పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము
శ్రీకృష్ణుఁడు ధర్మరాజునకుఁ గౌరవసభం బుట్టిన విశేషంబు దెలుపుట (సం. 5-145-1)
క. ‘కయ్యము గాని తెఱంగున | నెయ్యంబగు నట్లుగాఁగ నెఱిఁ బలికితి నే
నెయ్యది సుఖంబు పథ్యం | బెయ్యది యరయంగఁ దథ్య మెయ్యది దానిన్‌.
75
తే. బహు విధంబులఁ బలుకు నా పలుకు లెల్లఁ | జీఁదక న్నిడి తన పెడచెవులఁ బెట్టి
యీఱతాఱలు మఱుమాట లిచ్చి యపహ | సించె; దుర్యోధనుఁడు వేయుఁ జెప్పనేల?’
76
క. అనిన విని ధర్మజుం డి | ట్లను ‘నప్పుడు తండ్రి యుచిత మాడఁడె? భీష్ముం
డును గురుఁడు విదురుఁడుం ద | క్కిన పెద్దలుఁ బలుకరే తగిన చందమునన్‌?
77
క. నావుడు హరి యిట్లను ‘స | ద్భావమున విచిత్రవీర్యతనయుఁడుఁ దగ నా
నా విధములఁ జెప్పిన సం | భావన వినఁ డతఁడు, పలుకుఁ బ్రతికూలంబుల్‌.
78
సీ. శంతను పుణ్యవంశం బంకురించిన | చందంబు, నంబికానందనుండు
జాత్యంధుఁడై యుండ సామ్రాజ్యమంతయుఁ | బాలించి పాండునృపాలుఁ డతనిఁ
గొలిచి యుండుటయును, గురుకులంబున కెల్ల | దేజంబుగా మీరు దిగ్విజయము
సేసి కావించిన సిరి వారు వంచనఁ | గొనుటయు, సత్య మకుంఠితముగ
 
తే. నీవు సమయంబు నడపిన నెఱియుఁ దండ్రి | పాలు మీకు నీఁదగుటయుఁ, బాడిలేమి
నరయఁ జెడుదురు కౌరవు లనియుఁ, బెద్ద | లెల్లఁ జెప్పిరి మొగమోట యింతలేక.
79
క. అలయక యందఱుఁ జెప్పం | గల యంతయుఁ జెప్పి; రతఁడు కటకటఁబడి య
క్కొలువు వెడలి పోయెం ద | మ్ములుఁ గర్ణుఁడు రాజలోకముం దో నరుగన్‌.
80
వ. ఇట్లు కొడుకు ముష్కరుండై యరిగిన ధృతరాష్ట్రుండు గాంధారి రావించి. 81
క. తగ విదురుఁ బంచి యాతని | మగుడఁగఁ బిలిపించె; నా యమయుఁ దనయునకున్‌
వగయును గూర్మియు వెరవును | మిగిలిన వచనముల సంధి మెయికొనఁ జెప్పెన్‌.
82
వ. ఎవ్వ రెంత సెప్పినను గైకొనక కడంగి దుర్యోధనుండు దనకుం గలవారల నెల్లను గురుక్షేత్రంబునకు నడవుండని చెప్పంబనిచె; భీష్ముని సేనా ముఖంబు సేసికొని యెత్తి విడియం గలవాఁ; డిది ధార్తరాష్ట్రుల నిశ్చయం; బేనును నా యోపినంత సామవాదంబు లాడితి; నారదాది మహామునులను సుయోధనునకు బుద్ధులు సెప్పునట్లు సేసితి; నేమి చెప్పినను నెంతటం బోకున్నం గినుక దెచ్చికొని జంకించియు భంగించియు ధిక్కరించియుఁ దృణీకరించియుం జూచితిఁ గార్యంబు భగ్నంబగుట కొల్లక వెండియు శాంత వచనంబులు వలికితి; నతం డశక్త దుర్జనత సేయం జూచిన నమానుషంబు లగువానిం గొన్ని వెడమాయలం బన్ని పెక్కుపోకలం బోయితి నెన్ని భంగుల సంధియ కావలయునని పారలంగలయంతయుంబొరలితి; నప్పాపాత్ముం డెట్లునుం జక్కంబడక తన చలంబుతోన పొట్టుపొరలయ్యుఁ గయ్యంబు వొడుచుంగాని, యవశ్యంబును రాజ్యంబు పాలిచ్చు వాఁడు గాఁడు; కౌరవుల యెడ దండంబు దక్క నొం డుపాయంబు లేదు; మీకుం బోలిన తెఱంగు సేయుం’ డనిన ధర్మతనయుండు తమ్ములం గనుంగొని యిట్లనియె: 83
క. ‘కురుసభఁ బుట్టిన చందము | హరి యంతయుఁ జెప్పె; నింక ననుమానము లే;
దరి మర్దనమున కయ్యెడు | వెరవుం జేవయును మెఱయ వెడలుఁడు గడఁకన్‌.’
84
వ. అని పలికి, యజాతశత్రుండు కరుణాయత్తచిత్తుండై యచ్యుతు నాలోకించి. 85
క. ‘కురువంశముఁ ద్రుంచుటకుం | జొరఁజాలక నా మనంబు సుడివడియెడు; నే
వెరవును దొరకొనదు గదే | సరసీరుహనాభ! పొందు సంపాదింపన్‌.
86
వ. నా మనంబును దమ్ములతలంపును నీ వెఱుంగుదు; ధార్తరాష్ట్రుల చందంబును భీష్మ ద్రోణ విదురాదుల చిత్తంబులును నెఱింగి వచ్చితి; మాకు ధర్మచ్యుతి లేకుండునట్టి కార్యంబు నిశ్చయింపు’ మనిన నారాయణుం డిట్లనియె. 87
ఉ. ‘యుద్ధమ కాక కార్యమును నొండొకఁ డెద్దియుఁ గల్గనేర్చునే?
బుద్ధులు చెప్పు వాక్యములఁ బోల వినం డననేల? యట్టిచో
బద్ధునిఁ జేయఁజూచె ననుఁబట్టి సుయోధనుఁ, డింక నయ్యసం
బద్ధునితోడి సంధికి నుపాయము నా మతిఁ దోఁప దెమ్మెయిన్‌.’
88
వ. అని చెప్పి విదురుం డేకాంతంబున నాడినమాటలును, భీష్మద్రోణ బాహ్లికాదులగు పెద్దలకు ధార్తరాష్ట్రుల దెసం బుట్టిన మనఃక్షోభంబును, గుంతి కౌరవులు వినం బలికిన పలుకులుం బ్రకటించి ధర్మపుత్త్రుపైఁ బాపంబు లేకునికిఁ దెలిపి సమరం బవశ్య కర్తవ్యంబుగా నిశ్చయించె; నట్టియెడఁ దమ్ము లన్న మొగంబునం జూడ్కి నిలిపి యూరకుండి; రతండు వారలం గలయం గనుంగొని యిట్లనియె: 89
ఉ. ‘కౌరవకోటిచేత మన కష్టపుఁబాటు తలంపు వచ్చినం
గ్రూరవిచేష్టితంబునకు గొంతి యొడంబడె; బంధువర్గమున్‌
ఘోరముగా వధించుటకుఁ గోల్కొన కున్నది బుద్ధి; మీరు ని
ర్ధారణ చేయుఁడా హితము ధర్మము నయ్యెడు వృత్తమెట్టిదో.’
90
వ. అనిన విని అర్జునుం డతని కిట్లనియె : 91
చ. ‘హితమును ధర్మముం దగవు నిట్టిది నా మన మేమి నేర్తు? మ
చ్యుతుఁడు సమస్త ధర్మ పరిశోధకుఁ; డా విదురుండుఁ; బాండు భూ
పతి సతియుం దగం బలుకు పల్కుల సందియమెల్లఁ బాసె; ని
ట్లితఁడు రణంబు చేయుఁ డన నింక విచారము లెల్ల నేటికిన్‌?’
92
ఆ. అనిన ‘నట్లకాక యఖిల ధర్మజ్ఞాన | ఘనుఁడు మనకు నేడుగడయుఁ దాన
శౌరి నిశ్చయింప సంశయం బేటికి? | సంఘటింపుఁ డుగ్ర సమర విధము.’
93
వ. అని యుధిష్ఠిరుండు తమ్ములతో నెట్టకేలకుం దెగువ సెప్పి. 94
క. ‘బాహాగర్వము వివిధ | వ్యూహ విధిజ్ఞతయుఁ గలిగి యొకరుం డే డ
క్షోహిణులు నడపి భీష్మో | త్సాహంబున కోర్చు చాపధరుఁ డెవ్వఁ డొకో!
95
వ. అట్టివానికి వాహినీ నాయకత్వం బిచ్చి యభిషేకంబు సేయవలయు.’ 96
తే. అనిన సహదేవుఁ డిట్లను ‘నధిప! పుత్త్ర | పౌత్ర సోదరవంతుండు బాహువీర్య
ఘనుఁడు మన కాశ్రయంబయి మనిచె మత్స్య | దేశపతి గాఁడె సేనాపతిత్వమునకు?’
97
వ. అనవుడు నకులుండు. 98
చ. ‘బలఁగముఁ బెంపుఁ, దేజమును, బాహుబలంబును, నగ్గలంబు పె
క్కు లెఱుఁగుఁ గార్య ఖడ్గములకుం దగు త్రోవలు; ద్రోణులందు భీ
ష్ములదెసఁ గోపముం గలఁ, డమోఘ పరాక్రమశాలి, నీ బలం
బుల కధినాథుఁగా ద్రుపదభూపతిఁ బట్టముఁ గట్టు టెట్లొకో!’
99
వ. అనుటయుం దదనంతరంబ ధనంజయుఁడు. 100
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )