| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము |
| తే. |
‘అతిరథుండు యుధిష్ఠిరుం డగ్నికల్పుఁ | డాహవంబున నప్రతిహతుఁడు; భీముఁ డతిరథ శ్రేష్ఠుఁ; డతని మహాబలం బ | మానుషము, విక్రమం బసమాన మధిప! |
255 |
| క. |
సమరథులు కవలు భుజగ | ర్వము పటు విక్రమము దుర్నివారంబులు; వా రి మనంబులు నిర్భయములు; | తమ మొనలకు మించి బెట్టు దాఁకుదు రధిపా! |
256 |
| సీ. |
వారందఱును ధర్మవైభవంబునఁ, దప | స్సంపద నెక్కుడు జనులకెల్ల ధనువు నాఱంగంబులను బరిణతులు దాఁ | కోర్తురు; పరులకు నోర్వరాని కోల్తల గలరు; పెక్కులు పరాక్రమములు | వేర్వేఱ చేసిన వీరు లొక్క మొగ మయి తాఁకిన వెగడంద కుండునే? | మనసేన ము న్నవమాన పాటు |
|
| ఆ. |
దుఃఖపాటు గలిగి తొడరంగ వచ్చిన | వారుగాన నలఁతిఁ బోరు; ప్రాణ మాసపడక యోపినంతయుఁ బెనఁగుదు | రది సహించి నిలుచు టరిది మనకు. |
257 |
| మ. |
నరుఁ డీ మానమువాఁ డనంగ వశమే? నా కంతవా రెందు నె వ్వరులే; రింకను బుట్ట; రాపులికి దుర్వారోద్యముండైన యా హరియుం దోడటె! యేమి చెప్పుదు? నతం డా సేనలం గాచు నొ క్కరుఁడుం, గీటడఁగించు నీ బలములన్ గాండీవదుర్దాంతుఁడై. |
258 |
| వ. | అనిన విని యక్కొలువున నున్న రాజుల మనంబు లెల్లను జేవ సెడియె; భీష్ముండు వెండియు నిట్లనియె | 259 |
| సీ. |
‘ద్రౌపదేయులు మహారథు లేవురును; వారి | తరమ యుత్తరుఁడును ధరణినాథ! యతిరథవర్యుఁ డయ్యభిమన్యుఁ; డర్జున | వాసుదేవుల కెనవచ్చువాఁడు; లఘుచిత్రములు నేర్చు లావును దాల్మియుఁ | గలఁడు తండ్రులపాటు తలఁచుచుండుఁ గావున బెడిదంబుగాఁ బోరు; సాత్యకి | యతిరథోత్తముఁడు శౌర్యాన్వితుండు; |
|
| తే. |
పాండవ స్నేహసక్తుఁడై యుండుఁ గాన | నలుక మనమీఁదఁ బెద్దయుఁ గలిగి పెనఁగు; వీర లిరువురుఁ బరుసనివారు సమర | పరుల నొప్పింతు రీ యోధవరులనెల్ల. |
260 |
| మ. |
అలఁతింబోరు మహారథుల్ ద్రుపద మత్స్యాధీశు లుద్యద్భుజా బలశౌర్యాఢ్యులు పాండురాజసుత సంబంధ ప్రియస్నేహముల్ కలిమింజేసి తదీయ దైన్యమునకుంగా నొచ్చియుం జచ్చియున్ గెలిపింపం దమకించి చొత్తు రని కేకీభూతచేతస్కులై. |
261 |
| ఆ. |
వీరగుణము బలము వీఁకయుఁగలఁడు మ | హారథుఁడు శిఖండి; యతని తమ్ముఁ డతిరథుండు దర్పయుతుఁడు ధృష్టద్యుమ్నుఁ | డుగ్రతేజుఁ డనికి నుగ్రునట్ల. |
262 |
| క. |
అతని సుతుఁ డర్ధరథుఁ డా | ధృతవర్ముఁడు పిన్నవాఁడు త్రిమ్మటకాఁడై మతిహీనత శస్త్రా స్త్ర | ప్రతతి పరిశ్రమములేక పాలసుఁ డగుటన్. |
263 |
| ఆ. |
చేది భూవిభుండు శిశుపాల తనయుండు | ధృష్టకేతుఁ డధిక ధీరమతి మ హారథుండు; భోజుఁ డజుఁ డనురాజులు | నట్టివార తెంపు నలవుఁ గలరు. |
264 |
| వ. | ఉత్తమౌజుండును యుధామన్యుండును క్షత్త్ర దేవుండును జయంతుండును నమితౌజుండును విరాటుండును సత్యజితుండును ననం బరఁగు పాంచాల కుల ప్రదీపకులు మహారథులు; మత్తమాతంగ బృందంబు చందంబునం బ్రతిబలంబు పయిం గవిసి కోలాహల బహుళంబుగాఁ గలంపం జాలుదురు; కేకయపతు లేవురు సహోదరులు మహారథులు, కడింది మగలు, కెంపు రథంబుల మొత్తంబులతోఁ గార్చిచ్చు పగిదిం బొదువుదురు; కాశీశుండు నీలుండు సూర్యదత్తుండు మదిరాక్షుండు శంఖుండు విరాటజ్ఞాతులు మహారథులు వివిధాయుధ విద్యా విశారదులు; వారి పోరు భరంబై యుండు. | 265 |
| సీ. |
చిత్రాయుధుండును జేకితానుండు మ | హారథు లిద్దఱు నర్జునునకుఁ గూర్తురు, కయ్యాన కోర్తురు, నేర్తు, రా | యుధముల కెల్ల నత్యుగ్రు; లవ్వి ధము వార; చంద్రదత్త వ్యాఘ్రదత్తులు | వినుము సేనాబిందుఁడను నృపాలుఁ డతిరథోత్తముఁడు మారుత పుత్త్రు నెన యతం | డొక్కరుండును వారి యుఱిది లావు |
|
| ఆ. |
పాండ్యుఁ డతిరథుండు బలఁగంబుఁ గలవాఁడు | సమరథుండు కాశ్యుఁ డమితబలుఁడు కుంతిభోజుఁ డాజికోవిదుఁ డతిరథుం | డతని యొద్దిజోదు లధికబలులు. |
266 |
| వ. | రోచమానుండు మహారథుండు దేవసమానుండు. | 267 |
| తే. |
అతిరథుల కెల్లఁ దల, తండ్రియట్టివాఁడ | యసురవిభుఁడు ఘటోత్కచుం; డా హిడింబ కొడుకు మాయాబలంబున నొడుచుఁ బగఱ | నతనికడ దానవానీక మగ్గలంబు. |
268 |
| వ. | నాకుం దోఁచినవారిం బేరుకొంటి; నింతియకాని, రెండు వీళ్ళను మంచి మగలు పెక్కండ్రు గల’రని చెప్పి గాంగేయుండు. | 269 |
| క. |
‘పాండవుల దిక్కు రథికు ల | ఖండిత బలులైన నా మొగంబునఁబడి యు ద్దండత చూపఁగ లేరు శి | ఖండిని నొక్కరునిఁ జంపఁగాని కుమారా!’ |
270 |
| క. |
అనవుడు దుర్యోధనుఁ ‘డా | తని మీరు వధింపమికిఁ గతం బేమియొకో! విన దుగనేనిం జెపుఁడా’ | యనుటయు నిట్లనియె భీష్ముఁ డతనికి నెమ్మిన్. |
271 |
| వ. | ‘ఏ నా శిఖండినిఁ జంపమికి మూలంబు సాలం గలదు; తత్ప్రపంచం బంతయు వివరించెద నాకర్ణింపుము: | 272 |