పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము
భీష్ముఁడు కర్ణుని నర్ధరథుండని చెప్పుట (సం. 5-165-3)
వ. గాంధార రాజులగు వృక్షుండును, నచలుండును సమరథులు; మానిసితనంబును మానుసులుం గలవారు; వీరి సమరోత్సాహం బజేయంబైయుండు. 233
సీ. నీకుఁ బ్రెగ్గడయును నెయ్యంపుఁ జెలియునై | కయ్యంబునకు నెప్డుఁ గాలు ద్రవ్వుఁ
బాండుపుత్త్రుల తోడి పగకు ని న్నెసకొల్పుఁ | గొలువున రజ్జులు పలుకునట్టి
రాధాసుతుం డర్ధరథుఁడు; కుండలములుఁ | గవచంబుఁ బోవుట కారణముగ
బీఱువాఱినవాఁడు, వీఱిఁడి, కృపఁ బెద్ద | పరశురాముండు శాపమున వీని
 
తే. యస్త్రవీర్యంబుఁ జెఱిచె; నట్లగుట వీఁడు | పార్థు మార్కొని మానంబుఁ బ్రాణములును
దనకు సొమ్ముగఁ దక్కించుకొనఁగ లేమి | యెల్లవారికి నెంతయుఁ దెల్ల మధిప!”
234
క. అనవుడు గురుఁ డిట్లనుఁ ‘గ | ర్ణునిచందము మున్ను కడఁగు రోయఁడు పాఱన్‌
విను మేమఱి యుండుంగా | వున నీతం డర్ధరథుఁ డవుం దలపోయన్‌.’
235
వ. అనిన విని రాధేయుండు క్రోధతామ్రాక్షుం డగుచు గాంగేయున కిట్లనియె: 236
క. ‘ఒంటమిని లేని యొంటర | మింటరములు వల్కు టుచితమే? యర్ధరథుం
డంటి నను; నేమి తక్కువ | గంటి చెపుమ; దీన నీవు గన్నది కలదే?
237
తే. నొవ్వఁ బలుకుదు సభలోనఁ జివ్వకొల్ల | కేను గురుపతిఁ జూచి సహించి పోదు;
సురనదీపుత్ర! విను నాకుఁ జూడ నర్ధ | రథుఁడ వగుదీవు లావు బీరంబు నరయ”
238
వ. అని పలికి కొలువుఁ గలయం గనుంగొని. 239
చ. ‘హితుఁడని నమ్మఁగాఁ దగునె యీతనిఁ? గార్యపు మాట లిట్టివే?
పతిదెసకూర్మి వాపుటకుఁ బట్టుగ నెక్కువ తక్కువంచు ను
న్నతులగు మేదినీశులకు నానగఁ బల్కుట గాక, యిట్టివా
రితవులు తండ్రికిన్‌ సుతుల; కేమన నేర్తుము పెద్ద రాజులన్‌?’
240
వ. అని దుర్యోధనుం జూచి యిట్లనియె : 241
ఉ. ‘కర్జము దప్పె నీ యెదురఁ గష్టపు మాటల కేల యోర్తు రీ
దుర్జనుఁడైన శాంతనవు దోర్బల మేటిది? యీతఁ డొక్కఁడున్‌
వర్జితుఁడైన నేమి? నృపవర్గము కుందుట యొంటఁ బాయునే?
యర్జున పక్షపాతి యితఁ డాలము మేకొని చేయఁడుంజుమీ!
242
తే. చాలఁ గాలంబు పోవక చతురులైన | వృద్ధ జనముల బుద్ధులు విండ్రుగాక!
ముదియ మతిదప్పి నోరికి నొదవినట్లు | పలుకు వెడఁగుల మాటలు పాడి యగునె?
243
క. సేనమొగ మీతఁ డైనం | బూని మహీశ్వరులు నీకుఁ బొడిచెదరే? దు
ర్మాని యనిగాదె యీతని | తో నడచుట కొల్లనైతి దురమున కధిపా!’
244
వ. అనిన భీష్ముండు సూతసూనున కిట్లనియె: 245
చ. ‘ముదుకఁడనైన నాదు బలమున్‌ జలమున్‌ వివిధాస్త్రశస్త్ర సం
పదయును బోయి నీ గురుఁడు భార్గవుచే విను, మాజిభూమి నా
కెదిరినవారు పెక్కెడల నేమయిరో యెఱుఁగున్‌ జగంబు; నా
ముదిమియు నీ కుమారుతనమున్‌ వరుసన్‌ విజయుం డెఱింగెడున్‌.
246
క. అనుమానింపక సభలో | నను నేఁ జెప్పికొనవలసె నా కిమ్మెయి దు
ర్జనితుఁడ వగు నీ యెడ నీ | సున నా కిటు వలుక వలసె సూతతనూజా!
247
తే. కార్యమును ఖడ్గమును నింత గలుగు నీవు | గలుగఁ జేటువాటిల్లె నిక్కౌరవులకు;
దీని మముబోఁటు లెల్లను దీర్పనెట్లు | చాలెదము? మంచిబంటవు చక్కనగుము.
248
చ. నెపమిడి యోహటించి యిటు నీవు తొలంగినఁ బోవ వచ్చునే?
కుపితమనస్కుఁడై నరుఁడు కూల్పఁ గ్రమంబున దొడ్డలెల్లఁ జ
న్న పిదప, నెట్లుఁ జొచ్చెదు రణంబున, నప్పుడు చావకున్న దై
న్యపుఁ బరివారముం బతియునైన నెఱింగెద రెల్ల చందముల్‌.’
249
వ. అని పలికి దుర్యోధను నుపలక్షించి కర్ణుతో వెండియు. 250
ఆ. ‘సూతపుత్త్ర! యితఁడు నా తలఁ బెద్ద మో | పెత్తి నమ్మియున్న యట్టి చోటఁ
గ్రందుసేయ నాకుఁ గాదని సైరించి | యున్న బ్రదికి; తింక నూరకుండు.’
251
వ. అనియాడి మొగంబు గంటు వెట్టుకొనియున్న సురనదీసూను దిక్కు మొగంబై సుయోధనుండు ‘నీకుం గోపింప నగునె; నన్నును గార్యభారంబునుం జూచి నా బ్రదుకునకై సర్వంబును సహింపలయు’నని తేర్చి యంగ రాజుం గనుంగొని ‘మీ రిద్దఱు నొక్కటియై భరంపడి యిప్పని సక్కంజేసి కాక మీలోన నిట్టి యెరవు మాటలేల?’ యని పొదివి పలికి, తదనంతరంబ పాండవ పక్షంబు వారల తారతమ్యంబులు వినువాఁడై యమ్మాట పుట్టించిన నతనికి భీష్ముం డిట్లనియె: 252
తే. ‘పాండుపుత్త్రుల నద్దెస దండిమగలఁ | గలనిజంబేను జెప్పినఁ గర్ణు మనసు
నొచ్చు; నీ చిత్త మెట్లగునో యెఱుంగ; | నాకు నిదియేమి పని రిత్త నడుమనుండి?’
253
వ. అనిన, మఱియు దుర్యోధనుండు తఱిమి యడుగుటయు నిట్లనియె: 254
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )