| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము |
| తే. |
అంబ వృత్తాంత మరయంగ ననుదినంబుఁ | దగిన వారలఁ బుచ్చుచుఁ దలఁకుచుందు నేను నది యాదిగాఁ జింత నేపు దక్కి | స్రుక్కియుండియు రాజుల నుక్కుమడఁతు. |
361 |
| వ. | ఒక్కనాఁడు పారాశర్య నారదులంగని యక్కార్యంబు భయంబు దోఁప విన్నవించిన వారలు ‘దైవాధీనంబగు దాని మానుషంబున మానిపింప వశంబుగా; దా చింత విడువు’మని రందు నారదుం ‘డక్కాశీశ్వర కన్యక తెఱంగు విను’మని యిట్లనియె. | 362 |
| సీ. |
‘ఆ తన్వి యమునా నదీ తీరమున కేఁగి | యత్యుగ్రమగు తప మాచరించి యందుండి కౌశికు నావాస మాదిగాఁ | గలుగు సిద్ధాశ్రమంబులకు నెల్లఁ జని చని తత్ప్రదేశంబుల నిష్ఠుర | వ్రతములు సలుపంగ వచ్చి నీదు జనని జాహ్నవి ‘యిట్లు వనితల కతి దుష్క | రములగు బహునియమములు నీకు |
|
| తే. |
నడపఁ గత మేమి?’ యనుడు నన్నాతి పలుకుఁ | ‘దద్ద యవమాన పడితి శాంతనవు చేత; నపరజన్మంబునం దైన నతనిఁ జంప | నేను జాలుటకై యిట్టిదాన నైతి. |
363 |
| వ. | అనిన విని భాగీరథి ‘కుటిల ప్రచారవగుట నీవీ తనువు విడిచి యేఱయి పాఱంగల దాన; వింతియకాని యొండు గానేర’ వనిన న వ్వెలంది నవ్వుచు సరకు చేయక యరిగి తొంటికంటెను దీవ్రంబగు తపశ్చరణంబునం బ్రవర్తిల్లుచు మత్స్యదేశ వాసినియై యుండి నాఁడు నిజవ్రత ఫలంబులో సగంబున నంబయను పేర నదియై య మ్మండలంబునం బరఁగియున్న సగంబునను దనరూపు చెడకుండ వహించికొని జాహ్నవీ ప్రభావంబు నాత్మీయ ప్రభావంబున గెలిచి వెండియు. | 364 |
| క. |
పుణ్యాశ్రమ దేశముల న | గణ్యంబగు తపము చేయఁగా రుద్రుఁడు గా రుణ్యము వాత్సల్యము దా | క్షిణ్యము మెఱయంగ నింతికిం బొడసూపెన్. |
365 |
| క. |
మును లచ్చెరు వంది కనుం | గొన శంభుఁడు నిల్చి ‘వరముఁ గోరు’ మనుడు ‘భీ ష్ముని నాకుఁ జంపఁగా దొర | కొను నట్లుగ నొసఁగు’ మనియెఁ గోమలి యెలమిన్. |
366 |
| వ. | అనవుడు నద్దేవుం ‘డట్ల కాక’ యని యనుగ్రహించిన, నంబ ‘యెత్తెఱంగున నది యయ్యెడు?’ నని యడిగిన- | 367 |
| సీ. |
ఈ మేను విడిచి నీ వేఁగిన యప్పుడు | ద్రుపద భూవిభునకుఁ దొల్త పుత్రి వై పుట్టి పిదపఁ బుత్త్రాకృతిఁగాంచి శి | ఖండినామమున నుద్దండబాహు బలమునఁ గోదండ పాండిత్యమును బటు | శౌర్యంబు నొప్పఁ బ్రశస్తి కెక్కి యనిఁ జంపఁ గలదాన వాతని; నా మాట | దప్ప దూఱడు’ మని చెప్పి హరుఁడు |
|
| తే. |
సనియె; నా ప్రొద్దు సమిధలు చాలఁ గూడ | వైచి యనలంబుఁ గూర్చి యవ్వనిత క్రోధ దీప్తమూర్తియై ‘భీష్ము వధించు దాన’ | ననుచు సొదఁ జొచ్చె మునులకు నద్భుతముగ. |
368 |
| వ. | అట్టియెడ ద్రుపదుం డనపత్య యగు తన మహిషి విషాదంబు దీర్పం దివురుటను గాంగేయు తోడి రోషంబునను శివుని నుద్దేశించి తపంబు సేసిన నద్దేవుండు ప్రత్యక్షంబయి ‘వరంబు వేఁడు’ మనిన ‘భీష్ము వధియించు నట్టివాని నొక్క పుత్త్రుని నొసంగవలయు’ ననుడు. | 369 |
| తే. |
‘కూఁతురై పుట్టి పదపడి కొడుకుఁదనము | గాంచి భీష్ముని నాజిరంగమునఁ జంపు నట్టి యుజ్జ్వలాపత్యంబు వుట్టు నీకుఁ | దప్ప దిది’ యని రుద్రుండు సెప్పి చనియె. |
370 |
| వ. | ద్రుపదుండును బ్రీతుండయి నిజప్రియకు నవ్విధం బెఱింగించెఁ; దదనంతరంబ కాశీశ్వరకన్యక చైతన్యం బుదరంబు ప్రవేశించిన. | 371 |
| క. |
పాంచాల రాజభార్య స | మంచిత గర్భంబు దాల్చి, మఱువడఁ గూఁతుం గాంచి, నిజపతియుఁ దానును | వంచనఁ గొడు కనిరి యెల్లవారును వినఁగన్. |
372 |
| వ. | ఇట్లు పుట్టిన బిడ్డకుఁ బుత్త్ర ప్రకారంబున జాతకర్మాది కృత్యంబులు నిర్వర్తించి శిఖండి యనుపేరుపెట్టి యతి ప్రచ్ఛన్నంబుగాఁ బెనిచి రహస్యంబు తెఱం గా కన్నియకుం జెప్పి’ యక్షర శిక్షాదు లాచరించి ద్రోణాచార్యుకడ శస్త్రాస్త్ర పరిశ్రమంబు సేయించుచుండ జవ్వనంబు చేరువకుం దఱియగుటయు నమ్మగువం జూచి వగచి తల్లిదండ్రులు తమలో విచారించి ‘వేగంబ వివాహంబు సేయవలయుఁ; బరమేశ్వరు వరంబు కొఱంత వడునె? తన నెఱసినప్పుడు నెఱయుంగాక!’ యని నిశ్చయించి దశార్ణ దేశాధీశుండగు హేమవర్మ యను రాజు కన్యకం దగిన తెఱంగునఁ బాణిగ్రహణంబు సేయించి తెచ్చియున్నంత. | 373 |
| ఆ. |
అక్కుమారి చతుర యగుట శిఖండి వ | ర్తనము నెడఁ బ్రమాదమున నెఱింగి యుగ్గడింప నొల్ల కూరక యెఱుఁగని | యదియ పోలె నుండె నాత్మ నొచ్చి. |
374 |
| వ. | ఇట్లు దశార్ణ విభుపుత్రి యెఱింగి శిఖండి పురుషుండు గామి దన దాసికిం జెప్పిన నదియు నప్పు డన్నరనాథున కెఱింగించి, పుచ్చిన, నతండు విషాద రోషంబుల నొంది దూతం బుత్తెంచిన, వాఁడు వచ్చి పాంచాలపతిం గాంచి యిట్లనియె : | 375 |
| చ. |
కొడుకని చెప్పి యిట్లగునె కూఁతు వివాహము చేయ దీన నీ పడసిన లాభమేమి? నగుఁబాటగు నింతియ కాక యెల్ల నే ర్పడ నెఱుఁగంగ వచ్చితి; నరాతిభయంకరు హేమవర్మ నా గడమున గాసిచేసితి మగంటిమి నీదెసనైనఁ జూపుమా! |
376 |
| ఆ. |
అనిన నగుచు వాని కను ద్రుపదుం ‘డివి | యేటిమాట? లిట్టు లేల చేయ వచ్చు? నింత వెఱ్ఱివారును గలరె? యి | త్తెఱఁగు వొసఁగ కునికి యెఱుఁగ రాదె?’ |
377 |
| వ. | అని వెండియు నేర్పునం దీర్పుమాట లనేకంబులాడి నిక్కం బరయం జూచిన వానికిం జొరవ యీక త్రోపుసేసి వీడ్కొలిపి పుచ్చినం బోయి వాఁడును నిజనాథున కవ్విధంబు విన్నవించిన. | 378 |
| క. |
కోపోద్రేకంబున నతఁ | డా పాంచాలపతిమీఁద నతులిత సైన్యా టోపమున వచ్చి పురి పరి | ఖా పరిసర తలము చుట్టుఁ గైకొని విడిసెన్. |
379 |
| వ. | ఇట్లు విడిసిన. | 380 |
| ఆ. |
పట్టు వడ్డ మ్రుచ్చు పగిదిఁ బాంచాల భూ | నాయకుండు తనకు నానచేటు రాక కుమ్మలించి యేకాంతమునఁ బత్ని | యొక్కతియును గొల్వ నూరకుండె. |
381 |
| వ. | తదీయ దండనాథులు సమరోత్సాహంబునం బ్రవర్తిల్లి; రంత సూర్యాస్తమయ సమయం బగుటయు రెండు వీళ్లును భండనంబు తోడి వేడుకం జేసి వేగుటకు వేచియుండె. | 382 |
| క. |
అప్పుడు శిఖండి మరణము | దప్పఁగ సడి కొండు ప్రతివిధానము సేయుం జొప్పడమిఁ దలఁచి యొరులకుఁ | జెప్పక వెస నరిగెఁ బురము చెంత యడవికిన్. |
383 |