| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము |
| సీ. |
అరిభయంకరుఁడు ద్రోణాచార్యుఁడును, రణో | త్సాహ లంపటుఁడు రాధాసుతుండు, శరతత్త్వవేది యశ్వత్థామయును, భూరి | బాహా విలాసుండు బాహ్లికుండు, శౌర్య వైభవశాలి శల్యుండు, ధైర్యసం | పన్నిధి కృపుఁడును, బ్రకటశక్తి సార దుర్జయమూర్తి భూరిశ్రవుండును, | దర్పోజ్జ్వలుండు గాంధారపతియు, |
|
| తే. |
నుగ్రతేజుండు గృతవర్మయును, బ్రతాప | ఘనుఁడు కాంభోజుఁడును, బరాక్రమధనుండు సింధురాజును బతులుగాఁ జేయఁగోరి | కొనఁగఁ దగువార లగుదు రక్షోహిణులకు.’ |
139 |
| చ. |
అని మది నిశ్చయించి తగ నందఱఁ బిల్వఁగఁ బంచి వారితో నని పని మాటలాడి వినయంబునఁ బ్రార్థన చేసి ‘మీర లీ యొనరిన సైన్యముల్ పదునొకొంటికిఁ బ్రాభవ మాచరింపఁ జొ చ్చిన సకలంబు నొప్పు నభిషేకముఁ గైకొనుఁ డుత్సవంబునన్. |
140 |
| క. |
అనవుడు నందఱు నౌఁగా | కని సంతసమంద నధిపుఁ డభిషేకించెన్ జనులెల్ల సంప్రమోదం | బునఁ బొందఁగ నప్పు డతివిభూతి దలిర్పన్. |
141 |
| వ. | ఇట్లు మహామహిమ వెలయ నక్షోహిణీ నాయకుల సమకట్టి రారాజు పితామహుపాలికి వారిం దోడ్కొని చని సవినయంబుగా నతనికిఁ బ్రణామంబుసేసి, వారలం జూపి ‘వీరల మన యక్షోహిణులు పదునొకొంటికిం బతులఁ గావించితి; నిన్నిసైన్యంబులు నొక్కలావున వర్తించు చందంబు సూచికొనవలయు’ నని చెప్పుచుఁ జేతులు మొగిచి యిట్లనియె. | 142 |
| చ. |
‘నెఱిఁబడి యాజి నీ మొనలు నేరవు కూడి తగం జరింప నిం దఱ మన సొక్కఁడై చనక తప్పుఁగదా బహుదేశవాసు లం దఱొకటి సేయుచో వెరవు దప్పక చెల్లుట యెట్లు గల్గు? ని త్తెఱఁగొక చాలు వాని బలుతీర్పునఁ గాక పొసంగ నేర్చునే? |
143 |
| ఆ. |
అమరసేనలును దమంతన వర్తింప | నేర కునికి నా కుమారు మొగము గానొనర్ప వలసెఁగాదె! సమస్తసే | నలను నీవ యరసి నడపవలయు. |
144 |
| క. |
తారలకుం జంద్రునిగతిఁ | గౌరవులకు మేటి వీవ; కావున నీవీ భారంబు పూని మముఁ గడ | చేరుపఁదగు నెమ్మెయిం బ్రసిద్ధచరిత్రా! |
145 |
| తే. |
సర్వసేనాధిపత్యంబు నిర్వహింప | నీవు దక్క నిం దొక్కరు నీవ యరసి చెప్పుమా కలఁడేని; రక్షింపు మమ్ముఁ, | బూని పట్టంబుఁ దాల్పుము, పొడిచి గెలుము.’ |
146 |
| వ. | అనిన విని గాంగేయుండు గాంధారేయున కిట్లనియె : | 147 |
| ఆ. |
‘మీరుఁ బాండుసుతులు నారయ నా కొక్క | రూప; కార్య మున్నరూపు వలుక వలయుఁ; గయ్యమైన వత్తు మీలోన నా | యునికి చందమునకు నుచిత మిదియ. |
148 |
| క. |
సేనాధిపత్యమును దగఁ | బూనెద; నను మార్కొనంగఁ బురుషుల నుర్విం గానఁ; గిరీటికి నొక్కని | కే నోర్వ; నతండు శరము లెక్కు డెఱుంగున్. |
149 |
| క. |
పెఱవారినెల్లఁ దరమిడి | నఱకుదుఁ; బాండుక్షితీశ నందనులను రూ పఱసేయం జేయాడదు; | తఱుమరు నామీఁద నత్యుదగ్రత వారున్. |
150 |
| వ. | అప్పటికిఁ దగిన భంగి యయ్యెడు; నది యట్లుండె’ నని పలికి మఱియు నిట్లనియె. | 151 |
| ఆ. |
‘మున్ను కర్ణునొండె నన్నొండెఁ గయ్యంబు | చేయఁ బనుపు; మిట్లు సేయువాఁడ వైనఁ గాని సకల సేనాధిపత్యంబుఁ | బూన నేరఁ జుమ్ము భూపవర్య!’ |
152 |
| వ. | అనినం గర్ణుండు కౌరవపతితో నిట్లనియె : | 153 |
| క. |
‘ఇప్పుడు క్రొత్తగ దీనిం | జెప్పంగా నేల? మున్న చెప్పితిఁగాదే! యెప్పుడు భీష్ముండు వడు నే | నప్పు డనికి వచ్చువాఁడ నని సభలోనన్.’ |
154 |
| ఆ. |
అనిన ‘నట్ల కాక’ యని సర్వసేనాధి | పత్యభార పట్టబంధమునకు నియ్యకొనియె భీష్ముఁ; డయ్యగ్గలికఁ గొని | యాడె విభుఁడు ప్రముదితాత్ముఁ డగుచు. |
155 |
| క. |
‘భేరీ మృదంగ శంఖ మ | హారవములు సెలఁగఁ జేయుఁ’డని పనిచి, మహో దార పతాకా ద్యుత్సవ | గౌరవములు నడపె నెల్లకడలం బురిలోన్. |
156 |
| వ. | అట్లు పట్టణాలంకారంబు సంఘటించి, రత్నకాంచన కలధౌతమయంబులగు కలశంబులఁ దీర్థజలంబులు దెప్పించి, మణిప్రకరంబునఁ గుసుమ నికరంబున మంగళ తరు త్వక్పల్లవ ప్రచయంబున మహౌషధి నిచయంబున విహిత మంత్రంబుల నుచిత తంత్రంబుల ఋత్విక్పురోహిత సహితుండై త త్సంస్కార ప్రకారం బాచరించి. | 157 |
| క. |
గురుఁడును గృపుఁడును లోనగు | గురు లనుమోదింప, బాహ్లికుండు మొదలుగాఁ గురుజాతి యెలర్పఁగ న | న్నరపతి భీష్మాభిషేచనం బొనరించెన్. |
158 |
| తే. |
ఇవ్విధంబున నభిషేక మెలమిఁ జేసి | పరమభక్తి నక్షోహిణీపతులఁ జూపి ‘వీరికిని సైన్యములకును మీర యొడయ’ | లనుచుఁ బట్టంబుఁ గట్టె శంతనుతనూజు. |
159 |
| క. |
అత్తఱిఁ బాషాణంబులు | నెత్తురు నెమ్ములను గురిసె, నిష్ఠుర నినదా యత్తమయి నభము పిడుగుల | మొత్తంబులు వడియె నగరమున నెల్లెడలన్. |
160 |
| క. |
దానికి జను లుత్సాహ వి | హీనతఁ బొందంగఁ, గౌరవేంద్రుఁడు నానా దానాదు లయిన శాంతి వి | ధానము లొనరించి యానతత్పరమతియై. |
161 |
| క. |
తల్లియుఁ దండ్రియు వెఱఁగునఁ | బుల్లవడన్ వారికడకుఁ బోయి తడయఁగా నొల్లక పయనపు వీడ్కో | లెల్లను దనయిచ్చ నడపి యేడ్తెఱ వెడలెన్. |
162 |
| తే. |
వెడలి తమ్ములుఁ దగువారు వివిధభృత్య | గణముఁ దానును నేల గ్రక్కదలఁ గదలి రాజరాజు గాంగేయుఁ బురస్కరించి | కొని సముద్ధతి నడచె దిక్కులు వడంక. |
163 |
| వ. | నడచి కురుక్షేత్రంబు దఱియం జొచ్చి యం దొక్క రమణీయ ప్రదేశంబు విడిదలగా నిరూపించి నిలిచి, భానుసూనుండునుం దానును మెలంగి యెల్లవారిని విడియించి, నడుమ నిజనివాసంబు గావించినఁ, గౌరవేశ్వరు స్కంధావారంబు వారణపురంబున నెవ్వ రెయ్యెడ వసియింతు రాచందంబున నందంబై యొప్పె; నిట్లు రెండు వీళ్ళును సన్నద్ధంబులైన సమయంబున. | 164 |
| ఉ. |
సంధికి నేఁగి కార్యము పొసంగక కృష్ణుఁడు రాకయున్, సుహృ ద్బాంధవ సంఘయుక్తముగఁ బాండవ కౌరవ వీరు లష్ట ది క్సింధుర కంధరంబు లడఁగించు బలంబుల పెల్లుతోడ గ ర్వాంధత నాజికెత్తుటయు నా బలభద్రుఁ డెఱింగి యార్తుఁడై. |
165 |