పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము
భీష్ణుఁడు దుర్యోధనున కంబోపాఖ్యానంబు సెప్పుట (సం. 5-170-1)
సీ. శంతను పిమ్మట సత్యవతీ దేవి | యనుమతితోడఁ జిత్రాంగదునకు
సామ్రాజ్యపట్టంబు సమ్మతిఁ గట్టితి; | నల్పకాలంబున నతఁడు దీఱెఁ;
దత్పరోక్షావస్థఁ దదనుసంభవుని వి | చిత్రవీర్యుని రాజుఁ జేసి, పెండ్లి
సేయంగఁ దివిరి, కాశీపతి కూఁతులు | కన్యలు మువ్వురు గలుగుటయును
 
తే. నాత డర్థిఁ దదీయ స్వయంవరమున | కఖిల నృపతులఁ బిలిపించె ననియు నెఱిఁగి
తల్లి కెఱిఁగించి యొంటిమైఁ దత్పురమున | కాయితం బయిపోయితి నరద మెక్కి.
273
వ. ఇవ్విధమునం జని యమ్మహోత్సవంబున నలంకృతలై యున్న యంబయు నంబికయు నంబాలికయు ననుముద్దియల మువ్వురంబట్టి రథంబుపయిఁబెట్టి కొనిరా నచ్చటి రాజులెల్లను జతురంగ బలంబులతో వచ్చి నన్నుం బొదివినఁ, బటువిశిఖానల శిఖా కలాపంబున వేఁడిమి చూపి వారి నిలువరించి, యరుగుదెంచి సత్యవతికి నప్పొలంతుల నొప్పించిన నద్దేవి విచిత్రవీర్యునకు వారల వివాహంబు సేయ నుద్యోగించె; నట్టియెడ నమ్మువ్వురయందుం బెద్దయదియైన యంబయను కన్యక నాతో నిట్లనియె: 274
తే. ‘సౌంభపురవల్లభుండైన సాళ్వుమీఁదఁ | దలఁపు గలదు నా; కతఁడును దగులు గలిగి
యుండు నాదెస; నీవు ధర్మోత్తరుండ; | వతని పాలికిఁ దగ నన్ను ననుపవయ్య!’
275
క. అనవిని సత్యవతికిఁ జె | ప్పిన నాయమ వనుప నంబఁ బెంపుగ వృద్ధాం
గనలం దోడుగ నప్పుడ | పనిచి యనిచితిని జనంబు ప్రస్తుతిసేయన్‌.
276
వ. ఇట్లు పనిచి తక్కిన కన్నెల నిరువురం బాణిగ్రహణంబు చేయించితి. 277
క. అంబయు నట సాళ్వుని కడ | కుం బోయిన నతఁడు ‘భీష్ము కొనిపోయిన దా
నిం బరచుం గైకొన ధ | ర్మంబే? కన్యాత్వ మెడలె మగువా నీకున్‌.
278
వ. ఇంక నిన్ను భార్యగా వరియింపం దగునే?’ యనినఁ గామశరపీడిత యగుచు నక్కామిని యతని కిట్లనియె: 279
తే. ‘తమ్మునికిఁ గాఁగ భీష్ముఁ డుదగ్రవృత్తిఁ | గన్నియలఁ గొనిపోయెడుఁ గాన బలిమి
నన్నుఁ గొనిపోయె; నాచేత నిన్ను వినిన | యపుడె పుత్తెంచె దూషింప ననఘ! తగునె?
280
వ. మా తండ్రి యెఱుంగక స్వయంవరాలంకారంబు నాకుం జేయించిన కతంబున నింత వుట్టె; భీష్ముండు నా చెలియండ్రం దన తమ్మున కిచ్చి నన్ను నీకడకుం దగ ననిచె; దీన నేమి త?’ప్పని మఱియు ననేకప్రకారంబులం బలికిన వినక తన్నుం జేకొనక సాళ్వుండు. 281
క. కరుణంబుగ నేడ్చు తలోదరిఁ | ‘బోపొ మ్మిచట నింకఁ దడయకు’ మని మం
దిరము వెడలంగ నడిచిన | నరిగె నదియు నార్తచిత్తయై వికలగతిన్‌.
282
వ. చనిచని యవ్వెలంది యిట్లని వితర్కించు. 283
తే. ‘సాళ్వునకుఁ గాని యపుడ సంసారమునకుఁ | బాసితిన; యింక భీష్ముని పాలి కేల
యరుగ? నాతండు మూల మీ హానికెల్లఁ | గాన నాతని సాధింతుఁగాక యేను.
284
క. గాంగేయు గెల్వ నెవ్వరి | కిం గొలఁదియె? తపముపేర్మి గెలిచెదఁగా’ కం
చుం గాంత చనియె సంయమి | పుంగవు లొక కొందఱున్న పుణ్యస్థలికిన్‌.
285
వ. చని వారలకుం దనవృత్తాంతం బెఱింగించిన వా ‘రిది రాజులు చేసిన పని సాధులచేతఁ జక్కంబడునే’ యనిన నవ్వనిత ‘తపశ్చరణంబునకు వచ్చితి’ ననుటయు, ‘నీవు సుకుమారవు; నీకిది సొప్పడునే? తండ్రి పాలికిం బొ; మ్మదియ పరమ ధర్మం’బని పలికిన వారి కన్నారీరత్నం బిట్లనియె; 286
క. ‘ఎవ్వరు నెఱుఁగక యుండఁగ | నివ్వనమునఁ దపముసేఁత యిది నిర్ణయ మే
నెవ్వారి కడకు నేమని | యెవ్విధిఁ బోనేర్చుదాన? నేటికి బంధుల్‌?
287
వ. అని చెప్పు నవసరంబున నయ్యాశ్రమంబునకు హోత్రవాహనుండను రాజర్షి వచ్చిన నమ్మును లభ్యాగత పూజలు చేసిన యనంతరంబ యంబం గనుంగొని ‘యిక్కన్నియ యెక్కడిది? దీని విషాదంబునకుం గారణం బే?’మని యడిగి, వారివలన దాని జన్మప్రకారంబును దద్వృత్తాంతంబును విని, తన కూఁతుకూఁతు రగుట యెఱింగి యయ్యంగన వినం దపస్విజనంబులకుఁ జెప్పి, యప్పొలంతిం దన యంకతలంబున నునిచికొని వెండియు నడుగ సవిస్తరంబుగా నచ్చేడియ చెప్పిన విని, శోకించి యవ్విషమ ప్రకారంబునకు నిస్తారంబుఁ జింతించి. 288
ఉ. ‘నీ కిది యేటికిం దప? మనింద్యచరిత్రవు నీవు; నిన్ను నేఁ
జేకొని కాతు; నొక్క గతిఁ జెప్పెద, భార్గవరాము నాశ్రిత
శ్రీకరుఁ గాన్పు; మాపదలు చెందఁగనీఁ డతఁ డాశ్రయించినన్‌;
శోకము దక్కు’ మన్న విని సుందరి యల్లన యత్తపస్వితోన్‌.
289
ఆ. ‘పరశురాముఁ గానఁబడయుట యెక్కడఁ | గలుగు? నాతఁ డెట్లు కరుణసేయు?’
ననఁ దపస్వి యిట్టు లను ‘మహేంద్రంబను | పర్వతమునఁ జేయు పరమతపము.
290
వ. నన్ను మన్నించుం గావున మదీయ దౌహిత్రి వగుట యెఱింగిన నిన్ను రక్షించు; నందుఁ బొ’మ్మను సమయంబునం బరశురామశిష్యుం డగు నకృతవ్రణుండను ముని వచ్చి, యతిథి సత్కారంబులం బూజితుండై యున్నఁ, బ్రియపూర్వకంబుగా నా హోత్రవాహనుండు ‘భార్గవుం డెయ్యెడ నున్నవాఁ?’డని యడిగిన. నతం డిట్లనియె: 291
క. ‘తన ప్రియసఖుఁడవు నీవని | మునిజనులకుఁ జెప్పుచుండు ముదమున నిన్నుం
గనుఁగొనఁగ నెల్లి యిచటికిఁ | జనుదెంచు ననేక శిష్య సంఘము తోడన్‌.’
292
తే. అనిన విని యెల్లవారును నధిక హర్ష | మెసఁగ నున్నంత మఱునాఁడ యేగుదెంచె
భార్గవుం; డమ్మునీంద్రులు పరమభక్తి | నర్చ లిచ్చిరి హోత్ర వాహనుఁడు గనియె.
293
వ. కని పరశురాముని సంభావనంబును సంభాషణంబును బడసి కాశిరాజు కన్యకం జూపి, ‘యిది నా దౌహిత్రి; దీని వృత్తాంతం బంతయు విను’ మని య మ్మానినిం గానిపించిన నదియును. 294
చ. కనుఁగవ నశ్రుధార లొలుకం జరణానతయైన, రాముఁ డి
ట్లను ‘విను హోత్రవాహనుని యట్టుల యేనును నీకు; నీ మనం
బునఁ గల చింతయంతయును బుచ్చెద; నాకడఁ జేరి తింక నీ
వనటఁ దొలంగఁబెట్టి గరువంబుగఁ జెప్పుము దీని మూలమున్‌.
295
వ. అనిన విని యమ్మహాత్మునకు నంబ దనవృత్తాంతం బంతయు సవిస్తరంబుగాఁ జెప్పి ‘నీ వార్తశరణ్యుండవు; నా పరిభవంబు దీర్చి నన్ను రక్షింపు’మనవుడు నతం డిట్లనియె: 296
క. ‘పరిభవము రెండు దెఱఁగులఁ | దరుణీ తోఁచినది; సాళ్వుఁ దగఁ దేర్తునొ? యు
ద్ధురుఁ డగు భీష్మునిఁ దీర్తునొ; | కరము ప్రియంబెద్ది హృదయగతముం జెపుమా!’
297
చ. అనవుడు నింతి యిట్లను ‘మహాపురుషా! నను సాళ్వుఁ డింకఁ గై
కొనఁ; డది సాలు; భీష్ముదెసఁ గోపము నా మది గల్గియుండు; నా
తని వధియింపఁ బూని యిటు తాపసవృత్తికి వచ్చి యిచ్చటన్‌
నినుఁ గని యీ పరాభవము నీఁగఁగ నీ శరణంబుఁ జొచ్చితిన్‌.
298
తే. అనిన ‘నా చెప్పినట్ల గంగాత్మజుండు | సేయుఁ; జేయక తక్కిన శితశరముల
నతనిఁ బడవైతు; నూఱడు మబల! నీకుఁ | దపము సేయంగ నేటికిఁ దనువు డయ్య?’
299
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )