పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము
పరశురాముఁ డంబం దోడుకొని భీష్ముని యొద్దకు వచ్చుట (సం. 5-178-23)
క. అని పలికి పరశురాముఁడు | సనుదెంచెను మునిజనంబు సమ్మదమునఁ దోఁ
జనుదేరఁ గురుక్షేత్రం | బున కుద్ధతిఁ గాశిరాజపుత్రిం గొనుచున్‌.
300
వ. వచ్చి సరస్వతీతీరంబున విడిసి, తనరాక నా కెఱింగించిన, నేను ఋత్విక్పురోహిత ప్రభృతి విశిష్ట బ్రాహ్మణ సమేతంబుగాఁ బూజాద్రవ్యంబులు గొని తత్ప్రదేశంబున కరిగిన, నమ్మహాత్ముండును మదీయ భక్తి వినయ సంభ్రమంబులు సంప్రీతి నభినందించి యర్చనలు గైకొని కాశిరాజకన్యకం జూపి నాతో విట్లనియె: 301
తే. ‘బలిమి మున్నేల తెచ్చి తిప్పడఁతి? మగుడఁ | ద్రోచిపుచ్చంగఁదగునయ్య నీచవృత్తి?
వచ్చె దీనిఁ దమ్మునికి వివాహమింక | నైనఁ జేయుము; చేయమి యనుచితంబు.’
302
క. అనుటయు ‘ననఘా! తెలియన్‌ | విను మిది నాతోడ ‘సాళ్వవిభునకు నేఁ గూ
ర్చినదాన నతనిపాలికి | ననుపుము న’ న్ననినఁ గాదె యనిచితి మగుడన్‌.
303
తే. ఇంక నా తమ్మునికి దీని నెట్లు పెండ్లి | సేయ నేరుతు?’ ననుడు ‘నా చెప్పినట్లు
సేయ వైతేని నిన్ను నీ చెలులఁ జుట్ట | ములను జంపుదు’ ననియె నమ్మునివరుండు.
304
వ. ఏను వినయంబు వదలక వినతుండ నగుచు వివిధ వాక్యంబులం దెలుప, నంతకంతకు నతనికిఁ గోపం బగ్గలంబైన వెండియు. 305
ఆ. ‘గురుఁడవై సమగ్ర కోదండ విద్యా మ | హత్త్వ మిచ్చినాఁడ వలుగఁ దగునె
కారణంబు లేక యీరసమెత్తి యి?’ | ట్లనినఁ బరశురాముఁ డాగ్రహమున.
306
చ. ‘గురుఁడని నన్నెఱుంగు దనఘుండవు నా వచనంబునం దనా
దరణము సేసి తెన్నియొ విధంబులఁ బల్కెదు భక్తితోడ, నీ
వెరవులు దక్కు మీ! యబల వేగమ పెండిలిసేయు మంతతో
మరలు మదీయ కోప శిఖి; మానదు వేఱొక వేయుఁ జేసినన్‌?
307
వ. అనిన విని ‘యధర్మాచరణంబున కింతవట్టి పెనంగనగునె? పరానురక్తచిత్తయగు మగువ నిల్లాలిం జేయువారుం గలరె? యిట్టి యకృత్యం బాచరించుకంటె నీచేత నెట్లయినను లెస్స; తొల్లి పెద్దలు సెప్పిన చొప్పవధరింపు’ మని యిట్లంటి. 308
తే. ‘గర్వియై కార్య మిట్టి దకార్యమిట్టి | దని యెఱుంగక లోకంబు చనుపథమునఁ
దిరుగ కున్మదవృత్తి వర్తించునట్టి | వాని గురునైన దండింప వలయు నండ్రు.’
309
క. అను మాటకుఁ గాలానల | మును బోలెను మండి ‘కయ్యమున కాయితమై
మొనలేర్చి వేగ యిచటికిఁ | జనుదె’మ్మని భార్గవుండు సంరంభమునన్‌.
310
వ. పలికిన నేనును. 311
క. ‘చులుకఁదనంబున విప్రున | కలుగంగాఁ దగదు; గురుఁడునై యున్నాఁ డం
చలయక తలఁచితిఁ గా కిటు | నిలుమీ! నీ రణము సేఁత నిజమగునేనిన్‌.
312
క. క్షత్రియులఁ దొల్లి యలుకకుఁ | బాత్రము సేసితటె? నాఁడు బలియుఁడు గంగా
పుత్రుఁడు పుట్టమిఁగా కిది | యీ త్రయి నింకేల చెల్లు? నెఱుఁగవె నన్నున్‌!
313
క. ఏ నొకరుండన వచ్చెదఁ | గాని బలము దేను; నీవు గఱపిన శస్త్రా
స్త్రానేక విధవిలాసము | దాన వలయు సేన గాదె! తథ్యం బరయన్‌’.
314
వ. అని పలికి యతనికిం బ్రణమిల్లి చనుదెంచి, సత్యవతి కింతయు విన్నవించి, యద్దేవి యనుమతి వడసి, సర్వసన్నాహ సమేతంబగు రథం బెక్కి విప్రాశీర్వాదంబులు చెలంగ వెడలి వచ్చి కురుక్షేత్రంబు దఱియం జనునెడ, భాగీరథి భామినీ రూపంబున నరుగుదెంచి ‘తన్నెఱింగించి, మదీయభక్తి నభినందించి యే నాయితంబై పోవుటకుఁ గారణం బడిగి, నా చేత నత్తెఱం గెఱింగినదియై నన్నుం గినిసి, భార్గవుపాలికిం జని ‘నీ శిష్యుండు నిరపరాధుండు నా కొడుకున కలుగం దగునే?’ యని చెప్పి, యతని యందుఁ బిక్కు గానక మగుడ నేతెంచి, నావలనను మెత్తంబాటులేకున్నం జనియె; నప్పుడు సిద్ధ విద్యాధర ముని గణంబులు గౌతుకంబునం గనుంగొనుచుండ నేను జమదగ్ని తనయున కనతిదూరంబునం దేరుడిగి వినతుండనై నిలిచి ‘నీవు భూచారివై యున్నవాఁడవు; రథికుండనైన నాకు నీతోడ సమరంబు చేయనగునే?’ యనిన యనంతరంబ యతండు దివ్యంబులగు రథ రథ్యంబులు శస్త్రాస్త్రంబులునుం గలిగి యకృతవ్రణుండు సారథిగా సమర సన్నద్ధుండై తోఁచినం జూచి రథారోహణంబు చేసి శంఖంబు పూరించి గుణంబు సారించి సూతు నగ్గించి తనకు నమస్కరించి కడంగిన నప్పరశురామదేవుండు. 315
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )