| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. | స్థూలకర్ణుండును దలరి దండప్రణామంబులు సేసియుండె; నప్పుడు గొలిచియున్న దొరలు ధనదునకుం గృప వుట్ట నల్లన తెలిపిన నట్లేని ‘వీడు శిఖండి యాయువు గలంతకాలంబున గాంతాకృతియై యుండి, పదంపడి నిజరూపంబు దాల్చుంగాక!’ యని యనుగ్రహించి యరిగిన. | 395 |
| తే. |
గుహ్యకుండు విషాదంబు గూరియుండ | నచ్చటికిఁ గొన్ని దినముల కరుగుదెంచెఁ దల్లిదండ్రుల కెఱిఁగించి తగవు మెఱయ | సమయనిష్ఠ వాటించి పాంచాలసుతుఁడు. |
396 |
| క. |
వచ్చినఁ గనుఁగొని ‘నీ దెసఁ | బొచ్చెము లే; దిట్ల మగిడి పొ;మ్మిది విధి నీ కిచ్చిన రూ’పని గుహ్యకుఁ | డచ్చుపడం బలికి యెల్ల నతనికిఁ జెప్పెన్. |
397 |
| వ. | చెప్పి వీడుకొలిపిన శిఖండి యత్యంత ప్రమోదంబునం దండ్రి కడకు వచ్చి యత్తెఱం గెఱింగించిన నాతండు ప్రీతుండయి దేవగురుద్విజపూజనంబు లాచరించి ద్రోణాచార్యుపాల సవిశేషంబుగా శిష్యభావంబు ప్రతిష్ఠించె’. | 398 |
| క. |
అని చెప్పి నారదుఁడు దా | నును సత్యవతీ సుతుండునుం దమ యిచ్చం జనిరి; శిఖండి చరిత్రము | జనకర్ణ పరంపరం బ్రశస్తం బయ్యెన్. |
399 |
| వ. | ఇవ్విధంబునఁ గాశీపతికన్యక సిద్ధమూర్తి యయి నెగడె; నేను నంగనల నంగనాపూర్వుల నంగనాభిధానుల నంగనాకారులను వధియింపకుండ వ్రతంబు పూనినవాఁడం గావున నంగనాపూర్వుండగు శిఖండి నాకు భండనంబునం గోదండపాండిత్యంబు మెఱసినను జంపను నొంపనుఁ; గడంగితిన యేని నింతకంటె దుర్యశంబు గలదె? యెట్లయిన నగుదుంగాని భగ్నవ్రతుండ నగుట కోర్వ నిది నా తెఱంగు.’ | 400 |
| క. |
అని చెప్పిన దేవవ్రతు | వినుత వచనములు విభుండు విని తన చిత్తం బున నొక్కింత వగచి’ యీ | తనికి మగతనంబు పూన్కి తగు’నని పలికెన్. |
401 |
| వ. | తదనంతరంబ కొలువునం గలయ సమర విషయంబు లయిన సల్లాపంబులు సెలుచుండఁ గొండొకసేపు వినుచుండి సుయోధనుండు సురనదీసూనున కిట్లనియె: | 402 |
| ఆ. |
‘పాండవులకుఁ గలుగు బలము లన్నియు సమ | యింప నీకు దినము లెన్నివట్టు గురుఁడుఁ గృపుఁడు గురుని కొడుకుఁ గర్ణుండు నెం | తెంత మానమున వధింతు రనఘ?’ |
403 |
| వ. | అనిన విని గాంగేయుం డతని కిట్లనియె : | 404 |
| క. |
‘అనిఁ బాండవ సేనలఁ జం | పను జెఱుపను నేము చాలు భంగుల నీ కి ట్లనుమానము వాయఁగ నడు | గన తగుఁ; గడు లెస్స! విందు గాక నరేంద్రా! |
405 |
| వ. | ఏను నా సాలెడు కొలంది సెప్పెదఁ; దక్కటివారుఁ దమ తమ చాలుటలు దార చెప్పెద; రది యెల్లను బిదప విందుగాని; మున్ను నీ కొక్క బాస యిచ్చెద నాకర్ణింపుము. | 406 |
| క. |
మీఁటుగల రాజరథికుల | నాఁటికి వేవుర వధింతు; నరుశరములు నో నాఁటి పడవైచునంతకు | వేఁటాడెదఁ బ్రతిబలంబు వీరుల నెల్లన్. |
407 |
| వ. | అట్లుగాక నా కయ్యంబు సేయు దివసంబులోన. | 408 |
| క. |
పదివేలఁ జంపఁగా నో | పుదు నే నను నెత్తికోలు పుట్టిన యది నీ పదునొకఁ డక్షౌహిణులను | జదురున నడపింతు నెదిరి సైన్యము గలఁతున్.’ |
409 |
| వ. | అని పలికి వెండియు. | 410 |
| క. |
‘నీ వడిగిన పని యేర్పడఁ | గా విను “మేనొక్క నెలఁ’ దెగంజేయుదు నా నావిధ దివ్యాస్త్రంబుల | లావున నప్పాండవుల బలంబుల నెల్లన్.’ |
411 |
| వ. | అనవుడు గురుకృపాశ్వత్థామ కర్ణులం గలయం గనుంగొని గాంధారీనందనుండు ‘మీమీ చందంబులెట్ల? నిన నాచార్యుండు మందస్మితాననుం డగుచు నిట్లనియె. | 412 |
| తే. |
‘ఏను ముదిసిన వాఁడ మహీశ! యెట్టు | లయిన నోపిన భంగి నీ యనుఁగుఁ దాత సాలి నన్నిదినంబులఁ జాలవచ్చు | నబ్బలంబుల నని సమయంగఁ జేయ.’ |
413 |
| క. |
అనినఁ గృపాచార్యుం ‘డీ | యినుమడి దివసములఁ దీర్ప నేనోపుదు’ నా విని గురుతనూభవుఁడు ‘పది | దినములఁ గడతేర్తు’ ననియె ధీరవిచారా! |
414 |
| వ. | అందఱ పలుకు లాకర్ణించి కర్ణుండు. | 415 |
| క. |
‘నానాస్త్ర శస్త్ర చయ బల | బానలముం గవియఁ జేసి యత్యుగ్రత నే నేనాళ్లన యప్పాండవ | సేనా సాగరము నివురఁ జేయుదు నధిపా!” |
416 |
| వ. | అని ప్రతిన సేసినఁ గలకల నవ్వి గాంగేయుండు. | 417 |
| చ. |
‘పలికిన నేమి యన్నియును బల్క నగున్ మనరాజు నొద్ద మా ర్పలికెడు వారు లేరు విను పాండవమధ్యము గాండివంబు దీ ప్తుల మిఱుమిట్లుఁ గొన్న కనుదోయి గుణధ్వని వ్రయ్యలైన వీ నులు నయినన్ బలే పలుకు నూల్కొనకుండుదు సూతనందనా! |
418 |
| వ. | అనియె; నివ్విధంబున నీ కొడుకు కడం బుట్టిన విశేషంబులు ధర్మతనయుండు చారులవలన విని తమ్ముల రాఁబనిచి వారలతో నిట్లనియె. | 419 |
| సీ. |
‘మన చారు లిప్పుడు చనుదెంచి రావీట | నుండి; దుర్బుద్ధి సుయోధనుండు గొలువున గాంగేయ కుంభసంభవ కృపా | శ్వత్థామ కర్ణుల వలను చూచి యనిఁ బాండవుల బల మంతయు సమయింపఁ | జాలుదు రెంతేసి కాలమాన మున? నన్న భీష్ముండు దన కొక్క నెలవట్టు | ననియాడె; ద్రోణుండు నట్ల పలికెఁ; |
|
| ఆ. |
గృపుఁడు రెట్టి సెప్పెఁ; గృపి కొడు కోపుదుఁ | బది దినముల ననియె బాహువీర్య ఘనుఁడు గాన సూతతనయుఁ డేనాళ్లన | తీర్ప నేర్తు నని ప్రతిజ్ఞ చేసె.’ |
420 |
| వ. | అని చెప్పి యర్జునుం గనుంగొని ‘వారు తమ తమ యోపిన చందంబులు సెప్పిరి; నీచేతం గౌరవ బలంబు లెంత దడవునకుం దెగు? నాకుం జెప్పు’ మనిన నతం డిట్లనియె. | 421 |
| తే. |
‘వార లంతకుఁ జాలని వారె? నీ బ | లముల సమయింపఁ జాలెడు లావు వెరవుఁ గలర కాక! యా రాజుతోఁ బలికి బాస | దప్పవచ్చునె వారికి ధరణినాథ!’ |
422 |
| వ. | అని దరహాసోల్లాస భాసిత వదనుండై. | 423 |
| మ. |
‘అనుమానం బదియేల? నీమది మదీయ స్ఫార బాహాబలం బు నిరూపింప దలంచి తేని విను; మేపుం జేవయుం జూపి కృ ష్ణుని తోడ్పాటునఁ బేర్చి యేఁ గడగినం జూర్ణంబు గావింతు నొ క్కనిమేషంబున దేవదానవులతోఁ గూడం ద్రిలోకంబునున్. |
424 |
| వ. | అది యెట్లంటే నిఁ గృత్రిమ కిరాతుండైన పశుపతి మెచ్చి జగత్సంహార సమయంబునం దాను బ్రయోగించునట్టి పాశుపత మహాస్త్రంబు నాకిచ్చె; నది నాయందు సన్నిహితంబయి యున్నయది గావున శత్రునిరాసం బనా యాసంబై యుండు; నప్పాశుపత మహనీయ ప్రభావంబు భీష్ముండున్నరూపెఱుంగఁడు, ద్రోణ కృపాశ్వత్థామలు నెఱుంగరు, కర్ణున కెఱుంగ నెంతదవ్వట్టి ఘోర సాధనంబున సమస్తంబును సమయించుట యుక్తంబు గాదు తక్కిన యాయుధంబులం బోరి వైరులం బరిమార్చినం బౌరుషంబు దీపించు నని తలంచెద; నప్పటికి వలయు విధం బయ్యెడు; నది యట్లుండె; నీవా రక్కడి వారికిం దక్కువవారే? భీమసేనుండు కవ లభిమన్యుండు ద్రౌపదేయులు సాత్యకి విరాట ద్రుపదులు ధృష్టద్యుమ్నుండు శిఖండి యుత్తమౌజుండు యుధామన్యుండు ఘటోత్కచుండు మొదలైన జగజెట్లున్నవారు; మఱియు ననేకులు వీరల యట్టివారలు కలరు; వారల నందఱం జెప్పనేల? యేనుంగువోలె నీలావు నీవెఱుంగవు దివిజులకు నజేయుండవు నీయొక్కనికిఁ ద్రిభువనంబు నెదురె నీవు నిక్కం బలుగవుగాక; నీ వలిగిన నెవ్వ రెట్లయ్యెదరో యటు సూడుము; నీ సైన్యంబుల నెవ్వరికి నేమి చేయవచ్చు మనకు విజయానందంబు సులభంబ’ యని పలికె నని సంజయుండు ధృతరాష్ట్రున కెఱింగించె’ నని వైశంపాయనుండు జనమేజయునకుం జెప్పుటయు. | 425 |