| ఇతిహాసములు | మొల్ల రామాయణము | బాల కాండము |
| సురల మొఱ లాలించి శ్రీమహావిష్ణు వభయ మొసఁగుట | ||
| ఉ. |
రావణుచేతి బాధల నిరంతరమున్ బడి వేఁగి, మూఁకలై దేవత లెల్ల గీష్పతికిఁ దెల్లముగా నెఱిఁగింప, వారి రా జీవ తనూజుఁ డున్నెడకు శీఘ్రమ తోడ్కొనిపోయి చెప్ప, నా దేవుఁడు విష్ణు సన్నిధికి దిగ్గనఁ జేకొనిపోయి యచ్చటన్. |
28 |
| వ. |
అప్పురాణ పురుషోత్తముం గాంచి, నమస్కరించి, యింద్రాది దేవతలం జూపి, బ్రహ్మ యిట్లని విన్నవించె, |
29 |
| ఉ. |
రావణుఁ డుగ్రుఁడై తన పరాక్రమ శక్తిని వీరి సంపదల్ వావిరిఁ గొల్లలాడి త్రిదివంబును బాడుగఁ జేయ, నేఁడు దే వావళి దీన భావమున నక్కడ నుండఁగ నోడి, భీతిచే దేవరఁ గానవచ్చె నిఁక దేవర చిత్తము వీరి భాగ్యమున్. |
30 |
| వ. |
అని విన్నవించిన విని వనరుహలోచనుండు దయాయత్త చిత్తుండై యనిమిషనాయకుని గూర్చి యిట్లానతిచ్చె, |
31 |
| తే. |
వనజ గర్భుని గూర్చి రావణుఁడు మున్ను తపముఁ జేసిన వర మిచ్చు తఱినిఁ దనకు నేరిచేఁ జావు లేకుండఁ గోరువాఁడు నరుల వానరులను జెప్ప మఱచినాఁడు |
32 |
| వ. | అక్కారణంబునం జేసి | 33 |
| తే. |
వనరు గలిగెను మనకు రావణుని జంప, వినుఁడు మీరెల్ల నా మాట వేడ్క మీఱ, దశరథుం డనురాజు సంతాన కాంక్ష నొనర జన్నంబు గావించుచున్నవాఁడు |
34 |
| క. |
ధరణీపతి యగు దశరథ నరనాయకు నింటఁ బుట్టి నర రూపమునం బెరిగెద నేనిక, మీరును సుర కంటకుమీఁద లావు సూపుటకొఱకై. |
35 |
| క. |
కొందఱు కపి వంశంబునఁ గొందఱు భల్లుక కులమున గురు బలయుతులై యందఱు నన్ని తెఱంగుల బృందారకులార! పుట్టి పెరుగుఁడు భువిపై. |
36 |
| వ. |
అని, కృపా ధురీణుండైన నారాయణుఁ డానతిచ్చిన విని వనజాసనాది దేవతా నికరం బవ్వనజోదరుని పాదారవిందములకు వందనమ్ము లాచరించి, నిజ నివాసమ్ములకుం జని రయ్యవసరమ్మున. |
37 |