| ఇతిహాసములు | మొల్ల రామాయణము | సుందర కాండము |
| హనుమంతుఁడు రాముని కుశల వార్తను సీతకు విన్నవించుట | ||
| క. |
ఉన్నాఁడు లెస్స రాఘవుఁ, డున్నాఁ డిదె కపులఁ గూడి, యురు గతి రానై యున్నాఁడు, నిన్నుఁ గొని పో నున్నాఁ, డిది నిజము నమ్ము ముర్వీ తనయా! |
91 |
| సీ. |
ఆ మాట లాలించి భూమిజ తనలోన-వెఱఁగంది, శింశుపా వృక్ష మరసి చూడంగ, నప్పుడు సూక్ష్మ రూపంబున-నొడికమౌ శాఖల నడుమ నున్న కపి కుమారుని రూప మపురూపముగఁ జేసి-స్వాంతంబులోన హర్షంబు నొంది, దనుజ మాయలచేతఁ దఱచు వేగుఁటఁ జేసి-మాఱాడ నేరక యూర కున్న |
|
| తే. |
భావ మూహించి, తన్ను నా దేవి యాత్మ-నమ్మకుండుట దెలిసి, యా కొమ్మమీఁది నుండి క్రిందికి లంఘించి, నిండు భక్తి-మ్రొక్కి నిలుచుండి కరములు మోడ్చి పలికె. |
92 |
| ఉ. |
తమ్ముని గూడి పుణ్యగుణధాముఁడు, రాముఁడు వచ్చి మాల్యవం తమ్మున సైన్య సంఘము ముదంబునఁ గొల్వఁగ నుండి, భూమిపై మిమ్ములఁ జూచి రండనుచు మేటి కపీంద్రులఁ బుచ్చి, యందు మొ త్తమ్ముగ మమ్ముఁ గొందఱను దక్షిణ భాగము చూఁడ బంపుచున్. |
93 |