| ఇతిహాసములు | మొల్ల రామాయణము | బాల కాండము |
| రాజ కుమారులు శివచాపమును గదల్ప నోడుట | ||
| క. |
విల్లా? యిది కొండా? యని తల్లడపడి సంశయంబు తలకొన మదిలో బల్లిదు లగు నృప నందను లెల్లరు దౌదవుల నుండి రెంతయు భీతిన్. |
74 |
| క. |
కొందఱు డగ్గఱ నోడిరి, కొందఱు సాహసము చేసి కోదండముతో నందంద పెనఁగి పాఱిరి సందుల గొందులను దూఱి, సత్త్వము లేమిన్. |
75 |
| సీ. |
గాలిఁ దూలిన రీతిగా నెత్తఁ జాలక-తముఁ దామె సిగ్గునఁ దలను వంచి, కౌఁగిలించిన లోను గాక వెగ్గల మైన-భీతిచే మిక్కిలి బీరువోయి, కరముల నందంద పొరలించి చూచినఁ-గదలక యున్నఁ జీకాకు నొంది, బాషాణ మున్నట్టి పగిది మార్దవ మేమిఁ-గానరాకుండినఁ గళవళించి, |
|
| తే. |
రాజ సూనులు కొందఱు తేజ ముడిగి-జగతి రాజుల మోసపుచ్చంగఁ దలఁచి, జనకుఁ డీ మాయఁ గావించెఁ, జాలు ననుచుఁ-దలఁగి పోయిరి దవ్వుగా ధనువు విడిచి. |
76 |
| సీ. |
ఇది పర్వతాకార, మీవిల్లు కను విచ్చి-తేఱి చూడఁగ రాదు దేవతలకు, నటుగాక మును శేష కటకుని ధను వంట-హరుఁడె కావలెఁ గాక, హరియుఁ గాక, తక్కినవారికిఁ దరమె యీ కోదండ-మెత్తంగఁ? దగు చేవ యెట్లు గలుగు? దీని డగ్గఱ నేల? దీని కోడఁగ నేల?-పరులచే నవ్వులు పడఁగ నేల? |
|
| తే. |
గుఱుతు సేసియుఁ దమ లావు కొలఁదిఁ దామె-తెలియవలెఁ గాక, యూరక తివుర నేల? యొరుల సొమ్ములు తమ కేల దొరకు? ననుచుఁ-దలఁగి పోయిరి రాజ నందనులు గనుచు. |
77 |
| వ. | అంత విశ్వామిత్ర మునీంద్రుండు రామచంద్రుని ముఖావలోనంబుఁ జేసిన | 78 |