| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | విరాటపర్వము - పంచమాశ్వాసము |
| చ. |
అమృతమయాత్మ! భక్తిసుగమానుభవోజ్జ్వల దివ్యవర్త్మ! ష ట్సమయ గతానుభావ! పురుష త్రయతా వివృత స్వభావ! ని ర్మమ హృదయైకవాస! మునిరంజన నిత్యవిలాస! దోష సం గమ వినికర్తనా! పరమ గౌరవ ధుర్య పద ప్రవర్తనా! |
405 |
| క. |
దుర్వహ పటుతాపత్రయ | నిర్వాపణ కరణ, బోధ నిర్మలజన హృ త్పర్వాచరణ, మహాసుర | గర్వహరణ! తత్త్వ సంప్రకాశనకరణా! |
406 |
| మాలిని |
నిగమ కుసుమ గంధోన్మేష భూతాభిధానా! సగుణ విగుణ లీలా! సౌమ్య సాక్షిత్వ నానా జగదవన పిధాన స్థైర్య దత్తావధానా! నగశరధి నివాసా నంద సంస్తూయమానా! |
407 |
| గద్య. | ఇది శ్రీమదుభయకవిమిత్ర, కొమ్మనామాత్యపుత్ర, బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన శ్రీమహాభారతంబున విరాటపర్వంబునందు సర్వంబును పంచమాశ్వాసము. | 408 |
| శ్రీమదాంధ్ర మహాభారతమునందలి విరాటపర్వము సమాప్తము. | ||