పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము
ధృష్టద్యుమ్నాదులకు సేనానాయకత్వంబు నిర్ణయించుట (సం. 5-149-18)
సీ. ‘అగ్నికుండమున ద్రోణాచార్యునకు నాశ | మొనరించుదానికై యుద్భవించె;
రథరథ్యములు ధనుర్బాణంబులును దను | త్రాణఖడ్గములు నుద్దామ లీలఁ
దనతోన జన్మించె; దహన శిఖామూర్తి | భుజవీర్య విక్రమ స్ఫూర్తిశాలి
సైన్యనాథుండు ధృష్టద్యుమ్నుఁ డగునని | తలఁచెద; నాతఁడు దక్క నొరులు
 
తే. భీష్ము తాఁ కోర్వ; రుగ్రంపు బిరుదు ధైర్య | ధన ఘనుండు శిఖండి భీష్మునకు మృత్యు
వై జనించినవాఁడు మహాబలుండు | దండనాయకుఁ జేయ నతండు దగును.’
101
వ. అనవుడు ధర్మనందనుండు గోవిందుం జూపి ‘యితండు సకల చరాచర తారతమ్య సంవేది; విశేషించి మనకు నితని మాటలు విజయ మూలంబు; గావున నిమ్మహాత్ముండు నిరూపించినవాడు వరూధినీ ముఖ్యుండు.’ 102
క. అనుటయు దామోదరుఁ డి | ట్లను ‘ధృష్టద్యుమ్నుఁ డర్హుఁ డగు నభిషేకం
బొనరింపుము పేరోలగ | మున నక్షోహిణుల కెల్ల ముఖ్యుఁడు గాఁగన్‌.
103
క. సురగంధర్వ ఖచర కిం | పురుషాది సమస్త దివ్యభూతంబుల బం
ధుర భూరి వ్యూహంబుల | విరచనముల నెఱుఁగు నతఁడు వీరోత్తముఁడున్‌.
104
క. నీ యొద్దిరాజు లందఱు | ధీయుక్తులు విక్రమ ప్రదీప్తుల యైనన్‌
వేయేటికి ధృష్టద్యు | మ్నా యత్తము చేయు సైన్యమంతయు నధిపా!’
105
వ. అనిన విని యుధిష్ఠిరుం ‘డక్షోహిణులకుం బ్రత్యేక నాయకులను నీవ నిర్దేశింపు’ మనుటయు నతండు. 106
తే. ‘సేన దమకును గలవారు లేనివారు | ననక తగువారిఁ జెప్పెద నఖిల సమర
పండితుల నేరి, వారి నీ బలము లేడు | నడపఁ జాలించి యభిషేచనం బొనర్పు.’
107
వ. అనిన ‘నట్ల చేయుదు; వారెవ్వ రెవ్వరు? నిరూపింపు’మని యడిగినఁ గుంతీనందనునకు దేవకీనందనుం డిట్లనియె. 108
సీ. ‘పటుపరాక్రమనిధి పాంచాలపతియు, న | మానుష తేజుండు మత్స్యవిభుఁడు,
శత్రుభీకరమూర్తి సాత్యకియును, జరా | సంధాగ్ర తనయుండు శౌర్యఘనుఁడు
సహదేవుఁడును, ధైర్యశాలి యాదవశిరో | మణి చేకితానుండు, మహితవిభవ
ఖని యగు శిశుపాల తనయుండు దోర్దర్ప | ధుర్యుండు ధృష్టకేతుండు, సమర
 
తే. లంపటుండు శిఖండియు లావు వెరవు | గలరు, నీయెడ ననురక్తిఁగలరు, సాలఁ
బెంపుగల, రుక్కు ముట్టిన తెంపుగలరు | కోరి పతులుగఁ జేయు మక్షోహిణులకు.
109
వ. అని దండనాథుల నిశ్చయించి వెండియు. 110
క. ‘కురుసైన్యము నిస్సారం | బరయఁగ మన బలము లెల్ల నతిదృఢములు; నీ
వరవాయి గొనక నడపుము | ధరణీశ్వర! సేన మొగము దైవమ నీకున్‌.
111
క. నీ యనుజులు దివిజులకు న | జేయులు ధృతరాష్ట్రసుతులఁ జెఱుచుట వ్రేఁగే?
తోయజనాశము గజలీ | లాయత్తము గాదె! యెత్తు మాహవమునకున్‌.’
112
వ. అని నిర్ణయించి నారాయణుఁడు నిజనివాసంబునకుం జనియె; ధర్మతనయుండు దమ్ములుం దానును బ్రియంబంది యారాత్రి సుఖనిద్ర సేసిరి; రేపకడయ పాండవాగ్రజుం డనుజతనుజ దనుజాంతక సామంత మంత్రి పురోహిత సహితంబుగాఁ బేరోలగంబున నుండి సమస్త పరివారంబును వినఁ గార్యంబు నిశ్చయంబుఁ దెలియంబలికి, తగువారలతో సముచిత సంభాషణంబులు సేసి, మహనీయ మహిమ వెలయం బుండరీకాక్షుండు పనిచినట్ల పాంచాలనాథ ప్రముఖుల నక్షౌహిణులకు నధిపతులుగా వేఱువేఱ యభిషేకించి, శ్వేతవంశజాతుం డగుటంజేసి శ్వేతుండనం బ్రఖ్యాతుం డగు ధృష్టద్యుమ్నునకు నుత్కృష్ట ప్రకారంబున నభిషేకం బొనర్చి సర్వసేనాధిపత్యంబునకుం బట్టంబుగట్టి, యయ్యెనమండ్రను దక్కటి దొరలను గనుంగొని మధురవాక్యంబుల నగ్గించి కౌరవులతోడి కయ్యంబునకుం గురుక్షేత్రంబునకు విడియం బోద’మని చెప్పి వారినెల్ల ధనంజయునకుం జూపి. 113
ఉ. ‘ఎప్పుడు నెయ్యెడం బొదివి యిందఱకుం దగ నీవు కంటికిన్‌
ఱెప్పయుఁ బోలె మాటయి నెఱిం బను లారసి యొజ్జచాడ్పునం
జెప్పుచు వీరిబుద్ధిఁగొని చేయుము కార్యము; నీకు రక్షగా
నిప్పరమేశ్వరుండు గలఁ; డిచ్చు శుభం’ బని చూపెఁ గృష్ణునిన్‌.
114
వ. ఇట్లు గాంభీర్య మాధుర్య ధుర్యుండైన యుధిష్ఠిరుండు వరిష్ఠ ప్రభువుల చిత్తంబు లారాధించి సర్వజన సమ్మతంబుగా సమరోత్సాహంబు చేసి మహోల్లాసంబునం బ్రస్థాన భేరి సఱవంబంచిన. 115
సీ. బీఱెండ తాఁకున బీఁటలు వాఱిన | పచ్చిగోడల మాడ్కిఁ బగిలె దిశలు,
కాఁగిన యెసరుల కరణిఁ బొరిం బొరి | శరనిధు లుప్పొంగి పొరలఁబడియెఁ,
గలముపైఁ గీలించి గాలి కెత్తిన చాఁప | వోలె మిన్నంతయు బూరటిల్లెఁ,
గులపర్వతావళి కులిశభయంబున | బెదరి వాపోవున ట్లెదురుసెలఁగె,
 
తే. ధాత్రి కుమ్మరి సారె విధమునఁ దిరిగెఁ | జిత్రరూపులభంగి నిశ్చేష్టితంబు
లయ్యె సర్వభూతములుఁ బ్రయాణభేరి | భూరి నిష్ఠుర ఘోరభాంకార మడర.
116
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )