ఇతిహాసములు భారతము విరాటపర్వము - పంచమాశ్వాసము
అభిమన్యుని వివాహ మహోత్సవము (సం. 4-67-31)
వ. ఇట్లు వైవాహిక వర్తన సంవిధాన సావధానుం డగు మత్స్యమహీనాథుండు మౌహూర్తికాది శిష్టజనులు పరివేష్టింప నుండి ‘లగ్నం బాసన్నం బగుచు వచ్చె’ నని ధర్మతనయున కెఱింగింపం బనిచిన, నతండు ననుజతనుజసహితంబుగా నలంకృతుండై, వివిధ ప్రసాధన శోభితులగు సమస్తబంధు జనంబులం గూర్చికొని యభిమన్యునకు శృంగారంబు సేయించి భద్రగజారూఢుం జేసికొని యేనుంగులం బేరుగలవారువంబులను మట్టపుదట్టంబు సేసికొని పుణ్యాంగనా జనంబులతోడం గూడి, మణిగణంబులు నంబర నికరంబులు పుష్పపుంజంబులు ఫలప్రచయంబులు లోనుగాఁ గల యోగ్యవస్తువుల విస్తరిల్లిన క్రంత నడవ మంగళతూర్య నాదంబులు విప్రాశీర్వాదంబులు మాగధ గానంబులు వందిజన వాక్య సంతానంబులుఁ జెలంగ వాసుదేవ పురస్సరంబుగా విరాటుమందిరంబున కేతెంచి శంఖజయ ఘంటా పణవాది నిక్వణంబులతోడ నెదుర్కొని చల్లుసేసలు గైకొనుచుం జొత్తెంచిన. 389
క. విరటుఁడు సంభ్రమమును నా | దరమును భక్తియును నాత్మఁ దలకొనఁ బూజా
పరుఁడై సమయ సముచితా | చరణంబులు నిర్వహించె సమ్మదలీలన్‌.
390
తే. విహిత పరిపాటితో విప్రవృద్ధ జనులు | పుణ్యకర్మ పరంపరఁ బూని నడుప
నర్థిఁ గృష్ణ యుధిష్ఠిర పార్థ మత్స్య | వరులు దెరయొద్ద న వ్వధూవరుల నిలిపి.
391
వ. సాంవత్సరిక దత్త కాల కళావిశేషంబుల మంగళతూర్యంబులు చెలంగ నత్తెర యెత్తించిన. 392
ఉ. వీనులఁ దియ్య మెక్క మును విన్కిఁ బరస్పర రాగవృత్తి లో
నూనినఁ జూచు వేడుకల నువ్విళు లూరెడు నెమ్మనంబు ల
చ్చో నొక యింత సేపు నెడసొచ్చుట కోర్వక యుండ నున్న య
మ్మానినియుం గుమారుఁడును మారవికారము లంకురింపఁగన్‌.
393
వ. అన్యోన్యావలోకనంబు చేయునప్పుడు. 394
సీ. వరుచూడ్కి ముద్దియ వదనంబుపైఁ బాఱి | తివుటమై నునుఁగాంతితీపు గ్రోలు,
సుందరీ రత్నంబు చూపు మనోహరు | నడుగుల యొప్పుపై నల్ల నడరుఁ,
బతివిలోకనములు పడఁతుకమైఁదీవఁ | గలయంగఁ బలుమఱు మెలఁగుచుండు,
వెలఁది కటాక్షముల్‌ విభునిపైఁ గ్రమమున | నెగసి మోమున సోఁకి మగుడ వచ్చు.
 
తే. నొండొరువుల లేఁ జెమటల నూని, వ్రేఁగు | పడిన చాడ్పున నవయవ భంగులందుఁ
దగిలి మఱుపునఁ దడయు నిద్దఱ విశాల | నయన దీప్తులు నెఱుకువ బయలుపడఁగ.
395
వ. తదనంతరంబ. 396
తే. ఒండొరుల దోయిళుల నినుపొందఁ జేయు | నక్షత ప్రకరంబు లన్యోన్యమస్త
కములఁ బోసిరి మందార కల్పలతలు | విరులగముల నొండొంటిపైఁ గురియునట్లు.
397
చ. లలితతనూ విలాసముల లజ్జకతంబునఁ జేసి మున్ను వి
చ్చలవిడిఁ బట్టఁగా వెరవు సాలక యోరలువాఱుచూపులన్‌
లలిఁ దలఁబ్రాలు పోయునెడలం దగ వొందిన నూలుకొల్పి యి
మ్ములఁ బచరింతు రొండొరుల మోహనమూర్తులపై వధూవరుల్‌.
398
తే. చిత్తమున గాఢరాగంబు చేతఁ జూపు | తెఱఁగు దోఁపఁ గెంపారెడు తీఁగబోఁ డి
మృదులపాణిఁ గుమారుండు మెలపుమై గ్ర | హించెఁ బల్లవాలంబి మత్తేభలీల.
399
వ. ఇట్లు పాణిగ్రహణం బాచరించి. 400
క. పెనుఁగుదుట నిడిన చూతం | బును నవమాలికయుఁ బోలెఁ బొలుపొంది రతం
డును నమ్ముగ్ధయు నేకా | సనమున నున్నపుడు నూత్న సౌభాగ్యమునన్‌.
401
సీ. కోర్కులు గెడఁ గూడుకొని పార మేదిన | చిత్తంబు లూఱటఁ జిగురులొత్తఁ
బులకాంకురములకుఁ దలతాఁకుడై యిరు | మేనను మవ్వంబు మిగిలి పొదలఁ
దఱి వేచి చనఁబోయి తడఁబడి మార్గతి | వడిచూపు లాదట బయలుపఱుపఁ
జెమటల తావులు తమలోనఁ గలసి వే | ఱొక్క సౌరభమయి చొక్కుసేయ.
 
తే. గాఢ సంస్పర్శ భంగులు గలుగునట్టి | హోమ సమయ కృత్యంబుల నొదవి సౌఖ్య
రసము వెన్నిట్ట పొరింబొరి గ్రమ్ముదేర | సమ్మదాంబుధిఁ దేలిరి సతియుఁ బతియు.
402
వ. ఇవ్విధంబున వివాహంబు నిర్వహించి మత్స్యమహీనాథుండు మణిభూషణంబులు రుచిరాంబరంబులుఁ గర్పూరాది సుగంధ ద్రవ్యంబులుఁ దాంబూలంబుల తోడి పళ్లెరంబులఁ బచరించి పాండవులకు వాసుదేవ పూర్వకంబుగాఁ గట్టనిచ్చి, పురోహిత ప్రకరంబునకు నిప్పించి, యాజ్ఞసేనీ సుభద్రలకు సనురూపాభరణ పరిధానంబు లంతఃపురవర్తు లైన యర్హ జనంబులచేతం బుచ్చి, సౌభద్రునకు భద్రసామజసప్తశతియును, లోకోత్తర తురంగ దశ సహస్రంబును, సలక్షణ గోపంచలక్షయు, రథంబులు రెండు వేలును, దాసదాసీ జనంబు లక్షయు, మఱియు నానా ప్రకారంబు లగు ధనంబులు నరణం బిచ్చె; నమ్మహనీయ మహోత్సవంబు మంగళ సంవిధాన సావధాన పుణ్యాంగనలవలనను, నృత్త గీతాది వైచిత్ర్య మనోహర వారనారీజనంబుల వలనను, వినూత్న రత్నమయ భూషణాది దీప్తవేష విరాజమాను లగు కుమారుల చతుర పరిహాసాది విలాసంబుల వలనను, బ్రభూత విభవ విభ్రాజితు లగు రాజసూనుల మాననీయ గరిమలలిత విహార విశేషంబులవలనను. బాంచాలయాదవ కేకయాది బాంధవ మహిత మహిమాంచిత సంచరణంబుల వలనను, నానంద నిష్యంది పాండునందన సౌహార్దంబు వలనను మత్స్యమనుజపతి మందిరంబు పరమ సంపద్భరితంబై యుండె’ నని చెప్పిన విని వైశంపాయనునితో జనమేజయుండు. 403
క. ‘కుంతీనందను లట్ల | త్యంత విభవ మెసఁగఁ బరిణయము చేసి సుహృ
త్సంతోషోజ్జ్వలులై తద | నంతర మెబ్భంగి నడచి?’ రనవుడుఁ బ్రీతిన్‌.
404
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )