి ధృతరాష్ట్రుండు బంధుమిత్త్రాది సమస్త పరిజన సమన్వితుండయి పేరోలగంబున నునికి యెఱిఁగించినఁ బ్రియంబునఁ గట్టాయితంబైన తేరెక్కి భేరీశంఖచామర ప్రముఖ భద్ర చిహ్నంబులతో వెడలి గరుడధ్వజంబు గ్రాలఁ గృతవర్మ సాత్యకు లొక్కరథంబునను, దుర్యోధనాది దుష్టచతుష్టయం బొక్క రథంబునను బార్శ్వంబుల రాఁ బౌరులకుఁ గన్నుల పండువగుచు రాజమందిర ద్వారంబు సేర నరుగునప్పటి యులివునకుఁ గొలువువారెల్ల నత్యుత్సుకులై యెదురుచూడ రథోత్తమంబు నవతరించి యరవిందనాభుండు. | 247 |
| తే. |
ఎదురు వచ్చిన విదురుని యిచ్చు కరముఁ | దమ్ము చేయును రెండు హస్తములఁ బట్టి నడచె ముందటఁ గదియు సందడిఁ గడంగి | కర్ణ దుర్యోధనులు దొలఁగంగ జడియ. |
248 |
| వ. | కృత వర్మాది యాదవులు లోనుగాఁగల యభ్యంతరులైన బలు మానుసులు పొదివి కొని పోవఁదన సమీపంబునఁ గౌరవులు రవి సన్నిధి తారాగ్రహంబుల చందం బగుచుండం దేజోరాజియగు రాజీవాక్షుండు చని తనకుఁ బ్రత్యుత్థానంబు సేసిన కురురాజును దొరలను నభినందించుచు. | 249 |
| క. |
తన కని పెట్టిన మణిమయ | కనకోన్నత పీఠమునఁ బ్రకాశంబున ని ల్చిన యెడఁ దోఁచిరి నారద | ముని ప్రముఖు లంతరిక్షమున నుజ్జ్వలులై. |
250 |
| వ. | ఇవ్విధంబున సన్నిహితులయిన యమ్మహామునులం గురుపితామహునకుం జూపి నారాయణుం డిట్లనియె. | 251 |
| ఆ. |
మనలఁ జూచువేడ్కఁ జనుదెంచినారు మ | హాత్ములైన నారదాది మునులు; వీరి కర్ఘ్యపాద్య విధు లొనరించి యా | సనము లిడఁగఁ బనుపు సత్వరముగ. |
252 |
| వ. | వీరలు సముచితాసనంబుల నుండక మనకుఁ గూర్చుండుట తగవుగా’దనినం గొలువువారెల్ల సంభ్రమాశ్చర్యంబులతో మునుల వలను జూచుచుండ భీష్ముండు పరిచారకులం బనిచి కనక మణిమయాసనంబు లనేకంబులు దెప్పింప వార లరుగుదెంచిన వారలకు నమస్కరించి యాసనార్ఘ్య పాద్యాది విధులం బూజలు సేయించి కృష్ణుండు గూర్చున్న యనంతరంబ ధృతరాష్ట్రుండునుం దక్కటివారును నుచిత ప్రకారంబుల నమ్మునీంద్రులకు నభివందనంబులు సేసి నిజాసనా సీనులైరి; దుశ్శాసనుండును వివింశతియును గద్దియ లిడ సాత్యకియుఁ గృతవర్మయుఁ గృష్ణుం గదిసి యిరువంకలం గూర్చుండిరి. కర్ణ దుర్యోధనులుం జేరువ నొక్క గద్దియ నుండిరి. విదురుండును మణిపీఠంబునఁ గృష్ణుని వెనుక దెసఁ దదీయోన్నత పీఠంబునఁ గరంబత్తమిల్లి యుండె; గాంధార రాజు నిజపుత్త్ర పరివృతుండై యొక్క దిక్కున నుచిత పీఠాసీనుండయ్యె; నట్టి సమయంబున. | 253 |
| క. |
అంబుద శుభగాత్రుం బీ | తాంబరధరుఁ గమలదళ నిభాక్షున్ హరిఁ జూ డం బడసి లోచనము లమృ | తం బానిన మాడ్కి సమ్మదంబునఁ దేలన్. |
254 |
| క. |
ఆ కొలువువారు కర మచ | లాకృతి నొక పలుకులేక యందఱు వింజం బాఁకిడిన కరణి నవశ ము | దాకారిత చిత్తవృత్తులై యుండంగన్. |
255 |