| ఇతిహాసములు | మొల్ల రామాయణము | అరణ్య కాండము |
| జటాయువు రామునకు రావణుని దుశ్చేష్టను దెలుపుట | ||
| క. |
పక్షములుఁ గాళ్ళుఁ దునిఁగిన పక్షీంద్రునిఁ జూచి రామభద్రుఁడు మదిలో రాక్షస మాయయొ? యనుచును శిక్షింపఁ దలంచు నంత శీఘ్రమె పలికెన్. |
65 |
| క. |
నీ తండ్రికి నతి మిత్త్రుఁడ నో తండ్రీ! నన్ను నేయ నుచితమె నీకున్? నా తగు పేరు జటాయువు సీతాధిప! నన్ను నెఱుఁగు చిత్తములోనన్. |
66 |
| వ. | అని చెప్పి వెండియు నా జటాయు విట్లనియె, | 67 |
| మ. |
వినుమో రాఘవ! పంక్తి కంధరుఁడు దోర్వీర్యంబు సంధిల్లఁగా జనక క్ష్మాపతి నందనన్ గొనుచు స్వేచ్ఛా వృత్తితో నేఁగుచో, వనితా రత్నము దీనయై పలుకు తద్వాక్యంబు లేర్పాటుగా విని, పోరాడఁగఁ బ్రాప్తమయ్యె మఱి యీ వేషంబు భూమీశ్వరా! |
68 |
| క. |
అని సీత తెఱఁగుఁ దన పని జన నాయకుఁడైన రామచంద్రునితోడన్ వినిపించి, యా జటాయువు తను వెరియఁగ నంతఁ గాలధర్మము నొందెన్. |
69 |
| వ. |
ఇట్లు రామచంద్రునకు సకల వృత్తాంతమును నెఱింగించి శరీరంబు విడిచిన యప్పక్షిరాజునకు భక్తి పూర్వకంబుగా నగ్ని సంస్కారాది విధులు దీర్చి, దక్షిణాభిముఖులై చనుచుఁ జిత్ర రూపంబున నున్న కబంధుని వధియించి, ముందట, |
70 |