పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము
శిఖండి యక్షునివలనఁ ఋరుషత్వంబునొందిన వృత్తాంతము (సం. 5-192-20)
వ. అవ్విపినంబు స్థూలకర్ణుం డను నొక్క యక్షునికి నివాసంబై యునికిం జేసి నిర్జనంబై యుండు; శిఖండియు నత్తెఱం గెఱుంగుం గావున నతని నుద్దేశించి యందుఁ జొచ్చి తత్ప్రదేశంబున మహనీయ సుందరంబగు తదీయ మందిరంబున కరిగి, యచ్చటఁ బ్రాణవియోగం బగు విధం బాచరింపం బూనిన. 384
ఉ. యక్షుఁ డెఱింగి వచ్చి ‘యిటు లాఱడి చావఁగ నేల చెప్పు మ
బ్జాక్షి! భవన్మనోరుజకు నౌషధ మే నొనరింతు’ నన్న ‘ఫా
లాక్షుఁడు దక్క నొడ్లకును నా పని సేయఁగరాదు; నాదు చి
త్తక్షతి పుంస్త్వ మేను దగఁ దాల్పక మానదు గుహ్యకోత్తమా!’
385
క. అని తన వృత్తాంతం బా | తని కెఱిఁగించుటయు, నతఁడుఁ దనదగు చిత్తం
బునఁ గరుణ వుట్టి ‘యెంతటి | పని యిది? యే నిత్తు సమయపరిపాలనతోన్‌.
386
క. నా పురుషత్వము గైకొని | వే పోయి దశార్ణపతికి వెలయించిన మీ
యాపదలు దొలఁగి చనఁ, బొడ | సూపుము పదినాళ్లయంత సూనృత మొప్పన్‌.
387
క. అంతవునంతకు నీదగు | కాంతారూపంబు నేను గైకొనియెద; ని
శ్చింతమున మగుడఁ జను’ మని | యింతికిఁ బురుషత్వ మిచ్చె నెంతయు వేడ్కన్‌.
388
తే. ఇచ్చి తాను భామాకృతి నెలమిఁ దాల్చి | వీడుకొల్ప శిఖండియు వీటి కేఁగు
దెంచి నిజమందిరంబు సొత్తెంచి తల్లి | దండ్రులకు మ్రొక్కి నిలిచి ముదం బెలర్ప.
389
క. తన తెఱఁ గంతయు నెఱిఁగిం | చిన నద్భుత హర్షమగ్న చేతసులై త
జ్జననీ జనకులు బహువిధ | వినుతులఁ గొనియాడి; రంత వేకువ యయ్యెన్‌.
390
వ. తదనంతరంబ సూర్యోదయం బగుటయుఁ గాలోచిత కరణీయంబులు నిర్వర్తించి, పాంచాల విభుండు సంబంధితో వలయు మాట లాడందగు వారలం బనిచి, రావించి సంభ్రమంబు లేక వేగిరపడక నాగరిక ప్రకారంబున శిఖండి పురుషత్వంబు దేటపఱిచి యతని మాట గీడ్పఱచి, సపరివారంబుగా నద్దశార్ణపతికి విందువెట్టి కట్టనిచ్చి, యతని యనునయాలాపంబు గైకొని యనిచి పుచ్చిన, నతండు తన్నుందాన నిందించు కొనుచు నిజపురంబునకుం బోయె; నట్టియెడ నయ్యక్షవరుమందిరంబు చక్కటికిం గ్రీడార్థంబు గిన్నర విభుండు విమానారూఢుం డయి చని దాని యొప్పు గనుంగొని యగ్గించుచు నిల్చి యొక్కింత సేపునకుం జుట్లనున్న గుహ్యకులతో నిట్లనియె. 391
క. ‘మన మిచట నిలిచియుండఁగ | మనమున శంకింప కిట్లు మసలిన వాఁ డీ
తని గర్వ మేల యిక్కడఁ | జనుదేరఁగనిచ్చు నెట్లు సైపఁగ వచ్చున్‌?’
392
వ. అని పలికి యలుక మొగంబున ముడివడ నున్నంతఁ గిన్నరు లా గుహ్యకు నరసి తద్వృత్తాంతం బంతయు నెఱింగించి ‘దేవా! సిగ్గుపెంపున రానేరకున్నవాఁ’ డని విన్నవించిన. 393
ఆ. ‘అయిన నేమి పిలువుఁ’ డని పిలిపించిన | వచ్చి మ్రొక్కుటయును వనితయైన
యతనిఁ జూచి ‘యింక నవుదాని కిట్టుల | యుండుఁగాక’! యని విభుండు పలికె.
394
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )