పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము
సంజయుండు ధృతరాష్ట్రుని కులూకుఁడు పాండవుల నాడిన మాటలు చెప్పుట (సం. 5-157-1)
తే. అనిన సంజయుఁ డిట్లను ‘నకట! కొడుకు | మీఁదఁ దప్పు పెట్టెదవు నీ మీఁది కొఱఁత
నీకుఁ గానంగ వచ్చునె? నీ వెఱుంగ | కుండఁ బఱచెనె యాతండు పాండుసుతుల?
186
వ. ఆ పని గడవంబడియె; వార్తలు వినియెదవేని వినుము; దుర్యోధనుండు దుశ్శాసన శకుని కర్ణులతో విచారించి యులూకుం బిలిపించి నీవు వోయి పాండవులంగని వాసుదేవు సన్నిధిని బాంచాల విరాట ప్రముఖులు వినఁ బలుకు’మని పరుసని మాటలు గఱపి పుచ్చిన నతండును. 187
క. చని కొలువున ధర్మసుతుం | గని ‘దుర్యోధనుఁడు చెప్పఁగా నను నియమిం
చిన మాటలు గొన్ని గలవు | విను మలుగక’ యనిన నతఁడు విని యిట్లనియెన్‌.
188
ఆ. ‘నీకు వెఱవనేల? నిన్ను నా బుద్ధిమం | తుండు చెప్పు మనిన తులువమాట
లెన్ని గలవు వాని నన్నింటి ననుమాన | మింత లేక యాడు మెల్ల వినఁగ.
189
వ. అనిన నులూకుం డిట్లనియె : 190
సీ. ‘కయ్యంబునకుఁ బెద్ద కాలమేనియుఁ బూఁచి | పట్టి వచ్చితి కడు బరవసమున;
సంజయుతో మీరు శంకలే కాడిన | యెక్కుడు మాటలు పెక్కు గలవు;
భూమి భాగము గోలుపోయిన యలుకకు | ద్రౌపదిఁ బఱచిన దైన్యమునకుఁ
దగ మంచిబంటవై తఱి యిది బాహుబ | లాస్త్ర విద్యలు చూపనని తలంచి
 
ఆ. నిలువ వలయు నీకుఁగలవారి నెల్లను | గూర్చి మోహరించికొని కడంగి
నడవు సమరమునకు; వెడజంకఁబోదింకఁ | దప్పఁ గ్రుంకలేదు తఱికిఁ జొరుము.
191
క. ఆతతబలుఁ డగు భీష్ముని చేతి | బలువు ద్రోణు నంపసెల లవియుటయుం
జూతు రటురండు కృష్ణుని | చేతన సకలంబుఁ జక్కఁ జేసికొనుండీ!
192
క. వారిద్దఱ వాలమ్ముల | బారింబడి యర్జునునకు బ్రదుక వశమె? మీ
వారెల్ల నెఱుంగరె య | వ్వీరుల దివ్యాస్త్రశస్త్ర విభవ సమృద్ధుల్‌?’
193
వ. అని భీమసేనుం జూచి. 194
క. ‘ఈ వాయుపుత్త్రుఁ డాజిం | ద్రావుదు నే దుస్ససేను రక్తం బనియెం;
ద్రావఁగ శక్యం బేనిం | ద్రావు మనన్‌ రాదె? యింకఁ దడ వేమిటికిన్‌?
195
క. విను నూతి కప్ప విధమున | నిను నీవ యెఱుంగు; దెఱుఁగ నేరవు గర్వం
బున నావలి కొలఁది రణం | బున నొకమరి పెట్టువడక పోనేర్చెదవే?’
196
వ. అని పలికి సవ్యసాచిం జూచి. 197
తే. ‘వినుము గాండీవ మనునొక విల్లు తాటి | పొడవు గలిమియుఁ, గృష్ణుండు పూని తోడు
గూడుకొని వచ్చుటయు నెఱుంగుదుము; వీని | కెల్ల శంకించి భూమి పా లీము గాని.
198
క. పవనజు గదయును నీ గాం | డివమును నెట వోయె నంగడికిఁ బాంచాలిం
దివిచికొని వచ్చునెడఁ బరి | భవ మెఱుఁగవె బీర మేల పలుకుదు తోడ్తోన్‌?
199
చ. వలలుఁ డనన్‌ విరాటుకడ వంటలవాఁడయి భీముఁడున్‌, బృహ
న్నల యన నాఁడు పేడివయి నాన యొకింతయు లేక నీవు న
గ్గలమగు దైన్యమొంది కడుఁ గాఱియ వొందితి రుర్వియేలునా
సలఁబడి; సవ్యసాచి! యిది శౌర్యమొ? బాహుబలంబొ? చెప్పుమా!
200
ఉ. మాయలు నింద్రజాలములు మాధవుఁ డిందును గొన్ని వన్నినన్‌
బాయవు రజ్జు లెప్పుడు నవారణ నీ వెటు లాడితేనియున్‌
వేయును నేల? పార్థులును విష్ణులు నేఁబదివేలు వచ్చినం
జేయుదు మేము గయ్య మొకచీరియు సంపదఁ బంచియిత్తుమే?’
201
వ. అనిన భీమార్జున నకుల సహదేవు లొండొరుల మొగంబులు సూచుచు నాసనంబులు చలింప, మొగంబులు జేవుఱింపఁ గ్రోధాయత్తచిత్తులై యున్నం గనుంగొని నవ్వుచు నారాయణుం డులూకున కిట్లనియె ‘నీవు వోయి సుయోధనుతో నెల్లవారును విన నిట్లనుము: 202
తే. బవర మెల్లియ బిరుదవై బరవసంబు | గలిగి చావుము; చావక తొలఁగ రాదు
కృష్ణ సారథికంబగు జిష్ణురథము | తొడరి నీ వెందుఁ జొచ్చినఁ దోన చొచ్చు.
203
క. రిత్తలు రజ్జెడువాఁడే | మత్తగజాయుతబలుండు మారుతి యని మ
ద్వృత్తుఁడగు దుస్ససేనుని | నెత్తు రురము వ్రచ్చి త్రావు నీవుం జూడన్‌.
204
వ. అని యిట్లు హరి పలికిన యనంతరంబ యర్జునుం డులూకున కిట్లనియె: 205
క. ‘వారు గలరు వీరు గలరు | పోరికి నని చెప్పె దీవు పొంగారుచు మీ
వారిని మిమ్మును రేపు గ | దా రూ పేర్పడఁగఁ జూచెదం గితవసుతా!
206
చ. తన భుజశక్తి లేక యొరుదర్పమ యూఁది పరాక్రమింప వ
చ్చిన నది సెల్లునే? కులవిశిష్టుని సువ్రతు వృద్ధు నార్యు భీ
ష్ముని నెసకొల్పి సేనలకు ముఖ్యుఁడ వీవని యుబ్బఁజేసి యీ
సునఁ దలపెట్టి చంపికొనఁజూచె సుయోధనుఁ డింత నేమగున్‌?
207
చ. తన తలఁ పిట్లు భీష్ముభుజదర్పము లోకముకంటె నెక్కు డీ
తని నొకభంగి నండగొని తప్పుదుఁ జావున కంచునున్నవాఁ;
డనిఁ దొలుముద్ద గొందుము రయంబున నాతని, వెండి ద్రోణులం
దునుముదు, మప్డు సూతసుతుఁ దోలుదు, మంతట నాస మాలెడున్‌.
208
క. అనుజుల తనుజుల చావులు | కనుఁగొని మఱి తాను భీము గదచే నిలఁ గూ
లిన యప్పుడైన దుర్యో | ధనుఁడు మదిం దలఁచుఁగాక తన దుష్కృతముల్‌.
209
వ. అది యట్లుండె; నీవు వేగపోయి రేపకడయ మీ రాజుం గలనికి నడపింపు’మనియె; నప్పుడు ధర్మనందనుం డులూకునకుం దాంబూలాభరణంబు లిచ్చి వీడుకొలిపి, ధృష్టద్యుమ్ను నవలోకించి ‘యెల్లి కయ్యంబని మన సైన్యంబులకెఱింగించి సర్వసమరసన్నాహంబులు సమకట్టు’మని పనిచి కొలువు విరిసి చనియె; ధృష్టద్యుమ్నుండును ద్రోణులం దొడరం బడసితినని యుబ్బుచు వెడలి, భీష్ముం దలపడఁగంటి నని పొంగు శిఖండి తోడుగా రాజు శాసనంబు నిర్వర్తించె; నిట యులూకుండు వచ్చి దుర్యోధనుం బేరోలగంబునం గని యతనికిఁ గృష్ణార్జునుల పలుకు లున్న రూపు విన్నవించిన, నతండు కర్ణుదెసఁ గనుంగొని ‘సమస్త సేనలకు రేపు బవరం బని చెప్పి పుచ్చుము; సకల సాధనంబులు నాయితంబులు సేయు’ మని పనిచిన నతండు నట్లచేసె; నిట్లు భయకటకంబులు రణంబునకు నుత్సహించి విజృంభించి యుల్లసిల్లె’ ననిన ధృతరాష్ట్రుండు సంజయున కిట్లనియె: 210
క. ‘వినుము హరి తోడుగల య | ర్జును గెలువ నదీసుతునకుఁ జొప్పడునే? యా
పని నిలుపు; ములూకుని చె | ప్పిన మాటల కేమి యనిరి పిదపఁ గొలువునన్‌?’
211
వ. అనిన విని యంబికానందనునకు సూతనందనుం డిట్లనియె : 212
ఆ. ‘అయ్యులూకు పలుకు లన్నియు విని భవ | త్తనయుతోడ నిట్టులనియె భీష్ముఁ
‘డేనుగలుగ వెఱవ నేటికి? సేనలఁ | గాతు నీవు మెచ్చఁ గౌరవేంద్ర!
213
క. నడిపింపఁగఁ బొడిపింపఁగ | నెడమడువై కలఁగినప్పు డేర్పఱుపఁగ నేఁ
గడునేర్తుఁ బేర్చు నాదగు | కడిమియ నీ సైన్యమునకు గౌసెన కాదే?’
214
క. అనినన్‌ గురురా జిట్లను | ‘వినుము పితామహ! మహాస్త్రవిత్తము లనఁగాఁ
జను నీవును నాచార్యుం | డును గలుగఁగ నాకు నెన్నఁడును వెఱపేలా?
215
తే. ఏను గంధర్వ కిన్నర దానవాది | దివ్య భూతంబులకును భీతిల్ల ననినఁ
బాండుపుత్త్రుల మాత్రకు భయము నాకు | నెక్కడిది? వ్రేల్మిడిన వారి యుక్కు మడఁతు.’
216
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )